వచన సాహిత్యము ఉపన్యాసములు నాటకోపన్యాసములు - ౨
శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ

ఈ యుపన్యాసములు రెండును బళ్లారిలో ౧౯౩౪ అక్టోబరు ౨౦ - ౨౧\ తేదులలో,
మునిసిపలు హైస్కూలువారి యాజమాన్యమున జరిగిన
కృష్ణమాచార్య - శ్రీనివాసరాయల
స్మారకోత్సవ సందర్భమునఁ జేసినవి.

భారతి ౧౯౩౫ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ (సంపుటి ౧౨ - సంచికలు ౧, ౨, ౩, ౪)

నాటకములు తెలుఁగులో వ్రాయుటకు పునాదివేసిన యగ్రేసరులలో కీర్తిశేషులగు ధర్మవరము రామకృష్ణమాచార్యులును, కోలాచలము శ్రీనివాసరాయలును గణనీయులు. తెలుఁగు రూపకముల చరిత్ర వ్రాయువారు వీరి పేరులు మఱచుటకు వీలులేదు. కృష్ణమాచార్యులే మొదట తెనుఁగు నాటకము రచింప నుపక్రమించిన ధీరుఁడని కొందఱి నమ్మిక. కాదనియు, ఆ మర్యాద వీరేశలింగము పంతులకో, మఱియెవరికో చెల్లవలయుననియు మఱియొక వాదము. దీనిని నిర్ణయించు నాధారములు ప్రకృతము నావద్ద లేవు. "ఈ సభ (సరసవినోదిని సభ) యుద్భవించి 'చిత్రనళీయము' రచించు వఱకు నీ భాషయందు స్వతంత్రనాటకము లుండలేదు" అని కృష్ణమాచార్యుఁడే యొకానొక కరపత్రమునఁ బ్రకటించెను. అనఁగా అదివఱకున్నవి వీరేశలింగము పంతులు మొదలగువారి సంస్కృతాంగ్ల నాటకముల పరివర్తనములేనా? చెప్పలేను. మఱియు ఒకవేళ కృష్ణమాచార్యుఁడే ఆంధ్రమున ఆది నాటకకర్తగా ఏర్పఱుపఁ గలిగినను అది యంతగా గర్వపడవలసిన విషయముగాని, దుఃఖపడవలసిన విషయముగాని కాదని నా తలపు. ఎందుకనఁగా ౧౮౫౩- వ సంవత్సరమునకు కొంత ముందుగానో వెనుకనో ఆయన జనింపకపోవుట ఆకస్మికమే తప్ప అతని తప్పొప్పులుగావు. మఱి యెవరివియుఁ గావు. కాఁబట్టి కేవలము కాలమునుబట్టి కార్యమునకు విలువ గట్టుట ప్రాయశః కృత్రిమమైన దురభిమానములను బెంచునే కాని హార్దమగు గౌరవప్రీతులను బెంపదు. ఇఁక శ్రీనివాసరాయల విషయమున ఈవివాద మున్నట్లు లేదు. కృష్ణమాచార్యులకన్న కొన్ని నెలలు మాత్రము వీరు చిన్నయైయుండి బ్రతికియున్నన్ని నాళ్ళును నాటకరచన ప్రధానకార్యముగా ఇంచుమించు వారు వ్రాసినన్నియే నాటకములు రచించిరి. కాని వీరు నాటకరచన నికరముగా ఎప్పు డుపక్రమించి రను తేదీ నాకింకను తెలియలేదు. ప్రకృతము నా పనికి అక్కరయు లేదు.

నాలుగునాళ్లు వెనుకముందుగా ఎవరు వ్రాసినను, వ్రాయకున్నను ౧౯-వ శతాబ్ది ముప్పాలు కడచువరకును మనలో నాటకము లెవరును రచింపకపోవుటకు సంకోచింపవలసి యున్నదే కాని వ్రాసినవారిలో నెవఁడు మొనగాఁడను చర్చకుఁగాని, అహంకారమునకుఁగాని యర్థ మెక్కువ లేదు. అప్పటికి రెండువేల యేండ్ల క్రిందనే సంస్కృత ప్రాకృత భాషలలో అపూర్వమైన నాటకరత్నము లెన్నో పుట్టియుండి, నాటకమనఁగా నేమి యని తెలియనివారుగూడ లక్షణగ్రంథము లనుజూచి రచించునంతటి యధోగతికి ఆవిద్య దిగియుండెను. సంస్కృతభాషలో నున్నవానివంటి యుత్తమనాటకములు గాని, అధమనాటకములుగాని యే భాషలోనైనను ఇప్పటికైనను గలవా యను సందేహము నాకున్నది. తెలుఁగు సాహిత్యములో పనిచేసిన వా రందఱును సంస్కృతసాహిత్యమందు కొంచెమో గొప్పయో పరిచయము గలవారే. అట్లున్నను మొన్న మొన్నటివఱకు తెలుఁగురూపకములు యక్షగానముల యంతస్తును దాఁటి పెరుగకపోవుట తెలుఁగువారి యధైర్యమును, చాదస్తమును, సోమరితనమును దెలుపునేకాని వేఱగునా? లక్షణదృష్టితో చూచితిమేని తెలుఁగులో నాటకములు వ్రాయఁదలఁచిన వారు చేయవలసిన పనియెల్ల ఆ భాషలోనుండి ఈ భాషకు అర్థభావములు మార్చుటయే. తక్కిన సామాన్య లక్షణమగు గద్య పద్య రచన మనవారికి క్రొత్తగాదు. ఐనను పందొమ్మిదవ శతకపు తుదలో ఆంగ్లసాహిత్య వ్యాసంగము స్థిరముగా నిలిచి స్వతంత్ర బుద్ధిని ప్రేరేచి నరముల నల్లాడించువఱకును మనవారు మేలుకోలేదు. మనవారిని మాత్రము దూరనేల? భరతఖండములోని యన్ని భాషలవారిగతియు నట్లే యున్నట్లున్నది. అట్లు మేలుకొలుపులకు చిక్కి లేచి నాలుగుదిక్కుల పరువులెత్తిన కార్యశూరులలో మన కవిద్వయమును జేరి పనిచేసిరి. అది పందెము వేసికొని యెత్తిన పరువుగాదు. ప్రవాహమునకు చిక్కికొట్టిన పరవశమైన యీఁత. నాలుగుగడియలు నాలుగడుగులు ఎవరు వెనుక ముందైనను దానికి విలువలేదు.

వా రా మార్గమున ఎంతదూరము పోయిరి? ఏమేమి సాధించిరి? ఏమేమి వదలిరి? వారి మార్గము ప్రకృతము మన మెంతవఱకు ననుసరించవచ్చును? అనునదే సింహావలోకన న్యాయమున ప్రకృతము మనము చేయవలసిన చర్చ. ఇది వారియందలి గౌరవముచేఁగాని, యీర్ష్యచేఁగాని చేయు గుణదోషవిమర్శ కాదు. ఆ దృష్టిచే కీర్తిశేషులగు ఆ యిరువురు మహనీయులకు ఎట్టి లాభనష్టములు గలుగఁ జాలవు. మఱి వారు చూపిన మార్గముననే పోవుచు, వారివలె యథాశక్తిగా ఆంధ్రసాహిత్యమందు పనిచేయుచునో, చేసిన, చేయుచున్న వారి పనుల ఫలము ననుభవించుచునో యున్న మనకు ఆంధ్ర నాటక రచనా శిల్పము నింకను పెంచి పెద్ద చేయవలయునని కోరికకలదు. దాని పరమావధిని దాఁకు పేరాశ కలదు. కావున ఇప్పుడు మన యనుకూలమునకై ఆత్మసాక్షికముగా వారి పను లొక్కమాఱు కలయఁ జూచుట తప్పనిసరి.

ఆంగ్ల సామ్రాజ్యము మనదేశమున తేజోవంతమై వేఱూని చోటు చేసికొనుచుండిన కాలములో వీ రిరువురును, జనించినవారు; దాని ఫలమగు స్వస్థతను, శాంతిని పూర్ణముగా ననుభవించినవారు; ఆంధ్ర సంస్కృత సాహిత్యములకు తోడు ఆంగ్లసాహిత్యమును చక్కఁగా చదువుకొన్నవారు; ఆ సామ్రాజ్యమున కెదురుతిరిగిన దేశీయశక్తులు ప్రబలమై అల్లకల్లోలము చేయుటకు మునుపే దేహయాత్ర చాలించుకొన్న యదృష్టవంతులు; ఆ నెమ్మదికి ఫలముగా తమకుఁ గలిగిన ప్రాచ్య పాశ్చాత్య సారస్వత పరిచయము మూలమున తమ మాతృభాషను, తన్మూలమున దేశీయులను వృద్ధికిఁ దేవలయునని యుద్రేకముతో ప్రవర్తించినవారు. కాని వీరేశలింగము పంతులు మొదలగు కొందఱవలె అన్ని త్రోవలలోను నడవఁ బోయి అవకతవకపని చేయలేదు. నాటకములు తెలుఁగులో లేని కొఱఁతను దీర్చుటకును, నట్టువలలోను, దాసర్లలోను నిలిచి యపభ్రష్టముగా నున్న యభినయవిద్యకు మంచిగతిఁ గల్పించుటకు పూనినారు. దానికితోడు ఇందుమూలమున దేశమందలి దుర్నీతిని బోఁగొట్టఁ గలమను గట్టి నమ్మకమును వారి కుండెడిది. కావున ఇరువురును చెఱి సుమారు ముప్పదింటికి మించి వివిధరూపకములను రచించుటయే కాక ప్రత్యేకముగా 'సరసవినోదిని', 'సుమనోరమ' యను రెండు నాటకసంఘములను స్థాపించి విద్యావంతులగు నటులను చేర్చుకొని యా నాటకముల నభినయింపఁ జేసిరి. ఆజీవమానము ఇదే ప్రధాన కార్యముగా, తక్కిన పనులన్నియు గౌణముగా నేర్పఱుచుకొని వర్తించిరి.

ఇట్లు వీరి నాటకములకు స్వరూపము నిచ్చిన ముఖ్య తత్త్వములు మూఁడు: (౧) ప్రాచ్య పాశ్చాత్య నాటక పద్ధతులు, (౨) తమ నాటకములను తామే యాడింపవలసిన భారము, (౩) జనులకు నీతిని బోధింపవలయు నను నుద్దేశము.

