వచన సాహిత్యము ఉపన్యాసములు నాటకోపన్యాసములు - ౧
శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ

ఈ యుపన్యాసములు రెండును బళ్లారిలో ౧౯౩౪ అక్టోబరు ౨౦ - ౨౧\ తేదులలో,
మునిసిపలు హైస్కూలువారి యాజమాన్యమున జరిగిన
కృష్ణమాచార్య - శ్రీనివాసరాయల
స్మారకోత్సవ సందర్భమునఁ జేసినవి.

భారతి ౧౯౩౫ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ (సంపుటి ౧౨ - సంచికలు ౧, ౨, ౩, ౪)

"కావ్యేషు నాటకం రమ్యమ్‌" అని మన పెద్దలు తలఁచిరి. అందుకు తగినట్లు సాహిత్యమునకు నాటకములు చదువుట పరమావధిగా భావించిరి. కాళిదాస కవీశ్వరుఁడు ఊరక చదువుటకంటె నాట్యము 'దేవతలు కన్నులతోఁ గుడిచి క్రోలవలసిన యజ్ఞ' మని పొగడెను. ఎన్నో విధములుగా రుచులు వేఱు వేఱుగాఁ గల జనుల నందఱిని తన ప్రక్క కీడ్చుకొని తృప్తిపరచు కళ యిదొక్కటే యని యతఁడు చాటెను. ఇంతటి మహత్త్వము తక్కిన యన్ని కళలకంటె దీని కెక్కడిది?

నాకుఁ జూడఁగా కారణ మిది; ఇదియొక కళగాదు. అన్నికళలును ఏకీభవించి చేసిన మూర్తి యిది. వాచికము, ఆంగికము నైన యభినయమే యీ విద్యలో కేంద్రస్థానము నాక్రమించినను తక్కినవన్నియు దానిపోషణకు పనికివచ్చును. ప్రతికళయందును కొంత విశిష్టమైన మేలిమి కలదు; అట్టి కొదవయుఁ గలదు. ప్రతికళయును కొన్ని భావములను జూపి మఱికొన్నింటిని మీరే యూహించుకొనుఁడని తనకు చేతఁ గాక మనకు వదలిపెట్టును. చిత్రకర్మలో వ్యక్తియొక్క పలువన్నెలు స్పష్టముగాఁ జూపవచ్చునుగాని దాని ప్రక్కలు, వీపును చూపలేము. జుట్టును జూచి మొగమో, మొగమును జూచి జుట్టో ఊహింపవలసినదే కాని రెంటిని ఒకతూరి పటములో వ్రాసి ప్రదర్శింపలేము. విగ్రహ రచనలో వస్తువు దశ దిక్కులను చూపవచ్చును గాని వస్తు భేదమునకును, భావభేదమునకును ముఖ్యసాధనములలో నొకటి యగు వర్ణభేదమును జూపలేము. పై రెంటియందును క్రియారూపమగు చలనము చూపుట యసాధ్యము. వీనికంటె కవిత్వమందు వస్తువుయొక్క అంతరంగ బహిరంగములు, క్రియలు చిత్రింప వచ్చునుగాని దానికి మూలమైన పదార్థము శిల, మన్ను, వన్నె మొదలగువానినుండి ప్రత్యక్ష ద్రవ్యముగాక సంకేత రూపమైన భాష యగుటచే స్పష్టత యను గుణము పైవాని కన్న నిందులో తక్కువ. కాఁబట్టి తక్కిన కళలయం దక్కర లేనిది మాత్రమేకాక వికారముగాఁ గూడ పరిణమించు అతిశయోక్తి కవిత్వమునం దలంకారబీజమై వెలకెక్కినది. ఉన్నదున్నట్టుగా కొలతచేసి చెప్పినచో కవిత్వమునకు ప్రాయశః తేజస్సే యుండదు; వస్తువునూ మన హృదయములో ప్రతిబింబింపదు. అతఁడు గట్టివాఁడని, క్రూరుఁడని చెప్పినఁ జాలదు. రాక్షసుఁ డనవలెను. ఆ రెండు గుణములును అప్పుడే మనకు కొంత యర్థమగును. కవిత్వమందు పద్యములోనున్న భావసంగ్రహము, బలము, అచ్చుకట్టు గద్యములో నుండదు. గద్యమున నున్న విస్తరము, ధారాళత పద్యమందు సాధ్యము కాదు. మఱియు కవిత్వము గద్య రూపమైనను, పద్యరూపమైనను దాని మూలవస్తువు సంకేత రూపమగు భాష యగుటచేత, బయటి ప్రపంచమునఁ గాన వచ్చు పదార్థముల కన్నిటికిని సంకేతము లింకను ఏ భాషలోఁ గాని యేర్పడి యుండవు గావున, అంతరంగమగు భావము లందలి సూక్ష్మ సూక్ష్మతర భేదములకు సంకేతము గల్పించుట యసాధ్యము గనుక కవిత్వము చాలదూరము పోఁజాలదు, చాల లోఁతునకు దిగఁజాలదు. కాఁబట్టియే ఒక వస్తువును విస్తరముగా వర్ణింపవలసి వచ్చినప్పుడు మాటలు చాలక మనము కష్టపడుదుము. వేఱొక వస్తువును ఎరవు తెచ్చుకొని దానివలె నిది యున్నదని సాదృశ్యమును శరణు చొత్తుము. ఒక భావము తీవ్రముగా నున్నప్పుడు దానిని భాషారూపమున వెలువరింపలేక నోరు మూసికొందుము. తెఱచితిమా నత్తి తప్పదు. పై సూక్ష్మ సూక్ష్మతర భావములను సంగీతకళ ప్రదర్శింపఁ గలదు. కాని పై యన్నిటికంటె స్పష్టత దీనిలో చాల తక్కువ. ఈ సంగతి కీభావ మర్థమని భాషయందున్నట్లు సంకేతమైనను దీనికి లేదు. అభినయ కళలో సచేతనముల, అందును మనుష్యుల భావములను, క్రియలను స్థూల సూక్ష్మ భేదములతో ప్రదర్శింప వచ్చును గాని అచేతన ప్రపంచమును, దాని భిన్న రూపములను వెలువరించుట యసాధ్యము; అస్పష్టము.

ఇట్లు ప్రతికళయు తనయందలి కొఱఁత నెఱుఁగును గావుననే తన ప్రధాన ధర్మమైన అనుకరణమును చక్కగా నెరవేర్చుటకు ఇతరకళల సాహాయ్యము నపేక్షించును. చిత్రకర్మయు, విగ్రహ రచనమును ఒకటికొకటి తోడుపడును. కవిత్వమునకు సంగీతమును, అభినయమును తోడుపడఁ గలవు. సంగీతమునకు కవిత్వమును, అభినయము పుష్టినీయఁ గలవు. ఇట్లే అభినయము తక్కిన యన్ని కళల సాహాయ్యమును గోరును. ఒక సందర్భమును అభినయింప వలసిన వాఁడు దానికి వలయు వస్తువులను ఇల్లు, వాకిలి, అడవి మొదలగు వానిని కృత్రిమముగా తయారుచేసుకొని, వన్నెలు వేసి, వేసుకొని బహిరంగములను మన యెదుటఁ బెట్టును. అంతరంగమును వెలువఱచుటకు అభినయమునకు తోడు భాషను సహాయముగాఁ గొనును. దాని నింకను తీవ్రముగా ప్రదర్శింపవలయునేని పద్యమో, పాటయో యుపయోగించును. ఇట్లు సర్వకళాసమ్మేళనము గావుననే నాట్యము 'భిన్నరుచేర్జనస్య బహుధాఽప్యేకం సమారాధనం' 1 అను బహుమతిని బడసినది. ఏకళయందైనను కొంచెమో గొప్పయో పరిచయమును, అభిరుచియుఁ గలిగినఁ జాలును. దాని మూలమున మరల నానందపఱచుటకు నాటకమునం దవకాశమున్నది. అన్నికళల పరిచయము గలవారి మాట చెప్పఁ బనిలేదు.

