దేశి సాహిత్యము యక్షగానములు ప్రహ్లాద భక్తి విజయము
ప్రథమాంకము
- త్యాగరాజస్వామి
క. శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది వంద్య రఘుకులతిలకా
రాజీవనయన మునిజన
పూజితపద రామచంద్ర పుణ్యచరితా॥
క. ధ్యానించెద మది విష్వ
క్సేనుని శ్రీ విష్ణు చరణసేవానిరతున్‌
నానావిఘ్న నివారణు
సేనాధిపు నప్రమేయు శ్రితజన పోషున్‌॥
క. వాణీ నిను వేడెదను పు
రాణీ నా రసనయందు రంజిల్లవె క
ల్యాణీ వీణాపుస్తక
పాణీ మాధుర్యవాణి పద్మజురాణీ॥
క. నారాయణ పుణ్యకథా
సారముఁ గ్రోలుచును సర్వసమతఁ బరగు శ్రీ
నారద గురుపద యుగములు
సారెకు మదిలోననుంచి సన్నుతి సేతున్‌॥
క. తులసీ కాననమందున
విలసితముగ హరినిఁ జూచి విస్మయయుతుఁడై
పులకీకృత తనుఁడగు నా
తులసీదాసవరు సన్నుతులు సేతు మదిన్‌॥
క. దురిత వ్రాతములెల్లను
బరిమార్చెడి హరి గుణములఁ బాడుచు నెపుడున్‌
బరవశుఁడై వెలయు పురం
దరదాసుని మహిమలను దలఁచెద మదిలోన్‌॥
క. కలియుగమున వరభద్రా
చలమున నెలకొన్న రామచంద్రుని పద భ
క్తుల కెల్ల వరుఁడనందగి
వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్‌॥
వ. ఇష్టదేవతాభివందనంబును సద్గురు ధ్యానంబును సల్పి, పూర్వభక్త వ్రాతంబునుఁ
గొనియాడి, మఱియు పాండురంగ, నామదేవ, జ్ఞానదేవ, సహదేవ, జయదేవ,
తుకారామ, శ్రీనారాయణతీర్థాది భగవద్దాసుల కెల్లం బ్రణమిల్లి నాయొనర్పం బూనిన
ప్రహ్లాద భక్తి విజయంబను ప్రబంధమునకు కృతినాయకుండగు శ్రీరామచంద్రుని
సంబోధన వాక్యంబునం జీరి విన్నవించున దెట్లనిన.
క. శ్రీకల్యాణపరంపర
సాకేతపురాధివాస సామజవరదా
నీ కారుణ్యముచే నే
నీకావ్యమొనర్చినాఁడ నింపుగ వినుమా॥
క. శ్రీమత్పంచనదంబన
భూమిని విలసిల్లునట్టి పురవరమున శ్రీ
రామస్వరూపుఁడనదగు
రామబ్రహ్మార్యసుతుఁడ రాగరహితుఁడన్‌॥
తే. ఆగమాంత విహారివై యలరు నీకు
రాగతాళాదియుత గానరసముచేత
బాగుమీరంగ సంతోషపరచునట్టి
త్యాగరాజను పేరిటఁ దనరినాఁడ॥
ద్వి. శ్రీచేత విలసిల్లు శ్రీరామచంద్ర! - వాచాలకునిఁ గని వరమిచ్చుతండ్రి॥
నాటకంబొకటి నే నయముగా నీకు - నాటగావినిపింతు హాటకాభరణ॥
ఆనాటకంబున నమరు మర్మముల - శ్రీనాథ పలికెద శ్రితులకు మ్రొక్కి॥
జ్ఞాన వైరాగ్య విజ్ఞానసద్భక్తి - దీని భావములెల్ల దివ్యమై వెలుగు॥
కనక కశిపుడు మున్ను కడుచలంబునను - తనయుని సకలబాధలబెట్టి మఱియు॥
నాగపాశంబును నడుమునఁగట్టి - సాగరంబునవేయ సెలవిచ్చు మొదలు॥
ప్రహ్లాదయోగికి ప్రబలవారిధికి - నాహ్లాదమగు వాదమందు రాజిల్లు॥
ఘనుఁడైన నారదాగమనంబుచేత - జనియింపఁబడి జాలిఁ జెంది మూర్ఛిల్ల॥
నామీద మాధవుండావిర్భవించి - సామర్థ్యములనేచి సలలితుండగుచు॥
ముమ్మారు నెదురుగ ముదముతో నిల్చి - సొమ్మసిల్లిన వేడ్క సొంపుగానుండు॥
