బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి ముగ్ధ మధుర వాఙ్మయము

భాష యడవి వంటిది, కవిత యుద్యానమవంటిది. అడవినుండి శోధించి యందు సుందరమైన చివురుగుత్తులతోనున్న తరులతా గుల్మాదులను గొనివచ్చి చక్కఁ బఱిచి యుద్యానములందు నాఁటుకొనుచుందుము. బహు ప్రయోజనమయిన యడవినుండి పరిమిత ప్రయోజనమయిన ఉద్యానము పెంపొందుచున్నది. ఉద్యానపు హృద్యత కూడ నడవియం దెడనెడఁ బొడకట్టఁ గలదు గాని యరణ్య ప్రయోజనము లెల్ల నుద్యానమునం దొదవఁజాలవు. అడవి విచ్చలవిడిగాఁ బెరుగునది. ఉద్యానము పెంపు సొంపులకు అరణ్య పరిశోధన మత్యావశ్యకము. అట్లే సుకవిత పెంపు సొంపులకు భాషాపరిశోధన మత్యావశ్యకమవును. ఇంతవఱ కాంధ్రకవితోద్యాన పాలకులు తమ కవితోద్యానమందు నాఁటిన వచోవల్లరులు కొన్ని దెఱఁగులవే యున్నవి. ఇప్పుడు వింతవింత వన్నెచిన్నె యుద్యానములు వెలయుచున్నవి. పరికల్పకులును బలుదెఱఁగులవారు వెలయుచున్నారు. వారువారు వారివారి హృద్యతల కనుగుణముగా భిన్నభిన్న రీతుల పలుకు పువుగుత్తులను, వాని కూర్పు తీర్పులను జూచుకొనుచున్నారు. ఇది చక్కగా సాగుటకుఁ గవితోద్యానములు వెల్లివిరియుటకు, వార్వారు భాషారణ్యమునఁ బరిశ్రమించి, పరిశోధనము నెఱపి, యపూర్వముల నరయుచుండు టావశ్యకము గాదా?

విచ్చల విడిగా జీబుకొని వెలయుచున్న యాంధ్రభాషారణ్యమునుండి కవితోద్యానమునకుఁ గొనితేవలసిన హృద్యవచోవల్లరు లింకనెన్నో యున్నవి. చవులొలుకునవి, పలుకుబళ్లు, పాటలు, పదాలు, కథలు, గాథలు, సామెతలు, ఇత్యాదులు పెక్కులు అపరిశోధితములై, యముద్రితములై లోకము వాక్కులందే పుట్టుచు గిట్టుచున్నవి. అట్టివానిని బరిశోధించుటలోను, సేకరించుటలోను నాకుఁ గోర్కి కొండంత.

పామరులనుండి పండితులదాఁక, వారిలోఁగూడ బాల్యమునుండి వార్ధకముదాఁక నంతరము లనేకము లున్నవి. ఎన్ని యంతరములున్నవో యన్ని భాషారీతులున్నవి. వ్యవహారార్థమైన భాషారీతులేకాక రంజనార్థమయిన కవితారీతులు గూడ నంతరములఁబట్టి యనేకభేదములు గలవిగా నున్నవి. అవియెల్లఁ బరిశోధితములై యాదృతములు గావలెను. పలువురు దీనికై ప్రయత్నించుట బాగు. భూములకువలె భాషకును సర్వే జరుగవలెను.

నేనట్లు సేకరించుచున్నదానిలో బాలుర ముగ్ధమధురవాఙ్మయము నిప్పుడు వేఱు పఱచి, 'బాలభాష' యనుపేర గ్రంథముగా వెల్లడించుచున్నాఁడను. దాని నుద్దేశించియే నాకుఁదోచినవి నాలుగు ముక్కలిక్కడ వ్రాయుచున్నాఁడను.

ఉన్నత కవితావాహినికి బాలవాఙ్మయ మాటపట్టని చెప్పవచ్చును. బాలభాషలో సహజముగా నంకురప్రాయములుగాఁ గన్పట్టు కవితాగుణములే ప్రౌఢభాషలో సంస్కృతములై బలుపొందుచున్నవి. సరళాక్షర సౌష్ఠవము, సంగీతచ్ఛాయ యతిప్రాససంగతి, యాంధ్రకవిత కవతారము నాడే యలవడినవన్న విషయము నీబాలవాఙ్మయము ప్రవ్యక్త పఱుచుచున్నది. పసిపిల్లల కర్థానుస్యూతములుగా శబ్దములను సంధించి వాక్యములను వ్యాహరించుట కింక నలవాటు కాకముందే యతిప్రాసముల పొందిక యలవడుట కానవచ్చును.