ఒక వస్తువునందలి భిన్న భాగముల వేర్పాటు, శాస్త్రము; భిన్నపదార్థముల నొకచోటఁ జేర్చి చేయు కూర్పు, కళ. ప్రాచీనులీ తత్త్వమును చక్కగా గమనించిరి. కావుననే ఇంకను లోఁతుగా దిగి అట్టి భిన్నకళల కూర్పుచే ఇంకను పరిపూర్ణమైన కళను సృజింపఁ బ్రయత్నించిరి. అదే నాటకము. మనవా రింతకంటెను సాహసమైన పని యొకటి చేసిరి. పై యభినయముజతకు కవిత్వము, సంగీతము మొదలగువానివలె తాళ లయ ప్రధానమగు నృత్త మను దానినిగూడ చేర్చుకొనిరి. పాత్రము అభినయించునపుడు పాటకు తోడుగ 'తోంతతఝణ' లతో ఆడును. ప్రాచీనతరమగు నాటక పద్ధతుల పరిశేష మనఁదగిన దొంబిదాసర్ల ఆటలలో ఇది యింకను నిలిచి యుండుట మన మెఱుఁగుదుము. రసభావములు ప్రధానముగా చూపవలసినచోట ఈ యెగుర్లాటలు అస్వాభావికములని యందఱును సందేహించుట సహజము. కాని సందేహము కలిగిన వెంటనే దేనినిగాని తటాలున వదలుట ప్రాచీన పద్ధతి కాదు. అది ఇప్పటి మన సంప్రదాయము. నృత్తము అస్వాభావికమైనను అభినయమునకు మెఱుగు నిచ్చు ననుట ఆ కాలము వారి కనుభవగమ్యమై యుండెను. ఋజువు చేయలేకపోయిన మాత్రమున అనుభవసిద్ధమైన దానిని తిరస్కరించుట అన్యాయము. కావుననే "లాస్య తాణ్డవ భేదేన నాటకాద్యుపకారకమ్‌" అను దశరూపక సూత్రమునకు వ్యాఖ్యానము చేయుచు ధనికుఁడు "నృత్తస్య శోభా హేతుత్వేన చ నాటకాదా వుపయోగః" అని మాత్రము వచించి యూరకొనెను. అస్వాభావికమగు పదార్థము శోభాహేతు వెట్లగును? దమయంతీ ద్వితీయ స్వయంవర వార్త విన్న నల చక్రవర్తి కుళ్లి కుములవలయునా, నవ్వి నాట్యము త్రొక్కవలయునా? అట్టి నృత్య మట్టిచోట్లఁ జూచి సంతసించువారికి పదార్థముల యానురూప్యజ్ఞానము కలదని చెప్పవచ్చునా? 'అరగజ'మును అన్నముతో కలిపి భుజించుచు నాలుక చేదైనను "ఆహా! ఎంత ఘుమ్మనుచున్నది!" అని మెచ్చుకొనువారిది రుచియా, పిచ్చియా? నాటకము జనుల జీవిత మందలి యవస్థల యనుకరణమే తప్ప వెఱ్ఱి వెంగళయ్య చేష్ట కాదుకదా! - ఇట్లు ప్రశ్నించుట అనుభవ రసికుల దృష్టి కాదు; వివేక ప్రధానులగు విమర్శకుల దృష్టి, మొదటిది హృదయమును నమ్మినది, రెండవది మెదడు నాశ్రయించినది.

ఈ వివేక దృష్టి బలిసిపోవుచుండుటచేతనే మనలో నాట్యమునకు సహాయము చేయుచుండిన కళలు ఒక్కొక్కటిగా ఊడి పడిపోవుచున్నవి. నృత్తము నాటకమును వదలిపోయి ఎన్నోనాళ్లాయెను. మీ వివేక మెక్కడ కొల్లఁ బోయిన మాకేమి యని పామరజనులు మాత్రము దాని నింకను వదలక పట్టుకొని యున్నారు. ఈవల వారును చాలవఱకు దానిని వదలిపెట్ట నుపక్రమించినారు. అది మన సహవాస దోషము కొంత, వారి కన్నిటియందువలె దానియందును కాలవశమునఁ గలిగిన యనుత్సాహము కొంత. ఎప్పుడు తాళలయాశ్రయమగు నృత్తము చేవిడిచిపోయెనో అప్పుడు దానివెంటనే దానివంటివగు పాటలును మఱుఁగుపడెను. సంస్కృత నాటకములలో ఎందును పాట లున్న సూచనయే కానరాదు. రత్నావళి మొదలగు వానిలో 'ద్విపదీ ఖండము', 'చర్చరి' మొదలగు గీతఖండము లొకటి రెండున్నను అవి నృత్త గాన సన్నివేశమువలన వచ్చినవిగాని పాత్రముల యభినయమునకు సహజముగా తోడుపడినవి గావు. తుదకు త్రిశ్రగతిలోనో, చతురస్రగతిలోనో తాళమార్గము ననుసరించి విధింపఁబడిన నాందినిగూడ సంస్కృత నాటకకర్త లొక వృత్తముగా మార్చుకొనిరి. ఇటీవల మనము ఇంకను ఈ వివేకదృష్టిని తెగఁ బెంచుకొనుచున్నాము. ప్రాచీను లెట్లో చంపక నిలుపుకొన్న పద్యములను గూడ ఇప్పుడు అస్వాభావికము లని నాటకములనుండి తీసివేయు ప్రయత్నములు చేయుచున్నాము. ఇఁక పాటల మాట చెప్పఁ బనిలేదు. శ్రీధర్మవరము కృష్ణమాచార్యులును, కోలాచలము శ్రీనివాసరాయలును తమ నాటకములలో పాటలు కుప్పలుగా నించియున్నను వానిని పామరజనప్రీతికే చేయవలసివచ్చె నని 'పండితుల' క్షమాపణ కోరుకొన్నారు. పై స్వభావవాదమునే ఇంకనుఁ సాఁగఁదీసి తుదకు స్త్రీ పాత్రములను స్త్రీలే వహింపవలయునని చెప్పవలసిన స్థితికి దిగినది మన కళాభిరుచి!

ఈ స్వభావవాదమునకు తోడుగా కళాస్వాతంత్ర్యవాద మొకటి కలదు. దీని ప్రకారము ప్రతికళయును స్వతంత్రముగా వర్తింపవలయును గాని యితర కళలకు పరాధీనమైన బ్రతుకు బ్రతుకరాదు. అప్పుడే దాని పరిశుద్ధియు, పరిపూర్ణశక్తియు బైలుపడును. అట్లుగాక మిశ్రణము చేసితిమేని యేకళయును స్వశక్తిని సంపూర్ణముగాఁ జూపలేకపోవును. నాటకముల విషయమున ఈ వాదము నాశ్రయించు వారిలో వేఱువేఱు అంతస్తులు గలవు. పాటలు వలదనువారు కొందఱు; పద్యములు తిరస్కరించువారు మఱికొందఱు; ఇంక కొందఱు పద్యములున్నను వానిని రాగముతో పాడక గద్యమువలె చెప్పవలె ననువారు; వేఱుకొందఱు వేషములు, వన్నెలు, తెరలును అక్కర లేదనువారు; అసలు మాటలే కూడదనువారును లేకపోలేదు. మూగ నాటకములగు 'కథకలి' మొదలగునవి యీ వాదపు పరిణామములే. ఇది కేవలము ఆధునిక దృష్టికాదు. ప్రాచీనులలోను ఇట్టి యభిప్రాయములు కలవనుట కాధారము లున్నవి. కాని పాశ్చాత్య సంస్కారముచే నిప్పు డిది బలమగుచున్నది.

ఈ స్వాతంత్ర్య వాదమును గూర్చి మన మెక్కువ తంటాపడవలసిన పనిలేదు. ఎందుకనగా: పరస్పర సహాయమే సృష్టిలోని మూలతత్త్వము. కూర్పు కళాధర్మము. అట్లుండగా ఈ వాదము గట్టిగా నిలుచుట యెట్లు? కత్తి మీఁది సామువలె, ఏకాక్షర కవిత్వమువలె, స్వతంత్రకళలో భావప్రదర్శనము చేయుటకు తనుకులాడు కళావంతుని సామర్థ్యము మనము మెచ్చుకొనవచ్చును గాని మనకు దానిచేత పూర్ణతృప్తి కలుగుననుట నిజముగాదు. పలువన్నెల చిత్రమునకున్న విలువ ఒంటివన్నె చిత్రమున కుండరు. అర్థముగల కీర్తనలకున్న గౌరవము తిల్లానాల కుండదు. పది పాత్రములను పదుగు రభినయించుటకు బదులుగా ఒక్కడే యభినయించెనేని వానిది గొప్పశక్తియే కాని మనకు రక్తి తక్కువ. కావున ఈ వాదమునకు బలము చాలదు. సాధ్యమైనంత వఱకు ప్రతికళయు స్వతంత్రముగా నుండవలయు నందురేని యెవరును కాదనరు. కాని ప్రతికళకును అసాధ్యములైన ప్రమేయములు కొన్ని కలవనియు, వాని నట్లే వదలుటకంటె ఇతర కళల తోడ్పాటుతో సాధించుట ధర్మమనియు అంగీకరింపక తప్పదు.

ఇప్పుడు ముఖ్యముగా నాటకప్రపంచమును తలక్రిందు చేయుచున్నట్టిది స్వభావవాదము. ఇది అందఱికిని అర్థమగును. న్యాయమని యెక్కువ కష్టము లేకయే తోఁచును. ప్రపంచమున జరుగుచున్నవి, జరుగవచ్చునట్టివి యైన అవస్థల ననుసరించుటయే కదా నాట్యకళ! కాఁబట్టి రంగస్థలమున వ్యక్తులు చేయు పనులు, ఆడుమాటలు, వేయు వేషములు - అన్నియు సహజముగా నుండవలయును. కావుననే మన నిత్యవ్యవహారములో లేని ఛందస్సు, సంగీతము మొదలగునవి రంగము మీఁదికి వచ్చుట కధికారము లేదు. మగవా రెంతకష్టపడినను వారి స్వరూపము, స్వరము, నడక మొదలగునవన్నియు భిన్నములు గావున స్త్రీపాత్రమును సహజముగా ప్రదర్శింప లేరు. కావున స్త్రీపాత్రములు స్త్రీలే ధరింపవలెను. కృత్రిమములైన యవయవములతో ఆఁడపాత్రను అవకతవకగా అభినయించువానిని జూచి కథానాయకుఁడు 'ప్రియురాలా!' యని కౌఁగిలింపఁబోవుట యెట్లు? పై రెండును నా దృష్టిలో స్వభావవాదము యొక్క యిప్పటి ప్రబల పరిణామములు. చిల్లర మఱికొన్ని కలవుగాని ప్రకృతము వానిని విస్తరింపక యీ రెంటిని గూర్చి మాత్రము కొంత చర్చింతును.

