ప్రముఖులు కీ.శే. నేతి లక్ష్మీనారాయణ భాగవతులు  

‘హరికథా కేసరి’, ‘హరికథా ప్రవీణ’
కీ.శే. నేతి లక్ష్మీనారాయణ భాగవతులు (1897-1979)

హరికథా జీవనులై సంగీతాన్ని ఆరాధించిన కళాకారులలో అత్యంత ప్రముఖులైనవారు నేతి లక్ష్మీనారాయణ భాగవతులు. వీరు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా నూతక్కిలో 1897 ఆగష్టు 25న జన్మించారు. వీరి తల్లితండ్రులు సంగీత కళాపోషకులైన నేతి వెంకటప్పయ్య, మహాలక్ష్మమ్మ.

లక్ష్మీనారాయణ భాగవతులు పూర్వము వేద విద్యార్థి. ఆదిభట్ల నారాయణదాసుగారి సమాహార కళాసాగరమైన హరికథ ఆయనను ఆకర్షించినది కాబోలు.

సహజసంగీత సాహిత్య కోవిదులు, మహాకవిసార్వభౌములు, బహుభాషావేత్తలు, భావ, రాగ, తాళ, స్వర, శబ్ద ప్రబంధ కల్పనా సమంచిత పంచముఖీస్వరస్తోత్ర సహస్రావధాన ధురీణులు, స్వవిరచిత నానావిధానేక సంస్కృతాంధ్ర కావ్యోత్తమ సంపాదిత సంపూర్ణ యశశ్చంద్రికాధవళిత దశదిశావకాశులు, హరికథాగాన వాగనుశాసనులు, భాగవత శిఖామణులు, హరికథాగాయకులకు భుక్తిముక్తులను ప్రసాదించిన నిత్యానన్దమూర్తులు, కాత్యాయనీకటాక్ష విభవలబ్ధ జ్ఞానధనులై మోక్షసామ్రాజ్య మలంకరించిన “హరిదాస జగద్గురు” శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస సద్గురుపాదులు నేతి లక్ష్మినారాయణవారి గురువర్యులు. దాసుగారు హరిదాస జగత్తుకే గురువులు -- కాని వారు (దాసుగారు) ఆయనను ‘నా శిష్యు’డని చెప్పుకోవాలని లక్ష్మీనారాయణవారి ఆశయం. ఆ మహద్భాగ్యం కోసము వారు చేసిన తపస్సు ఫలించింది. ఆ ఫలమే వారి జీవిత కుసుమానికి పారిజాత సౌరభాన్ని ప్రసాదించింది.

నేతివారి మాటల్లో -- గురువుగారంటే సంగీతసాహిత్యాలు మూర్తీభవించిన “పుంభావ సరస్వతి”. వారు కథకు నిలబడి చెపుతుంటే సర్వశాస్త్రాలు, కళలు నవరస సమ్మేళనం పొంది ఆకాశగంగాప్రవాహాన్ని పోలిన గానరసంతో పెల్లుబుకుతూ సాక్షాత్తు పరమాత్ముని విశ్వరూపాన్ని తలపుకు తెచ్చేది. శ్రీవారి హరికథాగానం కాకినాడ సరస్వతీ గానసభలో మొట్టమొదట విన్నారు. ఈ కథాకథన వ్యాసంగం కూడా చేస్తూ ఉండడంచేత నాటినుండే శ్రీవారి శుశ్రూషకు కంకణం కట్టుకొన్నారు. కాకినాడలోనే వారి బసలో చేరి, ఒకటి రెండు మూడు సంవత్సరములు వరుసగా వెళ్లి వారి గురువుగారికి సర్వోపచారములు చేసారు. అయితే ఏం, నేతివారికి దాసుగారు గురువులే కాని వారింకా దాసుగారికి శిష్యుడు కాలేదు. శ్రీవారి పరిచర్యకు శ్రీవారి సోదరులు శ్రీ పేరన్నగారు అనుమతి ఇచ్చారట. ఈ మూడు సంవత్సరములలో, శ్రీవారి కృపాకటాక్షం నేతివారిపై ప్రసరించినది. నాటినుండే “శ్రీవారికి ప్రియశిష్యుడ”నని సగర్వంగా చెప్పుకొనేవారు.