రాగతాళ మృదంగ రవళిచే మిగుల - నాగరికం బభినయముచేఁ జెలగు॥
భక్తాగ్రగణ్యుఁడై పరమ ప్రహ్లాద - భక్తి విజయంబన బాగైన కృతిని॥
అనిశంబు నిది పుష్ప హారంబుగాను - దనివార ధరియించు ధరసుతా రమణ॥
సగుణ నిర్గుణముల సమముగా నెంచు - సుగుణ రామబ్రహ్మసుతుఁడైన త్యాగ॥
రాజు పల్కిన కథారసమెవ్వరైన - రాజిల్ల జేసిన రమ్యమై వినినఁ॥
గోరినఁ జదివినఁ గొనియాడుకొన్న - వారికి ఫలముల వ్వారిగా నొసగి॥
తప్పులొప్పులనైనఁ దాలిమిజేసి - యెప్పుడు దయచేత నేలుకోవయ్య॥
వ. ఈ ప్రహ్లాద భక్త విజయమను నాటకారంభమున సకల విఘ్న నివారణుండగు
విఘ్నేశ్వరుండు వేంచేయు విధం బెట్టులనిన.
ద్వి. కరిరాజ వదనుండు కర్పూర నిభుఁడు - గిరిసుతాసుతుఁడు సంగీత లోలుండు॥
అంబుజ సంభవాద్యమరులు గొలువ - జంబూ ఫలంబులు చవి చూచు కొంచు॥
ధర్మాధిఫలముల దయ సేతుననుచు - నిర్మల హృదయుఁడై నిర్వికారుండు॥
సొక్కుచు సోలుచు సొగసుగా వెడలె - మ్రొక్కి సేవించెదము ముదమున రారె॥
శ్రీగణేశుల ప్రవేశము
కీర్తన
సౌరాష్ట్ర - ఆది
పల్లవిశ్రీగణపతిని సేవింపరారే - శ్రిత మానవులారా
అనుపల్లవివాగాధిపాది సుపూజలఁ జేకొని - బాగ నటింపుచును వెడలిన
చరణ (1):పవన నారికేళాది జంబూ - ఫలముల నారగించి
 ఘన తరంబుగను మహిపై పదములు - ఘల్లు ఘల్లన నుంచి
 అనయము హరిచరణ యుగములను హృద - యాంబుజమున నుంచి
 వినయమునను త్యాగరాజ వినుతుఁడు - వివిధగతుల ధిత్తళాంగుమని వెడలిన
వ. ఇట్టి యాహ్లాదమగు ప్రహ్లాద భక్తి విజయమను నాటకోపక్రమ
సమయమునందు దౌవారికుఁడు వచ్చున దెటులనిన.
క. గడ గడని నడలతోడను
వడివడిగా నడుగులిడుచు వసుమతిలో తా
నెడలేక హరినిఁ బొగడుచు
నడుగడుగుకు సభనుఁ జూచి యడుగను వెడలెన్‌॥
దౌవారికుని ప్రవేశము
కీర్తన
కళ్యాణి - ఆది
పల్లవివాసు దేవయని వెడలిన యీ దౌ - వారికునిఁ గనరే
అనుపల్లవివాసవాది సుర పూజితుఁడై - వారిజ నయనుని మదిని దలఁచుచును
చరణ (1):నీరుకావి ధోవతులను గట్టి - నిటలమునను శ్రీచూర్ణముఁ బెట్టి
 సారివెడలి యీ సభలోఁ జుట్టి - సారెకు బంగరు కోలనుఁ బట్టి
చరణ (2):మాటి మాటికిని మీసము దువ్వి - మన్మథ రూపుఁడు తానని క్రొవ్వి
 దాటి దాటి పడుచునుఁ దా నివ్వి - ధంబున బలుకుచు పకపక నవ్వి
చరణ (3):బాగుమీఱ నటన సేయుచును - పతిత పావనునిఁ దా వేడుచును
 రాగతాళ గతులనుఁ బాడుచును - త్యాగరాజ సన్నుతునిఁ బొగడుచును
వ. ఇవ్విధంబున దౌవారికుండు వచ్చి యీ నాటక మొనరించు సూత్రధారునింగని, ఈ సభ యేమి,
ఈ దివిటీల ప్రభలేమి, ఈ మృదంగాది వాద్యఘోషలేమి, ఈ సొగసైన వేషము లేమి, యీ
నాటకంబునకుఁ బేరేమి, దీని ఫలమేమి, యీ నాటకం బాడుమని యెవరానతిచ్చిరో,
యా వివరంబు నెఱింగింపు మనఁగా, ఆ సూత్రధారి యెఱిగించు మార్గం బెట్టులనిన.