ఈ స్వభావవాద మింత ప్రబలముగా నున్నను మనము కొంత విమర్శించి చూచితిమేని నిలువక సడలిపోవును. ప్రకృతియందలి పదార్థముల భావములను, క్రియలను అనుకరించుటయే నాట్యమని ప్రాచీనులు అంగీకరించిరి. 'అవస్థానుకృతి ర్నాట్యమ్‌' అనియే వారును నిర్వచించిరి. నాట్య మొక్కటేకాదు, కళాసామాన్యపు మూలవస్తువునూ అనుకరణమే. ఉండునది ఉండవచ్చునట్టిది, ఉండవలయునట్టిదియు నగు వస్తువును బ్రదర్శించుటతోడనే కళలన్నియు మొదలు పెట్టును. కాని సంపూర్ణముగా ఏవస్తువునైనను అనుకరించుట యసాధ్యము. ఒక మల్లెపూవును కాగితము, వస్త్రము మొదలగువానిని కత్తిరించి చేయవచ్చును; లోహములతో పోఁత పోయవచ్చును; మ్రాను, దంతము మొదలగువానిని చెక్కి చేయవచ్చును; పటముపై వన్నెతో వ్రాయవచ్చును; వ్రేళ్లు మలఁచి చూపవచ్చును; దానిపై పద్యమువ్రాసి వర్ణింప వచ్చును, కాని యిన్నిటిలో దేనియందుఁగాని, తుద కన్నియు కలిపి చూచినగాని నిజమైన మల్లెపూవునందలి వన్నె, స్పర్శము, కొలఁత, సుగంధము, రూపము మొదలగు సర్వాంగములును మన మనుకరించినట్లగునా? రంగస్థలము మీఁద ఒకఁ డొకనిని పొడిచి చంపు సన్నివేశము వచ్చినప్పుడు నిజముగా పొడిచి చంపిననేతప్ప వాఁడు చంపినట్లగునా, వీఁడు చచ్చినట్లగునా? ఇట్లు అసాధ్యము, అనర్థదాయకమును అగుట యట్లుండగా సంపూర్ణానుకరణము కళపని కనావశ్యకము గూడ. ఎందుకనఁగా, కళాకార్యము వస్తువుయొక్క విశిష్టస్వరూపమును - ఇది ఫలానిదని గుర్తించుటకుఁ గావలసిన ముఖ్యధర్మమును - మన భావనావీథిలో ప్రతిబింబింపఁ జేయుటయే తప్ప దాని యంగోపాంగముల జ్ఞానమును మన మెదడున కంటించుట కాదు. అనఁగా అంగవర్ణన అక్కర లేదని కాదు. అంగసామాన్యముల వర్ణన మక్కరలేదనుట. కాని అంగవిశేషవర్ణన మత్యావశ్యకమే. ఎందుకనఁగా అంగి యందలి విశేషధర్మమును అంగముల విశేషధర్మము తెలుపును; పుష్టిచేయును. చిత్రించిన జంతువు గాడిద కాదు, గుఱ్ఱమే యనిపించవలసినప్పుడు పొడుగైన, కుచ్చైన తోఁక చూపవలసిన విశేషాంగములలో నొకటి. కాని ఆ తోఁక లోని వెంట్రుకలన్నియు లెక్కపెట్టి చూపవలసిన పనిలేదు. మఱియు అనుకరణము కొన్ని సందర్భములందు మూలవస్తువునకు విరుద్ధమైన గుణము గలదియుఁ గావచ్చును. మల్లెపూవు తెల్లనిది. కాని దానిని నల్లరాతితో చెక్కవచ్చును. హిమాలయమువంటి సర్వోన్నత పర్వతమును అంగుళము చోటులో ఇమిడించి చిత్రింపవచ్చును. శ్రవణబెళగొళములోని గోమఠేశ్వరుని విగ్రహము అరువది యడుగుల యెత్తున్నను మనుష్య విగ్రహమే, సిద్ధముగా తీర్చిన, యేరిన స్వరముల యల్లికను వ్యవహారములో ఎవరును ఉపయోగింపరు. కాని సంగీతము విన్నప్పుడు మనకు శోకము, సంతోషము మొదలగు ప్రకృతి సిద్ధములగు భావములు తలచూపును. ఇంతేకాదు, వస్తువు యొక్క అంతరంగ తత్త్వమును చక్కగా భావన సేయఁగల శిల్పి కలిగెనేని, మనము సామాన్యముగా అవశ్యకములని, ముఖ్యములని తలఁచు బైటి యంగములుగూడ నిరర్థకము లనిపించును. మైసూరు సంస్కృత పాఠశాలలో కొన్ని యేండ్లక్రింద వేణీ సంహార నాటక మభినయించుట నేను చూచితిని. చుట్టును సభ్యులు కూర్చుండి యుండగా నడుమ నాలుగు బెంచీలు వేసి రంగస్థల మేర్పఱచి యుండిరి. నియత కాలమునకు సరిగా నలుగురు విద్యార్థులు వచ్చి రంగస్థలమున కుర్చీలపైఁ గూర్చుండిరి. వారిలో దోవతి, షర్టు, ఉత్తరీయము, క్రొత్తగా చేసికొన్న అర్ధభద్రాకరణముచే తళతళలాడు తల, విభూతికట్ల ఫాలమును గల్గి సామాన్య శరీరము గల యొక విద్యార్థి తనవలెనే ప్రక్కన కూర్చున్న మఱియొక విద్యార్థిని చూచి 'ప్రియే!' యని సంబోధించెను. వాఁడును 'ఆర్యపుత్ర!' యని ప్రత్యుత్తర మిచ్చెను. రెండు మాటలాడులోపల మొదటివాఁడు భీముఁడనియు, రెండవవాఁడు ద్రౌపదియనియు మే మెఱిఁగి నవ్వజొచ్చితిమి. కాని మఱి రెండు నిముషములలో మా నవ్వంతయు మాయ మయ్యెను. బక్కపల్చని బడుగైనను భీముఁడు గావచ్చుననియు, చీరయే కట్టకున్నను స్త్రీపాత్రము నభినయింప వచ్చుననియు నా కర్థమైనది. భీమపాత్రము వహించిన వాఁడు ఇంక కొంత స్థూలకాయుఁడుగా నుండియుండెనేని ద్రౌపది నభినయించినవాఁ డొక చీర గట్టుకొనియుండెనేని, మనకు మొదట గలిగిన ఆ యింతనవ్వును రాక యుండును. బహిరంగముల ఫలమింతే. మన చిత్తవృత్తిని వస్తువిశేషమగు అంతరంగము వఱకు ఈడ్చుకొనిపోయి విడిచి తాము వెనుకఁ బడును. కళావంతుని ముఖ్యమగుపని ఆ చిత్తవృత్తిని ఆచోట ఏకాగ్రముగా నిలుపుటయే.

కాఁబట్టి కళకు అనుకరణము సాధనము, సాధ్యము చిత్తైకాగ్రత, దాని ఫలము శాంతి. కడచిన తృతీయాంధ్ర నాటక కళాపరిషత్తులో అధ్యక్షత వహించిన శ్రీ తాడిపర్తి రాఘవాచార్య నటశేఖరుఁడు "మనశ్శాంతిని బడయుటకు నాటకములు ముఖ్యసహాయకము లనుట నా కిప్పు డనుభవమునకు వచ్చినది" అని చెప్పినమాట చాల విలువగలది. నాటక మొకటే కాదు, అన్ని కళలును అంతే. శాంతి యనఁగా సోమరితనము కాదు; ఏకాగ్రత. అవిదిత వేద్యాంతరముగా ఏదేని యొక వస్తువునందు చిత్తము నిల్పఁగలుగుట. బహువిధములచే భిన్నమగు ఈ ప్రపంచమునందు అభేదానుభవమును సంపాదించుట. ఇట్టి అవస్థ ఆనందమయము. ఆనందమనఁగా సుఖము కాదు. సుఖము ఇంద్రియములకు సంబంధించినది. ఆనందము ఆధ్యాత్మికము. అనఁగా ఆత్మ కెక్కువ సంబంధించినది. మంచి కంచువంటి శారీరమును విన్నప్పుడు సుఖము చెవులకుఁ గలుగును. అందు వివిధ భావములను ప్రదర్శించి రాగాలాపన చేయునపుడు కలుగునది ఆత్మానందము. అట్లే నాటకములలో వింతవింత వన్నెల తెరలు, తళతళలాడు చీరలు, సొమ్ములు ఇత్యాది. 'పుస్తము' లను చూచినప్పుడు కన్నులకు సుఖము గలదు. శృంగారాది భావములను విరివిగా నటు లభినయించునప్పుడు ఆత్మకానందము గలుగును. సుఖము ఆనందముయొక్క మిత స్వరూపము. మఱియు చంచలము. సుఖమే దుఃఖమునూ అగును. చలికాలమున వేఁడివేఁడిగా ఒక గిన్నెఁడు కాఫీ త్రాగుటలో సుఖమున్నది. అదే రెండవ గిన్నెకు ఉదాసీనమై మూఁడవగిన్నెకు అసహ్యమగును; ఇంకను మించిపోయిన విష మగును. ఆనంద మట్టిది కాదు. సంపాదించుకొనఁగల కొలఁది అనుభవింపవచ్చును; అనుభవించుకొలఁది ఆశ లూరును; అమేయమగును. కాఁబట్టియే ఇట్టి యానందమునకు హేతువువగు శాంతికై పూర్వకాలపు మహర్షులు వేకారి చేసిన "ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః" అను ఘోషణ ఇప్పటికి వేదము వల్లించువారి నోట మిగిలియున్నది.

