వచన వ్యాసములు యథావాక్కుల అన్నమయ్య - పరిచయము

శతక కవిసార్వభౌముఁడు
యథావాక్కుల అన్నమయ్య (క్రీ. శ. 1218 - 1285)

- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)

“ధాత్రి న్భక్తజనానురంజనముగాఁ దత్త్వప్రకాశంబుగాఁ
జిత్రార్థాంచితశబ్దబంధురముగా సేవ్యంబుగా సజ్జన-
శ్రోత్రానందముగా శుభాంచితముగా శోధించి సర్వేశ్వర-
స్తోత్రం బన్నయ చెప్పె నిజ్జగములో శోభిల్ల సర్వేశ్వరా!”

ఈ పద్యమందలి ప్రతివాక్యముకూడ సార్థకమే యని “సర్వేశ్వర శతకము”ను సవిమర్శముగాఁ జదువు ప్రాజ్ఞులకు గోచరించును. ఈ శతకముయొక్క గొప్పఁదనమునుగూర్చి శ్రీ నిడుదవోలు వెంకట్రావుగారు “భారతి” తారణ ఫాల్గుణసంచికయందు విపులముగాఁ జర్చించిరి. దీని నిదివఱకే సాహిత్యపరిషత్తువారు, శైవసిద్ధాంత ముద్రాక్షరశాలవారు, వావిళ్ల రామస్వామిశాస్త్రులు “అండు” సన్సువారు, కాశీనాథుని నాగేశ్వరరావుపంతులుగారు ప్రకటించిరి. ఇవన్నియుఁ గూడ ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమందలి వ్రాతప్రతి కించుమించుగా సరిపోవుచున్నవి. ఈ శతకము “సర్వేశ్వరా” యను మకుటముతో 142 మత్తేభ శార్దూలవృత్తములతో నొప్పుచున్నది.

ఈ కృతికర్త తన్ను గూర్చియు, తన శతక రచనాకాలమును గూర్చియు, నీ క్రింది 142, 130 పద్యములం దీవిధముగా వివరించెను :--

“జయశక్తిన్ రవిచంద్రతారకముగాఁ జల్పెన్ యథావాక్కులా-
న్వయసంజాతుఁడు నన్నమార్యుఁ డవని న్వర్ణించి నీ సత్కథా-
క్రియసంబోధన నీదు భక్తిని మహానిర్ణీతవిశ్రాంతిగా
భయవిభ్రాంతులు లేక యీ శతకముం బ్రఖ్యాతి సర్వేశ్వరా!”
“శాకాబ్దంబులు వార్ధిషట్కపురజిత్సంఖ్యం బ్రవర్తింప సు-
శ్లోకానందకరంబుగా మహిమతో శోభిల్ల సర్వేశ్వర-
ప్రాకామ్యస్తవ మొప్పఁ జెప్పె శుభకృత్ప్రవ్యక్తవర్షంబునన్
శ్రీకంఠార్పితమై వసుంధరపయిం జెన్నొంద సర్వేశ్వరా!”

పరమేశ్వర భక్తిరసప్రపూరితమగు నీశతకమును రచించిన మహాకవి యథావాక్కుల అన్నమయ్య “ఆరాధ్య బ్రాహ్మణుఁడు”; ఆత్రేయ గోత్రుఁడు; యజుశ్శాఖీయుఁడు. “అభిరమ్యంబగు దూదికొండ మహనీయారాధ్య సోమేశ్వరప్రభు కారుణ్యవసంతసంజనిత మద్వాక్యప్రసూనావళిన్” అని చెప్పుకొనుటచే నితఁడు కర్నూలు జిల్లా, ప్రత్తికొండ తాలూకాలో ప్రత్తికొండకు సమీపమునందలి “దూదికొండ” గ్రామవాస్తవ్యుండగు నారాధ్యసోమేశ్వరుని శిష్యుఁడని తెలియుచున్నది. అన్నమయ్య మొదటి వాసస్థలము గోదావరీతీరమందలి పట్టెసము. తరువాత నితఁడు శ్రీశైలయాత్ర కేఁగి తిరిగి వచ్చుచు, పల్నాటి తాలూకాయందలి సత్రశాలలో నివాసమేర్పఱుచుకొని, యక్కడనే “సర్వేశ్వర శతకము”ను రచించి కొన్నినాళ్లకు సిద్ధిఁ బొందెను. ఇతని వంశీయులలో “సోమరాజు” అను నతఁడు మిక్కిలి ప్రసిద్ధి పొందినందువలన నింటిపేరు “సోమరాజు”వారుగా మాఱినది. ఇప్పటికిని, ఈ యింటిపేరివారు పల్నాడు ప్రాంతములందున్నారు. ఈ విషయము సాహిత్యపరిషత్తువారి “సర్వేశ్వర శతక” పీఠిక వలనఁ దెలియుచున్నది.

