ప్రముఖులు ఆదిభట్ల నారాయణదాసు  

“హరిదాస జగద్గురు”, “హరికథా పితామహుడు”
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు
(31 ఆగష్టు 1864 - 2 జనవరి 1945)
జయంతి (శ్రావణ బహుళ చతుర్దశి) - వర్ధంతి (పుష్య బహుళ పంచమి)

ప్రపంచంలో ప్రసిద్ధులు పలువురు పలువిధములుగా నుందురు, గాని పెక్కు ప్రతిభలు ఒక్కచోట గలవారు మిక్కిలి అరుదు. అట్టి బహుముఖ ప్రజ్ఞాధురీణులలో అవతారమూర్తి, ఆంధ్ర విద్వజ్జ్యోతి ‘హరికథా పితామహ’ శ్రీమదజ్జాడాదిభట్ల కులశేఖరులగు నారాయణదాసవర్యులు ఒకరు.

‘హరికథ’ అనే పేరువింటే శ్రీ నారాయణదాసుగారు, ‘శ్రీ నారాయణదాసుగారు’ అనే పేరువింటే ‘హరికథ’ తెలుగు రాష్ట్రములలో వెంటనే స్ఫురిస్తాయి. హరికథా రచనవల్లనూ, హరికథా ప్రయోగమువల్లనూ శ్రీ దాసుగారివలే అఖండ ప్రఖ్యాతిని పొందినవారు వేరొకరు గానరు.

శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు రక్తాక్షి నామ సంవత్సరము 1864 ఆగష్టు 31న ఆంధ్రప్రదేశ్ లోని అప్పటి పార్వతీపురమునకు ఆగ్నేయమున సువర్ణముఖీ నదీ తీరమునందు గల అజ్జాడయను గ్రామమందున (ప్రస్తుతం విజయనగరం జిల్లా) ఆదిభట్టకులమందు భరద్వాజస గోత్రమున వేంకటచయన, లక్ష్మీనరసమాంబలకు జనియించిన పుణ్యమూర్తి.

దాసుగారు మన హిందూదేశమున అవతరించిన అపర శారదావతారం. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచారు. అట్టి మహాపురుషుడు మన ఆంధ్రదేశమున అవతరించుట మన ఆంధ్రుల అదృష్టము, గర్వకారణము. సంగీతం, సాహిత్యం మరియు నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి ‘హరికథా పితామహ’ అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడించి నారాయణదాసు హరికథ అనే కళను అత్యున్నత శిఖరాలకు తీసుకొనిపోయారు. ఈ మూడింటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా హరికథలు రచన చేసినారు, చెప్పారు, నేర్పారు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన.

శ్రీ నారాయణదాసుగారు జగత్ప్రసిద్దులైన హరికథక పితామహులు, కారణ జన్ములు, విద్వత్కవీంద్రులు, భక్తాగ్రణ్యులు. తాము జీవితంలో భక్తినీ, రక్తినీ, ముక్తినీ పుష్కలంగా పొంది తమను దర్శించినవారికీ, విన్నవారికీ, శుశ్రూష ఒనర్చినవారికీ వాటిని ప్రసాదించిన మహానుభావులు.

శ్రీ నారాయణదాసుగారిని స్మరించినపుడు “సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం” అనునది స్ఫురించును. శ్రీ దాసుగారు వేదశాస్త్ర పురాణేతిహాసాదులలోని సర్వసారజ్ఞుడు. సంగీత, సాహిత్య, కవితా, నృత్య వాద్యములలో అసమాన ప్రజ్ఞాధురీణుఁడు, కళాప్రపూర్ణుడు. ఇది యది యననేల ఆయన సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు, సర్వస్వతంత్రుడు. రూపురేఖలలో సుందరమూర్తి, శ్యామలగాత్రుడు, శృంగారరసభరితుడు. సరస్వతీ అంశ సంభవుడు, ఆంధ్రావనియందు అవతరించిన గంధర్వుడు.

నారాయణదాసుగారు పుంభావ సరస్వతి. హరికథా వాఙ్మయానికి ఆదిభట్టు, కావ్యశిల్పానికి కవిసమ్రాట్టు, కథాకల్పనకు ఆటపట్టు, కథావధానమునకు మూలవిరాట్టు, భక్తిపారవశ్యానికి పెన్నిధి, నవరసాలకు కళానిధి, యుక్తి ప్రయుక్తులకు మహోదధి, సంగీత సాహిత్యాలకు సరస్వతి, బహుభాషా పాండిత్యానికి పట్టుకొమ్మ, లయబ్రహ్మ. సహజ పాండిత్య సాధనమున వారు సంగీతము, సాహిత్యము, నాట్యము, పాత్రాభినయము, కవిత్వము, వేదాంతము, వ్యాకరణము, జ్యోతిష్యము, ఆయుర్వేదము మొదలయిన విద్యలయందును; సంస్కృతము, ఆంధ్రము, హిందీ, ఉర్దూ, పారసీకము, అరబ్బీ భాషలయందును అసమానమైన పాండిత్యమును సంపాదించిరి. తారకం, హరికథామృతం అనే సంస్కృత కావ్యాలను రచించి జర్మను పండితుల మెప్పు పొందినవారు. ఋగ్వేదాన్ని స్వరసహింతంగా అచ్చ తెనుగులోనికి అనువదించి వేదంలోని విజ్ఞానాన్నీ, మంత్రమహిమని తెలుగువారికి తెలియచేసారు. ఆంగ్లభాషనుండి వివిధ కవుల రచనలు కొన్ని కొన్నిటిని విశ్లేషించి షేక్స్పియర్ నాటక రంగములోని ఘట్టములను హృద్యముగా మనభాషలోకి అనువదించారు. దీనినిబట్టి వారికి ఆంగ్ల సాహిత్యములో గాఢాభినివేశము కలదని స్పష్టము.

దాసుగారి గానవిద్యా ప్రావీణ్యము గాఢమైనది. ప్రాచీన సంప్రదాయమునేకాక నవీన విధానములనుకూడా వారు సరసముగా ప్రదర్శించేవారు. దాసుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రాచీన వాగ్గేయకారుల కోవకు చెందినవారు. హరికథా పితామహులుగా, కథావాగ్గేయకారులుగా వారు ప్రఖ్యాతిచెందారు. మనదేశంలో హరికథారచనకు, ప్రచారానికి మార్గదర్శకులు. పంచముఖి, షణ్ముఖివంటి అసాధ్యములైన తాళములలో రచనలుచేసి, గానంచేసి విద్వాంసుల మన్ననలు పొందిన ఘనవిద్వాంసుడు. దాసుగారు ‘ఆట పాట మాట మీటల మేటి’ గా ప్రసిద్ధినొందారు. శ్రీ దాసుగారు చిరునగవుతో నాట్యము చేయుచున్నపుడు, గంతు వేసినప్పుడు, శంభో అని మహానాధం చేసినప్పుడు ఎల్లరు తన్మయులుకాక తప్పరు. దాసుగారి గాత్ర నిస్వనంలో మైకు, లౌడ్ స్పీకర్లు సహజంగానే అమరి ఉన్నాయట. కంఠం ఎత్తిపాడితే అయిదువేల శ్రోతలకైనప్పటికీ అవలీలగా అందే గాత్ర సౌలభ్యం వారిదట. దాసుగారి నృత్య, నాట్య గానములు అద్వితీయములు.