(౧) ప్రాచ్యులకును, పాశ్చాత్యులకును నాటకరచనలో తత్త్వమునం దంతగా భేదము లేదు. ఇరువురును ముఖ్యముగా రసోపాసకులే. కాని పరిభాషయందు కొంత భేదము గలదు. మనలో రూపకములు మొదటినుండియు గద్యపద్యమిశ్రమములు. సామాన్య సల్లాపమునకు గద్యము నుపయోగించి, భావము తీక్ష్ణమైనచోట పద్యముల నుపయోగించుట సంస్కృత నాటక కర్తల పద్ధతి. కేవల గద్య రూపకములు గాని, పద్య రూపకములు గాని నే నెఱిఁగినంతలో వారిలో లేవు. పాశ్చాత్యులందును ఇట్టి మిశ్ర రచనలు లేకపోలేదుగాని మొత్తముమీఁద వారి రచనలు వట్టి పద్యముననో గద్యముననో రచింపఁబడి యుండును. ఇటీవల వారిలో పద్యరూపకముల వాడుక తప్పిపోయినది. ఇప్పు డట్టివి వ్రాయువారే యరుదు. మనలో అంకములను 'రంగములు' గా చీల్చు వాడుక లేదు. వారిలోఁ గలదు. భగవత్ప్రార్థనా రూపమగు నాందితోఁ గూడిన ప్రస్తావన మన నాటకముల కెల్ల మొట్టమొదట నుండును. వారు కేవలము కథాభాగముతోనే మొదలుపెట్టుదురు. యుద్ధము, చావు మొదలగువానిని వారు ప్రత్యక్షముగా చూపుదురు. మనవారు చూపరు; సూచింతురు. ప్రతి ప్రధానపాత్రమును క్రొత్తగా రంగస్థలమునకు వచ్చుటకు ముందో, వచ్చిన యుత్తరక్షణముననో దానినిగూర్చిన పరిచయము సభ్యులకుఁ గల్గునట్లు సూచించుట ప్రాచీనపద్ధతి. పాశ్చాత్యులలో ఇది యంతగా పాటింపఁ బడదు. మనవారు కేవల శోకపర్యవసానముగల కథల గ్రహింపరు. వారిలో నట్టి వెక్కువ. ప్రధాన పాత్రములను కేవలము ఉత్తమములుగానో, నీచములుగానో తయారుచేయుట సంస్కృతమువారి దారి. ఉత్తమపాత్రములందు దుర్గుణములను, నీచపాత్రములందు సుగుణములను కొంచెముగా నైనను కలిపి సృజించుట పడమటి కవుల మార్గము. ఇంకను కొన్ని చిల్లర సంకేత భేదములు గలవు. 1

రెండు పద్ధతులను చక్కఁగా నెఱిఁగినవారు గావున మన కవులు పై రెంటి నుండియు కొంత గ్రహించి, కొంత వదలి నూతనమార్గము ద్రొక్కు స్వాతంత్ర్యమును వహింపఁ గల్గిరి. ప్రాచ్యపద్ధతి వట్టి చాదస్తమని తిరస్కరించు నవివేకము గాని, పాశ్చాత్య పద్ధతి యశాస్త్రీయమని యసహ్యపడు మొఱకుఁ దనముగాని వారి కుండలేదు. కాని వట్టి స్వాతంత్ర్య సాహసమునే మెచ్చుకొని వీరపూజ చేయుట ప్రకృతము మనపని కాదు. మనము స్వార్థపరులమని మొదలే చెప్పితిని. ఆ స్వాతంత్ర్యమును వా రెట్లు ఎంత యుపయోగించిరి? దాని ఫలము మన కెంత? అనునదియే యిప్పటి మన చింత.

వారి కాలమున కప్పుడే ఆంగ్లవాఙ్మయములో పద్య నాటకములు మూలఁబడి గద్య నాటకములే యెక్కువగా వ్యాప్తియం దుండెను. అట్టిచో 'వారిలో కేవల పద్యరూపకములును, గద్యరూపకములును ఉన్నవే! మనలో లేవే!' యని మాత్రము చింతించి మన కవు లిరువురును అట్టి రచనలకు పూనుకొనక పోవుట నాకుఁ జూడఁగా మన భాగ్యమే. వట్టి పద్యములే కాక ఆద్యంతము పాటలతోనే నిర్వహింపఁబడు 'ఒపేరా' లనఁబడు వింత రూపకములు వారిలోఁ గలవు. అవి వారి చాదస్తములకుఁ జేరినవి. ఆ వాతలే పెట్టుకొని మన వా రొకరిద్దరు పద్యనాటకములు వ్రాసినా వా రున్నారు గాని ఆ వెఱ్ఱి యంతటితో నిలిచిపోయినట్లు తోఁచుచున్నది. 'ఒపేరా' ల ప్రతిబింబములను తయారుచేయుటకు మనలో నెవరును చేయి వేసినట్లు కానరాలేదు. తీవ్రభావములను వివరించుటకు గద్యము చేతఁగానప్పుడు పద్యమును, పాటయు పనికివచ్చునే కాని యాద్యంతము దానినే కలిపికొట్టుట నాటకము నందు ప్రధానమైన వాచికాంగికాభినయములకు తిలోదక మిచ్చినట్లే. ఆంగికాభినయమునకు వేషభూషణాదు లెట్టివో వాచికాభినయమునకు పద్యమును, పాటయు, గద్యమును అట్టివి. పాత్రములను, సమయసందర్భములను ఎఱిఁగి తగినట్లు మార్చుకొనవలసినవి. అట్లుగాక, వినుటకు చదువుటకును ఇంపుగా నుండునని పద్యమో, పాటయో మొదటి నుండి తుదివఱకు ప్రయోగించుట ధర్మవరము సరిగంచు చీర చూచుట కందమని పాత్రములందఱును ధరించినట్లగును గాని వేఱుకాదు. మన కవు లిద్దఱును పై మూఁటిని యథాయోగముగా నుపయోగించి తమ రూపకములను చాల రసిక జనాహ్లాదకములుగా నొనరించిరి. ఐనను ఇద్దఱకును పాటల యందలి యభిమానము కొంత దాక్షిణ్య గర్భముగానే కానవచ్చుచున్నది గాని వానిని ప్రయోగించుటలో తగినంత ధైర్యము వారి కుండినట్లు తోఁపదు. పామరజన తృప్తికై పాటలు వ్రాయవలసి వచ్చినట్లే యిరువురును చెప్పుకొన్నారు. కాని కృష్ణమాచార్యులు ఒక 'అజామిళచరిత్రము'న దప్ప నేనెఱిఁగిన యన్నినాటకములందును పాటలు వ్రాయక మానలేదు. మఱియు 'ప్రహ్లాద'లో ప్రహ్లాదుని నోటిపాటలను 'ఆ గేయముల రచనావిశేషమును అద్భుతముగా నున్నది. నూతన ఫక్కి విలసిల్లుచున్నది' ('ప్రహ్లాద' పు.౨౪) అని హిరణ్యకశిపునినోట పొగడించుచు కవి తన పాటలరుచిని తానే పరోక్షముగా ప్రశంసించినట్లు తోఁచుచున్నది. శ్రీనివాసరాయల నాటకములలో నైదాఱు మాత్రము పాటలు లేకున్నవి. వారు వ్రాయనేలేదో, లేక యచ్చువేయలేదో తెలియదు. ఇరువురును వ్రాసిన పాటలనుగూడ గ్రంథమధ్యమందు అచ్చులో వానివాని చోటులఁ జేర్పక, కులముచెడినవారికి కూడుపెట్టినట్లు, మడుగు గ్రంథమంతయు ముగిసిన తరువాత తుదలో నతికించి పొమ్మన్నారు! ఏమి ప్రాయశ్చిత్తము పెట్టుకొన్నవో కాని యొకటి రెండు పాట లీబహిష్కారమునకుఁ దప్పినవి. ('చిత్రనళీయం' అం. ౩, రం. ౪.) కొన్నిపాటలు, పద్యములు వేషమునకును పనికివచ్చునవియై పంక్తికి నర్హములైనవి. పాటలయందు వీ రిద్దరికిని ఈ సవతితల్లి మక్కువ యేల కలిగినది? సంగీతమునం దిరువురును మంచి పరిచయముగల రసజ్ఞులు. కాని వారికినీ దెలియకయే గాయకులు మనుష్యజాతిలో నొకమెట్టు తక్కువయను ప్రాచీనభావము వారిని వదలక యంటియుండెనేమో! లేక పాట యందుకొన్న వెంటనే నటులు తమ నటకత్వమును మఱచి సంగీతగాండ్రై పోయి నాటకమును కచ్చేరీ క్రిందికి దింతురను భయము వారి కుండెనో! శ్రీనివాసరాయల నాటకపు పాటలు నే వినియుండలేదు. కృష్ణమాచార్యులవి కొన్ని విన్నాను. వారి కీర్తికిని, వ్యాప్తికిని పద్యము లెంతో అంతే పాటలును గారణము లగునని మాత్రము చెప్పక తప్పదు. ఇదిగాక కృష్ణమాచార్యులకు పద్యములుగూడ లేని గద్యనాటక మందే అభిమాన మెక్కువ యుండెననియు, దాని కుదాహరణముగా ఒక పద్యమైనను లేని 'అజామిళచరిత్రము' వారు రచించిరనియు, వారు ఇతర నాటకములలో పద్యములు వ్రాయుటకు తత్కాలపు జనుల యభిరుచియే కారణమనియు ఒకానొక విమర్శకులు వ్రాసిరి ('రోషనార' పీఠిక). ఏమో! చెప్పలేను. కాని యజామిళచరిత్రమున పోతన్న భాగవతము నుండి యెన్నియో పద్యము లెత్తి కడపటియంకమందు చేర్పఁబడినవి. కృష్ణమాచార్యులు సొంతముగా రంగముమీఁద నభినయించుటను జూడఁబడసిన పుణ్యాత్ములు, పద్యములను రసానుగుణముగాఁ జెప్పుటలో వారివంటి నటులు లేరని చెప్పఁగా విన్నాను. ఎట్లును శ్రీనివాసరాయల నాటకముల కంటె కృష్ణమాచార్యుల వానిలో పద్యములు తక్కువ. మనస్సులలో నెట్టి యభిప్రాయ మున్నను ఇరువురు కవులును పద్యములను, పాటలను యథేచ్ఛముగా వాడినారనుట ప్రకృతము మనకుఁ గావలసినది.

అట్లు వాడునప్పుడు అనేక స్థలములందు చాల అపురూపముగా పాట పద్యముల రచన అతుకుకొని యందమై యున్నను, ఎన్నో స్థలములందు వాని యావశ్యకత లేకున్నను, అవి కూర్పబడినవని చెప్పవలసియున్నది. భావములకు తీవ్రత లేనిచోట అవి యక్కరలేదని మొదలే విన్నవించితిని. ఇంతేకాదు, సామాన్యభావములకు వాని నుపయోగించినచో హాస్యముగా పరిణమించునుగూడ. సారంగధరునిమీఁది వలపు తప్పని తెలిసి యున్నను దుర్బలమగు మనస్సు నాఁపుకోలేని చిత్రాంగి ఒంటరిగాఁ గూర్చుండి 'కోరకుమా కోరకుమా కూడనివాని' నని సురటిరాగ మార్దవములో తన హృదయవేదనను వెడలించుట యెంతో మధురముగ నున్నది. అట్లే పినతల్లియింటికి పోవలదని సుబుద్ధి బలవంతము చేసినపుడు నిష్కల్మష హృదయుఁడగు సారంగధరునికి కోపమువచ్చి 'ఇఁక వినఁగఁజాల నీగాథ, ననుఁ గనలఁజేసె నీవేధ' యని కన్నడరాగముతో కసరి చెప్పుటలో నెంతో యౌచిత్యమున్నది. కాని వేఁటకు పోయివచ్చెదనని రాజరాజనరేంద్రుఁడును, పోవలదని చిత్రాంగియు చెప్పుకొనునప్పుడు,

రాజ -
వరధరోద్యదురోజ సరోజవిలోచనా
కడుబిరాన నేవత్తునే ....