ఇంకేముంది? కాకినాడనుంచి విజయదశమి దర్బారుకు విజయనగరం ప్రయాణం. గురువుతో శిష్యుడు కదా! గురువుగారింటికే సరాసరి వెళ్లారు. పంక్తిని భోజనంపెట్టి లాలించి మన్నించారు. శ్రీ వాజపేయాజుల సుబ్బయ్యదాసుగారు అంతకు పూర్వమే శ్రీవారికి శిష్యులుగా ఉన్నారు. వారుభయులకు విజయనగరం సంగీత కళాశాలలో కూర్చోపెట్టి ఆ విజయదశమి నాడే ఆనన్దమానన్దమాలించినన్ బాల! అనే కీర్తన ఆరంభించారు. ఇచట బాల! అంటే దాసుగారు రచించిన యదార్థరామాయణం శ్రీమతి గురుపత్నికి అంకితం చేయబడింది.

అయితే గురుపంక్తిని భోజనం అల్లుళ్లుగా ఎన్నాళ్ళు చెయ్యటం అని నేతివారికి పెద్ద సమస్యగా అనిపించి -- పూర్వం పేద విద్యార్థి గనుక “ఉపనయనం నాటి మాట ఉన్నది గదా” అని మాధుకరానికి బయలుదేరారట. దీనికి ముందు గురువనుజ్ఞ తీసికోలేదు. మధ్యాహ్నం 12 గంటలవేళ మాధుకరం లభించిందట. ఆకస్మికంగా సుబ్బయ్యగారు నేతివారిని బజారులో కలసికొని గురువుగారు “నిన్ను వున్నవాణ్ణి ఉన్నట్లు రమ్మన్నారు” అన్నారట. ఏదో కొంప మునిగిందని ఆ “భిక్షుక” రూపంలోనే వెళ్లారట గురువుగారి దగ్గరకి. దాసుగారు నేతివారిని చూచి ఒక నవ్వు నవ్వి, “నేటినుండి నువ్వు నా సహపంక్తినే భోజనం చేస్తావు” అన్నారట. ఎంత అదృష్టం ! నిత్యం బ్రాహ్మముహూర్తంలో లేచి అనుష్ఠానము పూర్తిచేసుకొని భాగవత పారాయణం చేసుకొనే సమయంలో గురువుగారు “రారా” అనేవారట. గురు శిష్యులిద్దరూ గోక్షీరంతో “కాఫీ” సేవించేవారట.

దాసుగారి శిష్యవర్గంలో శ్రీ నేతి లక్ష్మీనారాయణగారి దొక విశిష్ట స్థానము. దాసుగారికి వీరిమీద పుత్రవాత్సల్యము. ఇంటినుండి సంగీతకళాశాలకు దాసుగారి వెంట రామాయణ కథాగానము చేయుచు వీరును సుబ్బయ్యగారును వెళ్ళుచు మార్గమధ్యమందే గురుశుశ్రూష చేయుట ఒక పరిపాటి. ఒకరు గొడుగు ఇంకొకరు పుస్తకం పట్టుకొని వెళుతూ వుంటే దాసుగారు ముందు నడిచేవారట. ఆ సన్నివేశమును, సంగీత కళాశాలలో గణపతి నవరాత్రులు జరిపి చివరి దినమున ఊరేగింపు ఉత్సవములో విజయనగర వీథులలో దాసుగారు గీతనృత్యములు పఠించుచుండగా వారి వెనక ఈ శిష్యద్వయము వంతపాడు సన్నివేశము తిలకించిన పురజనులు వాల్మీకి వెంట కుశలవులను జూచిన స్ఫురణ గలిగించి పులకించి పోయెడివారు. సుబ్బయ్యగారికి, నేతివారికి “రామాయణం” ఆరు కాండలు ఆరు కథలుగా పూర్తిగా చెప్పి దాసుగారు వారుభయులను “రామాయణ సోదరులు” అనే నామకరణం చేసారు. నాటి నుండి ఆ సోదరుల సహకారగానం గురువుగారి కథకు తప్పకుండా ఉండేదట. మదరాసు అఖిలభారత కాంగ్రెస్ మహాసభలకు సభాప్రారంభకులుగా వెళ్ళిన గురువుగారి వెంట వీరిరువురును వెళ్లి అక్కడ జరిగిన అనేక హరికథలలో గురుదేవునితో శ్రీ వేపా రామేశం ప్రభృతుల ప్రశంశలకు పాత్రులైనారట. పిఠాపురంలో నెలదినములు దాసుగారు యదార్థ రామాయణము చెప్పినప్పుడు శ్రీ నేతివారు సహకారగానము చేసి వీణ సంగమేశ్వరశాస్త్రి, దెందుకూరు నరసింహశాస్త్రి ప్రభృతుల ప్రశంసలను దాసుగారితోపాటు శిరసా వహించారు. దాసుగారికడ వారి పండ్రెండు హరికథలను వల్లించిన మహాయోగము ఈ రామాయణ సోదరులకే పట్టినది. శిష్యులంటే కేవలం సహకారగానం చెయ్యటమే కాకుండా, కథకు ముందు మంచి గంధం అరగదీసి శ్రీవారి భుజాలకు వక్షస్థలానికి రాసేవారట.

