దేశి సాహిత్యము యక్షగానములు ప్రహ్లాద భక్తి విజయము
ద్వితీయాంకము
- త్యాగరాజస్వామి
ప్రహ్లాదుఁడు శ్రీహరిని నానావిధంబుల స్తుతి సేయుట
వ. అంతట ప్రహ్లాదుఁడు సముద్రమహారాజు పలికిన వాక్యంబుల నాలకించి శ్రీహరి
ప్రత్యక్షం బగుట కొఱకు స్తోత్రంబు సేయు మార్గం బెట్టులనిన.
క. పెద్దల మాటలవల్లను
కద్దని సత్యంబు వరద! కడునమ్మితి నా
యొద్దకు రాకుండకురా
యద్దపు నెమ్మోముఁ జూడ నలసితిఁ గదరా!
దండకము. శ్రీభక్త హృత్తాప గాఢాంధకారాయుతార్క ప్రభాకార దివ్యంబు
నేత్రోత్సవంబౌను నీరూపుఁ జూపించు రామ ప్రభో నీవనేకాండ కోట్లన్‌!
విధీంద్రాది దేవాసుర స్థూల సూక్ష్మంబులన్‌ నీవు పుట్టించి కాపాడి
నష్టంబు సేయన్‌ సదా మూడు రూపంబులన్‌ దాల్చి లోకేశుఁడై, విష్ణువై,
రుద్రుఁడై చాల లీలా వినోదంబులన్‌ చేయ మర్త్యుల్‌ సదాషణ్మతంబైన
కూపంబులోఁ బుట్టి కామాది షడ్వర్గ కృత్యంబులన్‌ సల్పి గర్వాచలా
రూఢులై చాల దారార్భకాగార గోబంధులోకంబులం జూచు
చుప్పొంగుచుం గుక్షి పూర్ణంబు సేయంగ లేకెప్పుడున్‌ దుఃఖ వారాశిలో
మగ్నులౌ వారు శ్రీరామునింజేరు నారాజ మార్గంబులన్‌ స్వప్నమందైన
సాధింపలేరయ్య నే నమ్మినానయ్య రావయ్య నాయొక్క భాగ్యంబు నీవంచు
నున్నాను శ్రీత్యాగరాజార్చితా ఖండలాద్యష్ట దిక్పాల సంసేవ్య
మాంపాహి మాంపాహి మాంపాహి॥
క. వందనము దశరథాత్మజ
వందనమిదె నీకు భక్తవత్సల దేవా
వందనము లోకనాయక
నందకధర పరమ పురుష నారదవినుతా॥
కీర్తన
శహన - ఆది
పల్లవివందనము రఘునందనా సేతు - బంధనా భక్త చందనా రామ
చరణ (1):శ్రీదమా నాతో వాదమా నే - భేదమా ఇది మోదమా రామ
చరణ (2):శ్రీరమా హృచ్చారమా బ్రోవ - భావమా రాయబారమా రామ
చరణ (3):వింటిని నమ్ము కొంటిని శర - ణంటిని రమ్మంటిని రామ
చరణ (4):ఓడను భక్తి వీడను ఒరుల - వేడను నీవాడను రామ
చరణ (5):కమ్మని విడె మిమ్మని వరము - కొమ్మని పలుకరమ్మని రామ
చరణ (6):న్యాయమా నీకాదాయమా ఇంత - హేయమా మునిగేయమా రామ
చరణ (7):క్షేమము దివ్యధామము నిత్య - నేమము రామనామము రామ
చరణ (8):వేగరా కరుణాసాగర శ్రీ - త్యాగరాజ హృదయాగారా రామ
క. నా మొరవిని బ్రోతువంచు
నేమంబున మదిని దలచి నెరనమ్మితినే
సామజ వరదా నాయెడ
వేమరు నీ కరుణరాని విధమేమోగా॥
వ. ఈలాగున ననేక విధంబులు స్తోత్రంబులు సలుపఁగ శ్రీహరి ప్రత్యక్షంబు గాలేదని
ప్రహ్లాద స్వామి యత్యంత వ్యసనా క్రాంతుడై పలుకు మార్గం బెట్టులనిన.