చిత్రాంగి -
వరధరావరరాజ పరాజితమన్మథా
కనికరింపఁగ భారమాయెనే ....
2 ఇత్యాదిగా 'డయలాగు' పాటలలోనికి దిగుట విపరీతముగాదా! ఇట్లే యిరువురి నాటకములందును కొన్ని పద్యములు అనావశ్యకముగా అస్థానపతితములుగా రచింపఁ బడినవి. పద్యములందలి భావములు మాటలందును, మాటలందలివి పద్యములందును పెక్కుచోట్ల పునరుక్తము చేయఁబడి యున్నవి. నటులలో సంగీత మెఱిఁగి పాడఁగలవారికిని, లేనివారికిని అనుకూలముగా నుండవలయునని యిట్లు చేసిరేమో! పద్యములందును సీసములు కొన్ని రాగమాలికగా పాడుట కనుకూలముగా ఆ యా రాగముల పేళ్లుగూడ మెలకువగాఁజేర్చి రచించుట వీరు త్రొక్కిన క్రొత్తత్రోవలలో నొకటి. సీసమువంటి పెద్ద పద్యములలో వివిధములగు భావములకు చోటు గలదుగాన అట్టి భిన్నభావములను వెలయించుటకు భిన్న రాగములు చాల సహాయముగా నుండగలవు. నటించువానికి వదలకుండ రాగములు గూడ తామే యేర్పరచి యిచ్చుటయు మంచిదే. కాని ఆ రాగముల పేళ్లుగూడ ముద్రాలంకారరీతిగా పద్యభాషలో నిమిడింపవలయు నను నియమమును వీ రుంచుకొనుటచే ఎన్నో చోట్ల రాగమును, భావమును పరస్పరమిత్రములుగా నుండవీలులేక పెరుగును, వడ్లును గలిపినట్లుండుట తటస్థించినది. అర్జునుఁడు యుద్ధభూమియందు దుర్యోధనునితో నాడు వీరాలాపము సీసమున నుపయోగింప వలసిన రాగములలో 'నీలాంబరి' యొకటి! (కృ. 'బృహన్నల', అం. ౫, రం. ౧) శ్రీనివాసరాయల 'హరిశ్చంద్ర' లో మాలకన్నెలు తమ గానకళా ప్రావీణ్యముఁ జూపు సందర్భమునఁ గూర్చిన ముప్పదియేడు రాగాల ద్విపద యించుక దీర్ఘమైనను చాల నుచితమైన చోట పడినది. కాని వారి 'మైసూరు రాజ్యము'లో వీరవర్మ - జగన్మోహినుల సల్లాపమందలి నాట, గౌళ, వరాళి మొదలగు 'ఘన' రాగముల మాలిక నిష్ఫలమైన కూర్పు. మఱియు వీరిద్దఱి పద్యకవిత ప్రబంధశయ్యకుఁ జేరినది. అందందు రసోచితముగా స్పష్టమై ధారాళమైన యర్థభావములును, భాషయుఁ గల పద్యములు రచించి యున్నారుగాని, భావమును మఱుఁగుపెట్టు ప్రాసములతో నిండిన యెగుడుదిగుడు కూర్పు గల వెన్నియో అందందుఁ గలవు. సారంగధరుని శిక్షకు పరితపించు తల్లి రత్నాంగి నోట,

శా.
"ఈ కార్పణ్యము నీకుఁ గల్గఁజనునే!
యెగ్గేమి నేఁ జేసితి\న్‌?
నా కయ్యో సుతుఁడొక్కఁడేయగుఁగదా!
నన్నైన దండించి మా
రాకారున్‌ సుతుఁ గావవే! - యఘము పు
ణ్యంబెంచి నన్‌ బ్రోచువా
రీకాలంబునఁ గల్గరే! తనయు నీ
రే నాకు! హా దైవమా!"

అని రాతి గుండెలు కరఁగున ట్లేడిపించిన కృష్ణమాచార్యుఁడే, అదే సన్నివేశమందు తిరుగా,

క.
దినయామినుల నయారే
ఘనయాతన లనుభవింపఁ గననాయెనయా!
వినయార్యనయా సునయా
తనయా మన యార్తి కెదియు ధారునీ నెనయా!

అను పనికిరాని పద్యమును గూడ పాడించి తైతక్క లాడించినాఁడు! సీసము మొదలగు సామాన్యవృత్తములను ఎంతో ముద్దుగా వ్రాయఁ గలిగిన వీ రిద్దరును, ఉన్నదున్నట్లుగా, స్త్రీపర్వములో తిక్కన చేసినట్లు, ఎవరును వినని కనని వింత వృత్తములలో రచనను మొదలిడి రసధారను తెంచివేయుదురు. ఇద్దరును నాటకములందు మాటలు మొదట వ్రాసి, పద్యములు, పాటలు తరువాత నిదానముగా రచించి నడుమ నడుమ చేర్చు వాడుక కలిగిన ట్లున్నారు. కృష్ణమాచార్యుల యముద్రిత నాటకముల వ్రాఁతప్రతులను జూచిననేమో ఈ విషయమందు సందేహముండదు. పూర్వోత్తర సందర్భములు, ఆ యా పాత్రముల పరస్పర సంబంధము, రసభావముల ధార - ఇత్యాదులు మనస్సులో జీవంతములై యున్నప్పుడు వ్రాసిన పద్యములకును, తరువాత నెపుడో యభిప్రాయము మనస్సులో నుంచుకొని కూర్చిన పద్యములకును భేదముండదా? మొదటివి కథాప్రవాహముతోఁ జేరినట్లుండును. రెండవవి అందదుకులుగా నుండును. తెలుఁగు కవులలో నన్నయ తిక్కనాది పురాణ కవులకంటె తరువాతి ప్రబంధకవుల రచనల యందు మన కవిద్వయమున కభిమాన మెక్కువ. కావుననే వారిని బోలిన శబ్దార్థరచనలు గల పద్యములెన్నో వీరి యందుఁ గలవు. ఈవిషయమున కృష్ణమాచార్యులకంటె శ్రీనివాసరాయలు ఒకచేయి మీఱినవారు. వారి 'శిలాదిత్య' నాటకమున కథానాయిక యగు వితంతువు సూర్యోపాసనచేసి గర్భము ధరించి లోకాపవాదమునకు చింతించుచోట తన గర్భమును తానే యిట్లు వర్ణించుకొను చున్నది -

మిన్నయి సన్నగా నున్న నా లేఁగౌను - గరువంపు గరిమమైఁ బరఁగె నేఁడు
రాగోరు రుచులచే రాజిల్లు చనుమొనల్‌ - నీలకాంతి వహించి నెగడె నేఁడు
చిగురుల జిగికాంతిఁ జెలువుగాంచిన మోము - వెల్వెలఁ బాఱుచు వెలసె నేఁడు
మించె నిట్టూర్పు జనించె నురు శ్రాంతి - కొంచెపుటారు కన్పించె నేఁడు
నడలకును మందభావంబు లడరె నేఁడు
ఒడలికాంతికి జిగి హెచ్చి యొప్పె నేఁడు
కడుపు బరువయి కాన్పించె ఘనతగాంచి
దైవమా! ఏమి తెల్పుదుఁ దండ్రి కిపుడు!

('శిలాదిత్య', అం. ౧, రం. ౩)

ఇట్టి శబ్దార్థ రచనలు ఇరువుర నాటకములందును పద్యములందేకాక మాటలందును చూడవచ్చును. శ్రీనివాసరాయల యర్జునుఁడు అభిమన్యుని చావున కేడ్చుచున్న సుభద్రను,

"సుభద్రా! విపన్న దైన్య విటప విపాటన మానస భద్రా! మందగమన విలాస విజిత భద్రా! క్షుద్రజన వాక్సంజనిత పాపవార్తాకర్ణన గాఢనిద్రా! ... ఈ మౌనముద్ర నేల వహించితివి?" ('శిరోమణి' అం. ౨, రం. ౧)
అని పలుకరించినప్పుడును, కృష్ణమాచార్యుల భరతుఁడు కౌసల్యతో తన నిర్దోషిత్వము నత్యద్భుతముగా స్థాపింప నుపక్రమించి,

"అట్టి యాచక కల్పధామునకా, సుందర తను ప్రభా కామునకా, దుర్గ్రహ ప్రథన భీమునకా, తరణి కులాంబుధి సోమునకా ... రామునకా నే నెగ్గు లెంచుట!" ('పాదుకాపట్టాభిషేకము' అం. ౪, రం. ౨.)

అని మకారాంత శబ్దములు పండ్రెండు వెదకి వేయునప్పుడును, మన కదివఱకును వందలుగా కాఱిన కన్నీటియూట తటాలున నెండిపోక, మన యోర్పు సుతిమించక యెట్లుండఁగలదో యెఱుఁగను!

ఇఁక అంకములను రంగములుగా విభజించుట, నాందీ ప్రస్తావనలు వదలుట, మరణము మొదలగువానిని ప్రత్యక్షముగా చూపుట - ఇత్యాదులలో పాశ్చాత్య పద్ధతి ననుసరించి మనకవులు నాటకరచనకు చాలమేలిమి తెచ్చిరనుటలో సందేహము లేదు. రంగములుగా అంకములను విఱుచుటచే కథలోని యనేక సన్నివేశములను మనము సాక్షాత్తుగాఁ జూడ వీలుండును. ఇతరుల మాటలచే నూహింప వలసిన తొందఱ యుండదు. ఈ విభజనకు ముఖ్య సూత్రము కాలదేశముల సామీప్యము. ఒకనాఁటి కథ యొక యంకములో నుండవలయునని ప్రాచీనలాక్షణికు లనిరి. కాని రంగవిభాగమునకు చేయివేసిన తరువాత ఆ నియమము సాధ్యముగాదు. ఆవశ్యకమును గాదు. దేశమును, కాలమునుబట్టి కథాభాగమును ముఖ్యముగా నాలుగైదు భాగములుగా పంచుకొని యంకముల నేర్పఱుప వలయును. ఒక యంకమునకును మఱొకటికిని దేశకాలముల భేద మెంతయున్నను అంతగా నష్టములేదు. సభ్యులకు విరామ ముండును గనుక. కాని రంగములందలి కథా సన్నివేశములకు దేశకాలము లెంత సమీపముగా నున్న నంత మేలు. ఒకరంగములోని పాత్రములే తరువాత రంగమునకు వచ్చినప్పుడు రెంటికినడుమ నెలలకొలది కాలముగాని, యామడల కొలఁది దూరముగాని గడచినట్లు చూపుట రంగరచనా దౌర్బల్యము. ఇట్టివి మన కవుల నాటకములం దపురూపముగా అందందు కానవచ్చును. వరూధిని మాయాప్రవరుని వరించుట మొదటి రంగము. తరువాతి దానిలో వారే వత్తురు. కాని యప్పటికే వరూధిని పూర్ణగర్భిణి. (కృష్ణ. 'వరూధిని'. అం. ౨, రం. ౨-౩.) అనఁగా ఎనిమిదినెలలైనను దాఁటిన వన్నమాట! ఒకరంగమునందు ద్వారకాపురమున నుండిన యదురాయఁడు కృష్ణరాయఁడును మఱురంగమందే మైసూరు దేశమున నిలిచియుందురు! (శ్రీని. 'మైసూరు రాజ్యము'. అం. ౨, రం. ౨-౩)

సంకల్పములో 'శుక్లాంబరధరం' ఉన్నట్లు మన సంస్కృత నాటకములలో నాంది వట్టి శాస్త్రముగా పరిణమించినది. భగవత్ప్రార్థనయే నాంది యుద్దేశము. విఘ్ననివారణాదులు ఫలములు. కాని దాని నిట్లు అందఱ యెదుటను వన్నెలు, వేషములు ధరించి చేయవలసిన పనియేమి? సంస్కృత నాటకములలోని నాంది యిప్పటిస్థితికి వచ్చుటకు ముం దెన్ని యవతారము లెత్తినదో, ఎందఱి భ్రాంతి కారణమో యనుచర్చ ప్రకృతము పనిలేదు. సూత్రధారుఁడు నటియు చేరి చక్కందాలాడుచు నడపు ప్రస్తావనయు నిట్టిదే వికారము. దానిని కొంత నిపుణముగా నిర్వహించినావా రెవరో యొక రిద్దఱే తప్ప మిగిలినవా రందఱును పాచిపండ్ల దాసరి పాటను పాడినవారే. ఆచార్యులును, రాయలును పై రెంటిని వదలుదమా వలదా యని యోచించి యోచించి, కొన్ని నాటకములలో పూర్తిగా శాస్త్రప్రకారము రచించి, మఱికొన్నిటియం దున్నట్లును లేనట్లునుగాక శాస్త్రమునకు వ్రాసి, తుదకు ధైర్యముతో ఆ తంటా వదలించుకొన్నారు. కృష్ణమాచార్యులకంటె శ్రీనివాసరాయలకు ఇంకను కొంత చపలము మిగిలియుండెనని తోఁచెడిని. కాని యింత శుష్కములైనను నాందీప్రస్తావనలకు ప్రయోజనములు లేకపోలేదు. మొదటిది గ్రంథకర్తయొక్కయు, నాటకకథ యొక్కయు పరిచయము గల్గించి రాఁబోవు పాత్రముల స్వరూపమును సభ్యులకుఁ దెల్పుట. ఈ పని యిప్పుడు ప్రత్యేకముగా కరపత్రముల మూలమునను, కథా సారాంశముల మూలమునను కొంత జరుగుచున్నది. ఇంతకంటె ముఖ్యమగు ఫల మేమనఁగా, వచ్చి కూర్చున్న సభ్యుల మనోధర్మములకు కొంత నెమ్మది గలిగించి కుదురుగా నుండఁ జేయుట. నాటకమును జూడవచ్చిన వారి చిత్తవృత్తి యొక్కొక్కరి దొక్కొక్క విధముగా నుండును. అప్పుడే భుజించి దిగచెమటలతో వచ్చు వారు కొందఱు; ఆలుబిడ్డలకై డబ్బు ఖర్చుపెట్టి పిలుచుకొని రాలేక వారితో కలహించి వచ్చువారు కొందఱు; ఇంటి పెద్దలను మోసగించి కృత్యావస్థతో తప్పించుకొని వచ్చువారు కొందఱు; ఎవరెవరినో ప్రార్థించి అప్పుదెచ్చుకొని కడపటి నిముషమున కాత్రపడి వచ్చువారు కొందఱు; దాక్షిణ్యమున వచ్చువారు కొందఱు; దొంగతనమున లోపలికిం జొచ్చువారు కొందఱు; వచ్చినవారిలో ఇరుగుపొరుగువారి వేషభూషలను విమర్శించువారు కొందఱు; కుర్చీలు వెనుకముందుల కీడ్చి మార్చి రగడచేయువారు కొందఱు; స్థలములకై తగవు లాడువారు కొందఱు - ఇట్టి వివిధమనోవృత్తులుగల సభ్యులు నిర్ణీతమైన కాలమునకు సరిగా గంటవాగి తెరయెత్తగానే నాటకమందలి కథాప్రవాహమును గ్రహించి తన్మయులై చప్పుడుచేయక గంభీరముగా నుండుట సాధ్యము కాదనుట నాటకములాడిన వారికిని, చూచినవారికిని తెలియని విషయము గాదు. ఇట్టి స్థితిలో కొన్ని పద్యములు, పాటలు, మాటలుఁ గల్గి పావుగంట ప్రొద్దు కాలక్షేపము చేయుటకు పనికివచ్చు ప్రస్తావన సభ్యులను కొంత స్వాధీనమునకుఁ దెచ్చుకొని వారి చిత్తవృత్తులను నాటకాభిముఖముగాఁ జేయఁ గలదు. మన కవులు ప్రస్తావనను వదలిరి కాని పై ప్రస్తావనకార్యము నిర్వహించు మఱి యే మార్గము గాని యాశ్రయించినట్లు తోపఁదు.