నేతివారి నృత్యగానములు శాస్త్రశాణ రేఖాయితములై రసజ్ఞ పారిషద రంజన శ్లాఘన పాత్రములై దాసుగారిచే సెహబాసనిపించుకొన్నవి. వారు హరికథనభ్యసించి అందులోనే జీవించినప్పటికీ, మనసా సంగీతాన్నే ఆరాధించారు. వీరు ‘గాయక సార్వభౌమ’ కీ. శే. పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి వద్ద కూడా సంగీత సాధన చేసిన మహనీయులు. చిన్ననాడే తన ఇంట చేసిన వేదాధ్యయనం హరికథాగాన ప్రవాహానికి మరింత దోహదకారి అయ్యింది. మృదు మధురమైన కంఠం, మాటల్లో స్పష్టత, శరీరంలోని అణువణువు నిండిన లయపాండిత్యం వెన్నతో వచ్చిన సిరులు. అందువలననేనేమో, చాలాకాలం పాటు గురువుగారైన ‘హరికథా పితామహ’ ఆదిభట్ల నారాయణదాసుగారికి కథలలో వంతపాట పాడేవారు.

దాసుగారు 9-11-1933లో తునిలో కథ చెప్పినప్పుడు సహకారగానానికి నేతివారు వెళ్లారు. అప్పటికే దాసుగారి కథలను వారి సన్నిధిలో శుశ్రూష చేయకుండగనే కొందరు హరిదాసులు చెప్పుటయు, ఆ చెప్పుటలో వారి సంప్రదాయమునకు చెరుపు చేయుటయు కద్దు. అది గమనించి దాసుగారు అట్టివారికి రిజిస్టర్ నోటీసులిచ్చి కథలను మధ్యలో అపుచేయించేవారట. అట్టి యొక ఘట్టములో ఆవేశవశంవదులైన దాసుగారు వెంటనే ఆ తునిలోనే 11-11-1933న నేతివారికి సాధికారముగా ఒక సనదు (అనగా సర్టిఫికేట్) వ్రాసి సంతకము చేసి యిచ్చిరి. ఏ విశ్వవిద్యాలయ పట్టానికి లేని గౌరవము ఇట్టి సనదుకు ఉందని ఉప్పొంగిపోయారట నేతివారు. (సనదు సారాంశము - “నేతి లక్ష్మీనారాయణ భాగవతునకు ఆదిభట్ల నారాయణదాసు వ్రాసి ఇచ్చిన యనుమతి. నీవు నాయొద్ద శుశ్రూష చేసి నేర్చుకొన్నావు కనక నా రచించిన యక్షగానములు హరికథలుగా నీవు సభలలో నృత్య గీత వాద్య సహితముగా సభలలో నిచటి నుండియు విన్పించ వచ్చును.” -- ఆదిభట్ల నారాయణదాసు వ్రాలు, 11-11-33, తుని)

లక్ష్మీనారాయణ భాగవతులవారి సంగీత నిర్వహణలో విజయవాడ ఆకాశవాణి కేంద్రములో దాసుగారి యక్షగానములైన రుక్మిణీ కళ్యాణము, పాదుకా పట్టాభిషేకం అనే హరికథలు సంగీత రూపకములుగ ప్రసారము గావించబడి రసికుల మన్ననలు పొందాయి.

గురువర్యులు ధరించిన మంచిగంధపు పాదుకలు, వారి కాలిగజ్జలు, చిరుతాళములు, చేతికర్ర తమ యింట పూజామందిరమున - భరతుడు శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం చేసినట్లు తన జీవితాంతం వాటిని పూజించారు. ఇంతటి గురుభక్తి పరాయణునినీ నవయుగమున మరి చూడబోము!