ఈ కవి కాలనిర్ణయమునుగూర్చి శ్రమ నందవలసిన పనిలేక శతకమునందే “శాకాబ్దంబులు వార్ధిషట్కపురజిత్సంఖ్య” యను పద్యమునందు కవి స్పష్టపఱచెను. అనఁగా శాలివాహనశకము 1164 శుభకృత్సంవత్సరము (క్రీ. శ. 1242)లో శతకరచన జరిగినది. అప్పటి కన్నమయ్యకు “30” యేండ్లని తలఁచినను, అతఁడు క్రీ. శ. 1212-15ల ప్రాంతమున జననమంది యుండవలెను. అప్పటి యాయుర్దాయము ననుసరించి, 65-70 యేండ్లైనను నితఁడు జీవించియుండిన యెడల నతని జీవితకాలము క్రీ. శ. 1215-1285 వఱకైన నుండునని యూహించుట కవకాశమున్నది. ఇచ్చట మఱియొక యంశముగూడ ముఖ్యముగా గమనింపవలసినది లేకపోలేదు. ఇతఁడు పాల్కుఱికి సోమన శిష్యుడని కొండఱి మతము. కాని, అది యెట్లును పొసఁగదు. [1]“అన్నమయ్య, సర్వేశ్వర శతకమున పాల్కుఱికి సోమన భావములను గొన్నిఁటి ననుకరించి యున్నాఁడు. ఆ కారణము ననుసరించి యిర్వురు సమకాలికులు మాత్రమే గాక సమవయస్కులుగ (మూఁడునాలుగేండ్లు హెచ్చుతక్కువగ) నుండవలెను. అయిన, పాండిత్యమునందు, ప్రతిభయందు, పరమత వాదఖండనయందు- బహుళవిషయజ్ఞతయందు- ప్రజ్ఞాప్రాభవములందు పాల్కుఱికి సోమనారాధ్యుఁడే ఇతనికన్న నెన్నియో రెట్లెక్కువవాఁడనిపించును. ఆయీ కారణములవలన సోమన ప్రౌఢనిర్భర వయఃపరిపాకమునకు ముందే, తన యుద్గ్రంథములను దేశికవితయగు ద్విపదలో వ్రాసి- ఉడుకునెత్తుటిప్రాయమునఁ దనకున్న బసవేశ్వరభక్తి-పండితారాధ్యాభిమానము- వీరశైవదీక్ష వెల్లడించెను. కనుక, అన్నమయ్య భక్తిప్రతిపాదకమైన తన “సర్వేశ్వర శతకము”నకుఁ గావలసిన సరుకు నాతని బసవపురాణ పండితారాధ్యచరిత్రానుభవసారములనుండి గ్రహించుటయం దాశ్చ ర్యము లేదు.” అన్నమయ్య పాల్కుఱికి సోమన శిష్యుఁడనువారి వాదధోరణి యిది. కాని, తదాధారములంత బలవత్తరములు కావు.

ఈసందర్భమున- “సోమన యభిప్రాయములకు అన్నమయ్య యభిప్రాయములకు నెంతవఱకు పొత్తుకుదురు?” నన్నది విచారణీయాంశము. “భక్తిని బలపఱుచు పట్టులయం దన్నమయ్య కొన్నిఁట సోమన ననుకరించినాఁడు. దానికిఁ గారణ మదివఱకే యతని గొప్పతనమునుగూర్చి, అతని వీరమాహేశ్వరవ్రతమునుగూర్చి పాండిత్యప్రతిభలనుగూర్చి విని యతనిపై నెనలేని గౌరవభావము గలిగియుండును. అంతియగాని, యణుమాత్రమైనను, అతని బసవభక్తి, అన్యమతనిరాసము, స్వమతపక్షపాతము, నితనికి లేదని సర్వేశ్వర శతక పద్యములు ఘంటాపథముగా నొడువుచున్నవి.” ఇందలి యథార్యము మున్ముందు చర్చింతము.