రంగస్థలముపై చూపరానివని ప్రాచీనులు విధించిన వానిలో కొన్ని అసహ్యములు: భోజనము, స్నానము, మితిమీఱిన శృంగారము ఇత్యాదులు. ఇవి యెప్పుడును వర్జ్యములే. ప్రాచీన నాటకములలో స్త్రీ పురుషుల ముద్దులాటలు గాని, కౌఁగిలింతలుగాని నే నెఱిఁగినంతవఱకును రంగమందు చూపఁబడవు. మన కవు లిద్దఱిలో శ్రీనివాసకవి శృంగారపు మాటలు ధారాళముగా ప్రయోగించినను వాని నభినయమున కవకాశ మియ్యలేదని సంతసించుచున్నాను. కృష్ణమాచార్యకవి పరిరంభ చుంబనములు ప్రయోగించినను పరవాలేదని తలఁచి అవకాశము కలిగినప్పుడెల్ల అనుమతి యిచ్చెను. ఈ కాలపు సినిమాలను, కొన్ని అరవవారి నాటకములను చూచినవారి కీ కౌగిలింతలు, ముద్దులును చాల పవిత్రమై సభ్యమైన శృంగారచేష్టలుగాఁ దోచును. కాని నామట్టుకేమో కృష్ణమాచార్యులు ఆ యింతచాపల్యమును గూడ అణఁచుకొనియుండిన బాగుగా నుండెడిది. రంగస్థలమున మరణము చూపరాదని విధించుటకు మనవారి యమంగళ భయమే కారణముగాఁబోలు. కాని అమంగళము చూపినను అమంగళమే, నోటఁ జెప్పినను అమంగళమే. కనుక కథానుసారముగా మరణమునుఁగూడఁ జూపి మన కవులు అనావశ్యకమైన యా విధిని దిరస్కరించిరి. మఱికొన్ని చూపరాదన్నవి రంగము మీఁద నసాధ్యములు. దూరప్రయాణము, యుద్ధము ఇత్యాదులు. ఎన్ని విధములగు వట్టి తెరలు, కత్తరితెరలును గలిగి యున్నను ఇప్పటికిని దూరప్రయాణాదులు చక్కఁగఁ జూపలేము. యుద్ధమన్ననో యెంతవదలిన నంత మేలు. ఎట్లు చేసినను, ఎంతచక్కఁగ నభినయించినను నేను రంగమునఁ జూచిన యుద్ధములన్నియు దగుఁబాటుగా నున్నవేకాని వేఱు కాదు. అందును మన పురాణ చరిత్రలలోని యుద్ధములు వట్టి తుపాకుల యుద్ధములు గావు, గుండ్లుగాక మందుపెట్టి ఢ మ్మనిపించి క్రిందపడి నిద్రపోయినఁ జాలు ననుటకు. కత్తులు, బల్లెములు, బాణములు మొదలగు వివిధాయుధములతో అంగాంగములు పొడిచి, నఱికి, చించి, పొడిచేసి చేయవలసిన పోట్లాట లవి. కాఁబట్టి నాటకములలో యుద్ధములు తెరమఱుఁగులో ముగింపక రచ్చకు దెఁచ్చినచోట్లనెల్ల సభ్యులకు రసభంగము గలుగునేకాని వేఱుకాదు. మన కవు లిరువురును యుద్ధప్రదర్శనమును పూర్తిగా వదలియున్న బాగుగా నుండెడిది.

రంగస్థలముమీఁదికి వచ్చిన పాత్రము లిట్టిట్టివారని సభ్యులకు తెలుపుట యె ట్లనుట నాటకకర్తలకెల్లఁ గలుగు గొప్పచిక్కు. పాశ్చాత్య నాటకములలో ఈ చిక్కును విడఁదీయు నియమము లేవియు నున్నట్లు గానరాదు. నాటకమును చదువునప్పుడు నటులకొఱకై వ్రాయఁబడిన కుండలీకరణ మందలి సూచనలు, నాటకీయ పాత్రముల పట్టీ మొదలగు సాహాయ్య ముండును. మఱియు చదివినభాగము మొదలర్థముగాదేని రెండవమాఱు చదివి తెలిసికొనుట కవకాశముండును. కాన అంత తొందఱలేదు. కాని నాటకము ముఖ్యముగా దృశ్యకావ్యము. చూచునప్పుడు పైని యనుకూలము లేవియు నుండవు. కావున గ్రంథకర్తయే నిపుణముగా పాత్రముల నోటనే ఆ యా వాని స్వరూపమును వెలువఱచుట ముఖ్యమైనపని. ఆ నైపుణ్యము లేమిచేతనే యెన్నెన్నో పాశ్చాత్య నాటకములందును, ఆధునికాంధ్ర నాటకములందును ప్రవేశించిన పాత్రముల స్వరూపము సభ్యులకు తెలియవచ్చులోపల వా రాడిన మాటలు, చేసిన చేష్టలును నిరర్థకములై పోవును. ప్రాచీనులు ఈ లోపమును సవరించుటకై విష్కంభము, ప్రవేశకము అనఁబడు చిన్న అవాంతర రంగములను గల్పించి కథయం దంతగా ప్రాముఖ్యములేని పాత్రములనుదెచ్చి మాటాడించి నాటకమందలి భూతభవిష్యదర్థములను, రాఁబోవు ప్రధానపాత్రములను సభ్యులకు తెలియఁ జేయుదురు. అట్టివి కొన్ని చోటుల చాల కృత్రిమములుగాఁ దోఁచి కొంత వికారముగా నున్నను, నాటకము చూచువారు కృత్రిమములు, వికారములు నైన యెన్నింటినోచూచి యోర్చుకొని సరిపుచ్చుకొన వలసి యుందురు గావున, పైని విష్కంభాదులనుగూడ వాని ప్రయోజనము గమనించి సహింపవలయును. ఈ విషయమున కవు లింకను శ్రద్ధ యెక్కువగా వహింపవలసి యుండెనని చెప్పక తప్పదు.

ఆంగ్లసాహిత్య పరిచయ ఫలముగా మన కవు లిద్దఱును సాహసించి తెలుఁగు వాఙ్మయమునఁ బ్రవేశపెట్టిన విషయములలో నెల్ల ముఖ్యమైనది శోకాంతముగా వ్రాయుట. ఇది సంస్కృత లాక్షణికు లెల్ల కూడదని విధించిన శాసనమునకు నేరుగా ఎదురుతిరిగిన నడత. సంస్కృత నాటకములలో నెల్ల కథానాయకుని మరణముతో ముగియునది భాసమహాకవి 'ఊరుభంగ' మొకటే యిప్పటికి కనఁబడుచున్నది. కాని మన కవు లిద్దఱును దాని నెఱుఁగరు. అది వారు కీర్తి శేషులైన పిదపనే వెలువడినది. అంతవఱకు ఇతరు లెవరును దాని పేరైన నెత్తి యుదాహరింప లేదు. కావున మన కవులు శోకాంతరూపకములు వ్రాయుటకు ఆ యింతమాత్రము వెన్నుబలమును సంస్కృతవాఙ్మయమునుండి లభించి యుండ లే దనుట సత్యము. మరణముతో ముగియు శోకాంతనాటకములు కృష్ణమాచార్యులు వ్రాసినవి నే నెఱిఁగినంతవఱకు నాలుగు: 'విషాద సారంగధరము', 'ముక్తావళి', 'అజామిళ చరిత్రము', 'చంద్రహాస చరిత్రము'. వీనిలో ముక్తావళిని మాత్రము మరల మోదాంతముగా మార్చి ముద్రించినారట ('ముక్తావళి' పీఠిక.) శ్రీనివాసరాయల 'రామరాజు', 'సుల్తానా చాందుబీ', 'శిలాదిత్య' - మూఁడును శోకాంతములు. కాని వీరికి కృష్ణమాచార్యుల కున్నంత యభిమాన మిట్టి మరణాంత నాటకములం దున్నట్లు తోఁపదు. వారి విషాద నాటకములలో నెల్ల నెక్కువ ప్రచారముగల 'రామరాజు' వారు మొదట సంతోషముతోనే ముగించిరి. కాని సుమనోరమసభ వారు దానిని ఖేదాంతముగా మార్చి తుదకు కథానాయికా నాయకులగు ఆషాబీని, పటాణిని చంపిరఁట. మరణముతో నాటకమును ముగించినచో మంగళమున కేమేని లోపము వచ్చునో రాదో యెఱుఁగనుగాని, సభ్యులశోకము చచ్చువాని యోగ్యతనుబట్టి యుండును గావున, శిలాదిత్యునివంటి పాత్రము చచ్చినను మనకు కొంత కనికరము గలుగవచ్చునేమోకాని శోకము గలుగదు. అట్లే అవివేకియైన రామరాజు (ఆ నాటక సంధాన ప్రకారము) చచ్చినప్పుడు మన కంతగా దుఃఖము కలుగని తీరుగనే ఆత్మకును, దేశమునకును ద్రోహియైన పటాణిని, వానిని రవులుకొల్పి త న్నేలిన రాణికి ద్రోహముచేసిన ఆషాబీని గ్రంథకర్త యిష్టమునకు విరుద్ధముగా నాటకపు తుదలో చంపినను మన కన్నులలో నీరు రాదు. 'సుల్తానా చాందుబీ' యొక్కటే శ్రీనివాసరాయల నాటకములలో కొంత శోకాంత మనఁదగినది. అందును ముఖ్యులగు కథానాయకుల జీవితము సుఖముగా పర్యవసాన మగుటచేత ముసలిరాణి యగు చాందుబీ ఖూనీ చేయఁబడి ఆకస్మికముగా మరణించినను ఇచట శోకరసము మందగించియే యున్నది. కాఁబట్టి శ్రీనివాసరాయలు నిజముగా శోకాంతమైన రూపకమును వ్రాయనే లే దనవచ్చును. కృష్ణమాచార్యులు రచించిన నాలుగింటిలోను 'చంద్రహాస'లో తుదకు చచ్చువాఁడు దుష్టబుద్ధియగు మంత్రియే కావున వాని చావునకై యేడ్చు వెఱ్ఱు లెవరును ఉండరు. 'అజామిళ చరిత్రము'న ఆలుబిడ్డలతో పాటు అజామిళుఁడు చచ్చుట యెవరి స్వాధీనమునుగాని ప్లేగురోగముచే ఆకస్మికముగాఁ గలిగినది కావునను, అప్పటికి వాని జీవితమందలి కష్టములన్నియు ముగిసియుండుట చేతను, తుదలో వానికి యమకింకరులను తన్ని తోలి విష్ణువు మోక్షము నిచ్చుటచేతను ఆ నాటకము మోదాంతమే యనకతప్పదు. 'ముక్తావళి' యిప్పుడు తుదలో చావనున్న వారును, చచ్చినవారును అందఱును బ్రతికినట్లే ముద్రింపఁ బడినది. గ్రంథకర్త అసలువ్రాతలో ఎవరిని ముగించి ఎవరిని మిగిలించి యుండెనో యెఱుఁగము. కావున ప్రకృతము మనకు మిగిలినది ఆద్యంతము శోకమయమైనది 'సారంగధర' యొక్కటే. కాని పది శోకాంత నాటకములు చేసినంతపని తెలుఁగువారి కిది యొకటే చేసినది; చేయుచున్నది. దీనికిఁ దగినట్లు కార్చుటకుఁ గావలసినన్ని కన్నీళ్లు తెలుఁగువారి కున్నవా యని సందేహ పడవలసి యున్నది.