ద్వి. ముజ్జ గంబుల కాది మూలమై పరగు - సజ్జన హృత్పద్మ సదనుని కృపను॥
సకల సంపద్భోగ సామ్రాజ్యములను - బ్రకటముగాఁ బొంది ప్రఖ్యాతి గలుగు॥
కనక కశ్యపుదైత్యు కడుపునఁ బుట్టి - దిన దినమున బుద్ధి దెలిసిన నాఁడు॥
వాజి గజాదుల వైఖరుల్‌ గలిగి - రాజ భోగములను రమియించు జనుల॥
కనుగొని హరిపాద యుగ్మమును - నెనరున ధ్యానించి నేఁ జూచుచుంటి॥
శుభశోభనములచే శోభిల్లి మఱియు - విభవంబుచే జనుల్‌ వెడలంగఁ జూచి॥
ఆవేళ హరిమయంబనుచు నా మదిని - ధావన సేయుచుఁ బలు మారునుంటి॥
నామది శోధింప నా తండ్రి నాకు - పాములఁ గఱిపించి భద్రేభములను॥
మేనునఁ గ్రుమ్మించి మిగులఁ గోపమున - దానవుల్‌ చిచ్చునఁ దగిలించునట్టి॥
పరిపరి విధముల బాధలనెల్ల - హరి లీలలనుచు నేనపుడెంచుచుంటి॥
ఇంతకు శ్రీహరి హృదయంబు కరిగి - చెంతకు రాఁడాయెఁ జెలువొంద నేఁడు॥
వ. మఱియు నతి చింతాక్రాంతుడై చింతించు టెట్టులనిన.
ఉ. నా మది కోర్కెలెల్ల రఘునాథుడు తామది నేల యెంచఁడో
నే మొరవెట్టగాఁ దెలిసి నేర్పున ముంగల నేల నిల్వఁడో
రామునిఁ జూడ నామనసు రాయిడిఁజెంది కరంగునట్లుగాఁ
దామరచూలి నానుదుటఁ దప్పక క్రూరపు వ్రాత వ్రాసెనో॥
క. పరులకు సాధ్యంబగునఁట
యరిషడ్వర్గములఁ దగిలి యాసించితినే
తరుఫల మందని చందము
హరియెచ్చట నేను నేడనని చింతించెన్‌॥
కీర్తన
ఘంటా - ఆది
పల్లవిఎట్ల కనుగొందునో - శ్రీహరిని నే
అనుపల్లవిచుట్లరగడియ దోవకు నామదిలోని
 జాలిదెలిసి విభునితోఁ దెల్పువారి
చరణ (1):ధరలో వెలయు సంపదల రోసి తనువును
 మఱచి హరినిఁగూడే మహారాజులకుఁ గాక
చరణ (2):మలయుని మదమునఁ దెలియకుంటిని కాని
 యలనాఁడే సదయుని ననుసరించక పోతి
చరణ (3):చిన్నప్రాయమునాఁడె శ్రీహరిపై నానఁ
 గొన్న జీవుఁడఁగాను కోదండపాణి నే
చరణ (4):ఈజన్మ మీభాగ్య మీసొమ్ములెల్ల ప్ర
 యోజన మాత్యాగరాజ వినుతుని నే
వ. ఈలాగు నత్యంత ప్రేమావేశములు గలవాఁడై యతిదీనుఁడగు
ప్రహ్లాదస్వామి తిరుగ నేమనుచున్నాఁడనిన.
