శతకములు మారుతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
శా. శ్రీమద్రామ పదారవిందయుగళిన్‌ సేవించి, యస్మద్గురు
స్వామిన్‌ వేడ్క భజించి, సత్కవి నమస్కారంబుఁ గావించి, వా
గ్భూమప్రౌఢిమ నీకు నొక్క శతకంబున్‌ భక్తి నర్పించెదన్‌
నా మీదం గృపజేసి కైకొను మమందప్రీతితో మారుతీ!
1
మ. అనఘా! నీవు జనించి నప్పుడె సముద్యద్భూరితేజంబునన్‌
వినువీథిం గనుపట్టు బాలరవి సద్బింబంబు నీక్షించి, యె
ఱ్ఱని పండంచు గ్రసింప బత్రిపతిలీలన్‌ వేడ్క మున్నూరు యో
జనముల్‌ మింటికి దాటితౌఁ ద్రిభువనశ్లాఘ్యుండవై మారుతీ!
2
మ. నిజగర్భస్థితశైవతేజము, సమున్నిద్రాత్మ తేజంబుఁ గూ
డ జగత్ప్రాణుఁ డమోఘ కేసరివనాటక్షేత్రమందర్థి నిం
చ, జయశ్రీ మహిమాప్తి నయ్యుభయతేజంబుల్‌ రహిన్‌ మిశ్రమై
త్రిజగంబుల్‌ గొనియాడ బుట్టితివి గాదే నీవిలన్‌ మారుతీ!
3
మ. అనిమేషేభము తెల్లపండనుచు బాల్యక్రీడలన్‌ మ్రింగ నొ
య్యన డాయం బవిచే బలారి నిను మూర్ఛాక్రాంతునిం జేయ బూ
ర్వనగాధిత్యక మీఁద వామహనువున్‌ భగ్నంబుగా వ్రాలినన్‌
హనుమంతుండను పేరు నాడమరె నీకన్వర్థమై మారుతీ!
4
మ. అపుడా గంధవహుండు నీదయిన మూర్ఛావస్థ వీక్షించి, తా
గుపితుండై నిజమూర్తి వైభవము సంకోచింపఁగాఁ జేయ న
చ్చపు గూర్మిన్‌ నిఖిలాస్త్రశస్త్రముల బంచత్వంబు లేకుండ స
త్కృపతో నీకు వరంబులిచ్చిరిగదా బృందారకుల్‌ మారుతీ!
5
మ. ఒక పాదంబు మహోదయాచలముపై నొప్పారఁగా నుంచి వే
ఱొక పాదం బపరాద్రి మీఁద నిడి యయ్యుష్ణాంశుచే బల్విడిన్‌
సకలామ్నాయము లభ్యసించిన భవచ్చాతుర్య మేమందు దా
పక దివ్యోరుతర ప్రభావము నుతింపన్‌ శక్యమే? మారుతీ!
6
మ. బలవంతుండగు వాలి ప్రోలు వెడలింపం, బత్నిఁ గోల్పోయి మి
క్కిలి దుఃఖంబున ఘోరకాననములం గ్రీడించి వర్తించు నా
జలజాప్తాత్మజు నొజ్జ పట్టి యని యశ్రాంతంబుఁ జేపట్టి యా
బలభిత్సూతికిఁ జిక్కకుండ ననుకంపం బ్రోవవే మారుతీ!
7
మ. తనపత్నిం దిలకింపుచున్‌ నిబిడకాంతారోర్వి వర్తించు రా
మ నరేంద్రోత్తము పాలి కర్కజుఁడు పంపం భిక్షువేషంబునన్‌
జని, సుగ్రీవుని చందముం దెలిపి యా క్ష్మానాథు దోడ్తెచ్చి, మె
ల్లన నయ్యిద్దఱకుం ధనంజయుని మ్రోలన్‌ సఖ్యసంబంధమున్‌
వినయం బొప్ప ఘటింపఁ జేసినది నీవే కాదొకో మారుతీ!
8
మ. మనుజగ్రామణి సత్కృపాత్త కపిసామ్రాజ్య స్థితుండయ్యు భూ
తనయాన్వేషణ కార్యమున్‌ మఱచి కందర్పక్రియామత్తుఁడై
తనివిం జెందక యున్న భానుజునిఁ దత్కాలార్హ నీత్యుక్తయు
క్తిని బోధించిన నీతిశాలివి నినుం గీర్తించెదన్‌ మారుతీ!
9
శా. లేరా కీశులనేకులుం? ద్రిజగముల్‌ వీక్షించి రా నేర్పరుల్‌
గారా? రాముఁడు జానకిన్‌ వెదక వీఁకన్‌ గీశులం బంపుచో
నారూఢిన్‌ భవదీయ దివ్యమహిమ వ్యాపారముల్‌ సూచి కా
దా! రత్నాంగుళి భూషణం బిడియె నీ హస్తంబునన్‌ మారుతీ!
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - mAruti shatakamu ( telugu andhra )