ఈ నాటకమందలి శోక మింత తీవ్రముగా హృదయ భేదకముగా నుండుటకు గలఁ కారణము లంద ఱెఱిఁగినవే. రూపము, యౌవనము, పదవి, చదువు, శీలము మొదలగు నన్నిటి యందును సాటిలేని యాదర్శమూర్తి సారంగధరుఁడు కథానాయకుఁడు. వానిని మనసారా మొదలే వలచియుండినను నిర్బంధముచేత వాని తండ్రిని వృద్ధుని పెండ్లాడి, సహజమై, బలవత్తరమైన ప్రణయతృష్ణ తీరుమార్గము గానక పరితపించు చిత్రాంగి కథానాయిక. ఇరువురియందును మన కనురాగమును, అభిమానమును గలవు. తన యాశలన్నియు పటాపంచలై అవమానమునకు నొచ్చి తెగించిన మనసుతో సారంగధరునిపై నిరాపనిందను మోపినదని చిత్రాంగి నైనను గొంత తప్పు పట్టఁగలముకాని సారంగధరుని నడతను వ్రేలెత్తి తప్పు చూపలేము. ఇట్టి స్థితిలో అట్టి ధర్మమూర్తికి కాళ్లు చేతులు కత్తిరించు శిక్షచే మృత్యువు సంభవించుటను జూచి యోర్చుట మనుష్య శక్తికి మీఱినపని. ప్రపంచ వ్యవహారములో ఇది యిట్లు నడచుట అసాధ్యమునుగాదు. అసంభావ్యమును గాదు. కాని యది యన్యాయమని, అకార్యమని మనుష్యుఁడై పుట్టినవాఁడెల్ల దలఁచి తీఱును. శక్తి యున్నంతవఱకు అట్టివి సంభవింపకుండుటకు ప్రయత్నములు చేయును. పని తన శక్తికి మించినప్పుడు ఏదేవతలైనను దిగివచ్చి దీనికి ప్రతీకారము చేయరాదా యని అంగలార్చును. అమానుష శక్తిగల దేవతావ్యక్తులు ఇట్టి సమయములందు ధర్మమును, న్యాయమును స్థాపింపక పోయిరేని వారిబ్రతుకు వట్టి యమృతపు దండుగయే కాని వేఱు కాదనుట మన కందఱకును గలుగు భావము. కాఁబట్టియే యెవఁడో సిద్ధుడు వచ్చి మరల సారంగధరుని బ్రతికించినట్లు ప్రాచీనులు పైనికథ కుత్తరరంగ మొకటి యతికించిరి. అసలుకథ కేవలము కల్పితముగానిండు; లేక చరిత్రాధారము గలది కానిండు; అది సారంగధరుని మృతితోనే ముగిసియుండనిండు; కాని దానినట్లే వ్యవహారమునందు నిలుపుకొనుట యసాధ్యము. మనుష్య స్వభావమునకు, మనుష్యుల ధర్మ న్యాయాభిమానమునకును, మనుష్యుల సహజమగు శాంతిప్రియతకు విరోధము. కాని కృష్ణమాచార్యుల కీ సిద్ధుని కథ సరిపడలేదు. నాకును సరిపడదు. తెగినకాళ్లను, చేతులను తిరుగా అతికించి బ్రతికించు విచిత్ర సిద్ధశక్తిని నమ్మినను నమ్మకున్నను, బ్రతికించిన తరువాత వాఁడు సారంగధరుని నొక జోగిని జేసి యే కొండగుహలలోనికో యీడ్చుకొని పోవుటచేత, మనపాలికి వాని చావును, బ్రతుకును ఒకటేయైనవి. కాని కృష్ణమాచార్యులవలె కాళ్లుచేతులు తెగి చచ్చువఱకే సారంగధరుని బ్రతుకు నూహించి వదలుటకు నా దేహ మనస్సులు రెండును గంపించుచున్నవి. "నీతిబోధ విషాదాంతనాటకము లందువలె మంగళాంతనాటకములందు గలుగఁ జాలదని నా తప్పని యభిప్రాయము" అని వారు 'విషాధసారంగధరము' పీఠికలో వ్రాసిరి. నీతికిని, నాటకములకును ఇంత స్పష్టమైన సమీప సంబంధమున్నదని నే నెప్పుడును అనుకొనలేదు. విషాదము నెక్కువగా నాటకములం దనుభవించుటచే జనులు నీతిమంతు లగుదురనుట నా సిద్ధాంతమునకుఁగాని, యనుభవమునకుఁగాని యింకను రాని మతము. నాటకములు చూచునది, చదువునది రసానుభవమునకు, తన్మూలముగ మనశ్శాంతికి, ఐనశోకమొక రసము గాదా? శృంగారముతో నాటకము ముగింపవచ్చునఁట, శోకమేమి తప్పు చేసెను? అని యడుగవచ్చును. నిజమే. శోకమునకును రసత్వము, ఆస్వాద్యత్వము కలదు. లేకున్న మనము దానిని చూడనే చూడము. కాని ప్రతిరసమును ఒక హద్దుమీఱిన తరువాత అసహ్యమగును. శృంగారమును ఇంతేకదా? నాయికానాయకుల పెండ్లి వరకును, వారి సరససల్లాపముల వరకును బ్రదర్శించి తరువాతి వారి శృంగార చరిత్ర మీఁద తెరవైతుముగాదా? శోకమునకువలె శృంగారమునకును సహజమైన ముగింపు నీయఁ బ్రయత్నించినచో గతియేమి? మరియు శోకమువలె బీభత్సమును ఒక రసమే కదా! దానినిగూడ తెగఁబెంచి రంగముమీఁద నెవ్వరైనఁ జూపుదురా? రసము ననుభవించి యానందించు మన మనస్తత్త్వము గూడ తక్కిన ప్రకృతి ధర్మములకు లోపడినదే కాని కేవలము స్వతంత్రము గాదు. రస మేదియైనను మనము సహజముగా నేర్పఱచుకొన్న నీతి, ధర్మము, ఆనురూప్యము, సౌమనస్యము మొదలగు హద్దులను మీఱి పోయినచో దాని ఫలమగు ఆనందమును మన మనుభవింపఁ జాలము.

ఏ తప్పు నెఱుఁగని యిట్టి పాత్రములను దెచ్చి ప్రత్యక్షముగా రంగమునకు బలియిచ్చుపద్ధతి పాశ్చాత్య కవులలో మితిమీఱి యుండెను. మహాకవులగు షేక్‌స్పియర్‌ మొదలగు వారుగూడ ఈ చాపల్యమునకు తప్పినవారు కారు. రాజద్రోహియైనవాఁడు తప్పించుకొనిపోఁగా ఆ తప్పునకు రాజభటులు ఏపాపము నెఱుఁగని యతని చిన్నకుమారుని తల్లి కన్నులయెదుటనే పొడిచి చంపి తల్లినిగూడ పరువెత్తించు కొనిపోయి చిత్రవధ చేసిన రంగ మొకటి 'మాక్‌బెత్‌' నాటకమున మనము చూడవలసియున్నది. (అం. ౪. ౪౦. ౨.) ఇట్టివి చూచి సంతసించు రక్తపిపాసువులు వారిలోను, మనలోను గలరు. కాని కోడిపుంజులను, పొట్టేళ్లను పోట్లాడించి యవి కాళ్లు, మెడలు తెంచుకొని తలబుఱ్ఱలు పగులఁగొట్టుకొని చావుబ్రతుకులలో నుండఁగా చూచి యానందించు వారికిని వీరికిని మనస్తత్త్వమం దెక్కువ భేదములేదు. ఇటీవలి పాశ్చాత్య వాఙ్మయమునందే ఇట్టి కేవలోద్రేక ప్రధానమగు సన్నివేశములకు వెలయిచ్చువారు చాలమంది లేరు. ఇఁక మన ప్రాచీనులన్ననో శోకమును రూపకములలో గౌణముగా బ్రయోగించిరేకాని యది ప్రధానముగాఁగల రూపకము లరుదు. 'ఉత్తరరామచరిత్ర' మున్నగునవి యొకటిరెండున్నను వాని తుదలో సంతోషమే కలదు. ఇఁక చావును వారు ప్రత్యక్షముగా చూపనేచూపరు. ఇట్లు దుఃఖమయములగు సన్నివేశములనెల్ల సుఖమయముగాఁ జేయుటలో ప్రాచీనాధునిక కవుల కల్పనలు చాలదుర్బలముగా, కృత్రిమముగా నున్నవని యొక యాక్షేపణ కలదు. అందు చాల సత్యమును గలదు. కాని యది కర్త లోపముగాని, పద్ధతి లోపముగాదని నా మతము. మనలో నన్ని నాటకములును అట్లు లేవు. 'శాకుంతలము', 'మృచ్ఛకటిక' మొదలగు నాటకములలోని శోకమును సుఖముగాఁ ద్రిప్పిన కవుల కల్పన కేమివిలువ యీయగలము? నాటకములు వ్రాయఁ బూనిన వారందఱును చక్కని సంవిధానమును గల్పించు శక్తి గలవారని యెవరు చెప్పఁగలరు? ఎందఱో తమ యయోగ్యత నెఱుంగకుండ పనిచేయ నుంకింతురు, ఎట్లో ముగింతురుకూడ, కాని మూలతత్త్వము నిర్ణయించునప్పుడు వారి రచనలు పనికిరావు.

కాఁబట్టి సారంగధరుని చరిత్రమున కృష్ణమాచార్యులు చేసిన యీ మరణాంతపుమార్పు నాకు రుచింపలేదని నా మనవి. అనగా ఆ నాటకమందు నాకు రుచి లేదనికాదు. అందలి పాత్రపోషణము, సల్లాపకౌశలము, సంవిధానచాతుర్యము ఇత్యాదులనుబట్టి చూచినచో వారి నాటకములలో నెల్ల నిది యుత్తమ మనక తప్పదు. ఇంతేకాదు. తెలుఁగు భాషయందలి యుత్తమ రూపకములు కొన్నింటిలో నిది యొకటి యనుట నిస్సందేహము. నా యిప్పటి చింత యేమనఁగా సారంగధరుని పూర్తిగా చంపుటలో గ్రంథకర్త యాశ్రయించిన మార్గము పాశ్చాత్య కవుల సామాన్యపద్ధతుల ననుకరించుటచేఁ గలిగిన యడ్డుదారియే కాని దానిచే నాటక పరమఫలమగు రసానుభవానందము పూర్తిగా నెఱవేఱ లేదనుటయే. కాఁబటి యందలి శోకరసము వీరి 'పాదుకాపట్టాభిషేకము' నందలి దానికన్న ఒక వన్నె తక్కువయే యనక తీఱదు.

