వచన ఉపన్యాసములు అష్టదిగ్గజ నిర్ణయము
- డాక్టర్‌ నేలటూరి వేంకటరమణయ్య

ఉపన్యాసపు తేదీ - 2-12-57
ఉపన్యాసకులు - డా॥ నేలటూరి వేంకటరమణయ్య
సభాధ్యక్షులు - డా॥ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు

అష్టదిగ్గజములు 1960
(అష్టదిగ్గజ వర్ధంత్యుత్సవోపన్యాస సంపుటి)
(అష్టదిగ్గజ వర్ధంత్యుత్సవ సమితి,
తెలుగు సారస్వత సమితి,
ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల,
ఉస్మానియా విశ్వవిద్యాలయము)

శ్రీకృష్ణదేవరాయల యాస్థానమున అష్టదిగ్గజములను కవు లెనమండ్రుండి రను నైతిహ్య మొకటి చిరకాలమునుండియు నాంధ్రదేశమున వాడుకలోనున్నది. మన పూర్వీకు లందఱును, నీ యైతిహ్యము సత్య మైనదనియే విశ్వసించి, తమ రచనలలో అష్టదిగ్గజముల ప్రస్తావన వచ్చినప్పుడు వారందఱును నాంధ్రకవులనియే వ్రాసియున్నారు. కాని, ఆధునికాంధ్ర విద్వత్ప్రకాండులు కొందఱు పూర్వుల అభిప్రాయముతో నేకీభవింపరు. అష్టదిగ్గజము లనగనే తెనుగువారు మాత్రమే యనుట కేమి యాధారము గలదు? వారిలో గీర్వాణ కర్ణాట ద్రావిడ కవులు గూడ కొన్ని పీఠముల నధిష్ఠించి యుండరాదా? కృష్ణరాయలు గీర్వాణ విద్యావిశారదుడు; మదాలస చరిత్ర, సత్యావధూప్రీణనము, రసమంజరి మున్నగు గ్రంథముల రచియింప నేర్చిన మహాకవి; కర్ణాట సామ్రాజ్యాధిపతి. ద్రావిడ కవుల కాశ్రయ మొసగి పోషించిన ఉదార హృదయుడు. అట్టి ప్రభువు తెలుగు కవులయెడ పక్షపాతము చూపి, వారిని మాత్రమే యష్టదిగ్గజములలో జేర్చుకొని గౌరవించి యుండునా? అట్లని తలంచుట యా మహారాజు యొక్క విశాలదృష్టికి న్యూనత్వమారోపించుట యగును; కావున అష్టదిగ్గజములలో నాంధ్రకవులకే కాక తక్కిన సంస్కృతాది భాషలలో కవిత్వము సెప్పనేర్చి, ప్రఖ్యాతినందిన వారికిగూడ ప్రవేశము గలిగి యుండునని యెంచుట సమంజసము అని వాదింతురు. సమంజసమే, కాని యది వాస్తవమా? కృష్ణరాయ లన్ని భాషలయెడలను ఆదరము చూపినది నిజమే. ఎవ్వరును కాదనలేరు, కాని 'దేశభాషలందు తెలుగు లెస్స' యని యుద్ఘోషించిన మహాప్రభువు తెలుగుభాషపై వలపక్షము జూపలేదని యెట్లు వచింపగలము? ఇచట స్మరింపదగిన విషయ మింకొక్కటి కలదు. ఆంధ్రలోకమున దప్ప యన్యత్ర మఱి యెచ్చటను అష్టదిగ్గజములమాట వినరాదు - ఆంధ్రేతరులకు ఆంధ్రులు అష్టదిగ్గజములన అర్థమేమో వివరింపవలసి యున్నది. వారి కీ సంగతియే తెలియదు. పై బేర్కొనిన విమర్శకులు వాదించినట్లు గీర్వాణ కర్ణాట ద్రావిడ కవులకును అష్టదిగ్గజములలో బ్రవేశముండి యుండినచో వారి వాఙ్మయములందు వాని వృత్తాంతము శశవిషాణమై యుండజాలదు. కావున పై వివరించిన యంశములను రెంటిని దృష్టియందుంచుకొని విచారించితిమేని అష్టదిగ్గజములు ఆంధ్ర వాఙ్మయ ప్రపంచమును మోచిన తెనుగు యేనుగులేకాని యన్యభాషాజన్యములు గావని విశదపడగలదు. అష్టదిగ్గజములు తెనుగువారే కావచ్చును. వారందరును కవులే యని చెప్పుటకేమి యాధారము గలదు? కృష్ణదేవరాయ లొక కవిత్వమును మాత్రమేకాక సమస్త శాస్త్రములను విద్యలను కళలను పోషించెను; కావున ఆయన గౌరవాదరములకు పాత్రులయినవా రొక్క కవులు మాత్రమని చెప్పుట పాడిగాదు; ఆయన కవులతోపాటు శాస్త్రాదులలో నిష్ణాతులైన వారిని గూడ అష్టదిగ్గజములలో నుంచిరని తలంచుట సమంజసము - ఒకడు శాస్త్రములం దారితేరిన విద్వాంసుడై యుండ వచ్చును; ఒకడు వాస్తునిర్మాణ విద్యలో నేర్పరియైన యోజు కాదగును; మఱియొకడు మల్లవిద్యావిశారదుడు గానోపును; ఇంకొక్కడు చిత్రలేఖన నిపుణుడై యుండనగును. అని మఱి కొందఱు వాదింతురు - వాదపద్ధతి సరియైనదే కాని యష్టదిగ్గజములు కవులసంస్థయే యని రాయలనాటి శాసనములే డవిణగొట్టి చెప్పుచుండగా నది నానా శాస్త్రవిద్యాకళావిశారదుల ప్రాతినిధ్యసభయని వాదించు విమర్శకుల బుద్ధికౌశల్యమునే సూచించును గాని సత్యమును సూచింపదు; కడప మండలములో తిప్పలూరు అను గ్రామమొక్కటి కలదు. అది యష్టదిగ్గజ కవీశ్వరులకు దత్తమైన అగ్రహారమైనట్లు కృష్ణరాయల రాజ్యకాలమున శకాబ్దము 1450కు సరియైన సర్వజిత్సంవత్సర శ్రావణ బ. ౩౦ సోమవారమునాడు (26 ఆగష్టు 1527) వ్రాయించి నిల్పిన శిలాశాసనము వలన విదితమగుచున్నది.1 కావున అష్టదిగ్గజములు కేవలము కవీశ్వరుల కూటమని నిస్సంశయముగ జెప్పవచ్చును. కాని యీ శాసనము నందా యష్టదిగ్గజ కవీశ్వరు లెవ్వరో పేర్కొనబడి యుండలేదు. ఆర్కియలాజికల్‌ డిపార్టుమెంటు వారిచే 1938 సం. న బ్రకటింపబడిన దక్షిణ భారత శాసన సాంవత్సరిక నివేదికయందు వారు అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి, మాదయగారి మల్లన, పింగళి సూరన, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు నైనట్లు చెప్పియున్నది.2 కాని వారే యాధారమునుబట్టి పైనివేదికలో రచయితల నిర్ణయమునకు వచ్చిరో తెలియదు. పైపట్టికలో బేర్కొనబడిన కవు లెనమండ్రును వాస్తవముగ గృష్ణదేవరాయల సభాస్థానము నలంకరించిన యష్టదిగ్గజములలోని వారో కారో విచారించి కనుగొనవలసి యున్నది; ఈ విషయమును నిర్ణయించి తేల్చుటకు, ఇప్పటి కుపలభ్యమైన చరిత్రాధారముల స్వభావమును బట్టి చూడ వారిని మూడు తరగతులుగ విభజింపవచ్చును.

1.

సమకాలిక గ్రంథశాసనాదుల సాక్ష్యమువలన గృష్ణరాయల సభాస్థానమునందు వర్ధిల్లినట్లు తెలియవచ్చువారు మొదటివర్గమున జేర్పదగినవారు; రాయలకు నిజ రచనల నంకితమిచ్చిన వారును, నతని ప్రోత్సాహముచే గ్రంథరచనకు బూనుకొనిన వారును నీవర్గమునకు జెందుదురు. వీరు మువ్వురు: అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన, అయ్యలరాజు రామభద్రయ్య. వీరిలో మొదటి ఇద్దరిని గూర్చి విశేష చర్చ కవకాశములేదు. అల్లసాని పెద్దన తన మనుచరిత్రను, నంది (ముక్కు) తిమ్మన తన పారిజాతాపహరణమును, కృష్ణదేవరాయల కంకిత మొనర్చియున్నారు. అల్లసాని పెద్దన రాయలకు ప్రియతముడైన మహాకవి; అతడు తన్ను రాయలెట్లు గౌరవించి యాదరించెనో రాయల మరణానంతరము రచించిన ఈ క్రింది చాటువులో వివరించియున్నాడు:

ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్గి - కేలూత యిచ్చి యెక్కించుకొనియె
మనుచరిత్రం బందుకొనువేళ బురమేగఁ - బల్లకిఁ దనకేలఁ బట్టియెత్తె
బిరుదైన ఘనగండపెండేరమున కీవె - తగునని తానె పాదమున దొడగె
కోకట గ్రామా ద్యనేకాగ్రహారంబు - లడిగిన సీమలయందు నిచ్చె
నాంధ్రకవితాపితామహ! యల్లసాని - పెద్దన కవీంద్ర! యని నన్ను బిలుచునట్టి
కృష్ణరాయలతో దివి కేగలేక - బ్రతికియున్నాఁడ జీవచ్ఛవంబు కరణి.

