వచన సాహిత్యము వ్యాసములు రుద్రకవి - సుగ్రీవవిజయం : డా|| ఆర్. అనంత పద్మనాభరావు

రుద్రకవి - సుగ్రీవవిజయం
డా|| ఆర్. అనంత పద్మనాభరావు (‘150 వసంతాల వావిళ్ల వాఙ్మయ వైజయంతి’నుండి)

తెలుగు వాఙ్మయంలో యక్షగానం ఒక ప్రత్యేకశాఖ. సంగీత సాహిత్యాలతో పాటు దేశీయ సంస్కృతికి కాణాచి. శ్రీనాథుని కాలమునాటికే యక్షగానం ప్రాచుర్యంలో వుందనడానికి జక్కుల గానకళాప్రశస్తి 15వ శతాబ్ది ఆరంభానికే ఉండటం నిదర్శనం. ఆచార్య యస్.వి. జోగారావు యక్షగానాలపై ప్రామాణికపరిశోధన చేశారు. ప్రోలుగంటి చెన్నశౌరి (15వ శతాబ్ది ఉత్తరార్ధం) సౌభరి చరిత తొలి యక్షగానమని పండితుల అభిప్రాయం. అది అలభ్యం. వెల్లంకి తాతంభట్టు కవిచింతామణి లక్షణగ్రంథంలో లక్ష్మీకల్యాణం యక్షగానం కావచ్చు. అదికూడ అలభ్యం. చక్రపురి రాఘవాచార్యుల విప్రనారాయణ చరిత్ర పెద్దనకు సమకాలీనమని, కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయ యక్షగానం ప్రాచీనమైనదనీ ఆచార్య యస్వీ జోగారావు నిర్ధారించారు. కందుకూరి రుద్రకవిపై నేను చేసిన పరిశోధనలో కూడా ఈ విషయాన్ని స్థిరపరిచినాను. రచనావిధానాన్నిబట్టి చూచినా ఇది ఆరంభరచన కాదని చెప్పవలసి ఉన్నదని డా|| నేలటూరి వేంకటరమణయ్యగారి వాదన.

కందుకూరి రుద్రకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవుల్లో ఈశాన్య పీఠంలో కూర్చొన్నాడని ప్రతీతి. రుద్రకవి రచనల్లో నిరంకుశోపాఖ్యాన ప్రబంధము, సుగ్రీవ విజయ యక్షగానము, జనార్దనాష్టకము ఇప్పుడు లభిస్తున్నాయి. సుగ్రీవ విజయం ప్రదర్శన సౌలభ్యం గల రచనయే. కందుకూరులోని జనార్దనస్వామి కంకితంగా సుగ్రీవ విజయ యక్షగానాన్ని రచించాడు. గ్రంథంలో ఆఖ్యానశైలికంటె సంవాదశైలియే ప్రచురమైనదని వేటూరివారు భావించారు. కర్ణాటకదేశంలో ఎక్కలగాణ గానము ప్రాచీనం. కథాగానం సూత్రధారుడు చేస్తాడు.

యక్షగానంలో సంగీతం పూర్తిగా దేశీయం. “యక్షగాన మొక రసవత్ ప్రబంధమనుటకు సుగ్రీవ విజయ యక్షగాన మొక ఉదాహరణ” మని చింతా దీక్షితులు అభిప్రాయపడ్డారు. రుద్రకవి రామాయణంలోని కిష్కింధకాండను యక్షగానానికి ఇతివృత్తంగా ఎంచుకొన్నాడు. కిష్కింధకాండలో పూర్వభాగకథను ఎంచుకొన్నాడు. రామలక్ష్మణులు పంపాసరోవరప్రాంతంలో తిరగటంతో మొదలై వాలివధానంతరం సుగ్రీవ పట్టాభిషేకంతో అంతమవుతుంది.

సుగ్రీవ పట్టాభిషేకమని కాక సుగ్రీవ విజయమని యక్షగానానికి నామకరణ చేయడం కొత్తదనం. శ్రీరామచంద్రుని విజయమే సుగ్రీవ విజయం. తర్వాత తర్వాత సమీరకుమార విజయము, శశాంక విజయము, లంకా విజయము వంటి కావ్యాలు వెలిశాయి. సుగ్రీవ విజయం కరుణభాసుర యక్షగాన ప్రబంధమని రుద్రకవి పేర్కొన్నాడు. శ్రీరాముని సీతావిరహక్లేశము, తారావిలాపము, సుగ్రీవునకు అంగదుని అప్పగించడం కరుణరసభరితాలు. రామాయణమంతా ఇలా యక్షగానంగా వ్రాయలేదే అని బాధపడ్డారు ఆరుద్ర.

రుద్రకవి తాళప్రధానాలైన దరువులు - త్రిపుట, జంపె, కురుచజంపె, ఆటతాళము, ఏకతాళము, సుగ్రీవ విజయములో ప్రయోగించి, కొన్నిటికి రాగసూచన కూడా చేశాడు. ధవళ శోభనములు, ఏలలు, అర్ధచంద్రికలు- మరెన్నో దేశిచ్ఛందోగీతాలు, ద్విపదలు ఈ యక్షగానంలో ఉన్నాయి. గానరూపకథాఖ్యానంగా కవి వ్రాశాడు. కథానుసంధానవచనాలు సూత్రధారునిచే చేయించవచ్చు.