ఐన సారంగధరుని గతియేమి? సిద్ధుఁడు మరల రావలసినదేనా? బంకవేసి తెగిన కాళ్లుచేతు లతికింపవలసినదేనా? యని యడుగుదురేమో! నావంటివాఁడు కృష్ణమాచార్యులవంటి కవికి కల్పనలు సూచింపఁ బూనుట తాతకు దగ్గు నేర్పఁ బూనినట్లు. సారంగధరుని జంపవలెనని మొదలే సంకల్పించుకొన్నాఁడుగాని లేకున్న నా యసామాన్య ప్రతిభావంతునికి వానిని బ్రతికించు కల్పన మార్గములకు కఱవు లేదు. చిత్రాంగిపై సందేహము గలిగిన వెంటనే సారంగధరుని శిక్షను నిలుపుమని రాజరాజు పంపిన భటుఁడు అడవిలో దారితప్పి ఆకస్మికముగా విలంబించుటకు బదులుగా నేరుగా పోయియుండెనేని యే తొందఱయు నుండకపోవునుగదా!

నాది వట్టి ఛాందసముగా కొందఱకుఁ దోఁపవచ్చును గాని న న్నడిగినచో చిత్రాంగినిగూడఁ జంపవలసిన పనిలేదు. దానిని మొదటినుండి తాటకవలెనో, శూర్పణఖవలెనో కేవల క్రూరవ్యక్తిగా కంటికి కనఁబడిన మగవానిని కామించి లోపఱుచు కొనఁజూచు జగఱాఁగగా తయారుచేసి యుండినచో అది చచ్చిన శని వదలెనని సంతసించియుందుము. కాని కృష్ణమాచార్యుల చిత్రాంగి యట్టిదికాదు. మోసము జరుగక, తండ్రి నిర్బంధముతో ముసలివానిని పెండ్లాడక, తాను వలచిన సారంగధరునినే చేపట్టఁగలిగి యుండెనేని ఆయమ సామాన్యస్త్రీలకన్న ఉత్తమమైన నడవడి గలిగియే యుండును. దమయంతి పుష్కరుని, రుక్మిణి శిశుపాలుని బలవంతముతో పెండ్లియే చేసికొని యుండినయెడల వారెట్టివారుగా పరిణమించి యుందురో యెవ రెఱుఁగుదురు? చిత్రాంగిని మేలుతరగతి గరితగాఁ జేయుటకుఁ దగిన చదువు, సంస్కారము, స్వాభిమానము, పాపభీతి మొదలగు గుణము లామెయందుఁ గలవు. కాని యామెగతి బలవంతముగా చెఱసాలలో నిష్కారణముగా వేసి తప్పించుకొనుటకు ప్రయత్నింపఁగా శిక్షించినట్లైనది. బ్రదుకులో నెమ్మది యనుమాటయే లేకపోయినది. తుదకు సారంగధరుఁడు మృతిఁ జెందిన తరువాత రాజరాజనరేంద్రుఁడు ఏడ్చుచు, మొత్తుకొనుచు "ఈడుకాని వివాహ మెందును జనదు" అని తన తప్పును ఊరివారందఱికి చాటి చెప్పెనుగాని ఆ మాట యా భర్తనోట వినఁగల తృప్తియైనను పాప మా నిర్భాగ్యురాలికి లేదయ్యెను! ఇట్లు ఏతృప్తియు లేక, యేయాశయుఁ దీరక, అదవచావు చచ్చుటకు చిత్రాంగి యర్హురాలుగాదని తలఁచియే కాఁబోలు, భర్త శిక్షను విధించినమాట విన్నంతనే ఆమె దిగులుపడి తన్నుకొని పడిచచ్చినట్లున్న కృష్ణమాచార్యుల కల్పనను మార్చి, చిత్రాంగి తానే కత్తితో పొడుచుకొని భర్తను చెడఁతిట్టి చచ్చినట్లు కల్పించి కొందఱభినయింపఁగా జూచినాను. ఈ మార్పు సభ్యులకు కొంత తృప్తి నిచ్చుననుట నిస్సందేహము. కాని యసలు చిత్రాంగి చావనేవలయునా? మఱి తన తప్పు ఇంతగా బయలైన తరువాత ఆ బండ బ్రతుకు బ్రతికి యేమిఫలమని యడుగుదురు? తాను జేసినది తప్పని యెఱుఁగనివారికి, పాపభీతి లేనివారికి ఇట్టిది బండబ్రతు కగునుగాని తన దోషము నెఱిఁగి హార్దముగా పశ్చాత్తాపము పడఁగలవారికి బ్రతుకులో బండతన మేమి? మఱియు తప్పులను దిద్దుకొని తరువాతి నడతను శుభ్రముగా నుంచుకొనుటకు నవకాశము బ్రతుకులో నున్నది. చచ్చిన నేమిగలదు? చిత్రాంగి న్యాయబుద్ధిని, పాపభీతిని, పశ్చాత్తాపమును గ్రంథకర్త స్పష్టముగా వివరించియే యున్నాఁడు. ఇఁక చావు ఎవరి యుపకారము కొఱకు? ఇట్లే 'రామరాజు చరిత్రము'లో శ్రీనివాసరావు ఆయుస్సు నిచ్చియుండినను ఆషాబీని, పటాణిని తుదకు రంగభూమికి బలియిచ్చిన సుమనోరమసభ వారి మార్పు గూడ చింత్యమే. పటాణిదృష్టిలో రామరాజు తన తండ్రి యనుట యొకటితప్ప తక్కిన యతని గుణములన్నియు దుష్టములే. శిక్షార్హములే. కావున వానిని జంపి పటాణి స్వధర్మమే నెఱవేర్చినాఁడు. తన్ను గని పెంచిన తండ్రిని జంపితినే యను దుఃఖము వానికిఁ గలుగుట సహజమే. కాని దానికి ఆత్మహత్య ప్రతీకారమా? జన్మాంతరములందు నమ్మిక గల చిత్రాంగికిని, పరలోకముగలదని విశ్వసించిన పటాణికిని జీవితమందలి తప్పుల ఫలములు చావుతోఁ దీరునా?

ఇఁక ఇట్టివి సహజములుగావా? ఇట్లు ఉద్రేకమునకు లోఁగి చంపువారును, చచ్చువారును లేరా>? యని వేఱొక ప్రశ్న. కావని, లేరని యెవరనిరి? ఇంతకన్నను అన్యాయములు, అసహ్యములు నైనవి యెన్నో జీవితమునందు చూచుచు, వినుచు నున్నాము. వానినెల్ల సహజము లను నెపమున రంగస్థలమున కెక్కింపఁగలమా? ఎక్కింపవచ్చునా? భీమసేనునివంటి యసాధారణబలశాలి యగు మగనికి తన కన్నులయెదుట సభలో తన ప్రియపత్నిని కీచకునివంటి మత్తుఁడు తన్ని అవమానపఱిచినప్పుడు వాని నూరక గొంతుపిసికి చంపి పాఱవైచుటతో మాత్రము తృప్తిగలుగదు. అక్కసు ఆఱదు. వాఁడు వానిని చంపిన విధానమును తిక్కన సోమయాజి యెట్లు వర్ణించినాఁడు?

వికృతపుఁజావు సంప మది - వేడుకపుట్టినఁ గిట్టి పట్టి మ
స్తకమును బీనదీర్ఘభుజ - శాఖలుఁ బాదయుగంబు మేనిలో
నికిఁ జొర నుగ్గుగాఁ దుఱిమి - నించిన క్రంతల తిత్తియైన కీ
చకు ధరణీస్థలిం జదిపి - చక్కని ముద్దగఁ జేసె దుష్టుఁడై.
(భార. విరా. ౨ - ౩౫౩\)
పరోక్షానుభవముగల కావ్యమునందే యిది యింత కష్టముగా నున్నప్పుడు సహజమను నెపమున దీనిని ప్రత్యక్షముగా రంగమందు చూపవచ్చునా? చూపుటకు సాధ్యము గాదని వదలుట వేఱుమాట. ఏదో యొక మార్గమున కిటుకుచేసి పైని మారణవిధిని చూపగల శక్తి యున్నను చూపఁదగదనియు, ఇట్టివాని వలన సభ్యుల కుద్రేకపు మత్తెక్కించుట తప్ప నిజమైన నీతిగాని, ఆనందముగాని కలుగదనియు నా యభిప్రాయము.

ఇఁక సారంగధరునివంటి యుత్తమ పాత్రములనుగాని, దుష్టబుద్ధివంటి యధమపాత్రములను గాని యుక్కుబొమ్మవలె తయారుచేయ రాదనియు, పాత్రములలో ఉత్తమ మధ్య మాధమ గుణములు మిశ్రమముగా నుండిననేతప్ప చూచునట్టి మనకు వానితో సౌమనస్యము కలుగదనియుఁ గొందఱు వాదింతురు. పాశ్చాత్యులలోని స్వభావవాదపు పరిణామములలో నిదియొకటి. మన కవు లిద్దఱు నీ యభిప్రాయమునకు నంతగా మన్నింపలేదని సంతోషమగుచున్నది. పాత్రములతో మనకు తన్మయత్వము కలుగుట, వాని స్వరూపము మన హృదయములం దచ్చుపడుట, కవియు నటుఁడును వాని కిచ్చిన తీర్పునుబట్టి, వర్చస్సునుబట్టి యుండునేకాని అవి మిశ్రములుగా నున్నంత మాత్రమునఁ గలుగదు. సారంగధరుఁ డొకమాఱు చిత్రాంగికి లోపడినట్లును, హరిశ్చంద్రుఁ డొక తూరి యసత్యమాడినట్లును కల్పించుట యొక గొప్పకాదు. అట్లుచేయుట "లాభః పరం గోవధః" అనునట్లు ఆ మహాపురుషుల మొగముపై నొక మసిబొట్టు పెట్టిన ట్లగునేకాని ఆ పాత్రముల వ్యక్తికి మేల్మిరాదు. అవి యెక్కువ సత్యములుగా మనకుఁ దోఁపవు. మంచియందుఁగాని, చెడ్డయందుఁగాని తీవ్రమైన హఠము గలిగి వర్తించు వ్యక్తులు అస్వాభావికము లనుట మన స్వభావాజ్ఞానమునే వెల్లడించును. మంచి చెడ్డల మిశ్రములగు దుర్బల వ్యక్తు లెట్లో అట్లే నమ్మిక నమ్మికకుఁ దగినట్లు పట్టిన పట్టు వదలని ప్రబలవ్యక్తులను ప్రకృతియందు సహజములు. కళాప్రపంచము వీని నేల వదలవలయును? కళావంతుని ధర్మమెల్ల తా నేఱుకొన్న వస్తువుగాని, పాత్రముగాని మనకు హృదయంగమ మగునంత తీవ్రతతో తయారు చేయుటయేకాని వేఱుకాదు. అట్టి పాత్రములు ప్రకృతిలో నున్నవా యనుచర్చతో వాని కంతగా పని లేదు. ఉండవచ్చుననిఁ తోఁచినను, ఉండవలయునని బుద్ధి పుట్టినను జాలును, మఱియు నాఁటి నుండి నేఁటివరకు దినదినమును, క్షణక్షణమును ధర్మము, నీతి, శాంతి, శక్తి మొదలగు నన్నిటియందును పరమావధిని సాధించుటయే మనుష్యుల పరాయణమై యుండఁగా భావనామయమగు కళాప్రపంచమునం దైనను దానిని పూర్తిగా సాధించు నాశను మనమేల వదలవలయును? ఎట్లు వదలఁగలము? అట్లని మిశ్రపాత్రములను వదలవలయునని నేను జెప్పను. మిశ్రవ్యక్తులను ప్రదర్శించుటయే కళాకారుని ధర్మమని మాత్రము నే నంగీకరింపఁ జాలను.