ఇవి యతిశయోక్తులు గావు. ఇందు పేర్కొనిన యంశములు సత్యమని ఋజువు చేయగల శాసన సాక్ష్యము కొంత గలదు. పై చాటువు చతుర్థ పాదమున గృష్ణరాయలు కోకటము మొదలగు అగ్రహారములు పెక్కింటిని తా నేయే సీమలలో నడిగిన నాయా సీమలలో నిచ్చినట్లు పెద్దన చెప్పుకొనియున్నాడు గదా! శా.శ. 1440 (క్రీ. శ. 1518) బహుధాన్య వర్షమున వ్రాయబడిన కడప జిల్లా కామలాపురము తాలూకాలోని కోకట గ్రామమున గానవచ్చు రెండు శిలా శాసనములలో నల్లసాని చొక్కయ్యంగారి పుత్రులయిన పెద్దయ్యంగారు తనకు కృష్ణదేవరాయలు ఇచ్చిన కోకట సర్వమాన్యాగ్రహారములో నచ్చటి శివాలయమునకు కొంతభూమిని దానము చేసినట్లు చెప్పియున్నది.3 మఱి రాయలు పెద్దన కొసగిన ఇతర అగ్రహారము లెచ్చటయుండెనో తెలియదు. చిత్తూరు జిల్లా మేల్పాడి గ్రామమునందు సోమనాథేశ్వరుని యాలయ ప్రాకారముపై శకాబ్దము 1441 (క్రీ. శ. 1518) బహుధాన్య సంవత్సర పుష్య సప్తమి, శనివారమునాడు శూలయోగ సమయమున నందాపురి వాస్తవ్యుడైన అల్లసాని చొక్కరాజుగారి పుత్రుడును నాంధ్ర పితామహ బిరుదాంకితుడును నైన పెత్తు(ద్ది) రాజుగారు తనకు కృష్ణదేవరాయలు దత్తము చేసిన తనైపూండియను గ్రామములో ముప్పాతిక భాగమును విక్రయించి యా విక్రయ ధనముతో కుంతళ సుందరీదేవి కొక కిరీటమును, బంగారు పిడిగల చామరమును, అరివాణమును సమర్పించినట్లు వక్కాణించియున్నారు.4 ఈ తనైపూండి గ్రామము పెద్దనకు రాయ లొసగిన యగ్రహారములలో నొక్కటి యనుటకు సంశయము లేదు. కృష్ణరాయలు పెద్దన యెడ గల యభిమానాతిశయము వలన నతని కగ్రహారములనేగాక సీమాధిపత్యమునుగూడ ప్రసాదించియున్నాడు. దక్షిణ ఆర్కాటు మండలమందలి విళుప్పురము తాలూకాకు చెందిన పనమలై గ్రామమున కొండమీది వరదరాజస్వామివారి యాలయమున శకాబ్దము 1442 (క్రీ. శ. 1519) ప్రమాది వర్షమున వ్రాయించి నిల్పిన యొక శాసనములో నాంధ్ర కవితాపితామహ బిరుదాంకితులును నల్లసాని చొక్కరాజుగారి పుత్రులును నైన పెద్దిరాజుగారు తనకు గృష్ణదేవ మహారాయలవారు నాయంకరముగా ప్రసాదించిన కరవాచి సీమలోని అన్నూరు గ్రామమున వరదరాజస్వామివారి ఆలయమును నిర్మించినట్లు చెప్పియున్నారు.5 పైనుదాహరించిన శాసనాది సాక్ష్యములవలన గృష్ణరాయలకు పెద్దన్నమీద ఎంతటి యభిమాన ముండెనో తెలియగలదు.

పెద్దనతోబాటు కృష్ణరాయల ఆదరాభిమానములకు మిక్కిలియు పాత్రుడైన వాడు నంది తిమ్మన. ఇతడు తాను రచియించిన పారిజాతాపహరణ కావ్యము రాయలకే యంకిత మిచ్చియుండుట వలన నతడును పెద్దనవలె రాయల యాస్థానమందు వర్ధిల్లెనని రుజువగుచున్నది. మఱియు రాయవాచకమునందు కృష్ణరాయలు తాను యుద్ధయాత్రలకు బోవునప్పుడు గూడ పెద్దన, తిమ్మన, మాదయగారి మల్లన మొదలయిన కవులను తనవెంట దోడ్కొనిపోవు వాడనియు నతనికి గృష్ణాతీరమున తురకలతో జరిగిన తొలిసంగ్రామమున విజయము కలుగగా ముక్కు తిమ్మన్న మొదలగు కవీశ్వరుల దిక్కు మొగమై "నేటి రాజయం యేరీతు?" అని అడిగినందులకు ముక్కుతిమ్మన ఈ క్రింది పద్యమును జెప్పెననియు కలదు.

'నరసింహ కృష్ణరాయా!
దురమున నీ పేరిటేరు తురకల ద్రుంచె\న్‌
కరిరాజవరదు డనుచు\న్‌
కరిఘటలును నిన్నుజూచి గ్రక్కున దిరిగె\న్‌.' 6

పెద్దన తిమ్మనల సంగతిని జేర్పదగినవాడు అయ్యలరాజు రామభద్రుడు.

ఇతడు తాను వ్రాసిన సకల కథాసారసంగ్రహ పీఠికలో దన్నాగ్రంథమును రచియింప గృష్ణదేవరాయలు నియోగించెనని తెల్పియున్నాడు.

"ఇట్లు కీర్తివిస్తార ధురంధరుండగు కృష్ణరాయ నరపాలాఖండలుండు నన్ను బిలిచి శ్రీమత్సీతారమణ చరణ కమల పరిచరణాయమాన మానసుండవు, బహువిధ కవితాచమత్కారధుర్యుండవు, సకలపురాణేతిహాస ప్రబంధరచనాధ్యక్షుండవు, మన్మనోరథ కార్యనిర్వాహకుండ వగుటంజేసి పురాతన మహాకవి విరచిత ప్రబంధంబు లన్వేషించి భగవద్భక్తి నిష్ఠాగరిష్ఠులగు రాజశ్రేష్ఠుల వృత్తంబులు ప్రసిద్ధంబు లగునట్టుగా ప్రశస్త కథలు విన్యస్తంబుగా యెలకూచి (?) సాహిత్య లక్షణ చిత్రకవిత్వ ప్రభావం బొక్కచోటం గనుపడ రచియింపవలయునని మఱియు నిట్లనియె.
    ...    ...    ...
కావున అతిమధుర రసాయన ద్రాక్షాపాకంబుగా శృంగార రసయుక్తం బగునట్లు సకల కథాసార సంగ్రహంబు గ్రంథ విస్తారంబు గాకుండునట్లుగా రచియింపుమని యుపన్యసించి" ఇత్యాది - ఇందువలన నయ్యలరాజు రాయల యాస్థానమున నలంకరించిన కవికుంజరులలో నొక్కడని తెల్లమగుచున్నది. మఱియు, రాయలచేఁ బ్రార్థితుడై గ్రంథమును రచించినను దాని నాతని కంకిత మీయలేదు. ఇందుమూలమున రాయల యాస్థానకవులు దాము రచించిన గ్రంథములు వాలాయముగ రాయలకే యంకితము సేయవలయునను నిబంధన లేదనియు, వారు మఱి యెవ్వరికేనియు నంకితమీయ స్వేచ్ఛగలిగి యుండిరనియు దెలియుచున్నది.

2

శాసన గ్రంథాదుల సాక్ష్యమువలన కృష్ణరాయలకు సమకాలికులైనట్లు తెలియవచ్చువారు; వీరిలో మొదట బేర్కొనదగినవాడు మాదయగారి మల్లన. ఇతడును రాయల యాస్థానమందలి ప్రధానకవులలో నొక్కడని వాఙ్మయ చరిత్ర కారులు చెప్పుదురు. ఇతడు రచించిన రాజశేఖరచరిత్రను పెద్దన తిమ్మనల వలె రాయల కంకిత మీయక రాయల సర్వశిరఃప్రధానియైన సాళువ తిమ్మరసయ్యగారి యల్లుడగు నాదిండ్ల అప్పయ కంకిత మిచ్చియుండుటవలన నితడు రాయల యాస్థాన కవులలో నొక్కడై యుండజాలడని కొందఱు వాదించుచున్నారు. అయ్యలరాజు రామభద్రయ్యగారి సకల కథాసార సంగ్రహమువలన రాయల సభాస్థాన మందలి కవులు రచియించిన గ్రంథము లన్నిటిని అతనికే అంకిత మీయ వలయునను నిబంధన లేదని తేలుచున్నదిగదా! తిమ్మరసయ్య యల్లునికి నిచ్చిన కవికి రాయల యాస్థానములోనికి ప్రవేశము గలుగకపోవునా? క్రీ. శ. 1600 ప్రాంతమున వ్రాయబడిన రాయవాచకమునందు, అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మనలతో గూడ మాదయగారి మల్లనయు యుద్ధయాత్రలకు బోవువాడనియు జెప్పియున్నది.7 ఈ విషయమును క్రీ. శ. 1625 ప్రాంతమున వెలసిన కుమారధూర్జటియు వక్కాణించియున్నాడు.

