వచన సాహిత్యము పీఠికలు సర్వేశ్వరశతకము - యథావాక్కుల అన్నమయ్య

సర్వేశ్వరశతకము - యథావాక్కుల అన్నమయ్య
పీఠిక
- నిడదవోలు వెంకటరావు
(శతకసంపుటము ప్రథమభాగము - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ, 1966)

భక్తిరసప్రధానమై, వీరశైవమత సంప్రదాయానుసారియగు సర్వేశ్వర శతకము, యథావాక్కుల అన్నమయ్య అను శివకవి రచించెను. తెలుగున గ్రంథరచనాకాలమును తెలిపిన తొలికవి అన్నమయ్యయే. ఆతడీ శతకమును క్రీ.శ. 1242లో చెప్పిన ట్లీ క్రింద పద్యమువలన తెలియుచున్నది.

శా.
శాకాబ్దంబులు వార్ధిషట్కపురజిత్సంఖ్యం బ్రవర్తింప సు-
శ్లోకానందకరంబుగా మహిమలో శోభిల్ల సర్వేశ్వర
ప్రాకామ్యస్తవ మొప్పఁజెప్పె శుభకృత్ ప్రవ్యక్తవర్షంబునన్
శ్రీకారాధనవంతమై వసుధలోఁ జెన్నొంద సర్వేశ్వరా!

శాలివాహన శకాబ్దములు - వార్ధి 4, షట్క 6, పురజిత్ 11 అనగా 1164; వీనికి 78 చేర్చిన క్రైస్తవ శకాబ్దములు క్రీ.శ. 1242 అగును.

అన్నమయ్య తన కృతిని దూదికొండయను గ్రామమున సోమేశ్వరారాధ్యుని యనుగ్రహమున రచించిన ట్లీ క్రింది పద్యము చెప్పుచున్నది.

మ.
అభిరమ్యంబుగ [1]దూదికొండ, మహనీయారాధ్య సోమేశ్వర
ప్రభు కారుణ్యవసంతసంజనితసద్భావప్రసూనావళిన్
విభవంబొప్పఁగఁ గూర్చి యెంతయు లసద్విఖ్యాతిగాఁ జిత్సుఖ
ప్రభవంబైన భవత్పదద్వయము నారాధింతు సర్వేశ్వరా!

ఈ సోమేశ్వరారాధ్యుడు - పాల్కురికి సోమనారాధ్యుడు. సుప్రసిద్ధ శైవకవిసార్వభౌముడగు పాల్కురికి సోమనాథుని గ్రంథములనుండియే యీతడు తన భావములను గ్రహించియున్న ట్లీ తరువాత విశదము కాగలదు.

అన్నమయ వంశీయులు నేటివఱకు, పల్నాటిసీమలో గురిజాల తాలూకా, చెర్లగుడిపాడులో నున్నారు. ఆ యూరి కరిణీకము వారిదే. అన్నమయ తరువాత కొన్ని తరముల వెనుక సోమరాజను మహనీయుడు ప్రసిద్ధి కెక్కెను. అందుచే వారింటి పేరు సోమరాజువారని వ్యవహారములోనికి వచ్చినది. ఆ వంశీయులవలన అన్నమయను గూర్చి తెలిసిన వృత్తాంతమును నిట దెలుపుచున్నాను.

“అన్నమయ్య ఆరాధ్యబ్రాహ్మణుడు- ఆత్రేయస గోత్రుడు- యజుశ్శాఖాధ్యాయి. మొదట గోదావరీతీరమున నున్న పట్టెస గ్రామమున వీరభద్రస్వామిని సేవించుచుండెడివాడు. అతడు ఒక శివరాత్రికి శ్రీశైలయాత్రకు వెడలి, మల్లికార్జునస్వామిని సేవించి, తిరిగి వచ్చుచు, పల్నాటిసీమలో జెట్టిపాలెము దాపున కృష్ణాతీరమందు విశ్వామిత్రాశ్రమమగు సత్రశాలయను పుణ్యస్థలమున శ్రీమల్లికేశ్వరస్వామిని సేవించుచు గొంతకాలముండి యచ్చటనే యీ సర్వేశ్వర శతకమును రచించెను.