    రుంగు రుంగు బిళ్లా,
    రూపాయదండా,
    దండాగాదు తామరమొగ్గ,
    మొగ్గాగాదు మోదుగుమాడ.
                -ఇత్యాది.

    బండో యమ్మ బండి,
    బండికి కుచ్చులు తెండి;
    సుబ్బారాయుడి పెండ్లి
    చూచివత్తాం రండి.

    అమ్మనాకు బువ్వ,
    అరచేతిలో గవ్వ.
    చేయబోకు తప్పు,
    చేస్తేకాలి చెప్పు.
            -ఇత్యాది.

వీనిలో వాక్యార్థ సంగతి యంతగా లేకున్నను యతిప్రాససంగతి యనుగతమై కానవచ్చుచున్నది.

    పంతులు పంతులు
    పావుసేరు మెంతులు
    కూర్లోకి చాలవు
    గుప్పెడు మెంతులు.

    పంచా యెక్కం పంచా,
    పంతుల్నేసి దంచా;
    రోట్లో వేసి రుబ్బా,
    రొట్టె గాల్చుకు దొబ్బా!

బడిబాలురే కదా యీ దుడుకుఁ గవిత్వమునకుఁ గర్తలు; యతిప్రాసముల మెలపే కదా పయి రచనములకుఁ జెప్పఁదగిన యర్థము.

తెలియవలసిన విషయమెంతయుఁ దేలికైన భాషలో, అందును వచనములో నున్ననుగూడఁ నది వాక్యముపై వాక్యముగా నెడతెగకుండఁ దీగసాగుచున్నప్పుడు బాలురు, పామరులు వెంటాడుచు దాని యర్థము నందుకొనఁజాల కుందురు. ద్రవరూపమున నున్నను ఉగ్గుఁ బాలను ధారగాఁ బోయుచున్నచో బాలురు త్రాగఁ జాలరు. గ్రుక్కెడు గ్రుక్కెడు చొప్పున నాచియాచి పోసినచోఁ ద్రాగఁ గల్గుదురు. అట్లయిన నాత్రాగినదియుఁ జక్కఁగా నిముడును. అట్లే తెలియవలసిన విషయమునుగూడఁ ద్రుంచి త్రుంచి యించించుకగాఁ జేసి, నడుమ నడుమ, విశ్రాంతికై యెత్తుపలుకును గూడఁజేర్చి చెప్పినచో బాలురు తేలికగాఁ దెలిసికొనఁ గల్గుదురు. అప్పుడు దాని యర్థమును తలలో వాండ్రకుఁ జక్కఁగా నెలకొనును. అంతేకాక యది యించుక తాళలయానుగుణముగా గణబద్ధమై యుండుటచేఁ జిత్తరంజకమై మరవరానిదై కూడ నుండును. హెచ్చుగా బాలురయు, పామరులయు వాఙ్మయ మీవిధముగాఁ గానవచ్చుచున్నది.

    రామన్న రాముడోయి రామభజనా,
    రాముడొస్తున్నాడు రామభజనా,
    పూలారథము నెక్కి రామభజనా,
    వూరేగుతున్నాడు రామభజనా.
                -ఇత్యాది

    శ్రీరామ లక్ష్మణులు గోవిందా రామ,
    చెలులతో గూడుకొని గోవిందా,
    పన్నెండు వర్షములు గోవిందా రామ,
    ప్రమదముతో ఉండిరీ గోవిందా.

    దశరథుఁ డంతటను గోవిందా రామ,
    తగ వసిష్ఠునిజూచి గోవిందా.
                -ఇత్యాది

తుమ్మెద పదాలు, కోవెల పదాలు, చందమామ పదాలు, బాలనాగమ్మ కథ మొదలయినవి యిట్టివే.

    దశరథుడను పేర తుమ్మెదా
        ఒక్క
    ధరణీశుడున్నాడు తుమ్మెదా
        ఆ
    ధరణీశునకు తుమ్మెదా
        నలుగురు
    తనయూలున్నారు తుమ్మెదా!
                -ఇత్యాది.

