| ౨-వ స్థలము. లుబ్ధావధాన్లుయిల్లు. |
| లుబ్ధా |
అవును. మీరు చెప్పినమాట బాగుంది. దివ్యస్థలాల్లో ఏకరాత్ర వివాహాచారంవుంది. |
| కరట |
పెద్ద పెద్ద ఉద్యోగస్థులుకూడా, యిప్పటిరోజులలో, వివాహాలు అలాగే చేస్తున్నారు. కోదండరామస్వామివారు స్వయంవ్యక్తవూఁ, హనుమత్ప్రతిష్ఠా అయినప్పుడు, దివ్యస్థలంకాదని యెవడనగలడు? |
| లుబ్ధా |
ఆమాట సత్యవేఁగాని, యిది దివ్యస్థలంగా ఆలోచించి ఇదివరకు యెవళ్లూ యిక్కడ, ఏకరాత్రవివాహం చేసివుండలేదు మావఁగారూ. మనంచేస్తే యేవఁంటారో? |
| కరట |
దివ్యస్థలం అయినతరవాత యెవడేవఁంటే మనకేం పోయింది? |
| లుబ్ధా |
అయితే పంతులుతో చెబుదాం. |
| కరట |
యేవిఁటి మీసత్యకాలం మావగారూ! యీపెళ్లిలో యేదోవొక వొంటుబెట్టి, నాలుగుడబ్బులు ఆర్జించు కుందావఁని చూస్తూవున్న పంతులూ, పోలిశెట్టీ, ఏకరాత్ర వివాహానికి ఆమోదిస్తారా? పుస్తెకట్టిందాకా ఆమాట వాళ్లతో చెప్పకండి. |
| లుబ్ధా |
పంతులుతో చెప్పకపోతే యేంజట్టీ పెడతాడో? |
| కరట |
యేవిఁటి మీభయం! అతగాడు మీకు యజమానా? జట్టీ, గిట్టీ పెడితే, పెణతూడ గొడతాను. |
| లుబ్ధా |
మీరు కాదుగాని, సిద్ధాంతిగారి చేతిలో రెండు రూపాయలు పడేస్తే, ఆపూచీ అంతా ఆయన నెత్తిమీద వేసుకుంటాడు. ఆయన యదట పంతులు నోరు యెగియదు. |
| కరట |
పావఁంటిదానికి విరుగుడుంది. పంతులికుండదా? |
| (నిష్క్రమింతురు.) |