ఒక్కొక్క పద్య మొక్కొక తాటియాకుపై వ్రాసి యా యాకును కృష్ణలో వైచి “ఇది ప్రవాహమున కెదురీది వచ్చెనా, దానిని దీసి సూత్రమున కెక్కించెద- అట్లే యాకైనను రాక క్రిందికిఁ గొట్టుకొనిపోయెనా అప్పుడే నా శిరసు ఖండించుకొనియెద” అని శపథము చేసి మెడకు ‘గండ గత్తెర’ వైచికొని, ఆకులమీద పద్యముల వ్రాసి నీళ్ళలో విడిచిపెట్టగా నవి తిరిగి వచ్చుచుండినవి. కొంతసేపటికి - “తరులం బువ్వులు పిందెలై” అను పద్యము ఎదురుగా రాక కొట్టుకొని పోవుచుండుట జూచి కంఠమును కత్తిరించుకొనుట కుద్యమించుచుండగా నొక పసులకాపరి “నాకొక తాటియాకు దొరికినది చూడు”డని యిచ్చి యదృశ్యుఁడయ్యెను. కవి యా యాకును జూడగా దానిపై తాను వ్రాసిన పద్యమునకు మాఱుగా వేరొక పద్యముండుట చూచి యది సర్వేశ్వరకృతమని గ్రహించి యా పద్యమును సూత్రమున కెక్కించి శతకమును పూర్తిచేసి కొంతకాలమునకు పిదప నా సత్రశాలయందే సిద్ధి బొందెను.[2]

అన్నమయ్య సర్వేశ్వర శతకమునకు తరువాత కాలమున వచ్చిన ప్రచారమునుబట్టి చూడగా, పైని చెప్పిన కథ వాస్తవమని చెప్పక తప్పదు. వృత్త శతకములలో నిది ద్వితీయమైనను రచనాప్రశస్తిచే నద్వితీయమై యలరారుచున్నది. ప్రసిద్ధులగు కవులు దీని ననుసరించిరి. ఆ విషయ మీక్రింది శతక సమీక్షవలన తెలియనగును.

అన్నమయ్య తన కృతియం దెచ్చటను ‘శతకము’ అని పేర్కొనలేదు. పై నుదహరించిన కాలనిర్ణయ పద్యమున, నిది ‘స్తవము’ అని పేర్కొనబడి యున్నది.

ఈ క్రింది పద్యమున స్పష్టముగా నిది ‘స్తోత్రము’ అని చెప్పబడియున్నది.

శా.
ధాత్రి న్భక్తజనానురంజనముగాఁ దత్త్వప్రకాశంబుగాఁ
జిత్రార్థాంచితశబ్దబంధురముగా, సేవ్యంబుగా, సజ్జన
శ్రోత్రానందముగా శుభాన్వితముగా శోధించి సర్వేశ్వర
స్తోత్రం బన్నయ చెప్పె నిజ్జగములో శోభిల్ల సర్వేశ్వరా!

ఇది స్తవము. స్తోత్రము అయినను నిందలి పద్యములన్నియు, నొకే మకుటముతో నున్నందున, నిది శతకముగా పరిగణిత మైనది. శతకమున సంఖ్యానియమము లేకున్నను మకుటనియమమున్నచో, నది శతక వాజ్మయమున చేరును.

అన్నమయ్య ‘శోధించి’ అని వ్రాయుటలోనే, ఆతని రచనాపద్ధతి మనము గ్రహింపవచ్చును. తనకు ముందుగాగల మల్లికార్జున పండిత, పాల్కురికి సోమనాథుల రచనలనే గాక, సంస్కృతమున గల శివస్తోత్రములను పరిశీలించి, వానియందలి భావముల నిందు పొందుపఱచి యున్నాడు. సర్వేశ్వరుడగు శివుడు గజాజినధారియే గాక వ్యాఘ్రచర్మాంబరధారి. కావున, అన్నమయ్య మత్తేభ శార్దూల వృత్తములతోనే శతకము రచించి, వృత్తరచన సార్థకము గావించెను.

[3] శివ పరములగు స్తోత్రములలో ‘శివ పంచస్తవి’ అను పేరనున్న “మహిమ్నము - మల్హణము - మలయరాజీయము - అనామయము - హలాయుధము” అనునవి ప్రధానములు. వానిలో మహిమ్నము - ప్రాథమికము, మహిమ గలది. ఈ స్తోత్రములను శివకవులే గాక, కవిత్రయములో ఎఱ్ఱననుండి ప్రబంధకవులును శివస్తుతిసందర్భమున గ్రహించియే యున్నారు. పై వానిలో, మలయరాజీయము తక్క, తక్కిన నాల్గింటినుండి అన్నమయ్య భావములను గ్రహించి, యనువదించి యున్నాడు.