శాంతిని సాధించు వస్తువు లయము. సంగీతగాండ్ర వ్యవహారములో లయమనుమాట విన్నాము. అక్కడ ఆ పేరునకు సంగీతమునం దాటపాటలకై యుపయోగించు కాలపు తునకల పరస్పర సామ్యము అర్థము. నడకకు మూలమగు కాలమాత్రలలో ఏమాత్రమును భేదము, ఎగుడుదిగుళ్లును ఉండక ఒకటేఖత్తుగా నికరముగా వర్తించుట. కాని యీ లయశబ్దమునకు కాలఖండసామ్య మనిమాత్ర మేకార్థమును సంకోచింపక "సామ్యము" అనియే సామాన్యమగు నర్థమిచ్చి చూచితిమేని మన జీవితమందు ఈపోలిక యెంత ప్రబలమైన పదార్థమో గమనింపఁ గలము. సామ్యము లేనిచోట వైషమ్యము. మనకు వైషమ్యమువలె మనస్సును కలఁతపెట్టి నొప్పి కలిగించు ధర్మము వేఱులేదు. ఇంటిముందఱి కంబములు రెంటిలో ఒకటి యింకొక దానికంటె పొడవులోనో, లావులోనో ఎక్కువ తక్కువగా నుండినచో ఎంత మనసు కంటగించునో వేఱుగా చెప్పవలయునా? శరత్కాలమున చీఁకటి రాత్రులలో ఆకాశమును జూచిన యెవరికిఁగాని "ఇన్ని నక్షత్రములును ముత్యాలమ్రుగ్గు పెట్టినట్లు ఏదైన నొక లయప్రధానమగు ఏర్పాటులో నుండక, కల్లములో గాలికి చెదరిన జొన్నలవలె చెల్లాచెదురుగా ఏల విసరి చల్లిన ట్లున్నవి?" అను వెత కలుగకుండునా? సామ్య మున్న చోట చక్కఁదనమును, వైషమ్య మున్న చోట వికారమును మన మనుభవింతుము. ఇ ట్లేలయగును? ఇది స్వభావ మింతే. సృష్టి యందే మన మేవస్తువు యొక్క నిర్మాణమును పరీక్షించినను అందు ఈ సామ్యము విశేషముగాఁ గానవచ్చును. మన కాళ్లు, చేతులు, కన్నులు మొదలగువానిని పరస్పరము పోల్చి అవి యెట్లు సమముగా తీర్పఁ బడినవో చూడుఁడు, తుదకు ఒక చేతిలోని ఐదువ్రేళ్లునూ ఒక్కొక్కటి యొక్కొక్క తీరున విషమముగా నున్ననూ అదేరీతినే వ్రేళ్లను ఇంకొక చేతియందును అమర్చి సృష్టికర్త సామ్యము నిర్వహించి యుండుట మనము చూడఁగలము. ప్రకృతిలో వైషమ్యము లేదనికాదు, కలదు. మఱియు సామ్యమును, వైషమ్యమును "సమతూకము" గానే యున్నవేమో! కాని యెట్లయినను ఆ వైషమ్యమును తొలగించ వలెనను ఆసయు, సాధ్యము గాని చోట దానిని తొలఁగి దూరముగా నుండవలెనను ఆత్రమును మనుష్యులకు - ఏల, ప్రాణిసామాన్యమునకు - గలదు. ఒకటికన్న నెక్కువ పదార్థములు సమానముగాఁ గనఁబడి నప్పుడు వానియందలి భిన్నబుద్ధి చాలవఱకు నశించి మనసు నెమ్మదిపడును. ఇది లేనిచోట కృత్రిమముగానైనను కల్పించి యానందింతుము. చెట్టుకొమ్మలు లయశుద్ధిలేక యెగుడు దిగుడుగా, వంకరటింకరగా పెరిగినచో కత్తిరించియైనను చక్కఁజేసి కన్నులు తృప్తిపఱచుకొందుము. ఈ లయము పదార్థముల జాతి, గుణము, క్రియ మొదలగు నన్నిటియందును వ్యాపించి అనంతమై అమేయమైన బలముగల మూల ధర్మము. సౌందర్యము, సౌమనస్యము, అనురూప్యము, అభిమానము, స్నేహము - అను భావములకెల్ల ఇదే ఆధారము. దీని ననుభవించునపుడు మనము సృష్టి మూలతత్త్వమునే స్పృశింతుమేమో! దీని మహత్త్వమును గమనించుట యందే మనుష్య ప్రయత్నము లన్నియుఁ బ్రవర్తించిన ట్లున్నది.

ఈ సహజమగు లయాభిమానమును వెలువరించు మానవ ప్రవృత్తులే కళలు. కావుననే వానికి అనుకరణము బీజమైనది. సృష్టిలో వైషమ్య మిశ్రమముగానున్న లయవేగము చాలక, ఉన్నది కొంత, ఉండవచ్చునది కొంత, ఉండవలసినది కొంత చూచి, ఊహించి, కల్పించి అనుకరించుట కళాధర్మము. అనుకరించుటకు మనము గ్రహించిన ప్రతివ్యక్తియందును రెండు భాగములు గలవు; వెలుపలి రూప క్రియాదులు, లోపలి తత్త్వము. వీనిలో బహిరంగముల ననుకరించుట అంత కష్టము గాదు, ప్రాయపువాఁడు ముసలి వాని వేషము వేయవలసినప్పుడు తెల్లగడ్డము, వంగి నడచుట, కాళ్ల చేతుల వణఁకు మొదలగువానితో ఆ పని చేయవచ్చును. కాని ముసలివారి అంతరంగములగు మఱపు, హృదయ దౌర్బల్యము, సుకుమారత, పక్వమైన వివేకము, ఇంకను ముదిరినచో అవివేకము - మొదలగువాని ననుకరించుటయే కష్టము. అప్పుడే మనకు ఆ ముసలివ్యక్తితోడి లయము పూర్ణముగా సిద్ధించును. కాఁబట్టియే కళలలో బహిరంగాభినయము చేయువానికంటె అంతరంగమందలి భావభేదములను విరివిగా ప్రదర్శించునవియే యెక్కువ మనల నాకర్షించును. ఱాతిలో పాత్రమును తొలుచువానికంటె ప్రతిమను తొలుచువానికి గౌరవమును, వెలయు నెక్కువ. కారణము మొదటిదానిలో అంతరంగచర్చ లేదు. రెండవ దానిలో అంతరంగదృష్టి తప్పనిది. కాకున్నచో దానిని మొద్దుబొమ్మ అందుము. తక్కిన కళలన్నియు అంతరంగ బహిరంగముల రెంటిని కొంతకుకొంత వెలువఱచునుగాని సంగీత మొక్కటి కేవలము అంతరంగమునే ఆశ్రయించినది. పాశ్చాత్య సంగీత పద్ధతిలో ఉఱుము, తుపాను, సముద్ర తరంగముల కోలాహలము - మొదలగువాని ననుకరించు బహిరంగ రచన కలదని విన్నాను గాని మనపద్ధతిలో అట్టి దేదియు లేదు. కాఁబట్టియే సూక్ష్మములైన, తీవ్రములైన ప్రాణిభావభేదములను గానము చూపఁగలిగినట్లు ఏ యితరకళయు చూపలేదు. మఱియు ఏడ్పు, నవ్వు, ప్రేమ, ప్రార్థన మొదలగు భావములను విచిత్రరీతుల, వివిధగతుల వెలయింప వచ్చును గాని ఏడ్చువా రెవరో, స్త్రీయో, పురుషుఁడో, చిన్నయో, పెద్దయో, ఏజాతియో, వస్త్రము లున్నవో, దిగంబర మూర్తియో, ఎందు కేడ్చునో - ఏదియు చూప వీలులేదు. ఇందుచేతనే తక్కిన యన్ని కళలకంటె దీనియందు స్పష్టత తక్కువ యంటిని. ఇట్టివానిని స్పష్టపఱుపవలెనన్న కవిత్వమునూ, అభినయమునూ గానమునకు తోడు గావలయును. 2 ఇట్లే భావ ప్రదర్శనమందు అభినయమునకు కవిత్వమును దానికి సంగీతమును సహాయము గాకున్నచో పూర్ణభావ లయము మనకు సిద్ధింపదు. భరతుఁడు అయోధ్యానగరము నంతయు నిదానముగా నొక్కమాఱు కలయఁజూచి చేతులెత్తి వేలవేసి తల వంచుకొని కన్నులు మూసికొన్నాఁడనుకొందము. అతని ఆ భావము స్పష్టముగా మన మనస్సులలో రూపుగొనవలయునేని "అన్న లేక శ్మశానముగా నున్నదే ఈ పాడూరు. కన్నులతో ఎట్లు చూడఁగలను?" అని చెప్పక తీరదు. ఇట్లు గద్యముగాఁ జెప్పుటకన్న

