కవితలు యెంకి పాటలు యెంకితో బద్రాద్రి
14. యెంకితో బద్రాద్రి
ఆడ నీ సుక్కాని యీడ నే గెడయేసి
పడవెక్కి బద్రాద్రి పోదామా
బద్రాద్రి రాముణ్ణి సూదామా
గోదారి గంగలో కొంగు కొంగూగట్టి
కరువుతీరా బుటక లేదామా
సరిగెంగ తాణాలు సేదామా
కొత్త మడతలు కట్టుకోని పెజలోకెల్లి
రామన్న రాముడో యందామా
రామకతలే పోయి యిందామా
సంబరము కెదురుంగ జంటగా నిలుసుండి
సామివోరికి దణ్ణ మెడదామా
సాపసుట్టుగ నేల బడదామా
ఈడ నీ సుక్కాని ఆడనే గెడయేసి
పడవెక్కి మనపల్లె కెడదామా
బద్రాద్రి రాముణ్ణి సూదామా
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - yeMkitoo badraadri ( telugu andhra )