మహిమ్నము- పుష్పదంత రచితము.

“హరిస్తే సాహస్రం కమల బలి మాధాయ పదయో
ర్యదేకో నేతస్మిన్ శజముదహరన్ నేత్రకమలమ్
గతో భక్త్యుద్రేకో పరిణతిమసౌ చక్రవపుషా
త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతామ్”     (19)
మ.
సమయోద్దిష్ట సహస్రపంకరుహపూజాపూరణార్థంబు నే-
త్రము విష్ణుండు సుభక్తి యేర్పడ భవత్పాదంబు లర్చించి చ-
క్రము నీచే గొని దైత్యకోటి ననిలో ఖండించె దా నీ పద-
క్షమతాసేవ సమస్తదేవతలకున్ సత్త్వంబు సర్వేశ్వరా!

ఇంకను నెనిమిది పద్యములు మహిమ్నస్తవానువాదములు కలవు.

మల్హణము - మల్హణ రచితము.

“బాలోపి సంస్మరణమాత్ర మచేతనస్తే
లింగం కరోతి హరపాంసుమయం వినోదాత్
ఆత్యంతదేశ ధనధాన్య సమృద్ధి భాజి
రాజ్యం కరోషి హతకంటక మున్నతం చ”     (3)
“క్రీడాప్రపంచ నిరతశ్శిశవో భృవంత
మారాధయంతి”     (17)

పై శ్లోకభావములు మార్పుతో నిట్లు గలవు.

శా.
ఆడంబోయినచోట బాలురు వినోదార్థంబు పాషాణముల్
గూడంబెట్టి శివాలయంబనుచు పేర్కొన్నంతటం జేసి వా-
రాడంబోయి సురాంగనాకలితదివ్యారామ చింతామణి
క్రీడాశైలవిహారులై వెలయుటన్ కీర్తింతు సర్వేశ్వరా!

అనామయము - దండిమహాకవి రచితము.

“యోగీ భోగీ విషభుగమృత శ్శస్త్రపాణి స్తపస్వీ
శాంతః క్రూర శ్శమితవిషయ శ్శైలకన్యాసహాయః
భిక్షావృత్తి స్త్రిభువనపతిః శుద్ధిమా నస్థిమాలీ
శక్యో జ్ఞాతుం కథమివ శివత్వం విరుద్ధస్వభావః”
మ.
సకలాధీశ్వర పట్టభద్రుడవు భిక్షాగామి వత్యంతశాం-
తకళాత్ముండవు రౌద్రమూర్తి వతిసౌందర్యాంబికాసంగమా-
ధికలోలుండవు దివ్యయోగివి మదిం దెల్లంబుగా నెట్టివా-
రికి దా శక్యమె నీ నిజంబరసి చర్చింపంగ సర్వేశ్వరా!

హలాయుధము - హలాయుధ ప్రణీతము.

“యత్ప్రత్యక్షం సకలభువనాశ్చర్యభూతం విభాతి
జ్యోతిర్లింగం కనక కపిశం శ్రీగిరౌ వ్యోమ్ని నిత్యం
తత్పశ్యంతః శివసుకృతిన స్త్యక్తసంసారబంధా
స్త్వత్కారుణ్యా చ్చిరగణ పదప్రాప్తిభాజో భవంతి”
మ.
ధరణిం బ్రాక్తనభర్మనిర్మితమహాస్థానంబులై యొప్పు శ్రీ-
గిరిముఖ్యంబగు దివ్యతీర్థముల భక్తిం జూచిరే వారి దు-
స్తరదోషంబులు వాయునన్న మది సాక్షాద్భక్తులం జూచినం
బరమార్థంబుగ బాయదే నరుల పాపంబెల్ల సర్వేశ్వరా!
* తెలుగు కృతులు *

శివతత్త్వసారము - పండితారాధ్యులు.

కం.
ఏదేశంబున నేపురి
నేదెస వసియించి యుండు నిల శివభక్తుం
డాదేశంబున నాపురి
నాదెస వసియించియుండు హరతీర్థంబుల్.     (207)
శా.
ఏదేశంబున నేదిశాముఖమునం దేయూర నేవాడ మీ
పాదాభ్యర్చన సేయు నిర్మలుఁడు సద్భక్తుం డొకండుండు నా-
యాదేశంబును, నాదిశాముఖమును న్నాయూరు నావాడ గం-
గాదిస్నాన నదీప్రవాహఫలదంబై యొప్పు సర్వేశ్వరా!