"మా రాఘవుఁడు లేమి
మసనమై తోఁచు నీ
పాడూరు కన్నెత్తి
చూడఁగలనె?" 3
అని యిట్లు పద్యముగా లయమధ్యమందు బిగించినప్పుడు భావమునకు బిగు వెక్కువ. దీని తోడుగా శ్రుతి రాగలయలతో పాడినచో భావ మింకను కేంద్రీకృత మగును. దానికి తోడు తాళ లయ సహితమైన పాటయే యయ్యెనేని మేలు కాదా? మన ప్రాచీను లింకను లోఁతుకు దిగి నృత్తమును గూడ చేర్చిరని వెనుకనే విన్నవించితిని. ఏల కారాదు? భావములను తీవ్రపఱచు శక్తి శ్రుతి రాగ తాళ లయల నాశ్రయించిన సంగీతమున కున్నదఁట. అక్షరమాత్రాలయమును జూపు శక్తి పద్యరచన కున్నదఁట. నృత్తమునకు మాత్ర మేల లేదు? కావ్యములలో పద్యములు చదివినప్పుడు, కచ్చేరీలలో పాటలు విన్నప్పుడు ఆ యా భావములు మనలో నుద్రేకించుట లేదా? అట్లే నృత్తమునకును శక్తి కలదు గాని మనము దానిని చక్కఁగా పరీక్షింప లే దంతే. మృదంగము మొదలయిన వాద్యములను పాటకచ్చేరీలలో వినునప్పుడు వాయించువాని జుట్టు ఎగుర్లాడుట చూచి నవ్వుచుందుము; ఆడుచున్న బోగముసాని అంగసౌష్ఠవములపై దృష్టి యుంతుము. అట్లుగాక కొంత ప్రయత్నించి ఆ లయపు నడక ననుసరించి పోవుచు దానిచే మన మనస్తత్త్వముపైఁ గలుగు పరిణామములను పరీక్షించు కొంటిమేని కాలమాత్రాలయ ప్రధానమగు ఆ కళకు ఎంత సత్తువ కలదో మనలో సహృదయు లందఱును గమనింపవచ్చును. రుచియైన భోజనము గమ గమలాడునట్లు ముందు తెచ్చిపెట్టినను ఆఁకలి లేనివానికి కాఁబట్టనట్లే తత్త్వము కొంత యెఱిఁగి హృదయమును సంస్కరించుకొని తయారుగా నుండనివానికి ఎటువంటి కళయైనను బూడిదలో హోమ మగును. కావున కళాస్వరూపమును విమర్శించునపుడు అది స్వాభావికమా, కాదా అను విషయమును కేవలము బహిరంగములచేత, బహిరింద్రియములచేత నిర్ణయింపక అంతరంగమును, హృదయమును నమ్మి పరీక్షించిన పక్షమున ఇప్పటి స్వభావవాద మెంత తేలిక యైనదియు మనకుఁ దెలియఁ గలదు.

కాని మనలో నృత్తము నశించినది. కాళిదాసాదుల కాలమునకే అది అంతరించినది. దానిని మరల పామరజనులను జూచి నేర్చుకొనియైన పునరుద్ధారము ఎప్పుడు చేయఁ గలమో, చేయనేలేమో తెలియదు. కావున నాటక విషయమున దానినిగూర్చి చర్చించుట ఇప్పటికి వట్టి సిద్ధాంతపు మాట; వ్యవహారపు మాట కాదు. కావున దాని నట్లుండ నిత్తము. మనలో ఇంకను చావక బ్రతికినవి పద్యములు, పాటలు. పాటలు గూడ మనలో నాటక ప్రపంచమునుండి విడివడి యుండెను. ఏ పార్సీకంపెనీ వారి పుణ్యాననో మరల వచ్చి అతుకుకొని అల్లాడుచున్నవి. వానినిగూడ త్రోసివేయు ప్రయత్నములు జరుగుచున్నవే యను కడుపు చిచ్చుతో మీ కింత గందరగోళము మనవి చేయవలసితిని. కాని నాటకములందు పాటలను, పద్యములను చక్కఁగా యథోచితముగా నిర్వహించు కష్ట మెఱుఁగక పోలేదు.

ఇందు మొదటి కష్టము నాటకము రచించు కర్తది. నాటకమందు ప్రధానమైనది అభినయకళ. అందు సాత్త్వికము, ఆంగికము, ఆహార్యము అను త్రివిధాభినయములను గూర్చి కవి కేమియు అధికారము లేదు. అతఁడు సప్లై చేయునది వాచికాభినయమునకు పనికివచ్చు భాష మాత్రమే. ఆ భాషను పద్యములుగా ఎప్పుడు రచింపవలయును, ఏ పద్యము లేచోట్ల వాడవలయును, దానిని పాటగా నెట్టి సన్నివేశమందు కూర్పవలయును, ఏ రాగములో, ఏ లయలో - ఇత్యాది విషయములను చక్కఁగా భావనచేసి రచించి పెట్టుట వాని పని. కాని ఆ వివేచనా శక్తి గలవారు నాటక కర్తలలో నూటి కొక్క రుందు రంతే. తక్కిన వారందఱును ఇచ్చ వచ్చినట్లు కలిపికొట్టి వ్రాయువారే. ఎవరో, యేచోటనో వ్రాసిరని సమయము దొరకినప్పుడెల్ల అమ్మ, అయ్య అని పాదములను ముగించుచు అసహ్యములైన సీసపద్యములు గుప్పించువారు కొందఱు; త్యాగరాజు కీర్తనలను అచ్చుగొట్టు వారు కొందఱు; పారసీమట్లకు ప్రతిపదములు వేయువారు కొందఱు; జావళ్లకును, జట్కాసాహేబుల వరసలకును అక్షరమును జోడించువారు కొందఱు. ఇంతేకాని వెనుకఁ జెప్పిన మాటకును, పాట పద్యములలోని యెత్తుగడ మాటకును పొత్తు కుదిరినదా యని యైన విచారించి కూర్చువా రరుదు. ఇఁక రాగ తాళములు రసభావములను పోషించుచున్నవా యని విమర్శించు మాట చెప్పఁ బనిలేదు.

ఇఁక రెండవ కష్టము నటులది. వారి కేమైన కొంత సంగీతము అ ఆ ఇ ఈ లు వచ్చి యుండెనా - అమరకోశమున మాత్రము నిలిచియున్న హాహా హూహూ గంధర్వులు సాక్షాత్తుగా మనయెదుట ఆవిర్భవించినట్లై కచ్చేరీలకు మొదలుపెట్టి తబలా హార్మోనియము వారితో స్పర్థకు నిలిచి రసరంగమును రణరంగముగా మార్తురు. కవి, కథ, పాత్రములు వీనిగతి యేయేటఁ బోయినను వారికి చింతలేదు. అభినయవిద్యయం దసాధారణ చాతుర్యము గలిగి ఇప్పటి కర్ణాటకనటుల కనేకుల కాదర్శప్రాయుఁడుగా పరిణమించి అర్హతకు దగిన మహాప్రఖ్యాతినందిన వరదాచార్యునివంటి వారియందే ఈ గుణము ముదిరి అసహ్యముగా నుండెడిది. ఇఁక సామాన్యులమాట యేల? మాటకుఁ దగినపాట యొక వేళ కవి వ్రాసినను దాని రాగ లయల విలువ నెఱిఁగి తగినంత నియమములో, స్వరభేదములతో పాడి రసభావములను పోషించుశక్తిగల నటు లిప్పుడే కాదు ఎప్పుడైనను కొందఱే. నేను జూచిన నటులలో - నేను చాల మందిని చూడలేదను మాట సత్యము - ఒక స్థానం నరసింహారాయలకే యీ రహస్య మర్థమైనట్లు తోఁచినది.

ఇఁక మూఁడవ కష్టము మనది; అనఁగా చూచు సభ్యులది. నా భార్య యింటిలో ఎట్లేడ్చునో నలుని భార్యయు నట్లే యేడ్వవలయునే కాని ఒక్క కన్నీరుబొట్టుగూడ ఎక్కువగాఁగాని, తక్కువగాఁగాని కార్చరాదని తలఁచువారిని, స్వభావమను పదార్థమునకుఁ గల లోఁతును దిగిచూడకయే ఇది స్వాభావికము, అది అస్వాభావికము అని నిర్ణయించు కొన్నవారిని, తమ హృదయతత్త్వమును బరీక్షింపక యెవరో చెప్పిన అపసిద్ధాంతములనే పట్టుకొని అల్లాడువారిని రంజింపఁ జేయుట చాల కష్టము. మనవారికి పద్యములు, పాటలు రుచింపవని కాదు. కవిత్వమును వారు మెత్తురు; పాటకును పరవశులు కాఁగలరు. నాటకములం దీ రెంటికిని దేవుని సాక్షిగా చో టీయఁ గూడదని మొండిపట్టు పట్టుదురు. ఇది రుచిలోపము కాదు. అభిప్రాయలోపము. ఇఁక నాటకములందు పై రెండు ఉండవలయు ననువారు కొందఱితో మఱియొక కష్టము. వారి పాలిటికి ప్రాస యమక శ్లేషాది పూర్ణములై నాట్యమును కొంత ప్రొద్దట్లుండనిచ్చి నిఘంటువులను చూచు నట్లు చేయఁజాలినవే పద్యములు.