"సరస సాహిత్య రచన విస్ఫురణమెనయ
సారమధురోక్తి మాదయగారిమల్ల
నార్యుఁడల యల్లసానిపెద్దార్యవరుఁడు
ముక్కుతిమ్మన మొదలైన ముఖ్యకవులు

వినుతించిరపుడు వారికి
గనకాంబర భూషణములు ఘనతనొసఁగి యా
జనవరుఁ డప్పాజి గనుం
గొని యిట్లని పలికెనపుడు కుతుకంబలరన్‌."8

కావున మాదయ్యగారి మల్లన కృష్ణదేవరాయలకు సమకాలికు డగుటచేతను క్రీ. శ. 1600 ప్రాంతమున వ్రాయబడిన రాయవాచకమందును, 1625 ప్రాంతమున వ్రాయబడిన కృష్ణరాయ విజయమందును, నతడు అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మనలతోపాటు రాయల యాస్థాన కవివర్గములోని వాడని విస్పష్టముగ జెప్పియుండుట చేతను నాతడు రాయల కవితాగోష్ఠిలోని వాడనియే తలంచుట యుక్తము.

ఇతని తరువాత పేర్కొన దగినవాడు తెనాలి రామకృష్ణకవి. ఇతని యద్వితీయ ప్రతిభ కృష్ణరాయల కీర్తికౌముదితో మేళనమంది దక్షిణభారతమం దెల్లెడలను వెలుగొందుచున్నది. రాయరామకృష్ణుల కథల నెఱుగనివారును, విని యానందింపని వారును సేతు గోదావరీ సాగరద్వయ పరివృత దక్షిణావనియందు లేరు. కాని ఇటీవలి వాఙ్మయ చరిత్రకారులును, విమర్శకులును రామకృష్ణుడు కృష్ణదేవరాయల సమకాలికుడు కాడనియు నష్టదిగ్గజ కవులలో నతడుండుట యసంభవమనియు వాదింతురు. వీరికి మార్గదర్శకుడు ఆంధ్రకవుల చరిత్రకర్తయైన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు. "రామకృష్ణకవి యప్పయ దీక్షితులతోను, తిరుమల తాతాచార్యులవారితోను సమకాలికుడయి చంద్రగిరి రాజగు వేంకటపతి రాయల ప్రభుత్వ కాలములో నుండినవాడయినట్లు కొన్ని నిదర్శనములు కనబడుచున్నవి. ఈ వేంకటపతిరాయలు వసుచరిత్రను కృతినందిన తిరుమలరాయల యనంతరము తన రాజధానిని విజయనగరమునుండి చంద్రగిరికి మార్చుకొని క్రీ. శ. 1585 మొదలుకొని 1614వ సంవత్సరము వఱకును రాజ్యముచేసినవాడు." "అందుచేత దీక్షితులవారితోడి సమకాలికుడయిన రామకృష్ణకవియు కృష్ణరాయని యాస్థానమున నుండలేడనుట నిశ్చయము." 'రామకృష్ణకవిని గూర్చి తాతాచార్యులవారితో సంబంధించిన కథ లనేకములు చెప్పుచున్నారు. ... ఈ తాతాచార్యులు రామరాజుయొక్క రాజ్యాంతదశలో దలయెత్తి ... తనశిష్యులయిన రాజుల బలముచేత బలవంతముగా జనులనుబట్టి చక్రాంకణాదులు చేయుచువచ్చెను.' కావున తాతాచార్యులవారు గాని యతనికి సమకాలికుడైన రామకృష్ణకవియు గృష్ణరాయల యాస్థానమునందుండి యుండజాలరు. మఱియు రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యమున కృతిపతియైన విరూరి వేదాద్రి మంత్రికిఁ గందాళ అప్పగారు గురువైనట్లు తన పాండురంగ మాహాత్మ్య పీఠికయందు చెప్పియున్నాడు. ఈ కందాళ అప్పగారే తనకు గురువైనట్లు క్రీ. శ. 1581 మొదలు 1611 వఱకును గోలకొండ రాజ్యమును పాలించిన ముహమ్మద్‌ కుల్లీకుత్బ్‌శాహు కాలమున గోలకొండకు గరణమై యుండిన సారంగు తమ్మయ దన వైజయంతీ విలాస పీఠికలో దెల్పియున్నాడు. కావున ముహమ్మదు కుల్లీకుత్బ్‌శాహు తమ్మకవియు, నతనికి సమకాలికుడైన రామకృష్ణకవియు, క్రీ. శ. పదునాఱవ శతాబ్దము నందును పదునేడవ శతాబ్దాదియందును నుండిరనుటకు సందేహము లేదు.9 ఆంధ్రదేశమున చరిత్ర పరిశోధన ప్రారంభము కాకముందు, అప్పటి కెఱుకవడియుండిన స్వల్పచరిత్రజ్ఞానము నూతగఁగొని వీరేశలింగంపంతులుగారు ప్రతిపాదించిన సిద్ధాంతములు ఇప్పు డంగీకార్యములు గావు. గతించిన నలువది యేండ్లలో పరిశోధకుల నిరంతర శ్రమకు ఫలితముగ మన ప్రాచీన చరిత్ర జ్ఞానము బహుళముగ విస్తరించినది. వీరేశలింగముపంతులవారి కెఱుకవడని యపూర్వ చరిత్రాంశము లెన్నియో నేడు వెలువడినవి. వాని మూలమున ముందు సమంజసములని యెన్నబడుచు వచ్చిన సిద్ధాంతము లనేకము లపసిద్ధాంతములుగ గన్పట్టుచున్నవి. మొట్టమొదట అప్పయదీక్షిత రామకృష్ణుల సమకాలికత్వమును గూర్చి విచారింతము. ఇతడు వేదాంతదేశికులవారి యాదవాభ్యుదయముపై తాను రచించిన వ్యాఖ్యానముయొక్క పీఠికయందు తానా వ్యాఖ్యానమును అరెవీటి రామరాజు, తిమ్మరాజు చినతిమ్మరాజు యొక్క నియోగమువలన వ్రాసితినని చెప్పియున్నాడు.10 క్రీ. శ. 1542-43లో అళియరామరాజు సదాశివదేవ మహారాయలను విద్యానగర సామ్రాజ్యమున కభిషిక్తుని గావించిన పిమ్మట దక్షిణ రాజ్యములలో గొంత కళవళము బుట్టగా, నాహావడినణచి రాయల యధికారమును మరల స్థిరపరచుట కొరకును, దక్షిణ రాష్ట్రములను పాలించుటకు తిమ్మరాజు చినతిమ్మరాజును నతని యనుజుడైన విఠ్ఠలరాజును రాయల ప్రతినిధులుగ నియమించి యుండెను. వారు సైన్యముతో గదలిపోయి శత్రువులను నిర్మూలించి క్రీ. శ. 1545కు ముందే దేశమును సర్వమును స్వాధీనపఱచు కొనిరి. కావున చినతిమ్మరాజు అప్పయదీక్షితుల వారిని యాదవాభ్యుదయమునకు వ్యాఖ్యానము వ్రాయ నియోగించినది క్రీ. శ. 1545 ప్రాంతమునందే అయియుండవలయును. అప్పటికే అతడు మహా పండితుడును, గ్రంథకర్తయునై యుండెనని విదితమగుచున్నదికదా! అత డప్పటికి ఇరువది యేండ్ల యువకుడని తలంచినను నతడు క్రీ. శ. 1525 ప్రాంతమున ననగా కృష్ణదేవరాయ లింకను రాజ్యపాలన సేయుచుండగనే జన్మించి యుండవలయును. రామకృష్ణుడు కనీసము 1550 ప్రాంతమువరకు జీవించియుండినట్లు నిదర్శనములు గలవు; కావున కృష్ణరాయల సభాస్థానమందుండిన రామకృష్ణకవియు నప్పయ దీక్షితులవారును సమకాలికులగుట యసంభవము గాదు.

రామకృష్ణకవియొక్క సమకాలికులలో అప్పయదీక్షితులవారికి దరువాత పేర్కొన దగినవారు తాతాచార్యులు - వీరిరువురను గూర్చిన కథలు పెక్కు ఆంధ్రదేశమున ప్రచారములో నున్నవి. వేంకటపతిరాయలకు గురువైన తిరుమల లక్ష్మీకుమార తాతాచార్యులే రామకృష్ణకవి కథలలో వచ్చు తాతాచార్యులని తలచి వా రిరువురును నా వేంకటపతిరాయల కాలమున క్రీ. శ. 1585 - 1614 వర్ధిల్లిరని వీరేశలింగముగారు సిద్ధాంతీకరించి యున్నారుగదా! తాతాచార్యులను పేరు ఒక్క వ్యక్తికే చెల్లునని వీరు భ్రమజెందినట్లున్నది. ఇది వైష్ణవ సమయాచార్యులలో కొందరికి బిరుదనామము. తాతాచార్య బిరుదాంకితులను బెక్కండ్రను పేర్కొనవచ్చును. కృష్ణరాయల కాలమునను, నాతని తమ్ముడైన యచ్యుతరాయల కాలమునను కుమార తాతాచార్యులవా రొక్కరుండినట్లు వల్లభాచార్యకవి దేవేంద్రకృతమైన యాంధ్ర లీలావతివలన దెలియవచ్చుచున్నది.11 ఈ కుమార తాతాచార్యులవారు సదరు లీలావతీ కృతిపతియు, నరసింహనందనులైన కృష్ణరాయ భూజానికిని అతని యనుజన్ముడైన యచ్యుతరాయలకును భృత్యుడైన బొమ్మలాట కాళయకు గురువు. కృష్ణదేవరాయలును, అచ్యుతదేవరాయలును శ్రీవైష్ణవమతానుయాయు లగుట జగద్విఖ్యాతమైన చరిత్రాంశము. కావున కుమార తాతాచార్యులవారు కృష్ణాచ్యుతులకు గురువగుట యసంభవము గాదు. రామకృష్ణకవి కథలలో వచ్చు తాతాచార్యులవారీ కుమార తాతాచార్యులై యుందురు కాని వేంకటపతిరాయల గురువైన కోటి కన్యాదనం తిరుమల లక్ష్మీకుమార తాతాచార్యులై యుండజాలరు.