ఇది యిట్లుండ - “దూదికొండ” నివాసియైన ఆరాధ్యసోమేశ్వరుని శిష్యుఁడగు నీ యన్నమయ్యకుఁ బాల్కుఱికి సోమనాథుఁడే గురువని యీ క్రింది వాక్యములలో శ్రీ నిడుదవోలువేంకట రావుగారు తెలిపిరి.-

“అభిరమ్యంబుగ దూదికొండ మహనీయారాధ్య సోమేశ్వరప్రభు కారుణ్యవసంతసంజనిత మత్పద్యప్రసూనావళిన్” (అన్నమయ్యకృతియందలి చివరిపద్యములలో) నొక సోమనారాధ్యుని బేర్కొనినాఁడు.
“పై పద్యమున నారాధ్యసోమేశ్వరుఁ డన్నమయ్య గురువని యిదివఱకు విమర్శకులు నిర్ణయించిరి. ఈతఁడు పాల్కుఱికి సోమనాథుఁడే కాఁదగునని నేనూహింతును. సోమనాథుని సోమనారాధ్యులని కూడ ఆంధ్రవీరశైవకవులును, సోమేశ్వరుఁడని కర్ణాటకకవులును బేర్కొనిరి.”

ఈ వాద మేవిధముగను సమర్థనీయముగాఁ గనఁబడుట లేదు.

 1. పాల్కుఱికి సోమనాథుఁడు- పాల్కుఱికి, ఓరుగల్లు, [2]దోకిపఱ్ఱు, కర్ణాటక దేశములోని “కలిగె” మొదలైన స్థలములలోఁ గొంతకాలము గడిపినట్లు తెలియుచున్నది. కాని దూదికొండలో నతఁడు నివసించినటు లాధారములు లేవు. కాకున్న, శ్రీశైలయాత్రాసందర్భమున గొన్నినాళ్లక్కడ “మకాము” పెట్టెనేమో! కాని, ఎన్నఁడు దూదికొండ నివాసి మాత్రము కాఁడు. ఈవిషయమున శ్రీ వేంకటరావుగారు జూపిన యథోజ్ఞాపిక యందలి పుక్కిటి పురాణకథ విశ్వాసార్హముగాదు. మఱి, బలవత్తరమగు హేతువును గాదు.
 2. పాల్కుఱికి సోమనాథుఁడు “ఆరాధ్య సోమేశ్వరుఁడా?” శివకవు లతనిని సోమన- సోమనాథుఁడు- సోమనారాధ్యుఁడు- అని పేర్కొనిరి. కాని “సోమేశ్వరుఁడని” కాదు. దూరముగానున్న కర్ణాటక కవులెవ్వరో యతనిని గూర్చి విన్నవారు పలువిధముల బేర్కొనుట ప్రామాణ్యము గాఁజాలదు.
 3. సోమనాథుని నామాంతమందైన “ఆరాధ్య” యనునది బిరుదముగాఁ జేర్చుచు వచ్చిరి. కాని, ఇంటిపేరువలె నామము మొదట గాదు. “ఆరాధ్య సోమేశ్వరుఁ” డనినపుడు “ఆరాధ్య” యనునది “ఇంటిపే”రగును కాని, బిరుదము గాదు. ఆ పక్షమున “ఆరాధ్య సోమేశ్వరుఁడు” పాల్కుఱికి సోమనాథుఁడు కాఁడు.
 4. అన్నమయ్య నిజముగా పాల్కుఱికి సోమనాథుని శిష్యుఁడైన- ఇందులూరి అన్నయ్య- శివరాత్రి కొప్పయ్యల విధముగా సహజవీరశైవదీక్ష నవలంబించి జంగమముగా నుండియుండును. కాని యతఁడు “బ్రాహ్మ్యంబుఁ” బాయని యజుశ్శాఖీయుఁడగు నారాధ్యుఁడు.
 5. పాల్కుఱికి సోమనాథుని గురువుగా నంగీకరించినవాఁడైనచో, అన్నమయ్య తన శతకమున బసవేశ్వర మహిమను గాని, తన గురువు ప్రభావమును గాని తడవకుండఁజాలఁడు. కాని, ఈ కృతియందు (సర్వేశ్వర శతకమున) అట్టి దెచ్చటను గనఁబడదు.
 6. ఎంత శివభక్తిపరములైనను- ఇతని పద్యములం దక్కడక్కడ- అద్వైతభావములు స్పష్టముగా తొంగిచూచుచున్నవి. సోమనాథుని శిష్యు లిట్లు వ్రాయుట అసహజము.