నేతివారి కుటుంబంలో ఆందరూ సంగీత విద్వాంసులే - చిన్న కుమారుడు నేతి శ్రీరామ శర్మ, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో వాయులీన విద్వాంసులుగా మూడు దశాబ్దములు సేవలందించారు. పెద్ద కుమారుడు వెంకటప్పయ్య శర్మ కుమార్తె శ్రీమతి ఇందిరా కామేశ్వరరావు ఆంధ్రదేశములోని ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయని, ఆకాశవాణి విజయవాడ, విశాఖపట్నం కేంద్రములలో రెండు దశాబ్దములపాటు సంగీత విభాగంలో పని చేసారు. చిన్న కుమారుడు నేతి శ్రీరామ శర్మ కోడళ్ళు శ్రీమతి సీతా మహాలక్ష్మి మరియు శ్రీమతి సరళ కూడా సంగీత విద్వాంసులు. మునిమనుమడు చిరంజీవి శశాంక్ వర్ధమాన మార్దంగికుడు. మనుమలు, మనుమరాళ్ళు కూడా నారాయణసేవలో పాలు పంచుకొంటున్నారు.

గురుదేవుల జీవిత చరమక్షణమున వీరక్కడనే గరుడాళ్వారువలె కాచుకొనియున్నారట. గురువులు పరమపదించగానే వీరు తమ స్వస్థలమైన విజయవాడకు విచ్చేసి అచిరకాలమున “శ్రీ నారాయణదాస హరికథాగానకళా పరిషత్తు” స్థాపించి ఏటేట దాసుగారి ఆరాధన ఉత్సవములు అతివైభవముగా జరిపించేవారు.

తదనంతరము, వీరు గురువుగారికి విజయవాడ, సత్యనారాయణపురం, శివాలయ ప్రాంగణములో తేది జనవరి 25, 1951న ఆగమోక్తముగా విగ్రహ ప్రతిష్ఠ చేసి, ఆలయము నిర్మించి నిత్య పూజాదికములు మరియు ప్రతి సంవత్సరము దాసుగారి జయంతి (శ్రావణ బహుళ చతుర్దశి) మరియు వర్ధంతి (పుష్య బహుళ పంచమి) ఉత్సవములు ఘనంగా మూడు రోజులు దాసుగారి రచనలతో హరికథా మహోత్సవములు జరిపించేవారు. అలా వారు గురువుల ఋణం తీర్చుకున్నారు కనుకనే తనంతటి శిష్యుల్ని తయారు చేసుకోగలిగారు. వారి శిష్యులలో సర్వశ్రీ కర్రెడ్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, కుప్పా వీర రాఘవయ్య, కావూరి సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంపటి సుబ్బన్నారాయణ, ముట్నూరి కుటుంబరాయశాస్త్రి, ములుకుట్ల సదాశివశాస్త్రి, బుర్రా శివరామకృష్ణ శర్మ, అంబడిపూడి శివరామకృష్ణ శర్మ తదితరులు గలరు.

లక్ష్మీనారాయణ భాగవతుల మరణాంతరము, శ్రీ దాసుగారి శిష్య ప్రశిష్య భక్త బృందం దాసుగారి జయంతి మరియు వర్ధంతి ఉత్సవములు నేటికినీ ఘనంగా మూడు రోజులూ కొనసాగిస్తున్నారు. దాసుగారి జయంతి ఉత్సవములలో మొదటి రోజు కీ.శే. నేతి లక్ష్మీనారాయణ భాగవతుల సంస్మరణ దినముగా జరిపిస్తూ, ఆ రోజు నేతివారి కుటుంబ సభ్యులు మరియు పరివారము ఒక ప్రముఖ హరిదాస వర్యులను ఘనముగా సన్మానిస్తారు.

ఓం శ్రీ నారాయణదాస గురుభ్యో నమః.


సంకలనం: శ్రీ యనమండ్ర వెంకట కృష్ణయ్య
(కీ.శే. నేతి లక్ష్మీనారాయణ భాగవతులవారి మనుమడు)

AndhraBharati AMdhra bhArati - pramukhulu - SrI Neti LakshmiNarayana Bhagaratulu ( telugu pramukhulu andhra pramukhulu ) ( telugu andhra )