ఇక కందాళ అప్పలాచార్యులవారిని గూర్చి విచారింతము. విరూరి వేదాద్రిని బోలి కందాళ అప్పలాచార్యులు దమకు గురువని చెప్పుకొన్నవా రందఱును ఏకకాలమువారని వాదించుట సరిగాదు. ఏలనగా అప్పలాచార్య నామధేయము గల కందాళ వంశజులు పెక్కురు భిన్నకాలమున వర్ధిలినట్లు శాసనములవల్ల దెలియ వచ్చుచున్నది. శా. శ. 1416 ఆనందనామ సంవత్సరమునకు సరియైన క్రీ. శ. 1494వ సంవత్సరమున తిరుమల దేవాలయంస్థానంవారు పంకయచ్చెల్లి తిరునందన వనమునకు నధికారియగు కేట్వి రామానుజ జియ్యరువారిపేర జెక్కించిన శాసనమున సదరు జియ్యరుగారి ఆచార్యులవారు కందాడై అప్పన్‌గారు పేర్కొన బడియున్నారు.12 శా. శ. 1438 ధాతుసంవత్సరమునకు సరియైన క్రీ. శ. 1516వ సంవత్సరమున తిరుమలస్థానమువారు తిరువేంకటనాథుని పూలతోట కధికారియైన కేట్వి వేంకటనాథ జీయరుపేర గోవిందరాజస్వామి గుడియందు జెక్కించిన శిలాశాసనమున నొక కందాడై అప్పన్‌ పేర్కొనబడియున్నాడు.13 ఇంతకంటె ముఖ్యమైన శాసనము మఱియొకటి తిరుమలదేవస్థానం మూడవ ప్రాకారం పడమటి ప్రక్కగోడమీద చెక్కబడియున్నది. ఇది శా. శ. 1461 వికారినామ సంవత్సరమునకు సరియైన క్రీ. శ. 1539వ సం. న అప్పాగారి శిష్యుడును మలైకుని యని నాఱన్‌ పూదోటపై నధికారియునగు తిరువెంకటయ్య పేర దిరుమల దేవస్థాన ధర్మకర్తలచేత తిరుమల దేవాలయపు మూడవ ప్రాకారపు పడుమటి గోడమీద చెక్కబడినది. ఇందు "మీ యాచార్యులైన కందాడై అప్పాఅయ్యగారిజన్మనక్షత్రమగు అవణిమాస మందలి భరణి నక్షత్రమున ... నివేదన సేయుటకును" అను వాక్య మీ పట్టున గమనింప దగినది.14 ఇదిగాక గోవిందరాజస్వామి యాలయములోని శా. శ. 1466 క్రోధినామ సంవత్సరమునకు సరియైన క్రీ. శ. 1544 వ సం. నాటి యొక శాసనమున ప్రసాదగ్రహీతలలో కందాడై అప్పయ్యంగా రొక్కరైనట్లు చెప్పియున్నది.15 ఇందువలన క్రీ. శ. 1494వ సంవత్సరములలో నొక కందాళ అప్పగారును, 1516లో నొక కందాళ అప్పగారును, 1539, 1544లో కందాడై అప్పగారును ఉండినట్లు తెలియవచ్చుచున్నది. క్రీ. శ. 1539-44లలో వర్ధిలిన కందాళ లేక కందాడై అప్పగారే శ్రీసాధు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు చెప్పినట్లు మంగయ గురువరాజు పెదసంగరాజు మంత్రియైన విరూరి వేదాద్రి మంత్రియొక్క గురువు కావచ్చును. ఏలనగా మంగయ గురువరాజును పెదసంగరాజు మొదలయిన యతని పుత్రులును అప్పటివారే. కడపజిల్లా అనిమెలగ్రామమున శా. శ. 1465 శోభకృతు సంవత్సరమునకు సరియైన క్రీ. శ. 1543వ సంవత్సరమున మంగయ గురువరాజును అతని పుత్రులయిన పెదసంగరాజు, పినసింగరాజు, తిమ్మరాజు, రుద్రరాజు, బసవరాజు, పెదచిటిరాజు, చినచిటిరాజు, బొజ్జ సంగరాజు, పాపసంగరాజు మున్నగువారు అనిమెల సంగమేశ్వరునికి కొన్ని గ్రామములు దానముచేసి, యచట నొక శాసనమును నిల్పియున్నారు.16 ఇందువలన క్రీ. శ. 1543 నాటికే మంగయ గురువరాజుకు పెద సంగరాజు మొదలయిన తొమ్మండ్రు పుత్రులు గల్గియుండిరని తెల్లమగుచున్నది. వారిలో ఒక్కొక పుత్రునికి రెండేసి సంవత్సరముల యెడముండియుండునని తలచిన, జ్యేష్ఠుడైన పెదసంగరా జప్పటికి కనీసము పదునేడు, పదునెనిమిది యేండ్ల ప్రాయమువాడై యుండవలయును. ఇది యసంగతము గాదు. ఏలనగా, మంగయ గురువరాజుయొక్క ద్వితీయ పుత్రుడైన పినసింగరాజు అప్పటికే పెద్దవాడై నిర్వాహకుడై స్వయముగ పొత్తపినాటిలో రాజ్యము సేయుచుండెను. కడపజిల్లా రాజంపేట తాలూకా పొత్తపి గ్రామములోని గోపాలస్వామి యాలయమున కెదుట నున్న శిలాశాసనమున శా. శ. 1468 పరాభవ సంవత్సర (క్రీ. శ. 1549) ఆషాఢ బ. ౧ నాడు పొత్తపిగ్రామమును శ్రీమన్మహామండలేశ్వర గురువరాజు చినసంగదేవ మహారాజులగారికి పాలించివుండగా సదాశివరాయలవారి ఆనతిని, రాయలవారి ఆజ్ఞాపాలనము చేస్తూవున్నటువంటి రామరాజయ్యగారి ముదలను పొత్తపి మంగలవారు అచ్చెప్పన్న నగరికానికె కట్నం అన్ని సర్వమాన్య చేసి యిచ్చినారు.17 మంగయ గురవరాజు పెదసంగరాజుయొక్క మేనల్లుడగు కొండ్రాజు తిమ్మయరాజునకు గురువైన వాధూల గోత్రజుడును, యజుశ్శాఖాధ్యాయియు నాపస్తంబసూత్రుడైన కందాడై యప్పణన్‌గారి గురువైన యప్పగారును, విరూరి వేదాద్రి మంత్రియొక్క గురువైన అప్పళాచార్యులును ఒక్కరే కావలయును. ఈ కొండ్రాజు తిమ్మరాజు శా. శ. 1468 పరాభవనామ సంవత్సరమునకు సరియైన క్రీ. శ. 1546వ సంవత్సరములో నితనికి చెన్నూరు సీమలోని తూగుట్లపల్లె యను గ్రామమును దానము జేసెను.18 మీద నుదాహరించిన శాసనము వలన పాండురంగమహాత్మ్య కృతిపతి యగు వేదాద్రిమంత్రియు నతని గురువైన కందాళ యప్పళాచార్యులును క్రీ. శ. 1540-1550ల మధ్య నుండిరని తెల్లమగుచున్నది. తెనాలి రామకృష్ణకవియు నప్పటివాడే కావలయును. కృష్ణదేవరాయల మరణానంతరము పది పదునాలుగేండ్ల లోపల పాండురంగ మాహాత్మ్యమువంటి యుత్కృష్ట మహాకావ్యమును రచించిన రామకృష్ణకవి కృష్ణదేవరాయలకు సమకాలికుడై యతని సభాస్థాన కవి వర్గములలో నొక్కడై యుండుట అసంభవము కాదుగదా.