ఈ సందర్భమున మఱియొక వింత. సారంగధరుఁడు అంత యుత్తమపాత్రముగానుండుటకు మనలో కొంద ఱోర్చు కొనలేరు గాని, వారి తండ్రి రాజరాజనరేంద్రుఁడు తెలుఁగు వాఁడై తెలుఁగు మహాభారతమునకు మూలపురుషుఁడు కావున వాఁ డింతటి యకార్యము చేసియుండఁ డనియు, అందుచే తెలుఁగువా రీ కథ నాటకముగా నాడుటకాని, చూచుటకాని ఆంధ్రగౌరవమునకు లోప మనియు ఆవేశముతో వాదింతురు. ఇట్లు చూడఁ బోయినచో విరాటపర్వము నాటక మాడిన కర్ణాటకుల కవమానము. ఎందుకఁనగా విరాటుఁడును, వాని కొడుకగు నుత్తరుఁడును కర్ణాటకులఁట! మొదటివాఁడు పంద, రెండవవాఁడు పిఱికి. ఇట్లే రామాయణము నాడినచో అరవ మహాశయుల కాగ్రహము. రావణాసురుఁడు మొదలగువారు ఆది యరవలఁట! వంతులమీఁద ఒండొరుల పెండ్లాముల నపహరించి సంసారముచేసిన వాలిసుగ్రీవులును కర్ణాటకులు కావచ్చును గాన రామాయణపు అగౌరవములో కన్నడమువారికిని భాగము గలదు. ఇట్టి విమర్శలు తెగుట యెప్పటికి. అది యట్లుండనిండు. చెప్పవచ్చిన దేమనఁగా మనవారి కుత్తమపాత్రములం దభిమానము లేకపోలేదుగాని ఇంకెవరిమాటలనో యనువదించుచు కావ్యనాటకాదులందు వానివలన రంజన చెడు ననుచున్నారేకాని, ఇది తమ హృదయమును తాము పరీక్షించుకొని చెప్పుమాటకాదని.

(౨) ఈ కవు లిద్దఱును తమ నాటకములను తామే ఆడించుపనికి పూనుకొన్న వా రగుటచేత, నాటకప్రపంచమున కవికి తరువాత ముఖ్య ప్రకృతులగు నటుల యొక్కయు, సభ్యుల యొక్కయు ఇష్టానిష్టములను, అనుకూల ప్రతికూలములను గమనింపవలసిన యక్కర వీరి కేర్పడినది. అందుచేత ఇంటిలో కూర్చుండి నాటకములు వ్రాసి అచ్చొత్తించు ననేక కవుల రచనలవలె వీరివి కేవల శ్రవ్యకావ్యములుగాక నిజమైన దృశ్య కావ్యములును అయినవి. సంస్కృతభాషలో కేవల ప్రాచీనములైనవి కొన్నితప్పి తక్కిన వేవియు నభినయించుట కనుకూలముగా లేక, అభినయించినను రక్తియుండకపోవుటకుఁ గల ముఖ్యకారణము ఆ కవు లెవరును అభినేతల జవాబ్దారీని ఎఱుఁగక పోవుటయే యనుటలో సందేహము లేదు. నటులు పంక్తిబాహ్యులని, నటన పాపమని భావము హిందూసంఘములో చాలనాళ్లనుండి వేరూని యుండెను. అట్టికాలములో సంఘతిరస్కారము నెదిరించి, విద్యావంతులగు సంస్కారులను నటులునుగాఁ గూర్చుకొని, వారికి నాట్యవిద్యయందు మంచి శిక్ష గలుగుటకు అవకాశముఁ గల్పించి, కన్నడము ప్రధానభాషగాఁ గల బళ్లారి పురములో తెలుఁగు నాటకము లందు మితిమీఱిన యభిరుచిఁ గల్గించి యెన్నో సంవత్సరములు నిర్వహించిన మన కవిద్వయము సాహసమును, రసోపాసనయందలి భక్తిని, కార్యశూరతను ఎంత పొగడినను దీఱదు. సభ్యులయొక్కయు, నటులయొక్కయు దృష్టిలేని కవికి కథాప్రణాళిక ననుసరించి చెప్పవలసిన యర్థభావములను ఒకరి నోటనో, పెక్కుర నోటనో సల్లాపరూపమునఁ జెప్పింపవలయు నను ఒక యభిప్రాయము తప్ప, ఒకఁ డాడినమాట యింకొకనితో పొత్తు కలిసినదా లేదా, ఒకఁడు మాటాడుచు అభినయించునప్పుడు ఇతర పాత్రములు మూగబొమ్మలవలె నుండక సందర్భమునకు, సన్నివేశమునకు తగినట్లు చేరికగా వర్తించుట కవకాశము కలదా లేదా, కల్పించిన సందర్భములు, క్రియలును రంగస్థలమున చక్కగా ననుకరించుటకు వీలున్నదా లేదా, వాని యందు వైవిధ్యము గలిగి విసుగు, వేసట కలుగనీక పరస్పర సౌహార్దముతో నడచుచున్నవా లేదా - ఇత్యాదిగా చర్చించి సమంజసముగా నాటకమును దిద్ది తీర్చుట కంతగా అక్కర తోఁపదు. ఈ నిర్బంధము నుంచుకొనుట చేతనే వీరి నాటకములలో సామాన్య కవులవానిలో లేనిబిగువు, ఐక్యము, అనురూప్యము, విచ్ఛిత్తి లేని కథాప్రవాహము మొదలగు సద్గుణములు ఎక్కువగాఁ గానవచ్చును. అందును తా నే పాత్రమును ధరించి యభినయించుటయందు శక్తియు రక్తియుఁ గలిగి యుండుటచే కృష్ణమాచార్యుల రచనలలో శ్రీనివాసరాయల రచనలకంటె నీ గుణము లెక్కువగాఁ గనిపించును.

ఇట్లు నటుల యనుకూలములను, సభ్యుల యభిరుచులను దృష్టిలో నుంచుకొనుటవలన పైని లాభములున్నను ఇందు నాటకకర్తలు స్వతంత్రతను బోఁగొట్టుకొను నపాయము గలదు. నటులందఱును సమానమైన ఉత్తమాభినయశక్తియు, విద్యాసంస్కారమును, విమర్శనాశక్తియుఁ గలవారైయుండుట యే నాటకసంఘమునందును అసాధ్యము. వారి యభిరుచియు పైమూఁడు గుణములనుబట్టి రకము వారీగా నుండును. ఇఁక సభ్యులమాట యిప్పుడు చెప్పఁబనిలేదు. అదియొక సంత. నాలుగణాలకు బ్రతికియున్న వాఁడెల్ల నాటక సభ్యుఁడు గావచ్చును. కాఁబట్టి యిట్టివారి నావర్జింపవలసినప్పుడు కర్త యెట్టివాఁడైనను కొంత లొంగక తన స్వరూపమును, అంతస్తును దింపక తప్పదు. మన కవు లిద్దఱి నాటకములందును ఈ ఫలములు గానవచ్చుచున్నవి. శ్రీనివాసరాయలు ద్రౌపదీవస్త్రాపహరణ కథ నాటకమునకు తగినదిగాదని తన 'ప్రపంచ నాటకచరిత్ర'లో కంఠోక్తముగా చెప్పినను దానిని తరువాత తానే వ్రాసి యాడింపవలసెను. మయసభలోని యింద్రజాలము, ద్రౌపది చీర లొలుచునప్పటి వివిధవర్ణాక్షయవస్త్రముల యావిర్భావము మొదలగువానిని వింతలు వింతలుగా అన్ని కంపెనీల వారును జూపుచుండఁగా మనముమాత్ర మూరక యేలయుండవలెనని సుమనోరమసభ వా రెవరో యొత్తిడి చేసిరి కాఁబోలు! ఇట్లే పురాణకథలనుండి యేదో యొక ముక్కను తీసి స్వతంత్రముగా విచిత్రసంధానముఁ గల్పించు శక్తియుఁ గల కృష్ణమాచార్యులు నట్టి సన్నివేశముల పట్టీవలె నుండు 'ప్రహ్లాదచరిత్ర'ను రచింపవలసెను. ప్రహ్లాదుని పాములతోఁ గఱిపించుట, కొండనుండి క్రిందికిఁ ద్రోయుట, ఏనుఁగులచేఁ ద్రొక్కించుట, అగ్నిలో వేయుట, స్తంభము పగిలి నరసింహమూర్తి యావర్భవించుట మొదలగు విచిత్రములను ఎందఱో సభలవారు వింతలు వింతలుగాఁ బ్రదర్శించి మెప్పులందుచుండఁగా సరసవినోదినిసభవారు మాత్రము మడి గట్టుకొని సోమరులై యుండఁదీఱునా? ప్రతికంపెనీ యందును గాలిపటము నాట్యమో, గంగిరెద్దుల గంతులో నేర్చివాఁ డెవఁడో యొకఁడు ఎట్లో వచ్చి తప్పక చేరుకొనియుండును. సాధ్యమైనంతలో ప్రతి నాటకమునందును వాని నాట్యమున కవకాశముఁ గల్పించుట కర్తకు విధి. కాఁబట్టియే రుక్మాంగదుని యేకాదశ్యుపవాస వ్రతమహత్త్వముచేత విధివిరామములు లేక మోక్షమునకుఁ బోవుచుండు జీవుల ముక్తిమెరవణిలో ముందు నాట్యమాడి యాడికాలుసేతులు కట్టెవాఱి యున్నను రంభ, ఊర్వశి మొదలగు నప్సరసలు కృష్ణమాచార్యుల బ్రహ్మసభలో మరల నాట్యమాడవలసెను! ప్రాచీనమైన కర్ణాటక, హిందూస్తానీ సంగీతపద్ధతులం దభిరుచియు, అభిమానమును ఇద్దఱు కవులకును గలదుకాని, ఆ పద్ధతి ప్రకారము తయారుచేసిన పాటలను రక్తిగా నటులందఱును పాడఁజాలరు. పాడలేకున్నను పాడఁగలమని, పాడవలయునని తలఁచువారు ప్రతినాటక సంఘమందును కొందఱైన నుండురు. అట్టి నటుల తృప్తికై వానిని విని చేతులు దట్టి తల లాడించి యానందించు సామాన్య సభ్యుల సంతోషమునకై, పార్సీకత్తులును, వానివలె కల్పింపఁబడిన హిందూస్తానీ కర్ణాటకపు కత్తులును,మన కవు లిరువురును స్వేచ్ఛగా నుపయోగింప వలసినవారైరి. తత్ఫలముగా తెలుఁగు సీమలో ముత్తైదువల పెండ్లిపాటలుగూడ ఆ వరుసలక్రిందికే దిగినవి! ఇద్దఱి నాటకములందును పెక్కింటికి ముగింపు చాల ఆకస్మికముగాఁ గానవచ్చును. కథలోని ముఖ్యవిషయము ముగిసినను దానికి సంబంధించి రంగమందు నిలిచియున్న వ్యక్తుల మనోభావములు పూర్తిగా వెలువరింపనిదే మంగళము పాడుట చాల వికారముగా నుండును. కాని శ్రీమహావిష్ణువు ఆకాశము నుండి దిగి కొడుకును చంపనున్న రుక్మాంగదునిచేతి కత్తిని తటాలున నిలుపుటతో కథలోని సత్తంతయు ముగిసినది. అప్పటికే నాలుగైదు గంటలకాలము ఒకటే తీరున కూర్చుండియున్న సభ్యులలో ననేకుల యోర్పు సుతిమించి యుండును. వా రప్పటికే లేచి కుర్చీలు వెనుకముందల కీడ్చి గందరగోళము చేయ మొదలు పెట్టుదురు. ఇఁక మోహిని, ధర్మాంగదుఁడు, సంధ్యావళి మొదలగు పాత్రముల సుఖదుఃఖముల చింత యెవరికి? తీర్చినతీర్పును జూచి యానందించు వారు లేనప్పుడు ఏల యీ వృథాశ్రమము? వీరి యనేక నాటకముల యాకస్మిక పర్యవసానమున కిదితప్ప వేఱు కారణము నాకు గోచరింపదు.

