వచన సాహిత్యము పీఠికలు కుందుర్తి : నయాగరా 2వ ముద్రణ

మళ్లీ ఇన్నాళ్లకు!

ఈ నయాగరా కావ్యంప్రతి 30 సంవత్సరాల పాటు నాక్కనిపించ కుండా దాక్కుంది. చివరకు 1974లో నేను రాసిన లేఖను పురస్కరించుకుని డా. సుప్రసన్న తన కాపీ తెచ్చి యిచ్చాడు. ముప్ఫయి సంవత్సరాల నాడు యిల్లు వదిలిపోయిన పిల్లవాడు ఏ విదేశాల్లోనో తిరిగి తిరిగి చివరకు యింటికి వచ్చి కనిపిస్తే ఎలా వుంటుందో అలా ఆశ్చర్యానందాలతో నేను యీ ప్రతిని మళ్లీ చూసుకున్నాను అప్పుడు. ఏం, యిదంత గొప్ప కావ్యమా అంటారేమో!

అవునో కాదో గాని, కాకి పిల్ల కాకికి ముద్దు!

నిజానికి యిదంత గొప్ప కావ్యమే. ఇది ప్రచురణ అయ్యేనాటికి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కూడా యింకా వ్రాతప్రతిరూపం లోనే వుంది. అభ్యుదయ కవితా యుగంలో అచ్చు అయిన తొలి కావ్యం యిదే అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో నయాగరాను గ్రంథ సమీక్షలో తిట్టని పత్రిక గానీ, చదివిన వారిలో తిట్టని పాఠకుడు గానీ లేడు. ఇదిచాలా వాదోపవాదాలకు తావిచ్చిన కావ్యం కావడం వల్లనే దానికి అంత పేరు వచ్చింది తరువాత కాలంలో. గాంధీ గారిని చూడని మహా నాయకులున్నట్లు నయాగరాను చూడని గొప్ప కవులు యిప్పుడు చాలా మంది వున్నారు.

అప్పట్లో యీ కావ్యం చదివిన వారిలో యిది కవిత్వం కాదన్న వారే అధిక సంఖ్యాకులు. కవిత్వం అని ఒప్పుకున్న వారు కూడా యిది కమ్యూనిస్టు కవిత్వం అని విశేషణ పూర్వకంగా ఒప్పుకున్నారు. ఇకపోతే కమ్యూనిస్టు పార్టీ సభ్యులూ అభిమానులు మాత్రమే దీనిని కాస్తో కూస్తో ఆదరించారు.

ఆ రోజుల్లో కుండ పోతగా ఆవేశం కుమ్మరించడమే కవిత్వమనే వాదం మాది. దీనికి తోడు ఎర్ర జండా నాయకత్వాన యీ సమాజ వ్యవస్థ మారాలని మా కవితలో వుండే సందేశం. కమ్యూనిస్టు మానిఫెస్టోను మించిన ఉత్తమ కవిత్వం ప్రపంచంలో లేదని మేం వాదిస్తూవుంటే సంప్రదాయ వాదులైన కవి మిత్రులు కొందరు నిర్ఘాంత పోయి వింటుండే వారు. వాళ్లు రసమనీ, వ్యంగ్యమనీ, ధ్వని అనీ పూర్వ ఆలంకారిక పారిభాషిక పదాలు వాడుతూ వుంటే వాటిని ఆధునిక కవిత్వానికి అన్వయించి చెప్పేపని నాదిగా వుండేది. కీ. శే. మా రామదాసు ఒక వికటాట్ట హాసంలాంటి నవ్వు నవ్వి, వాళ్లకు జవాబు చెప్పేశేవాడు. ఇక మా సుబ్రహ్మణ్యం తనకు పూర్తిగా తెలియని, ఎదుటి వాడికి అసలే అంతుబట్టని విధంగా గంటలు గంటలు వుపన్యసిస్తుండే వాడు. ఇదంతా ప్రతిరోజు సాయంత్రం గుంటూరు బ్రాడీపేటలో రైలు పట్టాల మీద జరిగే సమావేశాల్లో జరుగుతుండేది. ఈ నిరంతర చర్చల పర్యవసానంగా ఆ రోజుల్లో చాలామంది యువకవులు అభ్యుదయ వాదం వైపు మొగ్గారు. ఆరోజుల్లో మేం సాధించిన సత్ఫలితాల్లో యిదొకటి. ఈనాటివలె సంప్రదాయవాదులను లక్ష్య పెట్టకుండా అభ్యుదయ వాదులైన కవులు ముందుకు పోయే అనుకూల పరిస్థితి ఆనాడు లేదు. అప్పుడు వారిని ఎక్కడికక్కడ ఢీకొని యుద్ధాలు చేయవలసిన అవసరం వుండేది.