ఈ సందర్భమున పరామర్శింపదగిన విషయము మఱియొక్కటి కలదు. మొట్టమొదట తెనాలి రామకృష్ణుడు శైవుడనియు, నప్పు డతని పేరు రామలింగమనియు, వైష్ణవము స్వీకరించిన పిమ్మట అతడు పేరును రామకృష్ణుడని మార్చుకొనెననియు నొక యైతిహ్యము చిరకాలము నుండియు లోకమున వాడుక యందున్నది. రామకృష్ణునే రామలింగమని యర్వాచీనులగు కవులును లక్షణ గ్రంథకర్తలును బేర్కొనియున్నారు. అప్పకవి "మన తెనాలి రామలింగయ్య" దని

"చిన్నన్న ద్విపద కెఱుగునుఁ
బన్నుగఁ బెదతిరుమలయ్య పదమున కెఱుగు\న్‌
మిన్నంది మెరసె సరసిం
గన్న కవిత్వంబు పద్య గద్య శ్రేణి\న్‌."19

అను చాటువు నుదాహరించియున్నారు. మఱియు తెనాలి రామలింగ కవి విరచితములైన 'కందర్పకేతు విలాసము', 'హరిలీలా విలాసము' అను గ్రంథములలోనివని కొన్ని పద్యములు పెదపాటి జగన్నాథ కవి సంకలనము చేసిన ప్రబంధ రత్నాకరమున నుదహరించియున్నాడు.20 కాని యీ గ్రంథములు నేడు లభింపవు. సుప్రసిద్ధ వాఙ్మయ విమర్శకులైన బ్ర. శ్రీ. వేటూరి ప్రభాకరశాస్త్రులవారు తెనాలి రామలింగకవి విరచితమైన ఉద్భటారాధ్యమను ప్రబంధమును సంపాదించి శ్రీ ముక్త్యాల జమీందారుగారి సరస్వతీపత్రికయందు 1925లో ప్రకటించిరి. దీనికి వారు వ్రాసిన విపులమైన పీఠికలో దద్రచయితయైన రామలింగకవియే పాండురంగ మాహాత్మ్య, ఘటికాచల మాహాత్మ్య కర్తయైన రామకృష్ణ కవియని నిరూపించియున్నారు. రామలింగకవి శైవమును విసర్జించి వైష్ణవమును బుచ్చుకొన్న తరువాత యా మార్పున కనుగుణముగ దన పేరును రామకృష్ణకవియని మార్చుకొనెననియు జెప్పి యున్నారు. తమ సిద్ధాంతమును స్థిరముగ స్థాపించుట కొరకు ప్రభాకరశాస్త్రులవా రుదహరించిన సాక్ష్యమును, జూపిన యుపపత్తులను వారి యుద్భటారాధ్య చరిత్ర పీఠికయందు గాననగును. గ్రంథ విస్తరభీతిచే వాని నిచ్చట మరల వివరింప దలపెట్టలేదు.

మీద వక్కాణించినట్లు రామలింగ కవియే రామకృష్ణుడైన పక్షమున నతడు కృష్ణదేవరాయలకు సమకాలికుడని యుద్భటారాధ్య సాక్ష్యమువలన రుజువగు చున్నది. ఉద్భటారాధ్య చరిత్రము ఊరదేచ మంత్రి కంకితము సేయబడినది. ఇతడు కృష్ణదేవరాయల పక్షమున కొండవీటికి దుర్గాధ్యక్షుడై యుండిన నాదెండ్ల గోపమంత్రి కమాత్యుడు. గోపమంత్రి సాళువ తిమ్మరసయ్యగారి మేనల్లుడు. మాదయగారి మల్లనచే విరచితమైన రాజశేఖర చరిత్ర ప్రబంధ కృతిపతియైన నాదెండ్ల అప్పమంత్రియొక్క తమ్ముడు; కావున నతని యమాత్యుడైన యూరెదేచయయు నతని కుద్భటారాధ్య చరిత్ర నంకిత మొనర్చిన తెనాలి రామలింగ కవియు నప్పటి వారేయని నిస్సంశయముగ బలుకవచ్చును గదా! రామలింగడు రాయల యాస్థానమును జేరి రామకృష్ణుడై యతని మన్ననను బొంది యష్టదిగ్గజములలోఁ బ్రముఖుడై వర్ధిలెనని యవిచ్ఛిన్నముగ తరములబడి వచ్చు గాథ విశ్వాసపాత్ర మేల కారాదు? అసంగత మేమియు లేదుకదా!

ధూర్జటి

ధూర్జటి కృష్ణరాయల సమకాలికుడని కాని యతని యాస్థానమందలి యష్టదిగ్గజ కవీశ్వరులలో నొక్కడని కాని నిరూపించుటకు దగిన సమకాలిక సాక్ష్యమేదియు గానరాదు; అతడు వ్రాసిన కాళహస్తి మాహాత్మ్య, కాళహస్తీశ్వర శతకములలో కృష్ణరాయల ప్రస్తావనగాని, పై గ్రంథముల రచనా కాలమును దెల్పు సూచనలుగాని లేవు. అందువల్ల నితడు రాయల యాస్థానమున లేడని యెంచరాదు. క్రీ. శ. 17వ శతాబ్ద ప్రారంభదశయందు వెలసిన కుమార ధూర్జటి స్వవిరచిత కృష్ణరాయవిజయ పీఠికలో గాళహస్తి మాహాత్మ్యాది గ్రంథకర్తయగు ధూర్జటి తనకు పెదతాత యనియు, నతడు తన కవిత్వ మహత్త్వముచే గృష్ణరాయలను మెప్పించెననియు జెప్పియున్నాడు.

"స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెనో
యతులిత మాధురీ మహిమ నా మును మీ పెదతాత చాల స
న్నుతి గనె కృష్ణరాయల మనోజ్ఞసభ\న్‌ విను మీవు నట్లు మ
త్కృత బహుమాన వైఖరుల గీర్తివహింపుము ధాత్రిలోపల\న్‌."

అని తన్ను గూర్చి యార్వీటి చినవెంకటాద్రి చెప్పి కృష్ణరాయవిజయమును వ్రాయ దన్ను బురికొల్పెనని వక్కాణించియున్నాడు. ఈ పద్యముయొక్క పూర్వార్థ మాంధ్రలోకమునకు చిరకాలమునుండి పరిచయమే. ధూర్జటి కవితామహిమకు మెచ్చి కృష్ణదేవరాయలు ప్రతిదినము సభలో నీపద్య భాగమును సమస్యగా నిచ్చెడి వాడనియు, నొకనాడు తెనాలి రామకృష్ణకవి యీ సమస్యను విన్నంతటనే లేచి:

"... ... హా తెలిసె\న్‌ భువనైకమోహ నో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సం
తత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటంజుమీ"

యని పూరించెననియు జెప్పుదురు. ధూర్జటిశీలమును గాపాడ కంకణము గట్టుకొని యుండు నాధునిక వాఙ్మయ చరిత్రకారులు సాహిత్య విమర్శకులును పై పద్యమందలి పూర్వార్థము సత్యమని గ్రహించి, యుత్తరార్థ మసత్యమని త్యజించు చున్నారు. ఇది యెట్లైనను కృష్ణరాయ విజయము నుండి మీద నుదాహరించిన పద్యము నాధారము జేసికొని ధూర్జటికవి కృష్ణరాయల యాస్థానమున నుండెనని యెంచవచ్చును.

3

ఇక నష్టదిగ్గజములని పేర్కొనబడిన కవులలో రామరాజభూషణుడును, పింగళి సూరనయు మిగిలియున్నారు. వీరు రాయలసభలోనుండిరని నిరూపించుటకు దగిన సాక్ష్యమేమియు లేదు. చిరకాలమునుండియు వీరుగూడ అష్టదిగ్గజకవికోటిలో జేరినవారని తెల్పు గాథలు ప్రచారములో నున్నవి. ఇందెంత సత్యము గలదో నిర్ధారించుటకు సాధ్యముగాదు. రామరాజభూషణుడనునది యాకవియొక్క పేరు గాదు. విజయనగర సంస్థానము నాశ్రయించుకొని యుండిన భట్టుకులజులైన కవులు కొందఱు తమపై యాదరాభిమానములను జూపి గౌరవించిన ప్రభువులకు దాము భూషణప్రాయులమని ప్రకటించుట కొరకు గృష్ణరాయభూషణ వేంకటరాయణభూషణేత్యాది నామములు ధరియించెడివారు. రామరాజ భూషణుడుగూడ ఈ తరగతికి జెందినవాడే. ఇతడు తాను విరచించిన వసుచరిత్రను జీర్ణ కర్ణాటక సామ్రాజ్యమును సముద్ధరించి క్రీ. శ. 1570-71లో పట్టాభిషిక్తుడైన అరెవీటి తిరుమలరాజు కంకిత మొసగినను, అభ్యుదయమంది పేరు ప్రఖ్యాతులను గడించిన దంతయు దిరుమలరాజున కన్నయైన అళియరామభూవరుని యాస్థానమునందే. ఈ యంశము నతడు దన హరిశ్చంద్ర నలోపాఖ్యాన పీఠికలో నిట్లు వివరించి యున్నాడు -

'సకల కర్ణాట రక్షాధురంధర రామ విభుదత్త శుభచిహ్నవిభవయుతుఁడ' ఆ రామవిభుదత్త శుభచిహ్నమే 'రామరాజభూషణ' బిరుదము. ఇతని వాస్తవమైన పేరు భట్టుమూర్తి యనియు, నరసభూపాలీయమను నామాంతరముగల కావ్యాలంకార సంగ్రహమున నుడివెను; అప్పటి కతడు 90 యేళ్ళ ముదుసలియట - అతడు క్రీ. శ. 1543 మొదలు తరువాత ఇరువదియొక్క సంవత్సరములు సదాశివదేవ మహారాయలపేర ఆసేతుగౌతమీ పర్యంతముగల దక్షిణ భారతావనిని నిర్వక్రపరాక్రమముతో పాలించెను. రామరాజభూషణుడు అళియ రామరాజు అధికారమునకు వచ్చునప్పటికె కవియని ఖ్యాతిని గడించిన సూచనలు గలవు. ఒకవేళ నతడు యౌవనదశయందు కృష్ణరాయల యాస్థానముననుండి యుండవచ్చును. ఇది యసంభవము గాదు. కృష్ణదేవరాయలను గూర్చియు, సాళువ తిమ్మరసు మంత్రి గూర్చియు, రామరాజభూషణుడు చెప్పినవనబడు చాటువులు కొన్ని నేడును లోకమున వాడుకలో నున్నవి. మరియు మండ లక్ష్మీనరసింహాచార్య విరచితమైన యర్వాచీన లక్షణగ్రంథమున భట్టుమూర్తి యనగా రామరాజభూషణు డల్లసాని పెద్దనార్య శిష్యుడని చెప్పియున్నది.21 ఈ యైతిహ్యము వాస్తవమైనచో రామరాజభూషణుడు దన కవిత్వ ప్రారంభదశను గృష్ణదేవరాయల సభాస్థానమున గడపెనని యెంచవచ్చును.