ఇరువురి నాటకములందును హాస్యరస ప్రధానములగు సన్నివేశములు కొన్ని కల్పింపబడియుండుట కిట్టి సభ్యపరాధీనతయే కారణము. తక్కిన యన్నిరసములకంటె హాస్యరసమందఱుకును హృదయంగమ మగును. ఎందఱో హాస్యప్రీతిచేతనే నాటకమును జూడఁబోవుదురు. సంస్కృత నాటకములందు విదూషకపాత్రము ప్రవేశించి రసభంగము చేయుట కిదేహేతువు. కాళిదాసుని విదూషకపాత్రము చాలదని కర్ణాటక నాటకసభల వారందఱును శాకుంతలము నాడుచుండిన కాలములో, అసలు నాటకమునం దైదు నిముషములలో ముగియుచుండిన ఆఱవయంకపు విష్కంభమును కనీసము అరగంట ప్రొద్దు పెంచి, అందు బెస్తవాని యమాయకపు వేళాకోళము, కోమట్ల బేరపు టక్కులు, పోలీసువారి లంచాల చిక్కులు మొదలగు చోద్యములను విస్తరించి చూపి వినోదము చేయుచుండిరి. ఇది యింకను పూర్తిగా నశింపలేదు. హాస్యప్రియులైన సభ్యులను తృప్తి పఱుప వలసినప్పుడు గ్రంథకర్త యిట్టివి కల్పింపవలసి యుండును. మన కవు లిరువురిలో కృష్ణమాచార్యులకు చక్కని హాస్యమును గురియించు శక్తి గలదు. శ్రీనివాసరాయల కది తక్కువ. ఐనను హాస్యసంవిధాన కల్పనాప్రయత్నము మాత్రము చేయక వదలలేదు. వారి 'ప్రహ్లాద' యందలి గురుశిష్య సంవాదము, ప్రస్తావనలలోని విదూషకపాత్రము - ఇత్యాదులిట్టి బలవంతపు హాస్య వస్తువులు. సరసమయి, నిజముగా చమత్కారజనకమగు హాస్యమిందు లేదనియే చెప్పక తీఱదు. కృష్ణమాచార్యుల నాటకములలో పెక్కు చోటుల సంవిధానముతో సమంజసముగా అతుకుకొన్న హాస్యరస మున్నను కొన్నిచోట్ల అసంబద్ధముగా గానవచ్చును. 'చిత్రనళీయము'లో సుదేవ పర్ణాదులు అడవిలో కలిసికొన్న చోటనుండు హాస్య మిట్టిది. 'చిరకారి'లో చెవిటివారి వినోదము, 'వరూధిని'లోని సరస్వత చక్రవంతుల సంవాదము మొదలగునవి యిట్లే యేర్పడినవి. అందందు - ముఖ్యముగా కృష్ణమాచార్యుని రచనలలో - సంస్కారులగు సభ్యుల మనసుకు వెగటుగల్గించు మాటలుగూడ దొరలినవి. ఇవి విని నవ్వువారు, సంతసించువారు సభ్యులలో దండిగానే యుందురు. కాని నవ్వఁజాలక మనసు నొచ్చుకొనువారును ఉందురనుట గూడ గమనింప వలసిన విషయము.

(౩) తమ నాటకములు ప్రజలకు నీతిని బోధింప వలయునను సంకల్పము ఆచార్యులకన్న రాయల కెక్కువగా నున్నట్లున్నది. ఇద్దరును శౌర్యము, సాహసము, భక్తి, పతిసతీవ్రతములు, సత్యము, అహింస - మొదలగు నీతుల విజయమును బోధించు పురాణచరిత్రకథల నేఱుకొనియో, అట్టివానిని గల్పించియో రచించినవారే. ప్రాతఁ కథలలో నీతికి భంగముఁ గల్గించు సన్నివేశము లుండెనేని ఇరువురును స్వతంత్రించి వానిని మార్చినవారే. వాలిని మఱుఁగుననుండు రాముఁడు వధించెననుట, అర్జునునిమీఁది యభిమానమున ద్రోణాచార్యుఁడు నిరపరాధియైన యేకలవ్యుని కుడిబొటనవ్రేలిని మరల వాఁడు విల్లు ముట్టకుండ గురుదక్షిణగా గ్రహించెననుట - ఇత్యాదులను కృష్ణమాచార్యులు మార్చి వేయఁగా ('సుగ్రీవవిజయము', 'హిడింబాభీమసేనీయము'), ధర్మరాజు ద్రోణుని జంపుటకై యుద్ధ భూమిలో నసత్యమాడెననుటను శ్రీనివాసరాయలు మార్చిరి ('శిరోమణి'). కాని నాటకతత్త్వము మొత్తముమీఁద రసప్రాతిపాదన మనుట కృష్ణమాచార్యుల దృష్టి, నీతిప్రదర్శనమునందలి యభినివేశము శ్రీనివాసరాయల యెడ కొంచెము ముదిరి యున్నది. కాఁబట్టియే సారంగధరుని కథ దుర్నీతి భూయిష్టమని వారు నాటకముగాఁ దలపెట్టలేదు. "నీతి కుదర్పవలయున్నన దుర్నీతి నించుక ప్రకటించియే తీరవలయు"నని కృష్ణమాచార్యులు తమ 'సారంగధర' పీఠికలోఁ బ్రకటించిరి. సారంగధరుని కథను నాటకీకరింపలేదను పేరే కాని శ్రీనివాసరాయలు దానివంటిది, ఒకవిధమున దానికన్న మించినది యగు కథను కల్పించి 'మైసూరురాజ్యము'నఁ జేర్చిరి. అక్కడ సవతితల్లి కుమారుని మోహించిన, ఇక్కడ మేనత్త - ఒక మేనల్లునిగాదు - ఇద్దఱిని మోహించును. సారంగధరునివలె వీ రిరువురును తిరస్కారమునకు ఫలముగా వధింపఁబడుదురు. సారంగధరకథకుఁ గలిగిన వ్యాప్తిని చూచి సుమనోరమసభవారి నిర్బంధముచేతనో, లేక వారికే దృష్టియందు మార్పు గలిగియో దీనిని వ్రాసియుందురు. అందులోఁగల కోర్టు లాయర్ల విచారణా కోలాహలము ఇందును గలదు. అది యట్లుండె. ఇద్దరిలో ఎవరును నీతిపేర రసమునుగాని, రసమను పేర నీతినిగాని ప్రాయశః చెఱిచినవారు గారు. మనుష్యజీవితమందు రెండును సమానమైన విలువగల తత్త్వములు. మఱియు పరస్పర సంబంధములు. ఒకటి యున్నచోట రెండవది యుండును; ఉండవలయును. రసమయమైన కళాప్రపంచమున నీతిని మరచిపోవలయుననియు, తలఁచుకొనరాదనియు చేయువాదము వివేచనాఫలము కాదు. ఈ రెంటిని ప్రత్యేకముగా, ఒకదాని మొగ మింకొకటి చూడనీక, తలుపులు వేసి బిగించుటకు మనుష్య జీవితమున వేఱువేఱు చిన్నిండ్లు లేవు. అవి రెండును ఒకదానికొకటి గౌరవమును, విలువను హెచ్చించు మిత్రములుగాని శత్రువులు గావు. రెంటికిని జీవితమమునందు శాంతిని బెంపొందించుటయే పరమఫలము గావున ఒకటినొకటి వదలి బ్రతుకలేవు. ఈ రెంటి యన్యోన్యాశ్రయధర్మ మెఱిఁగి వర్తించుటయే లోకక్షేమమునకు సాధకము. ప్రాధాన్యమును బట్టి పేరు మారు నింతే. మన కవు లిద్దరును కళతో నీతికిఁ గల యీ సంబంధము నేమఱక యుండుట వారి గ్రంథములకుఁ గల గౌరవ వ్యాప్తులకు ముఖ్యకారణ మనుటలో సందేహము లేదు.

కాని కళాసంసారమున నీతి తెరమఱుఁగు భార్యగా నుండి పనిచేయవలయునే కాని ముందుపడి మొగముఁ జూపి త్రోసికొని రారాదు. అట్లయినచో కళసొగసు చెడును. కనుక నాటకమునం దేనీతి ప్రవేశించినను దానికి కథతో, సన్నివేశములతో ఎడతెగని సంబంధ మున్నట్లు కన్పింప వలయునేకాని, అదేపనిగా ఆకస్మికముగా తెచ్చి యతికించినట్లు చేయరాదు. అది పిలువని పేరంటమువలె సహించుట కష్టము. ఇట్టి దౌర్బల్యము ముఖ్యముగా కృష్ణమాచార్యుల రచనలలోఁ నందందుఁ గానవచ్చును. వారికాలమున హిందూ సంఘమందు ప్రబలముగానున్న సాంఘిక, నైతిక, రాజకీయ సమస్యలను చర్చించి అందుమీఁద నిర్ణయమగు సిద్ధాంతమును వెలిఁబెట్టు పనికి వా రాకస్మికముగా తోడఁగుదురు. ప్రౌఢావివాహము, బ్రాహ్మణులు దేహ వ్యాయామము చేయునావశ్యకత, స్వదేశవస్త్రముల ప్రోత్సాహము, ఉప్పుపన్ను ధర్మముగాదనుట - ఇత్యాది విషయముల చర్చలు వీరి నాటకములందలి పాత్రముల స్వరూపము, కథాకాలము మొదలగువానితో పూర్తిగా మిళితముగాని యతుకులు.

ఆంధ్రవాఙ్మయము పాశ్చాత్యసాహిత్య సంపర్కముతో క్రొత్తక్రొత్త తెరువులఁ దిరుగుట కుపక్రమించిన కాలమున ఆ భాషలో లేని నాటకరచనకై, ఆ కాలమున బహిష్కృతమగు అభినయవిద్యకై తమ శక్తియుక్తులనెల్ల నాజీవము ధారపోసిన కార్యశూరులు వీ రిద్దఱు. వారు శక్తి కొలఁది, అనుకూలముకొలఁది, అవకాశముకొలఁది తయారుచేసి కట్టియిచ్చిన సద్ది చాలునా చాలదా యని చూచుకొనవలసినది వారి మార్గమున ముందుకు నడవఁగోరువా రందఱు చేయవలసిన పని. నేను నాటకకర్తనుగాని, అభినేతనుగాని ఇదివఱకును గాకున్నను రెంటియందును కొంత యనురాగము గలవాఁడనుగాన, ఇపుడు నేఁ జేయఁ బ్రయత్నించిన దదే. కాని యిది వట్టి పై పరామరిక. లోఁతుకు దిగి చూడవలసినది, చేయవలసినది కొండంత కలదు. నాకన్న శక్తియు, అవకాశమును, అనుకూలమును గలవా రా పని కధికారులు.


1[1] ఇక్కడ ప్రాచ్యపాశ్చాత్య శబ్దములచే ఆంగ్ల సంస్కృత నాటకములు మాత్రము గ్రాహ్యములు. అందును నే నెఱిగినవి. పైవి సామాన్య లక్షణములు. అపవాదములు ప్రకృతము గ్రహింపలేదు.
వెనక్కి

2[2] పై మూఁడును, కృష్ణమాచార్యుల 'విషాద సారంగధరము' లోనందలివి. నేను వీనిని పాడిన వరుసకును అసలు వరుసకును చాల భేదమున్నదని యొకానొక మిత్రులు వచించిరి. యుక్తమే. కాని బళ్ళారి పౌరమహాశయులు వానిని ప్రామాణికముగా సస్వరముగా బ్రకటించువఱకును ఎవరెవరి నోటినుండియో విని గ్రహింపవలసిన నావంటివారికీ పొరఁబాటు తప్పదు.
వెనక్కి

AndhraBharati AMdhra bhArati - nATakOpanyAsamulu - 1
rALlapalli anaMta kR^iShNa Sarma- Rallapalli Anantha Krishna Sarma- telugu vachana sAhityamu - upanyAsamulu vyAsamulu - ( telugu andhra )