ద్వి. యతులకు సురలకు నెల్ల వారలకు - సతులకు సుతులకు సద్భక్తులకును॥
నటులకు విటులకు నాల్గు జాతులకుఁ - జటుల కఠోరులై చెలగు దైత్యులకు॥
విన్నను కన్నను వివరంబుగాను - పన్నుగా జనులెల్ల పఠియించిరేని॥
ఇహపరంబులు గడిగి యిలను వర్ధిల్ల - మహికి వేల్పులు వచ్చి మఱి ప్రోచునట్లు॥
ఎందులే నాపద లెంతవచ్చినను - బంధించి యబ్ధిలోఁ బడవైచెనేని॥
మందుకైనను వాని మదివెతలేక - యందరు కీర్తించి యాడుకొన్నట్లు॥
త్యాగరాజ కృతంబయి యిది వెలసె - బాగుగ ప్రహ్లాద భక్తివిజయంబు॥
నాటకంబుగ సభానాయకుల్‌ మమ్ము - నాట గావింపరేయని యానతీయ॥
చైత్రోత్సవంబునఁ జెలగుచు మేము - చిత్రంబుగా సేయఁగోరెదము॥
వ. ఇవ్విధంబున పలికి సూత్రధారుండు దౌవారికునిఁ జూచి నీ వెచ్చటి వాఁడ విచ్చోట వచ్చిన
విధంబేమి యెఱిగింపుమనగా, దౌవారికుం డెఱిగింప జేయు మార్గం బెట్టులనిన.
ద్వి. ఈడు లేనటువంటి యీ పురంబునను - వైడూర్యమణులెల్ల వసుధపైఁ బరచి॥
పందిళ్ళు కిన్ఖాబుపట్టుతోవేసి - మందీలమేల్కట్టు మఱిబాగఁ గట్టి॥
పనస రంభాద్రాక్ష ఫలగుచ్ఛ మమరఁ - గనకంబుచే నలంకారముల్‌ చేసి॥
వరమైన సాంబ్రాణివత్తులు నిలిపి - సురవారసుతుల నీక్షోణి రప్పించి॥
ఘన నాట్యములనెల్లఁ గావింపుఁడనుచు - ఘనుఁ డాపగేశుఁ డాజ్ఞాపించినాఁడు॥
నెరయ సింగారముల్‌ నేనటు చేసి - యెఱిగింపబోయెద నిలవిభుకదకు॥
వ. అని పలుకు దౌవారికుం గనుంగొని యిట్లు పురాలంకారంబు సేయుటకు గారణం
బేమనఁగా దౌవారికుం డెఱింగింపజేయు మార్గం బెట్టు లనిన.
కథా ప్రారంభము
సీ. దనుజేశ్వరుని మాట తప్పక కింకరుల్‌ - శేషపాశంబుచేఁ జేర్చికట్టి
యబ్ధిలోఁ బడవైచి యచలముల్‌ పైవేయ - నంబుధి ప్రహ్లాదుఁడని యెఱింగి
సాధి సంగతిఁజేయ సమయంబనుచు - సంతసంబున గంగాది సతులతోను
నవరత్నమణి భూషణములచే విలసిల్లు - అసుర పుత్రుని నెత్తి యాదరించి
కనుల బాష్పంబు లొలుకఁగఁ గౌగలించి - లసితమౌనట్టి నగరంబలంకరింపు
మనుచు సెలవిచ్చెఁ దన ముఖ్యమంత్రికపుడు - సభకు వేంచేయు నీ వేళ సాగరుండు.