“ఏతావాతా” తేలినదేమన- పాల్కుఱికి సోమనాథుఁ డన్నమయ్య గురువు గాఁడనియు, దూదికొండ వాస్తవ్యుఁడగు “ఆరాధ్య సోమేశ్వరుఁడే” యగుననియు.

ఇక నీతని విద్వత్కవితాశక్తులను గూర్చి ఇంచుక పరామర్శింతము.-

అన్నమయ్య, కృష్ణాతీరమునందలి సత్రశాలలో మల్లికేశ్వరుని సేవించుచు నీ శతకమును వ్రాసెనఁట ! ఆ విధముగా వ్రాసినప్పు డొక్కొక్క తాళపత్రముమీఁద నొక్కొక్క పద్యము వ్రాసి, కృష్ణానదీప్రవాహమున వేయుటయు, అది యెదురీఁది వచ్చు నెడల దానిని పరిగ్రహించుటయు, ఆ ప్రకారము రానియెడల గండకత్తెర వేసికొనుటకు ప్రతిజ్ఞ చేయుటయు జరిగెనఁట! అప్పుడు

“తరులం బువ్వులు పిందెలై యొదవి తత్తజ్జాతితోఁ బండ్లగున్
హర మీ పాదపయోజపూజితములై యత్యద్భుతం బవ్విరుల్
కరులౌ నశ్వములౌ ననర్హమణులౌఁ గర్పూరమౌ హారమౌఁ
దరుణీరత్నములౌఁ బటీరతరులౌఁ దథ్యంబు సర్వేశ్వరా!”

యను పద్యముగల తాటియా కెదురీఁది రాకపోగా, తన శపథము ననుసరించి యన్నమయ్య గండకత్తెర వైచికొనుటకు సిద్ధపడెను. ఇంతలో పసులకాపరి యా పత్రమును దెచ్చి యియ్యఁగా, నందు

“ఒకపుష్పంబు భవత్పదద్వయముపై నొప్పంగ సద్భక్తిరం-
జకుఁడై పెట్టిన పుణ్యమూర్తికిఁ బునర్జన్మంబు లేదన్నఁ బా-
యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచో బెద్దనై-
ష్ఠికుఁడై యుండెడువాఁడు నీవగుట దాఁ జిత్రంబె సర్వేశ్వరా!”

అని యుండుటచే దాని నన్నమయ్య తీసికొనెనఁట!-

ఈ గాథ యెంతనరకు సత్యమో, కాని శివార్చనకు ఫలితములు రెండు పద్యములందును రెండురకములుగాఁ గనిపించుచున్నవి. మొదటిది సకామార్చనగను, రెండవది నిష్కామార్చనగను రూఢి యగుచున్నది. అందు రెండవది మేలైనందున పసులకాపరివలన దొరికినది. ఈ శతకశైలి పరిశీలించిన కొలఁది అన్నమయ్య దీనికంటె నుద్గ్రంథమును దేనినైనను రచించియుండిన భాషకెంతేని నుపకారముగ నుండుటయే గాక యతని కీర్తిగూడ నినుమిక్కిలిగ వ్యాపించియుండెడిది. ఈ కృతియందలి కవిత్వము చాల ప్రౌఢమైనది. సంస్కృతశబ్దములతో- జటిలసమాసములను గూర్చుటయం దితఁడు నన్నయ, నాచన సోమన, శ్రీనాథాదుల కెంతమాత్రము తీసిపోవఁడు. కుంటువోని సరళమైన ధార. కమనీయమైన “బారాహజారి” కదమునడకలకు నడక దిద్దునవి. ఈతని పద్యముల నడక యెగుడుదిగుడు లేని సాఫుసంతనలుగల పదముల వరుస. తూఁచి, ఏర్చి, కూర్చిన ముత్తెముల కోవ. భక్తిరస సుధావాహినియందుఁ బాఠకులను బరవశులను జేయు మృదుమధురభావవ్యక్తీకరణసమర్థతయం దన్నమారాధ్య పోతనామాత్యులలో గుడియెడమలు నిర్ణయించుట యరిది.