రామరాజభూషణునివలె పింగళి సూరనార్యుడు సయితము కృష్ణరాయల కవితాగోష్ఠికి జెందిన వాడని విద్వాంసు లనేకు లభిప్రాయ పడుచున్నారు. కాని వీరేశలింగం పంతులవారు సూరనార్యుడు కృష్ణరాయల కాలమువాడు గాడనియు దరువాతి వాడనియు నిర్ధారించియున్నారు. "అర్వీటి బుక్కరాజు ముమ్మనుమడైన యళియ రామరాజే 1564వ సంవత్సరమువరకును నుండినప్పుడు బుక్కరాజు ముమ్మనుమని మనుమడయి కళాపూర్ణోదయ కృతిపతియైన నంద్యాల కృష్ణమరా జంతకు పూర్వమునం దుండెననుట పొసగనేర నందున వారిమాట విశ్వాసార్హమైనది కాదు. ఇతడు 1560వ సంవత్సరమునకు లోపల నుండెననుట తటస్థింపదు."22 వీరేశలింగం పంతులవారి యభిప్రాయము చాలమట్టుకు సమంజసముగానే కన్పట్టుచున్నది. కళాపూర్ణోదయ కృతిపతి చరిత్ర రంగమున పొడచూపినది క్రీ. శ. 1585 ప్రాంతమున. నంద్యాలవారు సదాశివదేవ మహారాయల కాలమున కడపమండలములోని గండికోట దుర్గమున కధిపతులై యుండిరి. రక్షసితంగడి యుద్ధానంతరము రాయల కలిమి బలములు సన్నగిలగా నంద్యాలవారును తక్కిన అమరనాయకులవలె స్వతంత్రులగుటకు బ్రయత్నము జేసిరి. క్రీ. శ. 1571 మొదలు 1564 వరకు సామ్రాజ్య పాలన మొనర్చిన మొదటి శ్రీరంగనాయలకాలము అమరనాయకులకు ఆమనిప్రాయమాయెను. ఎక్కడి యమరనాయకు లక్కడ స్వతంత్రులవలె వ్యవహరింప గడగిరి. నంద్యాల కృష్ణమరాజు తండ్రియైన నరసింహరాజు 1580 ప్రాంతము వఱకును గండికోట దుర్గాధ్యక్ష పదవి యందుండి మృతిచెందెను. అతని మరణానంతరము కృష్ణమరాజు దుర్గాధ్యక్ష పీఠము నధిష్ఠించి తత్ప్రాంతములం దమరమాగాణల ననుభవించుచుండిన కొండ్రాజువారు మున్నగు తెలుగుచోళ వంశీకులతో సఖ్యము జేసికొని నిజస్వాతంత్ర్య ప్రతిష్ఠకొఱకు ఘనమైన ప్రయత్నములు సేయగడగెను. క్రీ. శ. 1584లో మొదటి శ్రీరంగనాయల మరణమును, గుతపనమలక దండయాత్రయు, స్వార్థ పరులైన యమరనాయకుల స్వామి ద్రోహమును అతని యుద్యమమునకు దోహద ప్రాయములాయెను; కావున నితడు క్రీ. శ. 1584లో శ్రీరంగరాయల తమ్ముడైన ఇమ్మడి వీరవేంకటపతిదేవరాయలు రాయలసింహాసనము నధిష్ఠింపగనే కృష్ణమరా జతని యాధిపత్యము నంగీకరింపక తిరుగుబాటు చేసి తన స్వాతంత్ర్యమును బ్రకటించెను. కాని యాతడు కృతార్థుడు గాజాలడాయెను. వీరవేంకటపతిదేవరాయలు సేనల సమకూర్చుకొని కుతపనమలకను దేశమునుండి పారద్రోలి తరువాత క్రీ. శ. 1599-1600లో జంబులమడక సంగ్రామమున నంద్యాల కృష్ణమరాజును పరాభూతునిజేసి జీవగ్రాహముగ గొనిపోయి చంద్రగిరి దుర్గములో చెఱయం దుంచెను. మఱి కొంతకాలమున కతడు చంద్రగిరిలో చెఱయందే స్వర్గస్థుడాయెను.23 ఇందువల్ల కళాపూర్ణోదయ కృతిపతియైన నంద్యాల కృష్ణమరాజు క్రీ. శ. 1580 ప్రాంతము నుండి 1599 వఱకు దాదాపు పందొమ్మిదేండ్ల కాలము ప్రభుత్వము సల్పినట్లు తెలియుచున్నది. కళాపూర్ణోదయము నంకితము గొనినప్పుడు కృష్ణమరాజు రాజ్యము సేయుచుండినట్లు చెప్పియుండుటచేత నా గ్రంథ రచనయు, గృతిసమర్పణయు నీ మధ్యకాలముననే జరిగియుండవలయును. ఇట్లు వీరేశలింగము పంతులువారు అభిప్రాయ పడినట్లు కళాపూర్ణోదయము క్రీ. శ. 16వ శతాబ్దమున రచింపబడినను తద్రచనాకాల మప్పటికి పింగళి సూరనార్యుడు అపరవయస్కుడై యుండవలయును. ఏలనగా గళాపూర్ణోదయముకంటె ముందరి రచనయైన రాఘవపాండవీయము క్రీ. శ. 16వ శతాబ్ద మధ్యమున వ్రాయబడెనని తెలుపు సూచన లందు కొన్ని కలవు. అప్పటి కింకను గర్ణాట సామ్రాజ్యమునకు రాజధానియైన విజయనగర ముచ్చస్థితియం దుండెను. క్రీ. శ. 1564లో జరిగిన రక్కసితంగడి యుద్ధానంతరము విజయనగరము దురకలచే నాశము సేయబడి క్రమక్రమముగా పాడుపడిపోయెనని యంద రెఱిగిన విషయమే కావున రాఘవ పాండవీయము 1564నకు ముందరి రచన యని నిశ్చయింపవచ్చును. "రాఘవ పాండవీయము నీకవి 1550వ సంవత్సరముల ప్రాంతములయందు మంచి పడుచుతనములో రచించియుండును."24 అను వీరేశలింగం పంతులుగారి యభిప్రాయముతో మన మేకీభవింపవచ్చును. రాఘవ పాండవీయము సూరనార్యుని తొల్లిటి రచనకాదు. అతని మొదటి రచన గరుడపురాణము. గరుడపురాణ మితని బాల్యరచన యని వీరేశలింగం పంతులుగారి యభిప్రాయము - రాఘవ పాండవీయమును వ్రాయు నప్పటి కితని వయస్సు ముప్పది యేండ్లుండునని యూహించితిమేని 1520వ సంవత్సర ప్రాంతమున నితడు జన్మించి యుండునని మన మనుకొనవచ్చును. అగునేని కృష్ణరాయల యవతార సమాప్తి యగునప్పటి కితడు కడు తరుణ వయస్కుడై యుండును. అప్పటి కితడు విద్యాభ్యాసమును సయితము పూర్తిచేసి యుండజాలడు. కావున నితడు రాయల సభాస్థానమందలి యష్టదిగ్గజ కవులలో నొక్కడగుట యసంభవము. ముగ్గురు - అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రయ్య - రాయల సభలోనివారని వారు రచించిన గ్రంథముల వలన విదితమగుచున్నది. మొదటి ఇద్దరును తాము రచించిన ప్రబంధముల నంకిత మొసగిరి. మూడవయాతడు రాయల ప్రోత్సాహముచే గ్రంథరచనము గావించెను. మఱి ఇద్దఱు - మాదయగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు - రాయల సమకాలికులని వారి స్వకీయమగు రచనలవల్లను, శాసనముల సాక్ష్యము వల్లను తేలుచున్నది. ధూర్జటియు నీ తరగతివాడే. సమకాలిక సాక్ష్యము లేకున్నను యర్వాచీన గ్రంథసాక్ష్య మతడు రాయల కవితాగోష్ఠిలోనివాడని పలుకుచున్నది. రామరాజ భూషణుడు రాయల మరణానంతరము పదునాల్గు పదియైదేండ్ల లోపల మహాకవియని ప్రసిద్ధికెక్కి రామరాజు నాదరాభిమానములకు బాత్రుడాయెను. అతని వాస్తవమైన నామము భట్టుమూర్తి యగునేని యతడును కృష్ణరాయల సభయందు వెలసెనని యతనిచే విరచింపబడిన చాటువులవలనఁ దెలియుచున్నది.