అనుభవసారము - పాల్కురికి సోమనాథుడు.

జంగమ లింగభక్తి పరిచర్యల మీఱుట యుత్తమంబు త-
జ్జంగమ లింగపూజ లవి సామ్యము సల్పుట మధ్యమంబునున్
జంగమ లింగపూజయెడ సల్పక లింగముగొల్చు చున్కి యె-
న్నంగఁ గనిష్ఠమౌట శరణ ప్రతిపత్తియె ముఖ్య మెమ్మెయిన్.     (217 ప)
మ.
తమ లింగార్చనకంటె జంగమము సౌందర్యంబుగాఁ గొల్చు టు-
త్తమభక్తిస్థితి లింగజంగమల సత్సామ్యంబుగాఁ జేఁత మ-
ధ్యమభక్తిస్థితి లింగపూజ నధికుండై జంగమోపాసనా-
క్షముఁడై యుండుట భక్తియం దది కనిష్ఠత్వంబు సర్వేశ్వరా!

పండితారాధ్య చరిత్ర - పాల్కురికి సోమనాథుడు.

సకలేశు భక్తుల చరణోదకంబు
సకలతీర్థములకు జనయిత్రి యనియు
పలుతీర్థముల గ్రుంగఁబఱచుటకంటె
నిల భక్తపాదాంబువులు గొనుటుఱువు
నెట్లన్న తీర్థంబులేగుట బార
మట్లునుగాక స్వర్గాది ఫలంబు
లారుద్ర భక్తపాదాంబువుల్ ద్రావ
భార మేమియులేదు ప్రాప్తించు ముక్తి
    (పురాతన ప్రకరణము)
మ.
పలుతీర్థంబులఁ గ్రుంకుకంటె మహిలో భక్తాంఘ్రిపానీయముల్
తలమీఁదం జిలికించుకోదగును తీర్థం బాడ భారంబు త-
త్ఫల మత్యల్పము భక్తపాదయుగళాంభఃస్పర్శ నిర్భారమై
యలరున్ శాశ్వతభుక్తిముక్తిఫలదంబై యుండు సర్వేశ్వరా!

పండితారాధ్య చరిత్ర

తలఁప “వేదాశ్చ శాస్త్రాణి” యనంగ
నిల “నుపమంత్రై రనేకథా” యనఁగ
తఱితఱి శ్రుతులు శాస్త్రములు మంత్రములు
నెఱి “పునస్తత్రైవ నిర్గతా” యనఁగఁ
బరగుచు సకలశబ్దప్రపంచంబు
వరుసనట్ల “యథా శివ స్తథా” యనఁగ
నడఁగు జనించు పంచాక్షరియందు
    (మహిమ ప్రకరణము)
మ.
అమితోద్యద్భవదీయతత్త్వము మహీయస్తోత్రవాణీవిలా-
సములై యొప్పు సమస్తవేదములు శాస్త్రశ్రేణియున్ దివ్యవి-
భ్రమనాదంబులు నెన్ని చూడ నివి నీ పంచాక్షరీమంత్రభా-
వములైయుండు సమస్తలక్షణముల న్వర్ణింప సర్వేశ్వరా!

పండితారాధ్య చరిత్ర

దృష్టంబు మఱియును “దేవాశ్చ వశవ
స్పృష్టా” యనఁగ శ్రుతి దృష్టంబులుగను
కాన యీశుండు జగత్ సృష్టికర్త
... ... ... తనదు గర్భాంబుధిలోన
జనియించు బుద్బుదజాలంబులట్ల
నెనయంగ “లింగ మధ్యే జగత్సర్వ”
మనఁగఁ దన్మధ్యంబు నంద కావించు
    (వాద ప్రకరణము)
మ.
జలజాతప్రభవాండబుద్బుదము లశ్రాంతంబునుం బుట్టుచుం గలయం గ్రాఁగుచునుండు నీ పృథులలింగస్ఫారగర్భాబ్ధిలో-
పలఁ దద్బుద్బుదగర్భవాసులు హరిబ్రహ్మాది దేవాళియుం
గలదే వారికి నీ మహత్త్వ మెఱుఁగంగా శక్తి సర్వేశ్వరా!