సీ. తల్లి గర్భములోన దగిలి నేనుండగా - నిల మౌని నిజమర్మమేల తెలిపె
నున్నతంబున నుండి యుర్వినిఁ బడవేయ - నీ భూమిదేవి నన్నేలఁ బట్టె
హరినిఁ గానని దేహమని యబ్ధిలోవేయ - నీ సాగరుండు గట్టుకేలఁ దెచ్చె
గోముఖవ్యాఘ్ర భంగుల నన్నుఁ గొనియాడి - యీలాగునను నిల్పిరేల యిచట
నెందుకీరీతి మరులైతినిపుడు హరికి - నెవరితోఁ దెల్పుదీవేళ నేమిసేతు
జీవుడీమేను కాసించి చిక్కుకొనెను - ఈశుఁ గనలేని జన్మంబు నిలకుమోఁత॥
కీర్తన
పున్నాగవరాళి - చాపు
పల్లవిఇందుకా యీ తనువును సాకిన
అనుపల్లవిఇందుముఖుఁడు రాక - హృదయము పగులఁగ
 నందరిలో జాలిజెంద నీయని యంద
చరణ (1):పాములకే మేను పలుగట్టిగా నుండ
 నేమో కారణమని యెంచుచు నుంటినే
చరణ (2):మనకేల నెపమని మన్నించిరో లేక
 తనువు బెల్లముగాదు తాళదు దైవము
చరణ (3):నాజపమును జూచి నమ్మరే దేవుని
 రాజిల్లు శ్రీత్యాగరాజ వరదుఁడు తా
వ. ఇచ్చట నీలాగున ప్రహ్లాదస్వామి మొరలిడుచున్న సమయంబున సనక సనందనాదుల
యొద్దకు శ్రీనారద గురుస్వామి వేంచేసి యర్ఘ్యపాద్యాదులు గైకొని అత్యంత హర్షముతో
ప్రహ్లాదుని వృత్తాంతము పలుకు టెట్టులనిన.
ద్వి. సనకాది మునులార సౌఖ్యాత్ములార - మనవిని వినరయ్య మధువైరియందు॥
జ్ఞాన వైరాగ్య శృంగార సద్భక్తి - మానక విజ్ఞాన మర్మంబు దెలియు॥
జ్ఞాన వంతుండని ఘనముగా వెలయు - మానవునెచ్చోట మౌనీశ మేము॥
కానలేమని మీరు కడఁగి పల్కితిరె - కానఁ బల్కుదునిదె కలతీరు వినుడు॥
భువిని ప్రహ్లాదుండు బుద్ధిమంతుండు - అవివేకముల నెల్ల నణఁచ యోగ్యుండు॥
హరినిఁ గానకను తా నారడిఁ జెంది - మఱి మఱిఁ జింతింప మాధవుం డెఱిగి॥
విహితమౌ భక్తుని వెతలన్ని దీర్చి - మహిమలన్నియుఁ జూపి మన్నన సేయ॥
మహికేగునని తోచె మది హర్షమునను - సహితమై పోదము సానందముగను॥
అనుచు నారదమౌని యట వారిఁ జూచి - వినయంబుతోఁ బల్కి వేంజేసె సభకు॥
వ. అంతట నారదమౌని హరిగుణ మహిమానంద జలధిలో వల్లకియను తెప్పనుఁ బట్టి యీదుచు
శ్రీమన్నారాయణ స్మరణఁ జేయుచు శ్రీహరి సభకు పోవువేళ నిచ్చట ప్రహ్లాదస్వామి
యేమనుచున్నా డనిన.
క. కోరిన దేవునిగానక
యేరీతిన్‌ జపముతపము లేమోయనుచు
న్నారామ మందుఁ బొలరఁగ
దూరపు నాదంబుఁ జెవుల దురమున వినియెన్‌॥
వ. ఇవ్విధంబున ప్రహ్లాదుఁడు నారద వీణా నాదమును విని యే మనుచున్నాడనిన.