ఇంతవరకు ఆర్కియాలాజికల్‌ డిపార్టుమెంటువారిచే బ్రకటింపబడిన, 1937-38వ సంవత్సరపు దక్షిణ భారత శాసన శాఖా నివేదికలో నష్టదిగ్గజములని పేర్కొనబడిన యెనమండ్రు కవులు వర్ధిల్లిన కాలమును వారికి రాయల సభతోగల సంబంధమును పరిశీలించితిమి. వారిలో నిద్దఱు అల్లసాని పెద్దన, నంది తిమ్మనలు రాయల సభాస్థానమునందుండుటయేకాక స్వవిరచిత ప్రబంధముల నాతని కంకిత మిచ్చిరి. ఒక్కడు అయ్యలరాజు రామభద్రయ్య రాయల నియోగమున గ్రంథరచన సాగించెను. వీరు మువ్వురును రాయల యాస్థాన కవులని నిస్సంశయముగ బలుకవచ్చును. మఱి ఇద్దఱు - మాదయగారి మల్లనయు, దెనాలి రామకృష్ణుడును గృష్ణరాయల సమకాలికులని తేలినది. అనాదినుండియు నవిచ్ఛిన్నమై పరంపరగ వచ్చు నైతిహ్యము పై ముగ్గురివలె వీరును రాయల యాస్థాన కవులని చాటువులుండుట వలన నది సత్యమని యంగీకరింపనగును. సమకాలిక శాసన గ్రంథాది సాక్ష్యము లేకపోయినను అర్వాచీన గ్రంథ సాక్ష్యము ధూర్జటియు బైవారివలె రాయల విద్వద్గోష్ఠిలోని వాడేయని తెల్పుచుండుటవలన నదియు నంగీకార్యమే కాదగును. తక్కిన ఇద్దరిలో రామరాజ భూషణుడు కృష్ణరాయల మరణానంతరము పది పదునాల్గేండ్ల లోపల మహాకవియని వాసికెక్కి యుండుటచేతను, భట్టుమూర్తియే యతడను ప్రథ యనాది సిద్ధమగుటచేతను, మూర్తి కృతచాటువులు కృష్ణరాయ తిమ్మరస ప్రశంసాత్మకములు, లోకమున వాడుకలో నుండుతచేతను నష్టదిగ్గజములలోని వారు కావచ్చును. ఇప్పటి కుపలబ్ధమైన సాక్ష్యమును బట్టిచూడ పింగళి సూరనార్యుడు మాత్రము కృష్ణరాయల కాలమువాడు కాడని తోచుచున్నది. కృష్ణరాయల కడపటి యేండ్లలో నతడు జనన మందియుండవచ్చును. విద్యాభ్యాసము సేయగడగెనో లేదో, తత్కారణమున నతనిని రాయల యాస్థాన కవులలో జేర్చుట వలనుపడదు. అతడష్టదిగ్గజ కవులలో నొక్కడు కాజాలడు.

అష్టదిగ్గజ కవులలో బింగళి సూరనార్యు డొక్కడు కానియెడల వారిలో నెనిమిదవ వాడెవ్వడు అను విషయము విచారింప గదియున్నది. కంసాలి రుద్రయ యని కొందఱు చెప్పుదురు. అగునేమో చూతము. రుద్రకవి సంతతివారి కడనుంచి బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులవారు సంతరించిన యాతని చరిత్రయం దిట్లున్నది.

రుద్రకవి కృష్ణరాయల నాటివాడు. రాయల యాస్థానమున కీయనను దత్రత్యులు మంత్రులు రానీయరైరి. రాయల సన్నిహిత భృత్యుడగు మంగల కొండోజు యనువాని తోడ్పాటున రాయల సందర్శనము పొసగగా రుద్రకవి యీ క్రింది పద్యము చెప్పినాడు.

"ఎంగిలిముచ్చు గులాముల
సంగతిగాఁ గులముచెఱుపఁ జనుదెంచిరయా
యింగిత మెఱిఁగిన ఘనుఁ డీ
మంగల కొండోజు మేలు మంత్రుల కన్న\న్‌"

అటుమీద రాయలవారి గురువైన తాతాచార్యులగారితో నితనికి వాదము గలిగెను. అందితనికి విజయము చేకూఱగా రాయలవా రితని అష్టదిగ్గజ కవులలో నీశాన్య సింహాసనారూఢుని గావించెను. 'రుద్రకవి రాయల యాస్థానమున బండ్రెండేండ్లు వసియించెను. సప్తకవులనబరగు పెద్దన, తిమ్మన, పుత్తేటి రామభద్రకవి, పింగళి సూరన, కవిరాట్టు, తెనాలి రామలింగయ, భట్టుమూర్తి అనువారితో దాతయాచార్యులతో వాగ్వాదములను సలిపెను.' శకాబ్దములు 1480 జయ సంవత్సర మాఘ శుద్ధ పంచమీ జయవాసరమున మల్కిబ్రహీమ్‌ ప్రభువు రుద్రకవికి రెంటచింతల (చింతల పాలెము) గ్రామము నొసగినాడు. పై గ్రామము నేటికిని రుద్రకవి వంశ్యులకే చెల్లుచున్నది. రుద్రకవి ప్రశంసాత్మకమగు నీ క్రింది పద్యమున రాయలవారి యాస్థానమున రుద్రకవి యెట్లు గౌరవింపబడెనో విరచించియున్నది.

'హరియౌ స్కందపురీ జనార్దను వరంబందె\న్‌ మహాసత్కవీ
శ్వరులౌ రాయలవారి సన్నిధిని హర్షంబందె బట్టంబు గ
ట్టిరి యాందోళికలు\న్‌ జవోగ్రతరఘోటీ లగ్రహారంబు లం
దఱు చూడ\న్‌ బహుమానమందెఁ గని రుద్రాఖ్యుండు తా ముఖ్యుఁడై.'

రుద్రకవి కృతమనఁబరగు నీ క్రింది సీసమునందు గూడ పై విషయమే వర్ణింపబడినది.

"పాటీరగంధహృద్ఘోటీ సమంచితధాటీ తిరస్కారి ఘోటకములు
కోటీందువరకళా పోటీడ్జదంభోళి దంభోళిసిత శంఖవ్రజంబు (?)
చేటీవిటాళీక వాటీ ఘనారామ వాటీ శుభగ్రామవారములును
... ... ... ... ... పృథులసత్కుండలములు
ప్రౌఢిఁగైకొంటి గీర్వాణ పదసమృద్ధి శతకహనుమజ్జయాది ప్రశస్త కావ్య
ప్రీతి శ్రీకృష్ణరాయ ధాత్రీశువలన మనుకులుండను రుద్రాఖ్య ఘనసుకవిని." 25