అన్నమయ్య శతక పద్యములన్నియు భక్తిప్రబోధకములు; అయినను నవి యద్వైతభావములతో నాత్మానాత్మవిచారవిషయములతో వేదాంతరహస్యబోధనలతో బెనవైచికొని, పరమశివునివంక కెట్టి పాషండునైనఁ ద్రిప్పఁజాలినవి. ఈ క్రింది పద్యములు చూడుఁడు.-

“ఉరుసంసారగజేంద్రదర్పదళన వ్యూఢప్రతాపోగ్రకే-
సరి దుష్ప్రాపశరీధబంధవిపులక్ష్మాజవ్రజచ్ఛేదవి-
స్ఫురితక్రూర కుఠారధార దురితప్రోద్భూతజీమూతదు-
స్తరసంఘాతవిఘాత మారుతము నీ సద్భక్తి సర్వేశ్వరా!”
“ఆకాశానలచంద్రసూర్యపవమానాత్మాంబువిశ్వంభరా-
ప్రాకామ్యాంచితమూర్తి భేదముల నీ బ్రహ్మాండనానాఘటా-
నీకప్రాకట జీవభావవిలసన్నిర్మాణకర్మాద్భుతా-
స్తోకశ్రీకరమూర్తియై వెలుఁగు నీ స్థూలంబు సర్వేశ్వరా!”

ఈ శతకమునందలి భావములు చాలవఱకు “మహిమ్నము,” “మల్హణము,” “అనామయము,” “హలాయుధము” మున్నగు సంస్కృత గ్రంథములనుండియు, “శివతత్త్వసారము” మున్నగు నాంధ్రగ్రంథములనుండియు గ్రహింపఁబడినవి.

ఇతని తరువాతివారగు సోమనాథాదు లితని భావముల ననుకరింపకపోలేదు.

“కల్పిత లింగజంగమ సుఖస్ఫురణాయ నమోనమో, యసం
కల్పవికల్పమార్గ కథితపథితాయ నమోనమో, గుణా
కల్పపరాయ తే యనుచు గౌరవలీల నుతింతు నిన్ను, న-
స్వల్పతరప్రభావ, బసవా, బసవా, బసవా, వృషాధిపా !”

అను పద్యము సర్వేశ్వర శతకమునం దీక్రింది పద్యము కనుకరణము-

“శ్రీకంఠాయ నమోనమో నతసురజ్యేష్ఠాయ రుద్రాయ లిం-
గాకారాయ నమోనమో విగతసంసారాయ శాంతాయ చం-
ద్రాకల్పాయ నమోనమో దురితసంహారాయ తే యంచు ని-
న్నాకాంక్షం బ్రణుతించు మానవుఁడు నీవై యుండు సర్వేశ్వరా!”

ఈ కృతియందలి యుపమానములు, అర్థాంతరన్యాసములు నిర్దిష్టభావముల కతుకునంత సన్నిహితములుగా నున్నవి-

 1. నిర్మలగంగాపృథులప్రవాహ మరయం బ్రస్ఫూర్తిఁ దా నెన్నివంకలుగాఁ బారిన, దాని నొండు వలుకంగాఁ జన్నె?
 2. ఘటదుగ్ధంబులు పేరుఁగాక, వెలయంగా నెంత తోడంటిన న్నటదుగ్ధాంబుధి పేరునే?
 3. భ్రమరధ్యానముఁ దాల్చి కీటకము సద్భావాదిసంయుక్తి దా భ్రమరంబై ఖగవీథి నాడుననినన్.
 4. సతి వేడ్కం దన ప్రాణవల్లభునితో సంయోగ మర్థించుఁ గా, కతనిం బ్రార్థన సేసి సొమ్ముఁ గొనిపో నఱ్ఱాడునే?
 5. కమలాప్తుం డుదయింపఁగా, ననలనక్షత్రక్షపాధీశతేజము లెల్లం లెడఁబాసి పోవు గతిన్.
 6. చీకటికిం దిగ్మమరీచికిం గలదె సాంగత్యంబు?
 7. ఉరుపక్షంబులు వచ్చునంతకు నిరుద్యోగంబున న్వృక్షకోటరమధ్యంబున నుండు పక్షి గతిన్.
 8. కనకంబందు ఘనీభవించిన కళంకంబెల్ల సువ్యక్తిగా ననలాస్యంబునఁ గ్రాఁగిపోవు గతిన్.
 9. కసవుం బెంచిన చేనియట్ల.
 10. జ్వరసంతానవిశోషితాంగుఁడు సుధాసంకాశదివ్యాన్నపానరసశ్రేణి భుజింప రోయు గతిన్.
 11. చకోరపోతము మహీయజ్యోత్స్నయం దుత్సవశ్రీ రంజిల్లుచు వేడ్కనుండు గతిన్.
 12. ఉదకం బింకిన లావుదూలి వడిఁ దా నుష్ణింపఁగా రొంపిలోఁ గదలం జాలని మీను వాన గురియం గ్రమ్మెక్కి పెన్నీటిలోఁ బొదలం గన్న విధంబునన్.
 13. శూలస్థాపితుఁడైన మానవునకు శూలంబు దుర్వారవాత్యాలిం గంపము నొందకుండుట సుఖంబై తోఁచు మాడ్కిన్.