సీత నగలను చూచి రాముడు విలపించే సన్నివేశం కరుణరసాత్మకం.

“తరణికులమున బుట్టి శరచాపములు బట్టి
తరుణి గోల్పడుకంటె మరణమే మేలు
నను శౌర్యవంతుడని తనపుత్రి నిడినట్టి
జనకవిభు డీవార్త విని వగవకున్నె
ఒకటి నొచ్చెము లేకయున్న రవివంశమున
కకట నాచే నింత యపకీర్తి వచ్చెనే”

వాలి అంగదునకు చివరిమాటలుగా చెప్పిన హితవువాక్యాలు, కడుదీనంగా పలికిన పలుకులు వాడి ములుకులై ఎదలో నాటుకొంటాయి.

“అన్న! యిన్నాళ్లవలె నాగడంబులు సేయ
కెన్న నెవ్వరికైన హిత మాచరింపు.”

అంగదుడు ఆ సమయంలో ‘క్రాలుగన్నుల నీరు వరదలుగాగ నేడ్చె’నని రుద్రకవి చిత్రించాడు. యక్షగానంలో వీరరసం అంగరసం. శ్రీరాముడు సుగ్రీవునకు అభయహస్త మిచ్చినప్పుడు ధర్మవీరము, సప్తతాళభేదనము, వాలి సంహారము, బలవీరము స్ఫురణకు వస్తాయి.

“ధర్మమే జయమనుచు దలపనేరని ఘోర
దుర్మార్గులకు బ్రతుకు దూరమై చనదె”

అని పలికి ధర్మవీరు డనిపించుకొన్నాడు శ్రీరామచంద్రుడు.

వాల్మీకి రామాయణ శ్లోకానికి రుద్రకవి అనువాదం ప్రశస్తం.

“త్వం నరాధిపతిః పుత్రః ప్రథితః ప్రియదర్శనః
పరాఙ్ముఖవధం కృత్వా కోఽత్ర ప్రాప్తి స్త్వయా గుణ”
    (కిష్కింధ 17 సర్గ - 16 శ్లో)

రుద్రకవి అనుకరణ

“నాయమెరుగక చంపితివి నరనాథ! పాపము గట్టుకొంటివి
బోయ వింతియెగాక నీవొక భూమిపతివా?”

రామాయణంలో శ్రీరామసుగ్రీవమైత్రి కథాభాగానికి ఆయువుపట్టు. సుగ్రీవునితో మైత్రి లభింపనిచో శ్రీరాముని సీతాన్వేషణ ప్రయత్నాలకు తగిన సాధనాలు లభ్యమయ్యేవి కావు. శ్రీరామునికి సుగ్రీవమైత్రి అత్యంతావశ్యకం. సుగ్రీవునికి రాజ్యపట్టాభిషేకం చేస్తానని శ్రీరాముడు మొట్టమొదట ప్రతిన బూనాడు. ఈ కథను యక్షగానంగా స్వీకరించాడు రుద్రకవి.

తార పాత్రను రుద్రకవి ఎంతో మెలకువతో తీర్చిదిద్దాడు. ఇది ఎంతో సంయమనము, బుద్ధినైశిత్యముగల పాత్ర. రెండవమారు సుగ్రీవుడు వాలిని యుద్ధాని కాహ్వానించగా వాలిని వారించే ప్రయత్నంలో తార ప్రథమంగా యక్షగానంలో ప్రత్యక్షమవుతుంది.

‘విజయోదార! ఏటికి బోయెదవు రవితనయుమీదన్’ అని ఎన్నో రాజ్యతంత్రాలు చెప్పింది. అంగదుచేత నొక కార్యము వింటినని రహస్యవృత్తాంతాలను తెలిపింది. రాముడు మనుజమాత్రుడు కాదని హెచ్చరించింది. వాలి తార మాటలు పెడచెవిని పెట్టాడు.

భర్తృమరణ సమయంలో వాలితో సహగమనానికి సిద్ధపడింది.

“ప్రాణేశ! నీవంటి పతి జన్మజన్మలకు
నేణాంకబింబాస్య కిల గలుగగలదె”

అని అంటుంది.

“ఆలి చెరగొనిపోయినట్టి దశాస్యు డుండంగ నిర్నిమిత్తము
వాలి నేటికి జంపితివి రఘువంశతిలకా!”

అని వాడి ములుకులు ప్రయోగించింది. ఇలా యక్షగాన చరిత్రలో విశిష్టమైనది రుద్రకవి సుగ్రీవవిజయం.


సుగ్రీవవిజయము - కందుకూరి రుద్రకవి

మధురకవితలు
‘సుగ్రీవవిజయము’ (1939) పీఠిక - వేటూరి ప్రభాకర శాస్త్రి

ఆముఖము
‘సుగ్రీవవిజయము’ (1973) పీఠిక - డా. జి.వి. సుబ్రహ్మణ్యం

AndhraBharati AMdhra bhArati - telugu vachana sAhityamu - vyAsamulu - yakShagAnamu - DR. S. V. Joga Rao DR. S.V.JogaRao ( telugu andhra )