సీ. ఈవేళఁ దనకోస మీదేశమునుఁ గోరి - యేలవత్తురు పెద్దలింపు మీఱ
నామీద దయయుంచి నన్నాదరించెడు - వారున్న నిందిరావరుఁడు రాఁడె
తన వారలము కామొ ధనజన తరుణుల - సుఖహీనుఁడని పైనసూయకాక
రాముని భక్తులై రక్షింప వచ్చిన - జయముదెల్పను ఇంతజాలమేల
సర్వ కాలంబునే సత్యసంధుఁడైన - వేల్పులెవరైన ననుఁ బ్రోవ వెడలియున్న
నాద మీవేళ సముఖంబున రాదె - పరమ కల్యాణ వైకుంఠ వాస, వరద॥
కీర్తన
భైరవి - చాపు
పల్లవినిజమైతే ముందర నిలువుము ఈ వేళ
అనుపల్లవిఅజుడైన హరిహయుఁడైన నాభక్తియు
చరణ (1):గాసి చెందుచు నేను గర్భములోనుండ - దేశిక వరుఁ డుపదేశించినదెల్ల
చరణ (2):ఉన్నతమున నుండి పడద్రోసినవేళ - నుర్విదేవి నన్నెత్తి బ్రోచినదెల్ల
చరణ (3):నాగ నాగములు నను బాధించగ - త్యాగరాజనుతుఁడు నన్నుఁ గాచినదెల్ల
వ. ఇవ్విధంబున ననేకవిధంబులుగ బల్కు శపథంబులను విని
నారదమౌని ప్రహ్లాదు నొద్దకు నతిత్వరితముగ వేంచేయునది యెట్టులనిన.
క. తెల్లని దేహముతోఁ గర
పల్లవమున వీణెమెరయ బరమాత్మునిఁ దా
నుల్లమున దలఁచి సొక్కుచు
సల్లాపముతోడ మౌని సరగున వెడలెన్‌॥
కీర్తన
పంతువరాళి - చాపు
పల్లవినారదముని వెడలిన సుగుణాతిశయము వినరే
అనుపల్లవిసారెకు శ్రీహరి పదసారసముల ధ్యానించుచు
 నారాయణ నామములనుఁ - బారాయణ మొనరించుచు
చరణ (1):భేదా భేద రహితమగు - వేదాంత రసభరితుఁడా
 హ్లాదము మీఱఁగను ప్ర - హ్లాదునకు శుభము దెలుపను
చరణ (2):కడు తెల్లదేహమునఁ బ - సిడి వీణెమెఱయఁగఁ దా
 నెడబాయని ప్రేమతో - నడుగడుగుకు వాయించుచు
చరణ (3):రాజిల్లిన శ్రీత్యాగ - రాజసఖుని మర్మములను
 ఈజగతిని విన్నవారి - కే జయము జయము జయమని
వ. ఈలాగున ప్రత్యక్షమైన శ్రీమన్నారద గురుమూర్తినిఁ జూచి ప్రహ్లాదుండు అత్యంతభక్తి
విశ్వాసముతో సాష్టాంగముగా నమస్కరించి నుతిఁజేయు మార్గం బెట్టులనిన.
ద్వి. అష్టాంగయోగీశ అమరేశ సన్నుత - సాష్టాంగముగ మ్రొక్కి సన్నుతింతుఁ॥
గష్టముల్‌ తొలగెను కన్నప్పుడే మిమ్ము - నిష్టముల్‌ చేకూరె నిపుడు తనకు॥
దుష్టులు మిముఁజూచి దూరమౌదురు గదా - తుష్టుఁడైతిని బ్రహ్మనిష్ఠసుగుణ॥
సృష్ట్యాది కర్తయౌ శ్రీవల్లభునిఁగూడి - నిష్ఠతో వెలసెడు నిర్మలాత్మ॥
గోష్ఠి వినవయ్య నాలోని కోర్కెలెల్లఁ - బుష్టియవునట్లు సేయవే పూజనీయ॥
యిష్టుఁడౌ జగదీశుని నిపుడు జూడ - శ్రేష్ఠుఁడౌ నిన్ను నేనమ్మి చెప్పుకొంటి॥
ఉ. నారద నీకు వందనము నాఁడుపదేశముచేత ధన్యుఁడన్‌
వారము విష్ణుకే తనువు వంచనలేకను నొప్పగించుచున్‌
కోరితిఁ గన్నులారఁ గన గోమలదేహుఁడు చెంతరాక నే
నారడిఁ జెందినాను దన యార్తిని దీర్చు విరించినందనా॥
వ. ఈలాగు తన మనోరథముఁ దెల్పిన విని ప్రహ్లాదునిఁ జూచి నారదగురుస్వామి యత్యంత
హర్షముతో స్తోత్రము చేయున దెట్టులనిన.
