| నాటకములు | నదీసుందరి | అబ్బూరి రామకృష్ణరావు |
| సూత్రధారుడు | |
|
రసపిపాసిని నేను పారమ్ము లేని గగనవీధీ విశాలరంగములయందు అందగారాని తలపుల కందమైన రూపములు దిద్ది క్రీడింతు రూపసరసి | |
|
తెనుగు సీమలలో నాల్గుకొనలయందు పూజకై పుట్టి వర్ధిల్లు పూలతోడ ప్రియతమములైన వలపుకోరికలతోడ గంధిలంబయ్యె శ్యామల గగనవీధి | |
|
ఎన్నడో పూలుపూచె నా హృదయసీమ కెంపుచివురుల కావేరి కీర్తిలతిక ఎన్నడో జీవనోద్యాన హృద్యవాటి కెరలిపాడెను కావేరి కీర్తిపికము | |
|
బంధురములైన యానాటి పరిమళములు పాటలును, రూపములు దాల్చి పల్లవించి యుగయుగాంతరవ్యాప్త వియోగభరము మోయు, కావేరి సంపూర్ణమూర్తి దాల్చె | |
|
భావవిదులగు రసరాజ్యపాలకులకు తొలుదొలుత భక్తితోడ చేదోయి మోడ్చి అభినవమ్మగు రూపక మంధ్రభాష నర్పణము సేయుచున్నాడ నందికొనుడు. |