| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (పరాత్పరులకే - అంతటి అనుమానాలూ అపనమ్మకాలూ వున్నప్పుడు సామాన్య మానవులలో అడుగడుగునా అపనమ్మకాలూ అవీ రావడం - విడ్డూర్యం కాదు కాని వింత అనుకోవాలి. విష్ణుమూర్తిని ఎలా నిలదీసి - అడుగుతుంది లక్ష్మి.) |
| 005. లక్ష్మీ - విష్ణు సంవాదం |
|
కలికి కవాటము బంధన చేసిన కారణమేమే లక్ష్మీ - నీకు కారణమేమే లక్ష్మీ? కారణమేమని అడిగెవు నీమది తెలియలేద ధవలాక్షా - మరి తెలియలేద ధవలాక్షా. తెలిసీ తెలియక చెంతను చేరితి పంతమేలనే లక్ష్మీ - నీకు పంతమేలనే లక్ష్మీ? కొంచెపు జాతని చెంచిత సవతని చింతదీరెనో సామీ - నాకు చింతదీరెనో సామీ. జిలుగుపు టేదల చీరలు తెస్తిని చెంత చేరవే లక్ష్మీ - నా చెంత చేరవే లక్ష్మీ. జిలుగుపు టేదల చీరలు తెస్తే చెంచీత చేరును పోవోయ్ - నీవు చెంచీత చేరును పోవోయ్. చేపట్టు చేల్వ బంగారు రవికలు తెస్తినే జాగుసేయ ధవలాక్షీ - నను చేరనీయవే కమలాక్షీ. జాల్వరు బంగరు రవికలు చెంచీత కిచ్చిన ఏలునుస్వామీ - నీవిచ్చిన ఏలును స్వామీ. ఇప్పపు బంతులు ఇంపుగ దెస్తిని ఇంపుగ యేలవె లక్ష్మి - నను ఇంపుగ యేలవె లక్ష్మి. ఇప్పపు బంతులు ఇంతి చెంచితకి ఇస్తే యేలును స్వామీ - నిను ఇస్తే యేలును స్వామీ. మల్లెపుబంతులు మగువరొ తెస్తిని మన్నించేలవె లక్ష్మీ - నను మన్నించేలవె లక్ష్మీ. మల్లెపుబంతులు మగువ చెంచిత కిస్తే మన్నించేలును స్వామీ - నిను మన్నించేలును స్వామీ. రవ్వలు చెక్కిన రాగిడి తెస్తిని రానియ్యవె ఓ లక్ష్మి - నను రానియ్యవె ఓ లక్ష్మి. రవ్వలు చెక్కిన రాగిడితెస్తే చెంచిత కివ్వగదోయీ - నివు చెంచిత కివ్వగదోయీ. గరిమిష్టమ్మున గండభేరుండంబులు గాసి పొందితినే భామా - నేను గాసిపొందితినే భామా. గండభేరుండంబులు గాసి బొందితే చెంచిత యేలును స్వామీ - నిను చెంచిత యేలును స్వామీ. శరణే శ్రీహరి శరణే లక్ష్మీ శరణంటిని గైకొనవే - లక్ష్మీ శరణంటిని గైకొనవే. కొత్తపెళ్ళికొడుకువై నీవూ వర్ధిల్లుము వసుదేవా - స్వామీ వర్ధిల్లుము వసుదేవా. పద్మగంధినీ పాదములకూ వందనములు పదివేలే - లక్ష్మి వందనములు పదివేలే. నవ్వుతు శ్రీలక్ష్మి వాకిలి తీసెను గడియెతీసె వరలక్ష్మి - అప్పుడే గడియతీసె వరలక్ష్మి మదనజనక తన మగువని తోడుకొ మందిరముల కేతెంచెన్ - లక్ష్మి మందిరముల కేతెంచెన్. |