ద్వి. వినవోయి ప్రహ్లాద వివరంబుగాను - తనప్రాయముల నెన్నదరముగా దిపుడు॥
తగనింద్రపట్టముల్‌ ధాతపట్టములు - అగచాపు ప్రళయంబు లటుచూచినాను॥
కర్మేంద్రియములనుఁ గాలకింకరుల - మర్మముల్‌ దెలిసి యీ మహిక్రింద నడచి॥
అనయంబు హృదయంబు హరి కొప్పగించి - కనులపండువుగానుఁ గనగోరి ఘనుని॥
గాఢంబుగామదిఁ గౌగిటజేర్చి - గూఢమునొకటిగా గూడనెంచెడిని॥
నీవంటి భక్తుని నిఖిలలోకముల - నేవంక నే గాన నీప్రదేశమున॥
బాలక నినుగంటి బాగుమీఱంగ - జాలివిడువు వచ్చు శౌరి యీవేళ॥
వ. అని పలికి నారదమౌని శ్రీవైకుంఠప్రభావమును బలుకు టెట్టులనిన.
చూర్ణిక. జయతు జయతు! సకల నిగమాగమ కుశల కిన్నర కింపురుషసిద్ధ విద్యాధర
గీయమాన బహుజగదుదయ రక్షణ లయ హేతుభూత చతురానన హరిహర
ప్రభృతి చింత్యమానమణిద్వీపే జిత సాధుహృత్తాపే! సకలసురముని నికర
నిజభక్తజన నిచయ హృదయ కామిత సంతాన సౌభాగ్య ధనకనక వాహనా
ద్యష్టైశ్వర్యదాయక చింతామణిమయ మహావైకుంఠనగరే! నేత్రానందకరే!
చండమార్తాండ విలసిత సప్తహేమ ప్రాకారాంతర శోభాయమాన
భాస్కరకోటి సమాన వజ్ర స్తంభాయుత సహిత సువర్ణమంటపాంతరే!
శుభతరే! నవరత్నఖచిత కనకమయ హంసతూలికాతల్పే! శరశ్చంద్రకోటి
సన్నిభ శేషతల్పే! సురనాయకా ద్యష్టదిక్పాల మకుట మణిగణ నీరాజిత పదారవిందః
జగదానందః అనంతగరుడ విష్వక్సేనాది నిత్యసూరిజన సమేత మహాప్రభావసంపన్నః
అఖిలభక్తజన ప్రసన్నః ఉభయపార్శోజ్జ్వలిత కర్ణకుండలనిందిత చంద్రమండలః
సేవితమునిమండలః! భక్తత్రాణ పరాయణః! శ్రీమన్నారాయణః! లక్ష్మీసమేతో మహాభగవాన్‌॥
వ. ఈ ప్రకారము శ్రీవైకుంఠ ప్రభావంబు నభివర్ణించి మఱియు నచ్చట జరిగిన
వృత్తాంతంబు ప్రహ్లాదస్వామికి నారదముని యతివివరముగాఁ బలుకు టెట్టులనిన.
ఉ. సారెకు వీణె మీటుచును సన్నుతిచేయుచు నేను నుండగా
గూరిమితో గరంగుచు వికుంఠపురంబున నాదిలక్ష్మితో
నీరజనేత్రుఁడాడిన సునిశ్చయ వార్తలు విన్నయంతనే
సారము నీకుఁదెల్పి మది సంశయమెల్లనుఁ దీర్పవచ్చినన్‌॥
వ. ఈలాగున నారదుఁడు పలికిన శుభవార్తలు విని ప్రహ్లాదుండు మితిలేని సంతోషంబున
బాష్ప పూరిత లోచనుండై గద్గదస్వరంబునఁ బరవశుఁడై పలుకునది యెట్టులనిన.