దాసుగారి మాటలలో హరికథయనగా “ఆస్తిక్యమును, ధర్మాధర్మములను సర్వజన మనోరంజనముగా నృత్యగీత వాద్యములతో నుపన్యసించుట హరికథయనబరగు. అట్టి ఉపన్యాసకుడు కథకుడనబడును. దైవభక్తియు సత్యము భూతదయము హరికథయందలి ముఖ్యాంశములు”.

శ్రీ నారాయణదాసుగారు .. హరికథ అంటే ఏమిటో తెలియని కాలంలో మన తెలుగు రాష్ట్రములలో దాన్ని రుచి చూపడమేకాక పలువురికి ఉపదేశించిన మహోపాధ్యాయుడు. మంచిగా కవిత్వం చెప్పే నైపుణ్యంకూడా ఉంది. పోతన భాగవతము వలన ప్రభావితులై వీరు భక్త్యుపాసనములగు ఎన్నో హరికథలను రచించినారు. నారాయణదాసు బహుభాషాభిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక భాషలలో మహావిద్వాంసుడు. ఇన్ని శక్తులు ఒక వ్యక్తిలో ఉండటం చాలా అరుదు.

దాసుగారిది మహాద్భుత వ్యక్తిత్వం! దాసుగారు సహజకవి. కథ స్వవిరచితము. సంస్కృతాంధ్రాలలో మహాకవి, హరికథకు సృష్టికర్త, అచ్చతెలుగుకు అశ్వత్థవృక్షం, లయబ్రహ్మ, మహానటుడు, గంధర్వగాయకుడు, వీణావాదన విశారదుడు మరియు బహుభాషావేత్త. దాసుగారి గాత్రం చాలా గంభీరమైనది. గానమే కాదు, సంస్కృతాంధ్ర సాహిత్యమేకాదు, నాట్యమేకాదు - అదీ యిదీ అనడమెందుకు? అన్ని విద్యలూ వీరికి స్వతహాగా లభ్యమైనవే.

దాసుగారి కథాకాలక్షేపము విలక్షణమైనది. కథ స్వవిరచితము. కవితారసము ననుభవించువారికి కవిత్వముచేతను, సంగీతప్రియులను పాటలవలనను, లయకాండ్రను క్లిష్టమగు ముక్తాయింపులతోను, పామరులను చమత్కారమగు మాటలతోను మెప్పించేవారట.

శ్రీ నారాయణదాసుగారు ఏకసంధాగ్రహి. చిన్నతనంలోనే పద్యాలు, శ్లోకాలు విని కంఠతా పట్టి తిరిగి వల్లించేవారట. కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే భాగవతంలోని పద్యాలు ఎన్నో చెప్పేవారట. ఒకసారి వారి అమ్మగారు బాల దాసుతో శివరాత్రి పర్వదినాన తిరనాలకి వెళ్ళివస్తూ పుస్తకాల షాప్ వద్ద బండి ఆపారుట. అక్కడ పుస్తకాల కొట్టులో, బాల దాసు భాగవతం కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని భాగవతం నీకేమి అర్థమవుతుంది అన్నాడట. అంతే ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతంలోని పద్యాలు గడగడా చెప్పేశాడట. అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా పిల్లవానికి ఆ పుస్తకంతో పాటు, కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించాడుట.

నారాయణదాసు ప్రఖ్యాత వైణికుడు. గీత, వాద్య, నృత్య త్రయ సమ్మేళనమే - సంగీత ప్రదర్శనము అనే సంగీత లక్షణమును ప్రమాణీకరించి, శ్రీ శివనారాయణతీర్ధుల వలె సత్యమైన సంగీతము నారాధించినవారు దాసుగారు. రాగం ధారాళంగా ఆలపిస్తూ, స్వరాన్ని త్రికాలములలోను ప్రస్తారిస్తూ బహుచక్కనైన గమకంతో వైణిక మార్దంగికులకు పరిశ్రమ కల్పించేవారు. ఆ మహాపురుషుని సమక్షంలో ప్రక్కనున్న వైణికులు, మార్దంగికులు అతిసూక్ష్మరూపాలుగ కనిపించేవారు.

కర్ణాట హిందుస్థానీ బాణీ రెండింటినీ సమన్వయించి, సరికొత్త ఫక్కీని అద్భుత సంగీత ప్రదర్శనము మైసూరు సంస్థానమునందు వారు గావించినపుడు మహారాజావారు వారి గానమును అత్యంత శ్రద్ధతో మహారాణి సహితముగా ఆలకించి “మీ రెక్కడ సంగీతము నేర్చుకొంటిరి?” అని ప్రశ్నింపగా, “నా సంగీత సాహిత్యములు సహజ పాండిత్యమేగాని యొకరివద్ద నేర్చుకొన్నవి కావ”ని దాసుగారు చెప్పిరట. మైసూరు మహారాజు సంస్థానంలో దర్బారులో తన వీణావాద్య కౌశల్యంచే మహారాజు మెప్పులంది సన్మానాలు అందుకొన్నారు. తర్వాత విద్యలకు నిలయమైన విజయనగరంలో ఆనందగజపతి మహారాజుని విద్యా పరీక్షణ వేళలో మెప్పించి తదుపరి విజయరామ గాన కళాశాల ప్రథమ ప్రధానాచార్య (1919లో) పదవినలంకరించి సుమారు పదునేడు వత్సరములు తమ సంగీతపాండితీ విధానమును పలువురు శిష్యులకు పంచిపెట్టిన మహానుభావులు.

ఆ రోజులలో సంగీత పాఠశాలయందు గురుకుల దాస పద్ధతిలో శిక్షణ వుండేది. శిష్యులను గురువులు కన్న బిడ్డలకంటే ఎక్కువ అభిమానంగా చూసేవారు. ప్రధానోపాధ్యాయులుగా నున్న దాసుగారు ప్రతి రోజూ, ప్రతి తరగతికీ వెళ్ళి, వారు సంగీతం ఏ విధంగా సాధన చేస్తున్నారో పరీక్షించేవారు. సంగీత పాఠములు సరళీలు, జంటలు, దాటు స్వరాలు, సప్త తాళ అలంకారములు అన్నీ కూడా మూడు కాలములలో అభ్యాసము చెయ్యాలి, తరువాత గాని గీతరచనలు ప్రారంభము చేసేవారు కాదు. కీ. శే. నారాయణదాసుగారు విజయనగరమునకు ఒక అలంకారము.