ఇట్టివి పెక్కులు.

ఉద్దండుఁడగు నీ కవి కొన్ని లక్షణవిరుద్ధప్రయోగములు చేసినను, అవి యంతఁగాఁ బాటింపఁదగినవి కావు.

గణభంగము-

“అభ్యంగార్చన జంగమాహితకరుండై చేసినం, దా శవశృంగారంబంగు.”

మొదటి పాదాంతవర్ణము లఘువు.

“ఉష్ణింపఁగా” - “పగే” (పగ + ఏ) - “భీతే” ( భీతి + ఏ) - “తోడంటినన్నట” (తోడంటినన్ + అట) ఇట్టి ప్రయోగముల కాస్కారము గనఁబడదు.

హస్తామలకము, శవశృంగారము, సిగ్గువిరియు, వజ్రపంజరము, బకవేషి, గీవెట్టు, గింజుకొను, -వాడుకలో నుండు నిట్టి జాతీయము లక్కడక్కడ నీతని శతకమున సందర్భానుసారముగా పొందుపరచఁబడినవి.

ఈ శతకమును మొత్తముమీఁద ప్రౌఢశైలియం దత్యద్భుతముగా నన్నమయ్య సాగించెను. ఇది తెలుఁగుభాషారమ శతకహారమున మణిపూసవంటిదని నా యభిప్రాయము. (ఉదాహరణము) మఱి రెండు పద్యములు పాఠకుల కుపాయనముగా సమర్పింతును.

“సత్యం బెప్పుడుఁ దప్పఁడేనియు దురాచారుండు గాఁడేని యౌ-
చిత్యం బేమఱఁడేని దుర్జనుల గోష్ఠిం బొందఁడే భక్తసాం-
గత్యం బాదటఁ బాయఁడేని మదనగ్రస్తుండు గాఁడేని నీ
భృత్యుం డాతఁడు మూఁడులోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా!”
“కాయంబన్నది వారిబుద్బుదసదృక్షం బందు రూపింప లేఁ-
బ్రాయంబన్నది శారదాంబుదతటిత్ప్రఖ్యంబగుం దత్సుఖ-
శ్రేయంబన్నది మాయ యిట్లెఱిఁగియు శీఘ్రంబ నీ ధ్యానసం-
స్థాయీభావనఁ బొందఁ డేమిటి కయో సంసారి సర్వేశ్వరా!”

[1] “భారతి” తారణ సం||ర ఫాల్గుణసంచికలోని శ్రీ నిడుదవోలు వేంకటరావుగారి శివకవి యథావాక్కుల అన్నమయ్య యను వ్యాసమును జూడుఁడు.
[2] ఇది గుంటూరు మండలములోనిదని తెలియుచున్నది.

సర్వేశ్వరశతకము

సర్వేశ్వరశతకము - పీఠిక - నిడవోలు వెంకటరావు (శతకసంపుటము ప్రథమభాగము - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ, 1966)

AndhraBharati AMdhra bhArati - యథావాక్కుల అన్నమయ్య - వేదము వేంకటకృష్ణశర్మ - ఆంధ్రభారతి - (శతకవాఙ్మయసర్వస్వమునుండి) ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) yathavakkula Annamayya - Vedamu Venkata Krihsna Sarma - AndhraBharati AMdhra bhArati ( telugu kAvyamulu andhra kAvyamulu)