అరయరే తరుణి నిర్ఝరిణులార ప్రమత్త
కరిణులార విభీతహరిణులార ... 4

ఇటువంటి పద్యములు వ్రాసినందుకు కవినీ, ఆప్రాసము లట్లే చెక్కు చెదరక యొత్తిపాడిన నటునీ వారు 'బలే' యందురు. పాటలందును ఇట్లే.

ఇట్లనుటచే పద్యములును, పాటలును నాటక ప్రపంచము నుండి బహిష్కారము చేసిన బాగేమో యనిపించుట సహజము. కాని యిట్టికష్ట మెందులో లేదు? నాటకకళకు మూలవస్తువగు అభినయములో లేదా? భావము తీవ్రముగా నున్నచోట జాలి మొద్దులువలె నిలుచుకొనువారు లేరా? సామాన్య భావమునకుఁ గూడ పంచప్రాణము లెగిరి పోవునట్లు, రక్తనాళముల బిగఁబట్టి, పండ్లుగొఱికి, మొగము సిండ్రించుకొని, వెంట్రుకలు గుంజుకొని, కనుగ్రుడ్డులు తేలవేయు వారు లేరా? వన్నె వేసికొనుటలో మొగమంతయు తెగఁ దిక్కిన తామ్రపు చెంబువలె వికారము చేసికొనువారు లేరా? సదుపయోగశక్తి లేక దురుపయోగశక్తి గలిగి యుండిన యెడల ఏ వస్తువు నైనను జెఱుపవచ్చును. ఒక కవిత్వ సంగీతములను మాత్రమేనా? అట్టిచో మొదటిశక్తిని వృద్ధి చేసికొని రెండవదానిని వదలుటకు ప్రయత్నము చేయుట ధీరగుణముగాని అసలు పదార్థమే వదలుట కళావంతులవంటి తపస్వులకు తగనిపని. మరల నొకమాఱు నా మనవి యేమనఁగా: స్వభావము అనునది అమేయము, అగాధము. దాని మేర యింతే యని యెఱుఁగ నెవరితరమును గాదు. మఱి సాధ్యమైనంత దాని లోఁతును జూచుటయే కళలపని. కాలుపెట్టి చూడని యెడల అది అంతరగంగ కప్పిన బావివలెఁ గానవచ్చును. అంతకే మోసపోరాదు.

మధ్యవర్తి వివేకులు కొందఱు ఈసందర్భమున ఒక కోమటి తీర్మానము చెప్పుదురు; ఏమనగా: "గంభీరములు, తేలికయైనవి యని రూపకములు రెండు విధములు. మొదటి తరగతిలో పురాణకథలను, చరిత్రకథలను బట్టి వ్రాసిన నాటకములు చేరును. సాంఘికనాటకములు రెండవ తరగతివి. అనఁగా సమకాలీన జీవితము నాశ్రయించి వ్రాయఁబడినవి. గంభీరనాటకములలో పద్యములు, పాటలు ఇష్టమున్న వేసికొనుఁడు. కాని రెండవ తరగతి వానిలో మాత్రము అవి అసందర్భములగును" 5 అని. అస లీ విభాగమే నా కర్థము కాలేదు. నేఁటి జీవితము రేపటికి చారిత్రము, మర్నాటికిఁ పురాణము. ఇది కేవలము విభాగ ప్రియులగు విమర్శకులకు, లాక్షణికులకు తృప్తికరమగునేమో కాని రసికులకు నిరర్థకము. రసము గల్గింపఁగల సన్నివేశములు నిన్న మొన్నటివలె నేఁడును గలవు. రసము ననుభవించి యానందించు సత్త్వమును మనకుఁ గలదు. ప్రాచీనులకును, మనకును ప్రమాణములో భేదమున్నది. వారు పూటకు రెండు సేర్ల అన్నము భుజించిన, మనము పావుసేరు భుజింతుము. కాని ఆఁకలివిలువ యిద్దఱకును ఒకటే. ఆ కాలపు తల్లులు నూర్లకొలది బిడ్డలను గనిన, మన తల్లులు నలుగు రైదుగురు పిల్లలఁ గందురు. కాని మాతృవాత్సల్య మొకటే. వారు నమ్మిన విషయములను మనము నమ్మకపోవచ్చును గాని నమ్మిన విషయములందు మనోబల మొక్కటే. బహిరంగములలో భేదముండవచ్చును గాని అంతరంగమందు లేదు. అదియే కళావస్తువు జీవనము గదా! అది యొక్కటి సృష్టిలో నుండువఱకును, ఏ కళగాని స్వతంత్రముగా, సంపూర్ణముగా దానిని అనుకరింపఁ జాలదనుట సత్యములలో సత్యము. కాఁబట్టి ఆధునిక సమకాలీన జీవన మందలి తత్త్వమును కేవలము మాటలు, అభినయము వీనితోనే నిర్వహింపఁ గలమనుట నాకుఁ జూడఁగా అర్థములేని అహంకారము. పాటలు, పద్యములును ఇందు చేరుట అస్వాభావికమనుట మన స్వభావజ్ఞాన మింతయనియే తెల్పునుగాని వేఱుకాదు. కనుక సమకాలీన జీవితము నాశ్రయించిన నాటకములు 'తేలిక' గా నుండవలసిన పనిలేదు. అవియును గంభీరములే యగును. గంభీరమగు భావరసములను గ్రహించి కూర్పఁ గల్గినచో, ఇఁక తేలికగానుండు నాటకములు లేవని కాదు, తేలికయైన విషయములు ఏకాలమందును గలవు. వానిని గ్రహించినప్పుడు నాటకములు తేలిక కాక మానవు. మఱియు, కవులకు నటులకును తెలివిలేకున్న రెండును తేలిక యగును. ఎన్నియో పురాణ చరిత్ర నాటకములఁ జూచిన నాకు నవ్వు వచ్చును. వానిలో పనికిమాలినచోట్ల పద్యములు, పాటలు నించియుండుట చూచి, వానిని చక్కఁగా పాడలేని నటులనుజూచి దుఃఖము వచ్చును. అది యట్లుండె.

రంగస్థలమున స్త్రీపాత్రములను స్త్రీలే వహింపవలయు నను పైస్వభావవాదముయొక్క వేఱొకపరిణామమును గూర్చి రెండు మాటలు మనవి. దీనిని రెండు త్రోవలఁ బరీక్షింపవలసి యున్నది. ఒకటి కళ, రెండవది నీతి. కళాదృష్టితోఁ జూచిన పక్షమున స్త్రీలు రంగమున కెక్కుటచేత అభినయకళ వృద్ధి నొందినదని చెప్ప వీలు లేదు. కారణమేమనఁగా, కళ వ్యక్తికిఁ జేరినదిగాని జాతికిఁ జేరినది గాదు. స్త్రీజాతిలోఁ బుట్టిన మాత్రమున స్త్రీత్వమును చక్కఁగా నభినయింపఁగలరని చెప్పుట కెవరును సాహసింపరుగదా! నే నెందఱో స్త్రీలు అభినయించుట చూచినాను. వారిలో చాలమంది యత్నముచేత స్త్రీలుగా నున్నారేకాని అభినయమును జూచినచో వారు స్త్రీలునుగారు, పురుషులునుగారు. అట్లే పురుషులందరును పురుషపాత్రమును సరిగా నిర్వహింపలేరనుటయు మన మందఱమును చూచిచూచి వేసరిన విషయము. వారిలోఁ గానిఁ వీరిలోఁ గాని కొందఱికే అభినయ శక్తి యుండును. తమలో లేనిధర్మము నారోపించుకొని యనుకరించుటయే కళాకౌశల్యమందలి ముఖ్యతత్త్వ మనుటయు అందఱెఱిఁగినదే. అట్లున్నప్పుడు అట్టియభినయశక్తి గల వ్యక్తి పురుషుఁడైన పురుషపాత్రమునే, స్త్రీయైన స్త్రీ పాత్రమునే వహింపవలయునను నిర్బంధమేమి? పురుషులు స్త్రీపాత్రమును చక్కఁగా నిర్వహింపలే రనుట అనుభవ విరుద్ధమైన విషయము. స్థానం నరసింహారావు, మైసూరు శామణ్ణ 6 మొదలగువారు స్త్రీ మనస్తత్వమును జూపుటలో ప్రదర్శించినశక్తి చూచినవా రందఱును ఎన్నఁడు మఱవ రానిది. పురుషుఁ డెంత నాజూకుగా వేషము వేసికొన్నను అచ్చపుటాఁడుదానివలె కానరాఁడనుట కొంతవఱకు సత్యమే. కాని అచ్చపు టాఁడుది యనఁగా ఇట్టిది యని చూపుటకా రంగస్థల మేర్పఱచినది? అమ్మలు, అక్కచెల్లెండ్రు, ఆలుబిడ్డలు ఇంటిలో లేరా? ఇరుగు పొరుగువారికి నుండరా? వారి ఆఁడతనములో మనము చూడని అచ్చమును వారిని రంగమున కెక్కించినమాత్రాన చూఁడగలమా? మఱియు ఈ అచ్చపు ప్రశ్న ఒక ఆఁడవేషమునకేనా వచ్చినది? ముసలివేషము వేసినవారిలో చర్మమునకు ముడుతలు చూపఁగల యభినేత యున్నాఁడా? అందుకై ముసలివానినే యేఱితెచ్చి ఆ వేషమునకు నియమింతురా? అట్లయిన దుష్యంతుని వేషమునకు దొరనే యెవనినైనఁ బట్టుకొని రావలయును. ఇఁక హనుమంతుని వేషమునకు రావలసిన దెవరు? ఈ వ్యవహారము తెగుట యెప్పటికి? అభినయించునది నిజముగా ఆడఁదా, మగవాఁడా యను చింత కళానుభవముగల రసికులకు కలుగనే కలుగదు. కొందఱికి కలిగినను వారికి సంస్కారము చాలదనియు, అచ్చపు టాఁడువారిని జూడవలయునన్న వారు పోయి చూడవలసిన చోటు వేఱనియు చెప్ప వలసియుండును. ఇఁక నాయకవేషము ధరించినవానికి నాయికాపాత్రము వహించి యుండునది నరసింహారావుగాని నరసమ్మగాదని నిరుత్సాహము జనించునేని అట్టివానికి రంగస్థలము మెట్లు త్రొక్కుట కధికారము లేదంతే. కాఁబట్టి స్త్రీ పాత్రమును స్త్రీలే వహించుటవలన కళకు ప్రత్యేకమగు మేల్మి యేమియును లేదు. అభినయించువారి సంఖ్యను పెంచినట్లగు నంతే. వారి కభినయశక్తి కలదేని మగవారివలె నన్నిపాత్రములను వహించు నవకాశమును కల్పింపవచ్చును. కాని యిదివఱ కెవరును ఆ యౌదార్యమును వారి యెడల చూపినట్లు కానము. ఏల? అవకాశ మిచ్చి చూడుఁడు. మగవారు మగపాత్రను వహించి చూపు నభినయముకంటె ఆఁడవారి పురుషపాత్రాభినయము ఏమిటను తక్కువగా నుండదనుట నా నమ్మకము.