వీరిది దేవదత్తమైన గంభీర కంఠారావము .. అందుచేతనే, ఆరోజులలో మైసూరు మహారాజంతటివాడు శ్రీదాసుగారి గాత్రాన్ని ఫోనోగ్రాముద్వారా రికార్డు చేయించుకొని తరచూ వినేవాడట! హరికథా వాఙ్మయ ప్రాచుర్యానికి, హరికథా ప్రదర్శన నైపుణ్యానికి మూలపురుషులు శ్రీ నారాయణదాసుగారే! కనుకనే వీరు ‘హరికథా పితామహ’ బిరుదానికి సర్వవిధములచేతా పాత్రులయ్యారు. అనేక మహారాజుల, ‘భారత కోకిల’ సరోజినీదేవి నాయుడు, ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ ఠాకూర్, సుప్రసిద్ధ గాయనీమణి జానకిబాయీ, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, Prof Geldner, Head of Sanskrit Dept., Marts Burg Univ., West Germany (commending Tarakam Sanskirt Kavyam) వంటి మహనీయుల ప్రశంసలనందుకొన్న భాగ్యశాలి.

దాసుగారిది గంభీరమైన, నిండైన విగ్రహం. మధ్యపాపిటలో జులపాలు సంస్కరించుకొని, పూలు ముడుచుకొని, మెలిపెట్టిన పెద్ద పెద్ద మీసాలతో వారి రూపాన్ని చూస్తుంటే ఏ రాజాధిరాజో హుందాగా ఉన్నట్లు కన్పించేవారట. గాత్ర పుష్టి, గాత్ర సౌష్టవం, గంభీర కంఠస్వరం, సమున్నత వక్షం, విశాల నేత్రాలూ, మహాపురుష లక్షణాలు కొట్టవచ్చినట్లు అగుపించేవి. వారిది విశిష్ట వ్యక్తిత్వం. నిరంతర బ్రహ్మజిజ్ఞాసతో దాసుగారు జగదాకర్షకమూర్తులైన పుణ్యాత్ములు. సంగీత సాహిత్య కళాప్రపూర్ణులై దాసుగారు పుంభావ సరస్వతులై ఒకనాటి కాలాన ఆంధ్ర మహాజనులను ఆనందాబ్ధి నోలలాడించి చరితార్థ జన్ములై మహాపురుషులైనారు.

ఔచిత్యాన్ని అనుసరించి రసభావములకు తగినరీతిలో శబ్దములు, చిట్టస్వరములూ, ముక్తాయిలూ కూర్చే విధానంలో దాసుగారిది అందెవేసినచేయి. నారాయణదాసు ‘లయబ్రహ్మ’ బిరుదాంకితులై మైసూరు, విజయనగరం మొదలైన సంస్థానములలో మహారాజుల మన్ననలందుకొన్నారు. కొమ్ములు తిరిగిన మదపుటేనుగులవంటి సంగీతాది విద్వాంసులచేత ఔనౌననిపించుకున్నారు.

దాసుగారు తెలుగున రచించిన హరికథలు పెక్కు గలవు - జానకీశపథము, రుక్మిణీకళ్యాణము, గజేంద్రమోక్షము, ప్రహ్లాదచరిత్ర, ధ్రువోపాఖ్యానము, మార్కండేయోపాఖ్యానము, భీష్మచరిత్రము, సావిత్రీచరిత్రము, యదార్థ రామాయణము మున్నగునవి వారు రచించిన హరికథలు. హరికథలుకాక పెక్కు శతకములను (శ్రీరామచంద్రశతకము, కాశీశతకము), కావ్యములను (ఉమర్ ఖయాం, బాటసారి), జగజ్జ్యోతియను వేదాంత గ్రంథమును, తారకమను శృంగార ప్రబంధమును, ‘నవరసతరంగిణి’ అను సంగీతశాస్త్ర గ్రంథమును రచించినారు.

వీరి శిష్యులుగా చరితార్థులై పేరుమోసినవారిలో వాజపేయాజుల సుబ్బయ్యదాసు, నేతి లక్ష్మీనారాయణ భాగవతులు (విజయవాడ), వేదనభట్ల వెంకటరమణయ్య, పిల్లలమఱ్ఱి రామదాసు, నేమాని వరహాలుదాసు, కరూరు కృష్ణదాసు, వడ్లమాని నరసింహదాసు మున్నగువారలు గలరు. దాసుగారి అపూర్వ నృత్యకళా కౌశలము కొంచెము సుష్టుగా పట్టుబడినిది కొందరికే - వారు వాజపేయాజులవారు, నేతివారు, వడ్లమానివారు, కరూరు కృష్ణదాసుగారు.

దాసుగారి ప్రియశిష్యులైన కీ.శే. నేతి లక్ష్మీనారాయణ భాగవతులవారి మాటలలో -- గురువుగారంటే సంగీత సాహిత్యాలు మూర్తీభవించిన ‘పుంభావ సరస్వతి’. వారు కథకు నిలబడి చెపుతుంటే సర్వశాస్త్రాలు, కళలు నవరస సమ్మేళనం పొంది ఆకాశగంగా ప్రవాహాన్ని పోలిన గానరసంతో పెల్లుబుకుతూ సాక్షాత్తు పరమాత్ముని విశ్వరూపాన్ని తలపుకు తెచ్చేది. దాసుగారు మధాహ్నంవేళ సంగీత కళాశాలనుండి ఇంటికి వచ్చి భోజనం చెయ్యబోతూ “శంభో” అని రోదసి పిక్కటిల్లేట్టుగా పలికేవారట. ఆ వీథివారందరికి అది దాసుగారి భోజనసమయం అని గుర్తుకొచ్చేది.

దాసుగారి శిష్యవర్గంలో శ్రీ నేతి లక్ష్మీనారాయణగారి దొకవిశిష్ట స్థానము. దాసుగారికి వీరిమీద పుత్రవాత్సల్యము. ఇంటినుండి సంగీతకళాశాలకు దాసుగారి వెంట రామాయణ కథాగానము చేయుచు వీరును సుబ్బయ్యగారును వెళ్ళుచు మార్గమధ్యమందే గురుశుశ్రూష చేయుట ఒక పరిపాటి. ఒకరు గొడుగు ఇంకొకరు పుస్తకం పట్టుకొని వెళుతూవుంటే దాసుగారు ముందు నడిచేవారట. ఆ సన్నివేశమును, సంగీత కళాశాలలో గణపతి నవరాత్రులు జరిపి చివరి దినమున ఊరేగింపు ఉత్సవములో విజయనగర వీథులలో దాసుగారు గీతనృత్యములు పఠించుచుండగా వారి వెనక ఈ శిష్యద్వయము వంతపాడు సన్నివేశము తిలకించిన పురజనులు వాల్మీకి వెంట కుశలవులను జూచిన స్ఫురణగలిగించి పులకించి పోయెడివారట. సుబ్బయ్యగారికి, నేతివారికి ‘రామాయణం’ ఆరు కాండలు ఆరు కథలుగా పూర్తిగా చెప్పి దాసుగారు వారుభయులను ‘రామాయణ సోదరులు’ అనే నామకరణం చేసారు. నాటినుండి ఆ సోదరుల సహకారగానం గురువుగారి కథకు తప్పకుండా ఉండేదట. దాసుగారికడ వారి పండ్రెండు హరికథలను వల్లించిన మహాయోగము ఈ రామాయణ సోదరులకే పట్టినది. శిష్యులంటే కేవలం సహకారగానం చెయ్యటమే కాకుండా, కథకు ముందు మంచి గంధం అరగదీసి శ్రీవారి భుజాలకు, వక్షస్థలానికి రాసేవారట. దాసుగారు శిఖలో పువ్వుధరించి మెడలో మాలవేసుకొని కథకు బయలుదేరేవారట.