వీనిలో ఎత్తు పలుకులు విడిచితిమేని మిగిలినది సరిగా సాధారణముగాఁ జదువఁ దగిన వచనముగా నుండును. యతిప్రాసముల సంగతికై రవంత రచనాప్రయత్నము కావలెను కాని యిట్టి రచనలలోని కేవచనమునుగాని సులువుగా విఱుగఁదీయవచ్చును. యతిప్రాసములు, తాళలయాన్వితమగు గణబంధము పొసఁగుటచే నివి చదువునప్పుడెంతో హృదయంగమములుగా నుండును. ఆంధ్రభాషకు సహజాలంకారము లయిన యతిప్రాసములు, సంగీతచ్ఛాయ, బాలరచనములందు గానవచ్చుచున్నవి. అట్టి రచనములను బాలకులు పాలమీఁగడ చవితోఁ జదువఁగలరు. ఈ యింపునెఱుఁగక పోవుటచే నిప్పటి బాలపాఠగ్రంథ రచయితలు "ఇదిగో ఆవు. దీనికి నాలుగుకాళ్లు గలవు." ఇత్యాది విధములఁ బొల్లు మాటలతోనే పాఠములల్లి బాలకుల విసిగించుచున్నారు. బాల్యమం దిట్టి సముచిత సంస్కారముఁ బడయక పోవుటచే నిప్పటిబాలురు మంచి మంచి తెలుగుఁ పలుకుబళ్ళను, వాని సంగీతచ్ఛాయలను, పాటలను, బదములను, బద్యములను జక్కఁగా జదువనేరకున్నారు.

    కంచికి పోతావా కృష్ణమ్మా!
        ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా?
    కంచిలో ఉన్నది అవ్వ;
        ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ.
    బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా,
        నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
    కోమటి యింటిది అప్పు;
        ఆ - అప్పు నాకు పెట్టు పప్పు.
    పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా,
        నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా?
    దొడ్లోను ఉన్నది బీర;
        ఆ - బీర నాకు పెట్టు కూర.
    కూర ఉన్నదిగాని కృష్ణమ్మా;
        నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా?
    కోమటి అక్కెమ్మ చెయ్యి;
        ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి.
    నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా;
        నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
    ఉన్నయింటి యిరుగుపొరుగు,
        ఆ - పొరుగు నాకుపోయు పెరుగు.
    బువ్వ తిందువుగాని కృష్ణమ్మా;
        నీకు - ఆ వూళ్ళోపనియేమి కృష్ణమ్మా?
    అక్కడ ఉన్నది అమ్మ,
        నేను - మొక్కివత్తును కామాక్షమ్మ.

ఈ పదము 'కృష్ణమ్మ' అని ఎత్తు పలుకు గలిగి బువ్వ, పప్పు, కూర, నెయ్యి, పెరుగు అను భోజన పదార్థముల వరుసతోను, వరుస అవ్వ బువ్వ, అప్పు పప్పు, బీర కూర, నెయ్యి చెయ్యి, పొరుగు పెరుగు అను అనుప్రాస పదముల సంగతితోను, ముక్త విషయగ్రస్తముగాఁ బప్పు మొదలగువాని పునరుచ్చారముతోను గలదు గనుక, బాలుడు, ఎక్కాలు మొదలగు వానివలె బండవల్లె వేయ నక్కఱలేకుండ నించుకంత ధారణను అవధానమును జూపుచు, అప్పటి కప్పుడు పయి పయి పలుకు నందుకొనఁ గలిగి సులువుగాఁ గడముట్ట నప్పగింపఁ గలుగును. దీనిచే బాలుని బుద్ధికి వయోనుగుణముగా సుకుమారమయిన పరిశ్రమము, యోజన కలుగును. ఈ పదము ముగింపు జీవిత పరమార్థముగా భావికాలమునఁ జూచుకొనవలసిన యీశ్వరచింతనము నాటునదిగా నున్నది. ఇట్టిదే యింకొక్కటి.

    ఎండలు కాసే దెందుకురా?
        మబ్బులు పట్టే టందుకురా.
    మబ్బులు పట్టే దెందుకురా?
        వానలు కురిసే టందుకురా.
    వానలు కురిసే దెందుకురా?
        చెరువులు నిండే టందుకురా.
    చెరువులు నిండే దెందుకురా?
        పంటలు పండే టందుకురా.
    పంటలు పండే దెందుకురా?
        ప్రజలు బ్రతికే టందుకురా.
    ప్రజలు బ్రతికే దెందుకురా?
        స్వామిని కొలిచే టందుకురా.
    స్వామిని కొలిచే దెందుకురా?
        ముక్తిని పొందే టందుకురా.

ఇందు భౌతికస్వభావము వరుస చొప్పునఁ జెప్పఁబడుటచే బాలుఁ డా వరుస నంటు కొని, యొకటి రెండు మారులు వినినంతనే తప్పకుండఁ బదము నప్పగింపఁగలడు.

సనసన్నగాఁ బ్రతిభ నుద్దీప్త పఱచి యవధానమును, ధారణను బెంపొందించి, చిత్తవృత్తి నిటునటు దొలఁగనీక బాలునికిఁ జురుకుఁ దనము నేర్పఁగల కథలు, పలుకుబళ్లు, పెక్కులున్నవి. "చిలుకలు కొట్టిన పలుకులేమి చేశావోయి? పిండిగొట్టానోయి, పిండేమి చేశావోయి? రొట్టెగాల్చానోయి." -- ఇత్యాదులు కొన్ని, చేపకథ, గుర్రముకథ మొదలయినవి కథలు కొన్ని.