రుద్రకవి యష్టదిగ్గజ కవులలో నొక్కడగుట నిక్కమేని యతడు కృష్ణరాయల కాలమువాడని నిస్సంశయముగ జెప్పవచ్చును. ఏలనగా నొక్క కృష్ణరాయ ధరణీపతి దక్క మఱి యేరాజును అష్టదిగ్గజనామ కవిసంస్థను సమకూర్చి పోషించినట్లు విని యెఱుంగము. పై నుదాహరించిన 'పాటీరగంధ' యను సీసపద్యము వాస్తవముగ రుద్రకవి కృతమేని, యతడు కృష్ణరాయల కవితాగోష్ఠికి చెందినవాడని యదియే చాటుచున్నది. రుద్రకవి సంతతివారి కడనుండి సేకరింపబడిన వృత్తాంతమున పెక్కండ్రు వ్యక్తులు పేర్కొనబడియున్నారు. అందఱు చారిత్రక వ్యక్తులా? అగుదురేని కృష్ణరాయల యష్టదిగ్గజములలోని వాడనబడు కందుకూరు రుద్రకవికి సమకాలికులు కాగలుగుదురా అన నివి పరిశీలించి తేల్చుకొనవలసిన యంశములు. అందఱును చారిత్రక పురుషులే. తాతాచార్యులు, పెద్దన, తిమ్మన, పుత్తేటి (అయ్యలరాజు) రామభద్రయ్య, తెనాలి రామలింగయ, భట్టుమూర్తియు గృష్ణరాయల యాస్థానము నందుండినవారే. వీరి పరిచయము నింతకుముందే జేసికొనియున్నాము. కవిరాట్టనునది వట్టి బిరుదనామము - కృష్ణరాయల సమకాలికులలో నీ బిరుదెవ్వరికి గలిగి యుండెనో నిశ్చయించి చెప్పుటకు వీలులేదు. కవి సార్వభౌమ బిరుదు డిండిమ కవులకు గలదు. ఒకవేళ యీ కవిరాట్టు అచ్యుతరాయాభ్యుదయ కృతికర్తయైన రాజనాథ డిండిముడు కావచ్చునేమో - పింగళి సూరనార్యుడు కృష్ణరాయల యుగమువాడు కాకపోయినప్పటికిని, రుద్రకవికి సమకాలికుడై యతనితో వాదము సల్పియుండుట కవకాశము లేకపోలేదు. 'చేరి కన్నడభూమి చెఱపట్టు పాశ్చాత్య నృపతికైన నొకింత కృప తలిర్చు' అను నిరంకుశోపాఖ్యాన మందలి సీసపాదము నాధారపరచుకొని యా "గ్రంథము విద్యానగర వినాశానంతరము రచింపబడినది కాదగును" అని విమర్శకు లభిప్రాయ పడియున్నారు.26 అనగా నిరంకుశోపాఖ్యానము క్రీ. శ. 1564-65 ప్రాంతమున వ్రాయబడెనని వారి భావము. మీద సూచించినట్లు పింగళి సూరనార్యుడు 1550వ సంవత్సర మప్పటికే గరుడపురాణ, రాఘవ పాండవీయాదులను రచించి ప్రఖ్యాతుడై యుండుట రుద్రకవి యాతనితో వాదమును సల్పుట సుసంగతమే. రుద్రకవికి కృష్ణరాయలయొక్క దర్శన మిప్పించిన మంగల కొండోజును చారిత్రక పురుషుడే. అతడు పట్టపుమంగలి - యనగా రాయపీఠ మెక్కిన ప్రభువులకు క్షురకర్మ యొనర్చు నాపితుడు. తెనాలి రామకృష్ణుడు నల్లకుక్కను దెల్లకుక్కనుగ మార్చబూనిన కథ కొండోజు పై యభిమానము జూపినందులకు రాయలను గేలిసేయుట కొఱకు రచింపబడినదే. కొండోజు క్రీ. శ. 1544-50ల మధ్య సదాశివదేవమహారాయల యాజ్ఞవలన సేయబడిన పెక్కు దానశాసనములందు పేర్కొనబడియున్నాడు. అతడొక యసాధారణ వ్యక్తి. రాయలను పనిచేసి అనగా క్షౌరకార్యమున నేర్పు చూపి, మెప్పించెనట. అందువలన రాయలు ప్రసన్న హృదయుడై యీప్సితార్థము నిచ్చెద నడుగు మనగా స్వాభిమానమును ద్రోసిపుచ్చి, జాత్యభిమానము పెంపున, రాయ సామ్రాజ్యమున నుండు మంగలివారు ప్రభుత్వమునకు వాలాయముగ గట్టుచుండిన సిధాయము మొదలైన పన్నులను "సర్వమాన్యము" సేయ వేడెనట! అందుమీదట రాయలవా రనుగ్రహముచూపి యతడు కోరిన మేరకు రాయరాజ్యములోని మంగళ్ళు అచ్చవలసిన పన్ను పర్యాయములను సర్వమాన్యముజేసి, శాసనములను వేయించెను. కావున కొండోజు కృష్ణరాయల కాలమున నుండి రుద్రకవికి రాయల దర్శనము కలిగించుట యసంభవము కాజాలదు. మల్కిభరా మన మల్లిక్‌ ఇబ్రాహీమ్‌ (కుత్బ్‌శాహు) అను గోల్కొండ సుల్తాను నామమున కాంధ్రీకరణము. ఇబ్రాహీము కుత్బ్‌శాహు క్రీ. శ. 1550 సంవత్సరమున గోల్కొండ సింహాసనము నధిష్ఠించి క్రీ. శ. 1580 వఱకును రాజ్యపాలన మొనర్చెను. కావున నతడు రుద్రకవికి సమకాలికుడు కానగును. కాని యతడు శకాబ్దము 1480 జయ సంవత్సరమున రుద్రకవికి రెంటచింతలను దానమిచ్చె ననుట సంశయాస్పదము. శకాబ్దము 1480 సరియైన ప్రభవాద్యబ్దము కాలయుక్తి కాని జయ కాదు. మల్కిభరామ్‌ రాజ్యకాలమునందు జయవర్షము రానేలేదు. శ. 1456 క్రీ. శ. 1534న నొక పర్యాయమును, శ. 1514 క్రీ. శ. 1594న మఱియొక పర్యాయమును జయాబ్దము సంభవించెను. శ. 1456లో మల్కిభరామ్‌ రాజ్యమునకు రానేలేదు. 1514 నకు పదునాల్గేండ్లకు ముందే యతడు గతించెను. కావున పై నుదాహృతమైన రుద్రకవివృత్తాంతమందు చెప్పిన దానకాలము విశ్వాస పాత్రము గాదు. ప్రభాకరశాస్త్రులవారు గుర్తించినట్లు రెంటచింతలయే చింతలపాలె మగునేని దానిని శకాబ్దము 1480 లోని ఇబ్రాహీం కుత్బ్‌శాహు దానమీఁ గలిగి యుండడు. ఏలనగా శకాబ్దము 1466 రక్తాక్షి వఱ కున్న అళియరామరాజు పరాక్రమభాను డుగ్రతేజుడై, శత్రువులకు దేరిజూడ శక్యముగాక వెల్గొందుచుండెను. తురకరాజుల కెవ్వరికిని కృష్ణానదీ దక్షిణమున నడుగిడుటకు గూడ వలనుపడ కుండెను. అట్టియెడ ఇబ్రాహీమ్‌ కుత్బ్‌శాహు రుద్రకవికి నెల్లూరి మండలము కనిగిరి తాలూకాలోని చింతలపాలెము నెట్లు దానమిచ్చి యుండగలడు? శకాబ్దము 1502 అనగా క్రీ. శ. 1580-81 వఱకును ఇబ్రాహీం కుత్బ్‌శాహు యొక్క అధికారము విక్రమ సంవత్సర చైత్ర బ. 14 భౌమవారంనాడు 'హజరతి యిభురాహిం పాదుషహా వొడయలుంగారు తమ నామజాదు (సేన) పంపితేను' అతని భృత్యుడైన అమీను మలకా వొడయలుంగారు,

'ధాటిగనేగి వుద్దగిరి దార్కొని వెంకటరాజుఁ ద్రోలి ముం
గోటలు లగ్గఁబట్టి వినుకొండయు బెల్లముకొండ తంగెడల్‌
పాటివరి\న్‌ హరిన్‌ మదిని బల్మిని గైకొనె కొండవీడు క
ర్ణాటకరాజధాని యిభురాముఁడు బాహుబలంబు మీరగ\న్‌.'27

అని యమీనాబాదు శాసనమునందు చెప్పియుండుట వలన క్రీ. శ. 1580-81 వఱకును కుత్బ్‌శాహువారి యధికారము చెల్లలేదని విస్పష్టమగుచున్నది. అట్లగుట వలన శ. 1480 జయ సంవత్సరమున ఇబ్రహీం కుత్బ్‌శాహు కందుకూరు రుద్రకవికి నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా చింతలపల్లెను దానమిచ్చెననుట నమ్మదగి యుండలేదు. కాని యీవిషయము విశ్వాసార్హము కాకపోయినను, రుద్రకవి క్రీ. శ. 16వ శతాబ్ద పూర్వార్థమున వెలసెనని గట్టిగ జెప్పవచ్చును. ఒకవేళ నతడు కృష్ణదేవరాయల సభాస్థానము నలంకరించిన యష్టదిగ్గజ కవులలో నొక్కడై యుండిన కావచ్చును.


1A.R. No. 282 of 1937-38
వెనక్కి
2ARE. 1937-38, part II para 6 9
వెనక్కి
3A.R. No. 715 and 716 of 1926
వెనక్కి
4A.R. No. 105 of 1921
వెనక్కి
5A.R. No. 623 of 1916
వెనక్కి
6ఆం. సా. ప. పత్రిక సం. 3 పుట 313
వెనక్కి
7ఆం. సా. ప. పత్రిక సం. 3 పుట 133
వెనక్కి
8కృ. రా. వి. 3- 48,4 9
వెనక్కి
9ఆంధ్రకవుల చరిత్ర పుటలు 266-6 9
వెనక్కి
10Sources of Vijayanagara History Pp. 210-11
వెనక్కి
11Sources of Vijayanagara History P. 157
వెనక్కి
12తిరు. దేవ. శాసన సం. 2 పుట 273
వెనక్కి
13తిరు. దేవ. శాసన సం. 3 పుట 224
వెనక్కి
14తిరు. దేవ. శాసన సం. 4 పుట 245-6
వెనక్కి
15తిరు. దేవ. శాసన నివేదిక పుట 303
వెనక్కి
16Mack. Ms. 15-3-6
వెనక్కి
17Mack. Ms. 15-3-6 Pp. 26-27
వెనక్కి
18Mack. Ms. 15-3-60
వెనక్కి
19అప్పకవీయము 3.225
వెనక్కి
20ప్రభాకర శాస్త్రిగారు: ప్రబంధ రత్నావళి పుటలు 125-131
వెనక్కి
21ఆంధ్రకవుల చరిత్ర పుట 357
వెనక్కి
22ఆంధ్రకవుల చరిత్ర పుట 353
వెనక్కి
23Further Sources of Vijayanagara History Vol I Nos. 212, 213a&b, 214
వెనక్కి
24ఆంధ్రకవుల చరిత్ర పుట 235
వెనక్కి
25చాటుపద్య మణిమంజరి, ద్వితీయభాగము పుటలు 25-36
వెనక్కి
26చాటుపద్య మణిమంజరి, ద్వితీయభాగము పుట 33
వెనక్కి
27Sources of Vijayanagara History P. 240
వెనక్కి
AndhraBharati AMdhra bhArati - aShTadiggaja nirNayamu - DAkTar nElaTUri vEMkaTaramaNayya Nelaturu Venkataramanaiah Dr. Nelaturu Venkata Ramanayya ( telugu kAvyamulu andhra kAvyamulu)