దాసుగారు 9-11-1933న తునిలో కథ చెప్పినప్పుడు సహకారగానానికి నేతివారు వెళ్లారు. అప్పటికే దాసుగారి కథలను వారి సన్నిధిలో శుశ్రూష చేయకుండగనే కొందరు హరిదాసులు చెప్పుటయు, ఆ చెప్పుటలో వారి సంప్రదాయమునకు చెరుపు చేయుటయు కద్దు. అట్టి యొక ఘట్టములో ఆవేశవశంవదులైన దాసుగారు వెంటనే ఆ తునిలోనే 11-11-1933న నేతివారికి సాధికారముగా ఒక సనదు (అనగా సర్టిఫికేట్) వ్రాసి సంతకము చేసి యిచ్చిరి. ఏ విశ్వవిద్యాలయ పట్టానికి లేని గౌరవము ఇట్టి సనదుకు ఉందని ఉప్పొంగిపోయారట నేతివారు. (సనదు సారాంశము - “నేతి లక్ష్మీనారాయణ భాగవతునకు ఆదిభట్ల నారాయణదాసు వ్రాసి ఇచ్చిన యనుమతి. నీవు నాయొద్ద శుశ్రూష చేసి నేర్చుకోన్నావు కనక నారచించిన యక్షగానములు హరికథలుగా నీవు సభలలో నృత్య గీత వాద్య సహితముగా సభలలో నిచటి నుండియు విన్పించ వచ్చును.” -- ఆదిభట్ల నారాయణదాసు వ్రాలు, 11-11-33, తుని)

శిష్య వాత్సల్యములో ఈయనకు సాటి ఎవరూ ఉండరని కూడా ప్రఖ్యాతి ఉంది. క్రొత్తగా తన కడకు విద్యార్థియై వచ్చిన నేతివారిని శిక్షణ పూర్తికాలము సహపంక్తిని భోజనము పెట్టి సత్కరించిరి. అలాగుననే అభినవాగతులైన శిష్యులందరికీ సర్వసదుపాయములను దాసుగారే సమకూర్చేవారు. తమ యింట కుదెరినా సరే, లేకున్న తామెరిగిన సంపన్నులచే వారికి భోజనవారములు ఏర్పరిచెడివారు. జేబుఖర్చులకు వారికి డబ్బులు గూడా ఇచ్చుచుండెడి వారట. శిష్యులకు బిడియము పోగొట్టుటకు, హరికథ కింత ప్రచారము కల్గించి వారి కిహపరముల కింత యుపాధి చూపుటకును నడివీధియందు తాను గజ్జెకట్టి నాట్యము చేయుచు వారిని పాడమనుచు, తాను తాళము వేయుచు వారిని ఆడుమనుచు అక్కడికక్కడ శిష్యులకు విద్య నూరి పోసేడివారు.

శ్రీ దాసుగారిలో పరమోత్తమ వాగ్గేయకారుడు త్యాగయ్యయున్నాడు, అభినయ పరమార్థవేత్త క్షేత్రయ్యయున్నాడు, అద్వైత దేశికోత్తములు శ్రీ శంకరులు వున్నారు. పై మువ్వురికంటే విలక్షణముగా దాసుగారికే చెందిన ప్రత్యేక వ్యక్తిత్వమున్నది.

తెలుగు రాష్ట్రములలో ప్రఖ్యాతిపొందిన హరిదాసులు శ్రీ దాసుగారికి శిష్యులో, ప్రశిష్యులో అయిఉన్నారు. హరికథా వాఙ్మయ ప్రాచుర్యానికి, హరికథా ప్రదర్శన నైపుణ్యానికి మూలపురుషులు శ్రీ నారాయణదాసుగారే! కనుకనే వీరు ‘హరికథా పితామహ’ బిరుదానికి సర్వవిధములచేతా పాత్రులయ్యారు.

దాసుగారి ఇతర ప్రజ్ఞలన్నీ ఒక ఎత్తు, హరికథా కథన కాలక్షేప సంవిధానం రూపొందించి ప్రచారం చేయడం ఒక ఎత్తు. అంత్యతాకర్షణీయమై, రమణీయమై, కళాత్మకమైన ఈసాధనము సంగీతాన్ని, సాహిత్యాన్ని, నృత్యాన్ని రంగరించుకొని నారాయణదాసు కృషిఫలితంగా రూపుదిద్దుకొన్నది. అందుచేతనే ఆయన ‘హరికథా పితామహుడైనాడు’. కవిగా, పండితుడిగా, వైణికుడిగా హిమాలయశృంగసదృశమైనప్పటికీ ఈయన ‘శంభో’ అన్న నాదంతో హరిదాసుగా అందుకొన్న కీర్తి కైలాసశిఖరిలా ఉత్తుంగమైంది. భక్తి భావాన్నీ, ధర్మాన్నీ పండిత పామర రంజకంగా ప్రచారంచేసే అవకాశం కల్పించిన ఈ సాధనం నారాయణదాసుగారికి అనన్య సామాన్యమైన కీర్తిని చేకూర్చింది. వారిని సువర్ణఘంటా కంకణాలంకారాలతో అలంకరించింది. అసంఖ్యాకులైన హరిదాసులకు మార్గదర్శియై వారి భుక్తికి ముక్తికి దారి చూపించిన ఉపదేష్టను చేసింది. అందుచేతనే తిరుపతి వేంకటకవులు “దాసు నారాయణునకు నీతండు, వీని దాసులెల్ల రొక్క హరిదాసులేగాదు, నిక్కమితని యెడల నాద్రుతి లేనివాడెవడు బుడమి.” అని ప్రసంగవశంగా, స్వభావోక్తిగా ప్రశంసించారు.