ఇట్లు కళాదృష్టితోఁ బరీక్షించితిమేని స్త్రీలు రంగమున కెక్కుటచే కళకు విశేష లాభ మేమియు లేదని యేర్పడఁగా నీతిదృష్టితోఁ జూచినపుడు గొప్పనష్టము గలదనియు మనము గమనించిన విషయమే. కళాప్రపంచమున నీతిదృష్టి యెందుకని ప్రశ్నించువారు లేకపోలేదు. మనుష్య జీవితమునకును నీతికిని వీడరాని సంబంధ ముండఁగా మనుష్యుఁడు ఆత్మక్షేమమునకై సృజించు కళమాత్రము నైతిక ప్రపంచము నుండి పూర్తిగా ఎట్లు వేఱుపడునో నాకర్థము కాదు. మఱియు స్త్రీవేషములు స్త్రీలే ధరించి పురుషులతో రంగమందు వ్యవహరించుటవల్ల చూచువారి నీతి కంతగా నష్టము లేదు. కథాప్రవాహమునఁ దన్మయులై యుండువారికి సావిత్రి వేషము వేసినది ఏసానియైనను, సంసారియైనను రసానుభవమునందు భేదముండదు. వారు రంగముపై సంబంధము గలిగియుండునది ఆరోపితమైన పాత్రముతోనేకాని అసలువ్యక్తితోఁ గాదు. మఱి యీ నీతిప్రశ్న నటుల యోగక్షేమములఁ గూర్చినది. అభ్యాస కాలమందును, అభినయించు నప్పుడును వారు పరస్పరము చాల సమీపముగా వ్యవహరించ వలసినవారు. అభినయించునప్పుడును భావము లెంత తీవ్రముగా నున్నను తమతమ స్వరూపములను కొంచెమును ఏమఱక యుండువారు; ఉండవలసినవారు. అట్టిచో నిజమైన భార్యాభర్తృసంబంధము లేని స్త్రీపురుషులు రంగమున అనేక విధముల వ్యవహరించునపుడు వా రొకరొకరి వలపులో పడకయుండుట సామాన్యముగా అనుభవమునం దసాధ్యమైన విషయము. "స్త్రీపురుషుల పరస్పరాకర్షణశక్తి దూరదూరముగా నున్నప్పుడే యుండును గాని వారికి సామీప్యవర్తన మధికమైనట్లెల్ల, మైత్రి పెరిగినట్లెల్ల అది కృశించును, కావున నీతికి భంగము లేదు సరికదా భద్రమే యెక్కువ" యనువాదము సత్యమని నమ్ముధైర్యము నాకు లేదు. పరస్పరాకర్షణ యీ రెండుజాతులకును సృష్టిమూలమై బలవత్తరమైన ధర్మము. దూరముగా నున్నప్పుడే యుదాసీనత యెక్కువ యనియు, సమీపించినట్లెల్ల రూపగుణాది విశేష ధర్మములచే కొన్నిచోట్ల కృశించినను, మఱికొన్నిచోట్ల దాని ప్రాబల్యము మఱింత యధికమగుననియు చెప్పుటయే యెక్కువ సత్యమను విషయములో నాకు సందేహములేదు. ఇది సాధారణ మనుష్యుల మాట. విశేషవ్యక్తుల చింత మన కప్రకృతము. ఇప్పటికిఁగాని, యెప్పటికిఁగాని నాటకములలోఁ జేరి యభినయించు నటు లందఱును నావంటి నామాన్య మనుష్యులే కాని మహర్షులు ప్రాయికముగా కారు; మహాపాపులును గారు. అట్టివారిట్టి అగ్గితో చెరలాటము - కత్తిమీఁద సాము చేయుట, వారిని చేయనిచ్చుట సామాన్యమైన సాహసము గాదు. సంఘముయొక్క ధర్మమునుగాదు. నీతి సామాన్య మనుష్యుల దేహ మనస్సులను ఆరోగ్యముగా నుంచుట కేర్పడిన కట్టుఁబాటు. ఆ యారోగ్యమును చెఱుచు విషబీజములలో ముఖ్యమైనది స్త్రీపురుషుల స్వచ్ఛంద వర్తన మనుట అంద ఱన్ని కాలములందును అనుభవించి యంగీకరించినదే. దానిని మన మల్పముగా చూడవచ్చునా? ప్రోత్సహించ వచ్చునా? మనలో ఈ విషయమున నీతిశాస్త్రములు అనావశ్యకమైన, అన్యాయమైన నిర్బంధముల నేర్పఱిచినవి గావున వానిని అక్షరశః గమనించి నడచుట పొరఁబాటని కొందఱు వాదింతురు. కొంత నిజమే. కాని అట్లు వాదించువారును ఏవో కొన్నియైన నిర్బంధములను పెట్టుకొనక తీఱదు. లేకున్న నీతికిని, కామవర్తనకును సంబంధమే లేదని చెప్పవలసి వచ్చును. మనుష్యుల దేహ మనస్తత్వముల నెఱిఁగి యోగక్షేమ చింతగల యేవివేకిగాని యట్లు చెప్పఁడని నా నమ్మిక. కావున అట్లు మనము ఈవిషయమున నుంచు కొనవలసిన కట్టుపాటు లేవి? పరపురుషుఁడు పరస్త్రీతో ఎంతవరకు వ్యవహరింపవచ్చును? ఏ మేర మీఱినప్పుడు నీతికి భంగము? ఆ మేర మీఱకుండుటకై పుచ్చుకొను జాగ్రత్త యెట్టిది? ఇత్యాది ప్రశ్నలకు తృప్తిగా, బహిరంగముగా సమాధాన మీయవలసి యున్నారు నీతిశాస్త్ర సంస్కారులు. ఆ నిర్ణయము చేయక మునుపు ఇట్టి తెగువపనులకు చేయి వేయుట సంఘవిషయమున చేయు గొప్ప యపరాధము. ఇఁక ఇట్టి నిర్ణయమునకు మనుష్యసంఘ మంతయు వచ్చుట యెన్నఁడు? అంతవఱకును స్త్రీలను రంగమునుండి దూరముగా నుంచవలసినదేనా? అను ప్రశ్న వచ్చును. మనుష్యజాతి కంతయు ఒక నీతిశాస్త్ర మేకాలమందును లేదు. కాని నీతిని సంపూర్ణముగా ఉదాసీనము చేసిన జాతి యే దేశమందును, ఏకాలమందును ఉండదు. ఆ యా సంఘములందలి నాగరకత ననుసరించి, నీతికి భంగము కలుగు వేఱువేఱు సన్నివేశముల ననుసరించి, వేఱువేఱు విధములుగా వారు దానిని పదిలము చేసికొందురు. అట్లు మీరును నీతిని నమ్మినవారేకదా! దానికి భంగము రానీక మీరు చేసికొన్న కట్టుపాటులేవి యనుట బహిరంగముగా చెప్పుడనుటయే నాప్రార్థన. ఆఁడువారు పురుషులతోపాటు రంగమెక్కక దూరముగా నుండిన పుట్టి మునిఁగిన దేమియు లేదు. లేదా, స్త్రీలే ప్రత్యేకముగా తమ యభినయకళను బ్రదర్శించు మార్గము కల్పించు కొనవచ్చును.