పండితారాధ్య చరిత్ర

అటుగాక యీ పుష్ప మంతయు నొకఁడు
పటుభక్తి మీ పదాబ్జములపైఁ బూన్ప
మఱి పూర్వజన్మ సమాధులు లేని
నెఱి ముక్తి గలిగింపు నిజమట్లుగాన (పర్వత ప్రకరణము)
మ.
ఒకపుష్పంబు భవత్పదద్వయముపై నొప్పంగ సద్భక్తిరం-
జకుఁడై పెట్టిన పుణ్యమూర్తికిఁ బునర్జన్మంబు లేదన్నఁ బా-
యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచో బెద్దనై-
ష్ఠికుఁడై యుండెడువాఁడు నీవగుట దాఁ జిత్రంబె సర్వేశ్వరా!

పై యుదాహృతాంశములవలన శైవగ్రంథములను ముఖ్యముగా పాల్కురికి సోమనాథుని కృతులను నన్నమయ్య యెట్లు జీర్ణించుకొన్నదియు తెలియనగును. మరియు సోముని పండితారాధ్య చరిత్రలోగల సవైదిక వీరశైవ సంప్రదాయమునే యనుసరించుటయు, దానిని గ్రంథరూపమున పాల్కురికి సోమనాథుడే ప్రవర్తింప జేయుటయు, నన్నమయ్య పాల్కురికి సోమనాథుని తరువాత నున్నట్లు విశదమగుచున్నది గదా. అన్నమయ్య క్రీ. శ. 1242 లో నుండుటచే, పాల్కురికి సోమనాథు డంతకు ముందువాడగుట నిశ్చితము, నిర్వివాదము.

అన్నమయ్య యీ కృతియందు నిరూపించినది యారాధ్యసంప్రదాయికమగు సవైదిక వీరశైవమే యైనను, నిందు ముక్తికి పరిశుద్ధమగు భక్తియోగము సాధనమని, భూతసేవాపరమైన జంగమ భక్తియోగము మూలసాధనమని వివరింపబడినది. విధ్యుక్తకర్మల నాచరించుచు, గురులింగ జంగమ జ్ఞానసంపత్తిని బడసి, తత్సేవాధర్మముల నిర్వర్తింపుచు నిశ్చలభక్తియోగమున ధ్యానమార్గమున శివానందము భక్తు డనుభవించునని యన్నమయ్య ప్రతిపాదన. కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన మార్గములను నాల్గు యోగములలో భక్తియోగమే తక్కినవానికి మూలమని, భక్తియోగ ప్రకృష్టతను ప్రపంచించి యున్నాడు.

సహజైకభక్తినిష్ఠాపరతంత్రుఁడగు భక్తునకు బాహిరములగు కేవల ప్రకృతివిషయములను గూర్చి గాని, అన్యదేవతావిషయము గాని యవసరమే యుండదు. సహజైకలింగనిష్ఠాపరతంత్రుడగు శైవుని భక్తికంతకు నిదియే మూలకందము. కాబట్టియే యీ కృతియం దెచ్చటను నితరమతఖండన, దేవతాప్రసక్తి లేక ఎచ్చట చూచినను శివమహత్త్వము, భక్తినిశ్చలత, శాంత, సాత్త్విక వైరాగ్య ప్రవృత్తి యుద్దీపించుచున్నవి.


[1] దూదికొండయను గ్రామము కర్నూలు జిల్లా ప్రత్తికొండ తాలూకాలో ప్రత్తికొండకు సమీపమున నున్నది.
[2] సర్వేశ్వర శతక పీఠిక 1వ పుట ఆంధ్ర సాహిత్య పరిషన్ముద్రణము, 1917.
[3] మలయరాజీయమునకు బదులు ‘బిల్హణము’ పంచస్తవిలో కొన్ని యెడల నున్నది. శ్రీవిశ్వారాధ్య పీఠాధిపతులై సిద్ధినందిన చిదిరెమఠము వీరభద్రశర్మగారు ప్రకటించిన ‘శివ పంచస్తవి’ ఆంధ్రశైవవాఙ్మయమున నొక విశిష్టకృతి.

సర్వేశ్వరశతకము

యథావాక్కుల అన్నమయ్య : కవిపరిచయము
-వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)

వేణుగోపాలశతకము - పోలిపెద్ది వేంకటరాయకవి - పీఠిక - కె. గోపాలకృష్ణరావు - అధిక్షేపశతకములు - అధిక్షేప శతకము - అధిక్షేపశతకాలు - అధిక్షేప శతకాలు - ఆంధ్రభారతి - వచన సాహిత్యము - పీఠికలు vachana sAhityamu - pIThikalu - Venugopala Satakam - Polipeddi VenkatarayaKavi ( telugu andhra )