దాసుగారు అపర సరస్వతీ అవతారమూర్తి. విజయనగరంలో ఒకానొకప్పుడు ఎండలు విపరీతముగా కాస్తూ చెరువులు, బావులు ఎండిపోయి తాగటానికి మంచినీళ్లు లేని పరిస్థితి ఉన్నప్పుడు -- దాసుగారి అమ్మగారు ఒరేయ్ నాయనా నేను నీకు చిన్న తనంలో చెప్పిన మార్కండేయ కథ గుర్తుందికదా .. నీవు మార్కండేయ చరిత్ర హరికథగా వ్రాసి మూడు కోవెలల దగ్గరో, ఆంజనేయస్వామి ఆలయం దగ్గరో కథాగానము చేస్తే వరుణదేవుడు కనికరించి వర్షాలు కురుస్తాయేమో అన్నారుట .. సరే అమ్మ చెప్పిందని ఈశ్వరుడికి మనవిచేసి రేపు కథవ్రాసి ఎల్లుండి నలుగురికీ వినిపిస్తానన్నాడు దాసుగారు అమ్మతో. ఆనాడు, మరునాడు కటిక ఉపవాసం, జాగరణం, నియమముతో వరుణ మంత్రం జపంచేసారు దాసుగారు. ఈశ్వరుడికి మనశ్శుద్ధిగా మనవి చేసారు. కలం, కాగితాలు తీసుకున్నారు. రెండోనాడు ఉదయకాలములో ఆరంభించి మధ్యాహ్నానికి పూర్తిచేశారు. ఆ మర్నాడు శిష్యులచేత చుట్టు పక్కల వీథులవారికి కబురు పెట్టించారు. మూడు కోవెలల ముందు మార్కండేయ హరికథాగానం సాయంకాలం మూడుగంటలకని. జనం విరగబడి వచ్చారు. కర్ర పావులు తొడుగుకొని బయలు దేరారు దాసుగారు. ఇదేమిటి కర్ర పావులు తొడుగుకున్నారని శిష్యుడడిగాడు. ఇప్పుడు దారిపొడిగా ఉందిగానీ తిరిగివచ్చేడప్పుడు తడిగా ఉంటుంది చూస్తావు కదరా! - అన్నారు. “బాల చంద్రమౌళి పాదముల్ విడక” .. అనే కీర్తన అందుకున్నారు. అంగము శైత్యపైత్యములంటనీక గంగాభవాని నిన్ కాపాడుగాక .. అని చరణం పూర్తిచేసి ‘శంభో’ అని కేక వేశారట. అంతే ! మహదాశ్చర్యం. మండుటెండ మాయమయినది. మింట కారుమబ్బు కమ్మింది శంభో కేకను అనుకరిస్తునట్లు ఉరుములు గానకవితాసుధాధారనుపోలి ఏనుగు తొండాలంతలేసి జలధారలు. విజయనగర ప్రాంతమంతా జలార్ణవం అయిపోయింది. పొడిగా వచినవారందరు తడిగా వెళ్లారు మార్కండేయ విజయాన్ని పొగుడుతూ. అమ్మా! ఇదంతా నీ అమోఘాశీర్వచన మహిమ! అన్నాడా చదువుల సరస్వతి. కనుకనే నారాయణదాసుగారు ‘దివ్యాంశ సంభూతుడు’, ‘సరస్వతీ అపరావతారమూర్తి’ అనటానికి ఇది ఒక ఉదాహరణ.

ఒకసారి దాసుగారు బందరులో హరికథ చెప్పటానికి వెళ్ళినారట. అప్పుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి తల్లి నాయనా మబ్బు పట్టినది .. వాన వచ్చిన కథ ఎట్లుజరుగునో అనగా నారాయణదాసుగారి కథ గావున వర్షం రాదమ్మా అన్నారట! వర్షం లేదు, కథ లోకోత్తరముగా సాగినదట. దాసభక్తి మహిమయట్టిది!!

దాసుగారు తన ప్రియశిష్యుడైన నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారితో, మరి కొందరితో .. “ఒరేయ్ నేనెవరినో ఈ లోకం సరిగా గుర్తించలేదు. దానివల్ల నాకేమి లోటు .. ఆ వెలితి వాళ్లదే .. నావంటివాడు కొన్ని వేల సంవత్సరములకు గాని ఆవిర్భవించడు” అని ఘంటాపధంగా అప్పుడప్పుడు అనేవారట.

శ్రీ నారాయణదాసుగారు రచించిన ‘జానకీ శపథం’ (ఉత్తర రామచరిత్ర) హరికథ ఒక సంగీత కళాఖండం. అందులో వారు పూర్వాంగ, ఉత్తరాంగములకు చెందిన 35 రాగాలను తీసి, వానిలో కీర్తనలు వ్రాసారు. ఆ కీర్తనలు గానం చెయ్యడానికి అసాధారణ సంగీత ప్రజ్ఞాపాటవము లేనిచో గానము చెయ్యడం కష్టం. ఉదాహరణకు శ్రీరాముడు కుశలవుల అమరగానమున కచ్చెరువొంది “ఏ యూ రెవ్వారి తనయు లెరింగింపుడు బాలులారా” అనే కీర్తనను 72వ మేళకర్తయైన రసికప్రియలో రచించారు. కొంతమంది పాడలేక ఆ కీర్తనను చక్రవాక రాగములొ పాడేవారట. ‘జానకీ శపథం’ కీర్తనలు పాడాలంటే సంగీత విద్వాంసుడైయుండాలి గానీ, ఆపాటి - ఈపాటి జ్ఞానం కలవారు పాడలేరు. ఇప్పుడు ఎవరికి తోచిన సులభ రాగాలలో వారు పాడుచున్నారు. దాసుగారి శిష్యులలో ముగ్గురు మాత్రం రాగములు చెడకుండా పాడేవారని అనేవారు. వారు - వాజపేయాజుల సుబ్బయ్యదాసుగారు, నేతి లక్ష్మీనారాయణ భాగవతులు మరియు నేమాని వరహాలదాసుగారు. ఆపురూపమైన రాగములలో ముందు తరాలవారికి వారి సంగీత పాండిత్యమును, కల్పనా చాతుర్యమును అక్షర బద్ధంచేసి అందించారు అని అన్నారు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారు. ఈ కథలో 72 మేళకర్తలకు అన్ని కీర్తనలు స్వరయుక్తముగా రచించి వారి ప్రతిభకిది యొక పరాకాష్ఠ అనిపించుకున్నారు దాసుగారు అని కొనియాడారు శ్రీ అమ్ముల విశ్వనాథ భాగవతార్.

కళాకమనీయమైన ఆ మహామహుని జీవతములో రసవత్తర సన్నివేశములు అనేకములు కలవు. ఈ సందర్భములో వానిలో మచ్చుకకు కొన్ని ఇచట ఉదాహరించటమైనది.

1883లో (అప్పటికి దాసుగారికి 19 సంవత్సరముల వయసు) విజయనగరమున దాసుగారు మెట్రిక్యులేషను చదువుచుండగా కుప్పుస్వామినాయుడను హరిదాసు చెన్పపట్టణమునుండి వచ్చి కానుకుర్తివారి యింట ‘ధ్రువచరిత్రము’ చెప్పుచుండగా తిలకించిన సన్నివేశము, దాసుగారి హరికథావతారమునకు నాంది అయినది.

1884లో దాసుగారి చరిత్రలో ఛత్రపురమున నొక విచిత్ర సంఘటన జరిగినది. ఒక పెండ్లిపెద్ద కోరికపై దాసుగారు వారి యింట ‘ధ్రువచరిత్రము’ హరికథ చెప్పిరి. అది విని పెండ్లిపెద్ద దాసుగారితో ‘అంబరీష చరిత్రము’ నా కొడుకునకు ఇష్టము, కవిత్వము చేసి విన్పించగలవా? నీకు పది దినములు గడువిచ్చిన’ అన్నారుట. ఆ రాత్రికి రాత్రి పంతము పట్టి మతి బృహస్పతియగు దాసుగారు అంబరీష చరిత్రమును రచించి, మరునాడు ఉదయము తొమ్మిది గంటలకు హరికథ అద్భుతముగా గానము చేసిరట.