అభ్యుదయ కవిత్వం నయాగరా రోజులనుండి ఎన్నో మలుపులు తిరిగి మజిలీలు దాటి, ఎంతోదూరం ప్రయాణం చేసింది. ఇప్పటి విప్లవకవుల వీరావేశాన్ని చూస్తుంటే అది ఒక ఋజురేఖలో కాకుండా ఒక వలయాకార పరిధి మీద తిరుగుతూ మళ్లీ అదే స్థానానికి వచ్చిందా అనిపిస్తుంది.

నయాగరాలోని కవిత్వం గురించి తరువాత కాలంలో వచ్చిన సహృదయ సద్విమర్శ శ్రీ కె. వి. రమణారెడ్డి గారు చేసినది. శ్రీ శ్రీ కేవలం సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆకాశ మార్గాలలో ఎవరికీ అందకుండా విహరిస్తుంటే, నయాగరా కవులు భూమ్మీదికి దిగి యిక్కడి పరిస్థితులను అర్థం చేసుకొని వాటికి కావ్యత్వం యిచ్చారని వ్యాఖ్యానించారు. మన్య విప్లవం, ఠాకూర్‌ చంద్రసింగ్‌ వంటి సంఘటన పూరితమైన కావ్య వస్తువులు వున్నందువల్ల ఆ వ్యాఖ్యానం చాలా వరకు నిజమనిపించింది. తరువాత నేను ప్రతిపాదించిన కథా కావ్య సిద్ధాంతానికి కూడా యివే మూలబీజాలు అయివుండవచ్చు.

ఈ నయాగరా కావ్యం రెండో ముద్రణ సిల్వర్‌ జూబ్లీ ఎడిషన్‌గా వేద్దామని మిత్రులు గుంటూరు రవి కళాశాల ప్రిన్సిపాలు శ్రీ సి. వి. ఎన్‌. ధన్‌ గారు కొన్నేళ్ల క్రితం నాకు సూచించారు. కాని ఎందుకో అప్పట్లో ఆ ప్రయత్నం ఫలించలేదు. దీని ప్రథమ ముద్రాపకులు శ్రీ నమ్మాళ్వార్‌ గారు కూడా అప్పుడప్పుడు అంటూవుండేవారు. అదీ జరుగ లేదు. ఇంతకూ యీ ప్రతి ఎక్కడా సులభంగా లభించక పోవటంవల్ల ఆ ప్రయత్నాలేవీ సాగలేదు.

ఇటీవల నా "కుందుర్తి కృతులు" ముద్రణ అయిన సందర్భంగా ప్రెస్సుల చుట్టూ తిరగవలసి రావటంవల్ల మళ్ళీ యీ రెండో ముద్రణ తలంపు నాకు కలిగింది. దీనిని మా ఫ్రీవర్స్‌ఫ్రంట్‌ తరఫున ప్రకటించ గలుగుతున్నందుకు నాకు సంతోషంగా వుంది.

మా నవ్యకళాపరిషత్‌, నరసరావుపేట తరఫున నయాగరా ప్రథమ ముద్రణ జరిగిన రోజుల్లో మిత్రులు శ్రీ అనిసెట్టి పెండ్లి జరుగుతోంది. ఆ సందర్భంగా దానిని అనిసెట్టి, అనిలలకు అంకితం యివ్వడం జరిగింది.

కావ్యం చిన్నదే అయినా, దీనికి ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రాధాన్యం వుందని నేను అభిప్రాయపడుతున్నాను. అందుకే యీ మలి ముద్రణ. ఇంత చారిత్రిక ప్రాధాన్యంకల ఒక కావ్యం మలి ముద్రణ పడడానికి 31 సంవత్సరాలు పట్టిందంటే యిది ఒక్క తెలుగు సాహిత్యానికే చెల్లిందని మనం సంతృప్తి పడదాం!

కుందుర్తి

ఫ్రీవర్స్‌ఫ్రంట్‌
హైదరాబాదు
30-3-75


నయాగరా కవితలు

AndhraBharati AMdhra bhArati - vachana sAhityamu - pIThikalu - kuMdurti : nayAgarA 2va mudraNa ( telugu andhra )