ద్వి. నిను సడ్డజేసి తా నళినాక్షితోను - వనరుహాక్షుండు నాదువార్తలు పలుక॥
నామాటలకు దల్లియడ్డమాడకను - నామీద దయయుంచి నా ప్రాణవిభునిఁ॥
గూరిమిఁ బల్కెనా గురుతరంబుగను - నారదఋషివర్య నగరాజధైర్య॥
ఇరువురు నామాటలెత్తిరా మఱియుఁ - గరుణను తలచిరా కడుప్రేమమీఱ॥
ఈ శుభవార్తకు నిది సరిగాదు - వాసుదేవుండు నావద్దనున్నట్లు॥
కమ్మని ముద్దిచ్చి కౌగిటఁజేర్చి - నమ్మికలిచ్చుచు ననుఁ బ్రోచినట్లు॥
నేఁడు నా మనసునకు నిండారు సుఖము - గూడినయట్లాయె గురురాయ శరణు॥
క. మదనజనకుఁడగు శ్రీహరి
మదిలో ననుఁ దలఁచి తలఁచి మన్ననతోడన్‌
సదయాళుఁడగుచు లక్ష్మీ
వదనము నీక్షించి పలుకు వాక్యము వింటిన్‌॥
వ. ఇవ్విధంబగు నా భాగ్యంబేమి తెలుపుదునని ప్రహ్లాదుండు పరమోత్సాహంబున
నారద గురువును చూచి మఱియు నేమనుచున్నాఁడనిన.
కీర్తన
ఆరభి - చాపు
పల్లవిఇపుడైన ననుఁ దలఁచినారా స్వామి
అనుపల్లవికృపకుఁ బాత్రుఁడనని - కీర్తించినారా
చరణ (1):దయచేసి నామాటలెల్ల నా - తల్లితో బలికిన కొల్ల
 నయముగ వింటి నీవల్ల నేడు - నామనసుకు నెంతో చల్లనాయె
చరణ (2):ఉన్నత దయ కాసగొంటి నేను - బన్నములకు బాలైయుంటి
 కన్నులార మిముఁగంటి నేడు - కర్ణామృతపు మాటవింటి స్వామి
చరణ (3):పలురూపములు తానుపూని నన్ను - బాధించే వేడ్కఁ జూచెను
 పలుమారు నన్ను నే చేయుపుణ్య - పాపము హరిచెంతగాని యేమందు
చరణ (4):భూమినిఁ బుట్టగలేను భూయో - భూయో హరిని నమ్మినాను
 తామసమును తాళలేను వర - త్యాగరాజాప్తా మదిలోను
వ. ఈ లాగున ప్రహ్లాదుం డాత్మసంతోషము గలవాఁడై
నారదగురుస్వామినిఁ జూచి మఱియు నేమనుచున్నాడనిన.
క. దేశిక! నలుగురిలోఁ బర
దేశిగ నెంచకయు నన్ను దేవుఁడు సతితో
నాశన్‌ పలికిన వార్తలు
ఆశుగ దెలియంగఁ బలుకు మమరేశనుతా॥
వ. ఈలాగున వైకుంఠము నందు జరిగిన లక్ష్మీహరి
సంవాదంబు వివరంబుగా దెలుపుమను
ప్రహ్లాదునికి నారదగురువు లెరింగింపు మార్గం బెట్టులనిన.
లక్ష్మీం ప్రతి శ్రీమన్నారాయణః (లక్ష్మీదేవితో శ్రీమన్నారాయణుడు)
చ. కలశ సముద్ర రాజవర కన్యక! చిత్రము నాలకింపు భూ
తలమున నిశ్చలుం డొకఁడు దానవపుత్రుఁడు వానిభక్తిచే
వెలపడిపోతి నామనసు వేరుగ మారదికేమిసేతు! నీ
వలె ననుఁ బాయలేఁడు కని వచ్చెదనంచు ప్రయాణ మయ్యెడున్‌.
వ. అంతట తన్నెడఁబాయ నాలోచించు భగవంతుని
హృదయం బెఱింగి తన చెలికత్తె నీక్షించి
యతిచింతాక్రాంతయై లక్ష్మీదేవి పలుకుటెట్టులనిన.
