శతకములు మారుతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
శా. నానావికారరూపులను నానావేషులన్‌ దైత్యులన్‌
నానాఘోరశరీరులం గనుచు నానాగుల్మముల్‌ చూచుచున్‌
నానావాద్యరవంబులన్‌ వినుచు, విన్నాణంబుగా రాఘవో
ర్వీనాథ ప్రియపత్ని భూమిసుత నన్వేషింపవే మారుతీ!
31
శా. సాహంకారత దానవుల్‌ సలుపు వీరాలాపముల్‌ గాంత లు
త్సాహంబొప్పఁగఁ జేయు గానములు మంత్రజ్ఞాసురప్రేరిత
స్వాహానాదము లాలకింపుచు నవాచ్యం బీపురీవైభవం
బాహా! చిత్రమటంచు మెచ్చుకొనవే స్వాంతంబునన్‌ మారుతీ!
32
మ. వరుసన్‌ గ్రంతులు రచ్చచావడులు భాస్వచ్చైత్యముల్‌ భూరిగో
పురముల్‌ మేడలు పుణ్యవీధులగముల్‌ భూమీగృహశ్రేణులున్‌
హరిజిత్కుంభ నికుంభులున్‌, శుకుఁడు యూపాక్షాసురుం డాదియౌ
సురవిద్వేషుల చారుమందిరములన్‌ శోధింపవే మారుతీ!
33
మ. చలమొప్పన్‌ దశకంఠరాక్షస నివేశంబు బ్రవేశించి యం
దు లతామందిరముల్‌ దివాగృహకముల్‌ తోరంపుక్రీడాగృహం
బులు, చిత్రావసదంబులున్‌ మణిగృహంబుల్‌ చారుశయ్యాగృహం
బులు వీక్షింపుచు నంతటన్‌ వెదకవే భూపుత్రికన్‌ మారుతీ!
34
మ. నలువొప్పం గమనీయ పుష్పకవిమానంబుం దగం జూచి యు
జ్జ్వల నానావిధధూపవాసనలు దివ్యస్రక్సుగంధంబు లిం
పలరారం బ్రియబంధునిం బలె సముద్యత్ప్రీతి రమ్మంచు నిం
జెలిమిం బిల్వఁగ నేగుదెంచినక్రియన్‌ జెంతం గుబాళింప ద
ద్విలసద్దివ్యగృహంబు జేరితివి కాదే మెల్లనన్‌ మారుతీ!
35
మ. అమరారాతికిఁ బ్రీతిగా వివిధవాద్యధ్వానముల్‌ చేసి పా
నమదావేశము చేత మైమఱచి నానాచేలభూషాఢ్యలై
క్రమతన్‌ జాల్గొని సుప్తవాహినుల లీలం గూర్కు కాంతానికా
యముల న్గన్గొని ధర్మలోపభయముం బ్రాపించి నీ వాత్మలో
విమలప్రజ్ఞున కేల శంక? యని యన్వేషింపవే మారుతీ!
36
మ. కమనీయోన్నత పుష్పతల్పము పయిం గన్మూసి గుర్వెట్టు పం
క్తిముఖున్‌ నీలఘనాభదేహు గని తత్తేజంబునన్‌ రత్న దీ
పములం దద్గృహమెల్ల వెల్గుచునికిన్‌ భావంబునన్‌ మెచ్చుచున్‌
సముదంచద్గతి నచ్చటన్‌ వెదకవే క్ష్మాపుత్రికన్‌ మారుతీ!
37
మ. సరసాన్నంబులు పక్వమాంసచయముల్‌ సౌరభ్య సంవాసిత
స్ఫురదుచ్చావచ మద్యపూరితఘటంబుల్‌, మాల్యముల్‌ నిద్రితా
సురకాంతల్‌ గల పానశాల గని యచ్చో రాఘవ ప్రేయసిన్‌
సురకాంతాసదృశన్‌ విదేహతనయన్‌ శోధింపవే మారుతీ!
38
మ. అరవిందోత్పల కైరవోదరమరందాస్వాదనోన్మత్తబం
భరమాలా పరిషన్మనోజ్ఞ మధురధ్వానాభిరంజత్‌ సరొ
వరతీరంబులఁ బుష్పపల్లవ ఫలవ్రాతాగ్ర ధాత్రీరుహో
త్కరమూలంబుల నేర్పునన్‌ వెదకవే ధాత్రీసుతన్‌ మారుతీ!
39
శా. ఈలీలన్‌ దశకంఠుపట్టణములో నేపారఁగాఁ బెక్కు చం
దాలమ్‌ గేలలిడునంత భూమితల మైనం దప్పకుండంగ నీ
వాలోకించి మహీజఁ గానక నిజస్వాంతంబులోఁ గొంతసే
పాలోచింపవే స్వామికార్యఘటనావ్యాపారమునన్‌ మారుతీ!
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - mAruti shatakamu ( telugu andhra )