‘విజయనగర గర్వకారణము’ - మదరాసు హైకోర్ట్ న్యాయవాది శిరోమణి రాయ్ బహాదూర్ శ్రీ పనప్పాకం ఆనందాచార్యులవారి నివాసములొ (జూన్ 1894లో) దాసుగారు ‘అంబరీష చరిత్ర’ హరికథాగానం చేసిరి. సత్కవి యనియు, బహుముఖ ప్రతిభాశాలి యనియు .. విజయనగర వైభవ గర్వకారణమనియు, బహుధా శ్లాఘింపబడిరి.

తేది 25-8-1894న బెంగుళూరులో మైసూరు ప్రభుత్వోన్నతాధికారుల యెదుట దాసుగారు సంగీత కాలక్షేపము చేసినప్పుడు, ఆనాటి రాత్రి వారి గౌరవార్థము ఏర్పాటుచేసిన విందులో ఉన్నత న్యాయాధిపతియైన శ్రీ రామచంద్ర అయ్యర్‌గారు దాసుగారిని ‘ఉత్తర సర్కారుల సంపద’ అని అభివర్ణించారు.

నారాయణదాసు అల్ప సంతోషి - 1895 ప్రాంతమున మైసూరు మహారాజావారు శ్రీ దాసుగారిని మెచ్చుకొని ఏమికావలెనో కోరుకోమనగా - అందులకు దాసుగారు “ఒక బుట్టెడు బెంగుళూరు వంకాయలు” ఇప్పించమని వేడిరట.

1904లో కాకినాడలో ‘సరస్వతీ గాన సభ’ స్థాపితమైనది మొదలు 1942 వరకు ఏటా ఆ సభకు దాసుగారి కథతోనే బోణీ జరుగుచుండేది. ఏ పాట కచ్చేరికిరాని ‘గేటు కలక్షను’ దాసుగారి హరికథకు వచ్చేదట. విజయనగర ప్రభువులు “మా దర్బారులో నీవేమైనా సర్వీసు జేయ గొరెదవా?” యను రాజావారి ప్రశ్నకు - “మర్త్యులను గొల్వ నొల్లను” అని దాసుగారు సమాధాన మిచ్చిరట.

1912-13లలో విజయనగరమున రీవాసర్కార్ రాణీ అప్పలకొండయాంబగారు దాసుగారిచే చెప్పించుకొన్న మూడు హరికథలలో రుక్మిణీకళ్యాణము విన్నపుడు సంతోషపరవశయై యేమి కావలయునో కోరుకొమ్మన్నపుడు - దాసుగారు “ఈశ్వర కటాక్షముకన్న కోరదగిన వస్తువేమున్న” దనిరి. ఆ కాలములోనే దాసుగారు కాశీయాత్రచేసిరి. అలహాబాదులో సుప్రసిద్ధ గాయనీమణి జానకీబాయి దాసుగారి మేఘగంభీర స్వరమునకును, హిందుస్తానీ బాణీకిని విస్మితురాలయారట.

ఒకమారు కలకత్తాలో (1913లో) దాసుగారు హరికథామృతంలోని శ్రీకృష్ణ జననం కథాగానం చేస్తున్నప్పుడు - హరికథ ఆసాంతం విన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ - దాసుగారిని కౌగలించుకొని హరికథ ఎవరివద్ద నేర్చుకున్నారు అని దాసుగారిని అడిగినప్పుడు -- దాసుగారు దేవునివద్ద అని చమత్కరించిరట.

1923లో కాకినాడ కాంగ్రెసు సమావేశ సందర్భమున దాసుగారు ‘రుక్మిణీ కళ్యాణము’ హరికథ చెప్పినప్పుడు, ఆ హరికథ విన్న ‘భారత కోకిల’ సరోజినీదేవి నాయుడు “your dance is exquisite” (మీ నృత్యం చాలా మనోహరము) అని శ్లాఘించినారట.

1923లో ఇంగ్లండులో జరిగిన ‘ఎంపైర్ ఎక్సిబిషన్’నకు భారతీయ సంగీతమునకు ప్రతినిధిగా దాసుగారే ఎన్నికయినప్పటికీ - ఆ వయసున నచటి శీతల వాతావరణమునకు తట్టుకొనుట కష్టమని ఆప్తమిత్రుడు బార్డ్స్ వెల్ దొర సలహాతో వారి ప్రయాణము ఆగిపోయినది.

1931లో గుంటూరులో జరిగిన యేడవ ఆంధ్రగాయక మహాసభకు దాసుగారిని అధ్యక్షులుగా ఎన్నుకొన్నారు.

సాధారణముగా మతాధిపతులకు, పీఠాధిపతులకు జరిగెడువంటి ‘బ్రహ్మరథ’ సన్మానము తేది 9-11-1933న తునిలో శ్రీ దాసుగారికి తుని పౌరులవలన అత్యంత వైభవముగా జరిగినది. (13-11-1933 నాటి హిందూ పత్రిక, ఆంధ్రపత్రిక తెలుపుచున్నవి.)

దాసుగారి డెబ్బయ్యవ జన్మదిన సందర్భాన (1934) సింగరేణి కాలియరీస్ పురజనులు శోభాయమానంగా గజారోహణము కూడా చేసి తరించారు.

వయోవృద్ధుడు - నృత్య నిత్య యౌవనుడు -- సెప్టెంబర్, 1935లో రాజమహేంద్రవరము మ్యూజిక్ అకాడమీ దసరా మహోత్సవములలో హరికథాగానము చేసిన దాసుగారు “వయోవృద్దుడు - నృత్య నిత్య యౌవనుడు అని ప్రశంసింప బడ్డారు – “It is remarkable that though Mr. Narayana Das is nearly 72 years old, he kept the packed hall spell-bound and made the function a great success. In spite of the old age, Mr Das danced like an young man of 25”. (Indian Express, 30 Sep 1935)

‘గాయక సార్వభౌమ’ ‘భారతీతీర్థ మహోపాధ్యాయ’ కీ.శే. శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు (మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గురువులు) దాసుగారిని ఒక లేఖలో - ‘సంగీత సరస కవితాది సకల కళాప్రపూర్ణ’గా అభివర్ణించారు.

ఫిబ్రవరి 1936 లో హైద్రాబాదులో జరుపబడిన త్యాగరాజ ఉత్సవములలో దాసుగారి రుక్మిణీకళ్యాణము హరికథ విన్న సాహిత్యాభిమానులందరు దాసుగారి పాండిత్యమును, నాటక కళానైపుణ్యమును చూసి ముగ్ధులైనారు.

1936 మార్చి నెలలో అప్పటి ఆంధ్ర మిత్రమండలివారు దాసుగారికి సన్మానపత్రం సమర్పించిన దాఖలాలు ఉన్నాయి. ఇదే మార్చి నెలలో హైద్రాబాదు తుల్జా భవనములో దాసుగారు ‘హనుమత్సందేశము’ హరికథ చెప్పినప్పుడు ఆ రోజులలో సుమారు 5000 వేల మంది వారి కథ తిలకించారట.