ద్వి. ఈశ్వరినై పుట్టి యీకర్మమెల్ల - శాశ్వతమాయెగా సఖియరో వినుము॥
నిన్నటి రాతిరి నిండారగను - మిన్నైన సొమ్ములు మేనెల్లనించి॥
సొగసున నేఁ గాంచి సొక్కుచునుండ - నగధరుఁడావేళ ననుజూచి శిరము॥
ఊచుచు బాగైన యురగతల్పమున - యోచనాక్రాంతుఁడై యుండి దిగ్గునను॥
లేచి నే వేంచేతు లేమరో యనుచు -నేచుచు మాటాడె నేమందునమ్మ॥
పడతిరో సొగసెల్లఁ బానుపుపాలు - పడఁజేసె నిక నోర్వవశమౌనె చెలియ॥
అనుచును నీవార్తలాడిన లక్ష్మి - ఘనుని దాఁ జూచుచు గ్రక్కునఁ బలికె॥
వ. మఱియు శ్రీహరినిఁ జూచి లక్ష్మీదేవి యొకవాక్యము పలుకుటయును,
శ్రీహరి యొకవాక్యము ప్రత్యుత్తర మిచ్చుటయును నెట్టులనిన.
సీ. (లక్ష్మీ)
తెలవార ప్రొద్దుగూకులు మీకు నిజదాస - వెఱ్ఱియేలనొ పనుల్‌ వేరెలేవె
(హరి)
అటువంటి వరభక్తుఁ డరుదారె గాని నీ - వీ మాటలందు వేరెంచ వలదు
(లక్ష్మీ)
మాటిమాటికి మీరు మహికినేగుటవల్ల - మదితల్లడిల్లును మదనజనక
(హరి)
ఎన్నాళ్ల కెన్నాళ్ల కెవరికోసము నేను - నినుబాసి చనితినో నీరజాక్షి
(లక్ష్మీ)
ద్రుతముగానాడు చనలేద ధృవుని కొఱకు
(హరి)
ఒకఁడు కోటాను కోట్లలో నుత్తముండు
(లక్ష్మీ)
అందుకే నేను నిను బాసి యార్తిబడితి
(హరి)
నింత మాత్సర్య మెందుకే యిందువదన॥
క. (లక్ష్మి)
త్రోవ నెఱింగిన బాలుడు
భావంబును బట్టుకొన్నఁ బలుకుటెటులనో
(హరి)
నా వైనంబుల నేచుచు
ద్రోవందే కల్ల సేయ దొరలెను సుమ్మీ॥
వ. ఇటువలె నమ్మిక బలికి ప్రహ్లాదునొద్దకు బోవుట కుద్యుక్తుఁడైన శ్రీమన్నారాయణునిఁ
జూచి లక్ష్మీదేవి మఱియు నేమనుచున్నదనిన.
క. ఏదారినైన వానికి
వాదాడి వరంబొసంగి వచ్చెదనని నా
మీదానఁ బెట్టి చనుమిక
నా దాహము దెలిసికొమ్ము నళినదళాక్షా॥
వ. ఈలాగున శ్రీవైకుంఠమునందు జరిగెనని ప్రహ్లాదునికి నారద గురుస్వామి పలుకు టెట్టులనిన.
క. సాకేతపురిని నిన్నను
శ్రీకాంతుండు కాంతతోడ జింతించెను తా
నా కరుణారస వార్తలు
ప్రాకటముగ నీకు నేను పల్కితిసుమ్మీ॥
క. ఈలాగు నడచు వార్తలు
బాలక నీ భాగ్యమెల్ల పండాయెనురా
నీలోఁ దగిలెను శ్రీహరి
యాలోచన సేయనేల అభయంబిదిగో॥
ద్వితీయాంకము సమాప్తము.
AndhraBharati AMdhra bhArati - tyAgarAja prahlAda bhakti vijayamu yaxagAnamu - tyAgarAja prahlAdabhaktivijaya - tyAgarAja prahlAda bhakti vijaya yaxagAna - andhra telugu tenugu ( telugu andhra )