మఱియు బాలుర విద్యాభివృద్ధి యాటపాటలు చాటున దెలియకుండా వెలయునదిగా నుండుట మేలు. ప్రాఁతకాలమున నది యట్టిదిగానుండెను. పసితనముననే బాలురకు రామకథ మొదలగు పుణ్యకథలును, నీతివార్తలును నుయ్యాలలలో నూచుచు జోలలుగా బాడుచు తల్లులు నేర్పెడివారు. ఇప్పటికిని బల్లెటూళ్లలో ప్రాఁతకాలపు తల్లులిట్లు జోలలు పాడుట గానవచ్చును; గాని పట్టణములందుఁ జప్పఁగా జట్టువాఱుచున్నది. నేఁటి నాగరపు స్కూళ్లలోఁ జదువుకొను బాలిక లిట్టివాని నెఱుఁగరు గదా! వీరు తల్లులైనపుడు తనయుల కిక నెట్లు తెలియును!

    ఉత్తముని పేరేమి? ఊరి పేరేమి?
    సత్యపురుషులఁగన్న సాధ్వి పేరేమి?
    ఉత్తముడు దశరథుడు, ఊరు అయోధ్య!
    సత్యపురుషులఁగన్న సాధ్వి కౌసల్య.

    ఇల్లాళ్ళు ముగ్గురే ఈ దశరథునకు;
    పిల్లాళ్లు నలుగురే పేరు గలవారు.
    అయ్యోధ్యలో వారు అంద రున్నారు;
    సయ్యోధ్యలో వారు సరిలేని వారు.

    జగతిపై రామయ్య జన్మించినాడు,
    సత్యమ్ము లోకాన స్థాపించినాడు.
    తల్లిదండ్రులమాట చెల్లించినాడు,
    ఇల్లాలితోపాటు హింసపడ్డాడు.

    సీతామహాదేవి సృష్టిలోపలను,
    మాతల్లి వెలసింది మహనీయురాలు.

    శ్రీరామ జయరామ సీతాభిరామ
    కారుణ్య గుణధామ కళ్యాణనామ!

    కృష్ణమ్మ వంటివాడు కొడుకొకడు పుడితె,
    కష్టాలు కడతేరు కన్నతల్లులకు,
    మారు తల్లీచేత మాటపన్ననుచు
    సారంగధరు డమ్మచావు కొప్పాడు.

పాటలతోను, పదములతోను గూడినపసిపిల్లల యాట లనేకము లున్నవి. వానిలో వింత వింత విషయము లనేకములున్నవి. గణనీయమైన కవిత యున్నది. బాలభాషలో నాకు శక్యమయినంత వాని సమకూర్చి నాఁడను.

నన్నయాది కవీశ్వరులు తమ దేశకాలములను దెలుపుకొనుటచే వారి గ్రంథముల ప్రాచీనత యెట్టిదో మన మెఱుఁగఁ గల్గుచున్నాము; కాని యీ పాటలు ఈకాలమున వెలసినవని, వీరు రచించిరని చెప్పుట కెట్లు సాధ్యమగును? నన్నయాదుల కింకను బ్రాచీన కాలమునాఁటివిగూఁడ గొన్ని యిందుండవచ్చును. నిన్న నేఁటివి గూడ నుండవచ్చును. నన్నయాదుల రచనములకింక నెంతో పూర్వమే యిట్టి రచనములు పుట్టియుండక తీఱదు. నన్నిచోడాదు లిట్టివానిఁ బేర్కొన్నారు. పాల్కురికి సోమనాథు డిట్లనుచున్నాడు:

    పొందంగ "రాగుంజ పోగుంజ లాట"
    కుందెన "గుడి గుడి గుంచంబు లాట"
    "అప్పల విందుల యాట" పల్మాఱు
    చప్పట్లు వెట్టెడు "సరిగుంజ లాట"
    "చేర బొంతల యాట" "చిట్లపొట్లాట"
    "గోరెంతలాట" "దాఁగుడు మూతలాట."

వీనిలో "గుడిగుంచ" మాట, "చిట్ల పొట్లాట" ఇప్పటికిని ఇదే యుపక్రమముగల పదములతో బాలకు లాడుకొనుచున్నారు. చూచితిరా! ఆ పదము లెంత ప్రాఁతకాలము నాఁటివో!

వేటూరి ప్రభాకరశాస్త్రి.

("కళ" నుండి పునర్ముద్రితము)

AndhraBharati AMdhra bhArati - mugdha madhura vaa~Nmayamu - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu vishhaya sUchika ( telugu andhra )