May 1937 లో సింగరేణి కాలియరీసు దగ్గర ఉన్నటువంటి ఇల్లేందు పుర వాస్తవ్యులు దాసుగారికి పండిత సన్మానం జరిపినట్లు తెలుస్తోంది.

శ్రీ దాసుగారి ‘ఉమర్ ఖయాం’ విజయనగర మహారాణి ప్రోత్సాహమున వ్రాయబడుటచే రాణిగారు ఆ గ్రంథం అచ్చువేసి డాక్టర్ S. రాధాకృష్ణగారికి పంపి వారిచే తొలిపల్కు వ్రాయించారట. ఆ పలుకులివి “I was greatly struck by his varied talents, remarkable linguistic equipment and technical Power of versification ….. I am tempted to congratulate him on Performance which taking all things into account is certainly astounding.”

నూనూగు మీసాల నూతనయౌవ్వనమునుండి జీవితాంతం వరకు హరికథా రచనలు చేస్తూ, వేలాదిగా హరికథలు వినిపిస్తూ, కలకత్తానుండి కన్యాకుమారి వరకు దాసుగారు దేశ పర్యటనలు చేసేవారు. చిన్న గ్రామాలు మొదలు - మహా పట్టణములు, అనేక సంస్థలలో, పరిషత్తులలో, విద్వత్సభలలో, దేవాలయాలలో, కోటలలో, రాజ దర్బారులలో, అంతఃపురాలలో వారు చేసిన హరికథా గానములు వేలకుమించి ఉన్నాయి. సామాన్యులు మొదలుకొని ప్రతిభావంతులు, అష్టావధాన శతావధానములు చేసిన దిగ్దంతులైన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు, కాశీ కృష్ణమాచార్యులుగారు, జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు, ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ (రాష్ట్రపతి) గారు మొదలుకొని వివిధ రాజకీయ ధురంధరులు, మద్రాసు ప్రెసిడెన్సీ (Madras Presidency) High Court Judge మొదలు Pleader గుమస్తాల వరకు, పోలీసు శాఖోద్యోగులు - వీరు వారు అనడం ఎందుకు? అన్ని వర్గముల వారు వేలాదిమంది నారాయణదాసుగారి హరికథా గానానికి, కవితాశక్తికి, సంగీత-లయల పాండిత్యానికి, అష్టావధానాలకు ముగ్ధులై ఆనందిచేవారట. వారు సభలో ఉన్న సభకు నిండు. వారితో సంభాషించుటకు పండితులు, కవులు భయపడెడివారు. వారు రామాయణ యక్షగానమును రచించి, దేశములో అనేకమంది హరిదాసులను శిష్యపరంపరగా తయారుచేసి భక్తిని, ముక్తిని, భుక్తిని కల్పించి తరించిరి.

నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షణ సమస్థాయిలో పరిమళించాయి. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వర’, ‘అట పాటల మేటి’, ‘సంగీత సాహిత్య సార్వభౌమ’ అని సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలతో ఐదు తాళాలకూ దరువు చూపేవారు. అప్పుడు ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సుమారు ఆరున్నర దశాబ్దాల సంగీత, సాహిత్య, హరికథా కళా ప్రస్థానంలో ఆయన అందుకోని సన్మానం లేదేమో. రాజ సన్మానాలూ, పౌర సన్మానాలూ, బిరుదు ప్రదానాలూ, గజారోహణలు, సువర్ణ ఘంటాకంకణ ధారణలూ, గండపెండేర ధారణలూ ఇలా ఎన్నెన్నో గౌరవాలు ఆయనకు లభించాయి.

నారాయణదాసుగారు తెలుగులో, అచ్చతెలుగులో, సంస్కృతంలో సుమారు ఏభై గ్రంథాలను రచించారు. వాటిలో స్వతంత్ర కావ్యాలు, ప్రబంధాలు, అనువాద గ్రంథాలు, వచన గ్రంథాలు, కవితా సంపుటాలు, శతకాలు, వేదాంత పరిశోధనలు, సంగీత ప్రబంధాలు, హరికథలు, పిల్లల నీతికథలు వగైరా ఉన్నాయి. అన్ని కళలలో ప్రావీణ్యం గల ఆయనను ‘ది హిందూ’ పత్రిక (జూన్ 30, 1894) బహుముఖ ప్రజ్ఞాశాలి అని శ్లాఘించింది. “మేఘ గంభీర నిస్వనంబున దిసావలయంబు మారుమ్రోతల ధ్వనించు” అని “ఒక కవి - కథకరత్న” దాసుగారిని ప్రశంశించాడు. ఆ మహనీయుడు తెలుగు జాతికి అధ్బుతమైన, అనన్య సామాన్యమైన, అనితర సాధ్యమైన, అజరామరమైన సాహిత్య సంపదను కానుకగా ఇచ్చారు.

శ్రీ దాసుగారికి సంగీతంలో స్థానం గురించి మహాపండితుడు, సుప్రసిద్ధ విమర్శకుడు అయిన శ్రీ శ్రీనివాస శిరోమణి ఇలా ఉదహరించారు (1944 నవంబర్ ఆంధ్రపత్రికలో) “దాసుగారు హరికథలు ఎందుకు మొదలెట్టారో తెలియదు, తెలియచెప్పేవారూ లేరు. కానీ దక్షిణాపధంలో సంగీతంలో అంతవాడు ఇంతవరకూ పుట్టలేదు. త్యాగయ్య సంగీతంలో ప్రాధమికంగా తేలికగా చేసిన పనులు శ్రీ నారాయణదాసు అతిసమగ్రంగా సప్రమాణంగా ప్రౌఢంగా ప్రదర్శించి చూపాడు. మైసూరు సంగీత దుర్గంమీద దాడిచేసి చిన్నాభిన్నంగా దాన్ని బగులగొట్టి ఆ మైసూరుతోబాటు దక్షిణాపథం అంతటా వినువీధిలో తన జయపతాకం ఎదురులేని రీతిలో ఎగురవేసిన జెగజెట్టి శ్రీ నారాయణదాసు”.

శ్రీ నారాయణదాసుగారి భక్తిని, శక్తిని శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు ఇట్లు ప్రశంసించిరి “ప్రహ్లాద నారద పరాశర పుండరీక .. అన్న పరమ భక్తులలో పరిగణింప తగ్గవాడు; అంతరంగము బహునిర్మలమైనది; ప్రపేదిరే ప్రాక్తనజన్మ విద్యాః అను కాళిదాసోక్తి ఈతనియందు సమన్వయించినట్లు మరియొకరియందు సమన్వయించదు”.