మఱియు నీతి సాధింపవలసిన ధర్మముకాని సహజమగు గుణముగాదు. దేనిని సాధింపఁ బూనుకొందుమో దానిని విఘ్నము గలిగించు సన్నివేశములనుండి సాధ్యమైనంత వఱకు తప్పించుకొని పోయినపుడే మన ప్రయత్నము కొంత వఱకైన నెగ్గును. నీతి మంతులని పేరుపడినవా రందఱు చేసిన పనియు, చేయఁగల పనియు ఇంతేకాని వేఱుకాదు. కాబట్టి నాటకములందు స్త్రీలను చేర్పనివారందఱు చాల నీతిమంతులుగా నున్నారా యని యెవరైనను ఎగతాళి ప్రశ్న వేసిరేని దాని కర్థము లేదు. దుర్నీతి కలుగు అవకాశమును ఆ యింతమాత్రములో దూరముచేసినవారు వా రనుట సత్యమనక తప్పదు. ఇట్లే నాటకములందు చేరిన స్త్రీపురుషు లందఱు నీతికి దూరులా యనుటయు పిల్లతనపు ప్రశ్నయే. అట్టి సన్నివేశములలో ప్రాయశః నీతికి భంగము కలుగ వచ్చుననుటయే మన వాదము. అంతకన్న ఎక్కువగా అట్టి స్త్రీపురుషుల జీవితముగూర్చి మనము తెలిసికొనలేము; అక్కరయును లేదు. వారును మనవంటి రక్తమాంసమయమగు మనుష్యులే కావున మనకుఁ గల కామక్రోధాదులు వారికిని గలవని యూహించుటచే, అట్టి సన్నివేశములందు మనమే యుంటిమేని హృదయదౌర్బల్యము నడఁచుకొని నీతిని నిలుపుకొనఁగల స్థైర్యము మన కుండదను నమ్మికచే ఇట్లు వాదింపవలసి యున్నది. రంగస్థలమున నిప్పుడు కలియుచున్న స్త్రీపురుషు లందఱు జితేంద్రియులగు అసాధారణ వ్యక్తులని ప్రపంచమునకు స్పష్టమయ్యెనేని అప్పు డిట్టి ప్రశ్నలు రంగమందుఁగాని, బైటఁగాని రానే రావు. ఎందఱు మీరాబేనులు, ఎందఱు నీలనాగిణులు ఏకాంతమందు పరివారించి యున్నను ఆ మహాత్మగాంధినీతిని ప్రశ్నించు నక్కర గాని, ధైర్యముగాని యెవరికిఁ గలదు?

ఈ విషయమున ఆంధ్రనాటక పితామహుఁడు రామకృష్ణమాచార్యుల యభిప్రాయ మెట్టిదో తెలియు వీలు నాకు లేదు. కాని వారి సరసవినోదిని సభలో ఎప్పుడుగాని స్త్రీ నటులను వారు జేర్పకయుండుట ప్రసిద్ధ విషయమే. కావున వా రిప్పుడు జీవించియుండు భాగ్యముండిన నాతో ఈవిషయమున నేకీభవించి యుందురను పేరాస నాకుఁ గలదు. శ్రీ కోలాచల శ్రీనివాసరాయలును తమ సుమనోరమసభలో స్త్రీలకు చోటియ్యలేదని విన్నాను. కాని వారి 'ప్రపంచ నాటక చరిత్ర'లో 'ఇంగ్లీషు స్త్రీలయంత మనస్త్రీలు చదువు కొనువఱకు, వారియంత నాగరకత మనము సంపాదించు కొనువఱకు మనస్త్రీలు నాటకరంగ మెక్కరాదని నా పేరాస" అని వ్రాసిరి (పు. ౧౨౫). అనఁగా తరువాత ఎక్కవచ్చు నన్నమాట. కాని చదువు, సంప్రదాయములు వేఱు, నీతి వేఱు. చదివిన నాగరకులందఱు చదువని అనాగరకులకన్న ఎక్కువ నీతిమంతులుగా నున్నారని చెప్పు ధైర్యము నాకు లేదు. ఇది మన స్త్రీలను గూర్చి మాత్రము చెప్పవలసిన మాటకాదు. ప్రపంచమందలి స్త్రీపురుష సామాన్యులకును సంబంధించిన సమస్య యిది. ఇంగ్లండు మొదలగు దేశముల లోని నట స్త్రీపురుషులు మనదేశమువారికన్న ఎక్కువ నీతిమంతులని ఆదేశములకు పోయి చూచివచ్చిన యెవరుగాని దృఢముగా నాతోఁ జెప్పలేదు. నేను ఎఱిఁగినంతవఱకును వారి సాహిత్యమున ప్రతిఫలించిన సంఘజీవితముఁ జూచిన అట్టి నమ్మికకు అవకాశము లేదు. ఇన్నాళ్ళవలె ఏనలుగురు ఇంగ్లీషువారో, లేక వారి యుప్పుదిన్న కింకరులో యీ దేశమునకు వచ్చి, ఆచార్యపీఠము నధిష్ఠించి పాశ్చాత్యదేశము లన్నియు పవిత్రమూర్తులని, నీతి న్యాయము లచ్చటనే అవతరించినవని వర్ణించి ప్రబంధకవిత్వ కల్పనలతో ఇప్పుడు మనలను బేలుపుచ్చుటకు సాధ్యముకాదు. నైతికముగా వారి సంఘమందు జరుగుచున్న యల్లకల్లోలమును వారి సాహిత్యమే కన్నులుగలవారి కందఱికిని ఘంటాఘోషముతో చాటుచున్నది. కాబట్టి శ్రీనివాసరావుగారి యాశ నాకు లేదు. స్త్రీపురుష వ్యవహారమునకును, నీతికిని సంబంధముండువఱకును నేఁడుగాని, రేపుగాని ఆ యిరువురును అన్ని సన్నివేశములందును చాల మెలఁకువతో సంవ్యవహారము నడువక తీరదని నా దృఢాభిప్రాయము.

స్త్రీజాతి విషయమున నింతటి యధికారమును ఈ యిరువదవ శతాబ్దమునఁగూడ చెలాయించుట నాగరకత లక్షణము గాదని యొక వాదము. కాని నా వాదము స్త్రీలకు మాత్రము సంబంధించినది గాదు; మనుష్యజాతి సామాన్యపు యోగక్షేమములఁ గూర్చినది. స్త్రీపురుషులలో ఒకరు చెడి యొకరు పవిత్రులుగా నుండుట యెన్నఁడును సంభవింపదు. చెడిన నిరువురు జెడుదురు; తప్పిన నిరువురును తప్పుదురు. కాఁబట్టి యీ విషయమున ఎక్కువ తక్కువ లెవరికిని లేవు. మఱియు మాతో మీరు రంగమున కెక్కవలదని మగవారు చెప్పుట స్త్రీలపై నధికారము చెలాయించుట యగునేని, మీజతకు మేము రామని తిరస్కరించు నధికారము స్త్రీలకును కలదుగావున ఇరువదవ శతాబ్దపు నాగరకత భద్రముగానే యుండును, దీనికిఁ దోడు స్త్రీలే ప్రత్యేకముగా అభినయ సంఘములను స్థాపించుకొనిరేని మగవారిని రావలదని నిషేధించు నధికారమును వారి కబ్బినట్లయి తూనిక సరిపోవును. మఱియు అధికారము చలాయించుటయే యపరాధమా? అట్లేని మగవారి నీతిరీతులను గూర్చి మగవారిప్పు డెన్ని విధముల నపరాధ పడుచుండలేదు? ఆఁడవారిని గూర్చినప్పుడు మాత్రము ఈజోలి మనకేల యని యూరకుండ వలయునా? ఏల? వారేమి యేయడవులలోనో వసించు మృగజాతివారా? మనుష్యులు కారా? వారును వీరును కలసిమెలసి యుండవలసి యుండఁగా, ఇద్దరికిని పరస్పర సహవాసమున లాభనష్టము లెన్నోయుండఁగా, దానికిఁ దగినట్లు వ్యవహారపు నియమముల నేర్పఱచుకొనుట అనాగరకత యగునా? నియమములేని స్వేచ్ఛావర్తనమే నాగరకతయేని యది యెంతత్వరలో నశించిన నంత క్షేమము.


1[1] మాలవికాగ్నిమిత్రము అం.౧, ప.౪
వెనక్కి

2[2] భాషలేని వట్టి వాద్యసంగీతమందును, అంతకన్న నెక్కువగా అభినయమున కవకాశములేని గ్రామఫోనుల పాటలందును మనకుఁ గల యతృప్తి స్పష్టమే.
వెనక్కి

3[3] ధ. కృ. గారి 'పాదుకాపట్టాభిషేకము'.
వెనక్కి

4[4] ధ. కృ. గారి 'చిత్రనళీయము' అం. ౩. ప. ౩.
వెనక్కి

5[5] Tragedies and Comedies.
వెనక్కి

6[6] మైసూరుమహారాజుల నగరి యాజమాన్యమున కొన్నేళ్ళక్రిందటివఱకు సుప్రసిద్ధముగా నుండిన శ్రీచామరాజేంద్ర కర్నాటక నాటకసభలోని యసాధారణాభినేతలో నొక్కఁడు; ఇప్పుడు కీర్తిశేషుఁడు.
వెనక్కి

AndhraBharati AMdhra bhArati - nATakOpanyAsamulu - 1
rALlapalli anaMta kR^iShNa Sarma- Rallapalli Anantha Krishna Sarma- telugu vachana sAhityamu - upanyAsamulu vyAsamulu - ( telugu andhra )