తేది 30-8-1964న దాసుగారి శతజయంత్యుత్సవ సందర్భముగా ఆనాటి ఒక ప్రముఖ దినపత్రికలో దాసుగారిగురించి ఒక ప్రత్యేకవ్యాసములో “ఒకటి రెండు విద్యలలో అసమానులుగా పాటించదగిన వారుండవచ్చు. కాని ఏకకాలంలో అనేక విద్యలలో, అనేక కళలలో ఆరితేరి అన్నిటా సమధిక ప్రజ్ఞావంతుడుగా సకల కళానిధిగా పరిణగించ దగిన వ్యక్తి అరుదుగా మాత్రమే ప్రభవిస్తాడు. శతజయంతి మహోత్సవ సందర్భంగా నేడు మనం సంస్మరిస్తున్న యశశ్శరీరుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు అపురూపమైన అట్టి మహావ్యక్తి అనడానికి సందేహంలేదు. సర్వతోముఖమైన ఈ పాడింత్యమంతా శ్రీ నారాయణదాసు స్వయంకృషిచే సాధించినదేగాని, గురుముఖతా అభ్యసించింది కాదు. అన్ని కళలూ, అన్ని విద్యలూ వాటంతట అవే శ్రీ దాసుగారిని వలచి వచ్చినవి. ఇది అపూర్వ విషయం. సంగీత సాహిత్యాలలో సహజ పండితుడూ, నిరంకుశుడేగాక, స్ఫురద్రూపీ, సుందరాకారుడు శ్రీ నారాయణదాసు. ఇదిగాక, సంగీతంలో స్వరకల్పనలో ఈయనదొక విలక్షణమైన బాణి. ఇతరులను ఈయన సుతరాము అనుకరించేవాడుకాడు. ఇతరులు ఈయనను అనుకరించడానికి కూడా అలవికాడు. దక్షిణదేశ మార్దంగికులలో ప్రసిద్ధుడైన దక్షిణామూర్తి పిళ్ళై అంతని వానిచే చేతులెత్తి నమస్కరింపచేసినది లయలో శ్రీ నారాయణదాసుగారికి గల ప్రజ్ఞావిశేషం. సుమారు అర్ధశతాబ్దానికి పైగా యావదాంధ్రదేశంలోనే కాదు, యావద్దక్షిణభారతంలోనే శ్రీ నారాయణదాసుగారు ‘ఆడినది ఆట, పాడినది పాట’గా జీవితాన్ని గడిపారనటంలో అతిశయోక్తిలేదు. .. ఇట్టి సకల కళా విశారదునకు, ఇట్టి వరప్రసాదునకు, ఇట్టి పుంభావ సరస్వతికి శతవార్షిక జయంతి సందర్భంగా యావదాంధ్రజాతి జోహారులర్పించడం సర్వసమంజసం” అని ప్రశంసించారు.

తన సంగీతము ద్వారా త్యాగరాజు భగవంతుని సేవించి పరమపదమును పొందియుండగా దాసుగారు తన సంగీత సాహిత్యములతో పరమాత్ముని కీర్తించిరి. వీరు ఘనగంభీర, మధుర స్వరముతో కథ చెప్పుచుండగా వేలమంది ప్రజలు దూరశ్రవణ యంత్రము యొక్క అవసరము లేకుండా వినగలిగెడివారట. కొన్ని మైళ్లవరకు వారి కంఠము వినిపించెడిదట. దాసుగారు జీవితమున ఎట్టి లోటును లేకుండా తృప్తితో, ఉత్సాహముతో, ఉల్లాసముతో, విలాసములతో, భోగములతో, గౌరవముతో హాయిగా కాలము గడపిన ధన్యజీవి. భక్తిపారవశ్యముతోడి హరికథా సంకీర్తనములచే పవిత్రహృదయుడయిన పుణ్యమూర్తి.

నటరాజునకు గగనతలమే రంగస్థలమైనట్లు నట్టనడివీథియే ఆదిభట్టు హరికథల కాటపట్టయినది. తనకడకు విద్యార్థులుగా వచ్చిన వారిని విద్వాంసులుగాచేసి పంపుటయేగాదు తనలోగిటను వాకిటను గూడ హరిదాసులకు అరచేత వైకుంఠము చూపేవారు దాసుగారు. శ్రుతిలయలు రెండు ఆయనకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు. అయనతీసిన కూనిరాగము సామగానము. ఆడినతైతెక్కలు శివతాండము. ఆయనకీ జగమంతా సంగీతశాలయే ..

త్యాగరాజుతో నేస్తం కట్టడానికో, లేక విద్యావివాదానికో అన్నట్లు సరిగ్గా త్యాగరాజాస్తమయ తిథియైన పుష్య బహుళ పంచమినాడే, 1945 జనవరి 2న, నారాయణదాసుగారు స్వర్గలోక గతులైనారు. ఇట్టి పుంభావ సరస్వతి ‘న భూతో న భవిష్యతి’.

ఇట్టి సరస్వతీ అపరావతారమూర్తికి తేది 25-1-1951న విజయవాడ సత్యనారాయణపురము శివాలయావరణములో దాసుగారి ప్రియశిష్యులు ‘హరికథా కేసరి’, ‘హరికథా ప్రవీణ’ నేతి లక్ష్మీనారాయణ భాగవతులు, వాజపేయాజుల సుబ్బయ్య భాగవతులు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసులచే ఆగమోక్తముగా ప్రతిష్ఠచేసిన శ్రీ నారాయణదాస శిలావిగ్రహమునకు గత 70 వత్సరములుగ పుజాదికములు జరిపి శ్రీవారి జయంతి (శ్రావణ బహుళ చతుర్దశి) మరియు వర్ధంతి (పుష్య బహుళ పంచమి) ఆరాధనోత్సవములు శిష్య ప్రశిష్యులచే నేటికీ ఘనంగా, నిరాటంకముగా సాగుతున్నాయంటే అతిశయోక్తిగాదు.

నారాయణదాసవర్యుల సంప్రదాయన్ని కొనసాగిస్తున్న శిష్యపరంపర హరికథా పతాకం దిగజారకుండా ఆలయ మండపాలలోను, సంగీత సభలలోను, రేడియో - టీవిల లోను కథాకాలక్షేప కళను కాపాడుకొంటున్నారు. దీనికి తూ. గో. జిల్లాలోని సర్వరాయ హరికథా శిక్షణ కేంద్రం కూడా ప్రశస్తమైన కృషి చేస్తోంది.

‘హరికథా’ ప్రక్రియద్వారా ఆనందం కల్పిస్తూ పురుషార్థ సాధన కవసరమైన విజ్ఞానాన్ని తెలుగు రాష్ట్రముల నాలుగు చెరగులా పండిత పామరులందరికి సుమారు ఆరు దశాబ్దాలకుపైగా పంచిపెట్టి సహస్ర చంద్ర దర్శనముచే చరితార్థుడై సిద్ధినందిన నారాయణదాసుగారు మనకు చిరస్మరణీయుడు, సదా స్మరణీయుడు.

ఓం శ్రీ నారాయణదాస గురుభ్యో నమః.


సంకలనం: శ్రీ యనమండ్ర వెంకట కృష్ణయ్య
(కీ.శే. నేతి లక్ష్మీనారాయణ భాగవతులవారి మనుమడు)
వ్యవస్థాపకుడు - అన్నమయ్య పరివారము, హైదరాబాదు.

AndhraBharati AMdhra bhArati - pramukhulu - Adibhatla Narayana Dasu ( telugu pramukhulu andhra pramukhulu ) ( telugu andhra )