వ. ఇవ్విధంబున సముద్ర మహారాజు ప్రహ్లాదస్వామి కొఱకు ఘనమగు శృంగారములు
సేయుటకుఁ గారణంబేమనగా దౌవారికుఁడు పలుకుటెట్టులనిన.
ద్వి. హరియు ప్రహ్లాదుండు నమృతంబు లొలుక - సరిసరివాదముల్‌ సలుపఁబోయెదరు॥
కనవచ్చుగా నేడు కనులపండువుగ - ననుచు వారిధిరాజు ఆనందమంది॥
మెఱుపుకోట్లను గేరు మేనును దాల్చి - కఱకు బంగరువల్వ కటియందుఁ గట్టి॥
ఆణిముత్యంబుల హారముల్‌ మెఱయ - మాణిక్యమయమగు మకుటంబు గదల॥
ప్రకటమౌ రథముపై ప్రహ్లాదు నుంచి - సకల వాద్యములెల్ల సన్నిధిమ్రోయ॥
శృంగారములచేత శ్రీమించు సభకుఁ - బొంగార జలరాజు భోరున వెడలె॥
కీర్తన
యమునాకల్యాణి - రూపకం
పల్లవిసాగరుండు వెడలెనిదో - సారెకుఁ గనరారె
అనుపల్లవిబాగుగ ప్రహ్లాదుని వర - యోగిని కౌగిటఁ జేర్చి
చరణ (1):మందరధరుఁడానంద - కందుఁడు తన హృదయార
 విందంబున నెలకొన్న - సౌందర్యములను దలఁచుచు
చరణ (2):వారణములపై భేరీ - వాద్యంబులు మ్రోయగ సుర
 వారస్త్రీల నాట్యపు - వరుసలఁ జూచుచు వేడ్కగ
చరణ (3):రాజిల్లెడి శ్రీత్యాగ - రాజసఖుని మనసార
 పూజించుచునుండు దనుజ - రాజకుమార సహితుఁడై
వ. అంతట సముద్ర మహారాజు నాగపాశ బద్ధుఁడై యున్న ప్రహ్లాదుని నవరత్న ఖచిత కనక
సింహాసనముపై నునిచి నిజ భక్తి సంభాషణము నందు నాస గలవాఁడై యట్టి నాగపాశ
విమోచనము సేయుకొఱకు నంజలింపుచు గరుడ ప్రార్థన చేయుటెట్టు లనిన.
క. ఖగరాజ నీకు మ్రొక్కెద
గగనంబున నుండి వెడలి గ్రక్కునను బలో
రగ బాధ లెల్లఁ దీర్పుము
వగ దెలియని బాలుఁడయ్య వరగుణసాంద్రా॥
కీర్తన
హుసేని - రూపకం
పల్లవివినతాసుత రారా నా - వినతిఁ గై కొనరా
అనుపల్లవిఘన నాగ పాశముల ఖండించ రారా
చరణ (1):అమరేశుని గెలిచి నీ - వమృతము దెచ్చి
 విమల కీర్తి వహించి - విలసిల్లిన వీరా
చరణ (2):హరికి వాహనమౌ మాయయ్య వేగరారా నీ
 సరియౌ భక్తుని బ్రోవ సమయమిది రారా
చరణ (3):త్యాగరాజ నుతుని దాసుఁడౌ ధీరా
 నాగాశన నిన్ను వినా గతెవ్వరురా
వ. ఇవ్విధంబగు ఆర్ణవుని స్తోత్రములచే సుపర్ణుడు సంతోషాక్రాంతుఁడై సువర్ణ పక్షములు
మెఱయ సముద్ర మహారాజు నొద్దకు వచ్చెడి మార్గం బెట్టు లనిన.
ద్వి. కనకాద్రి ధరలోన కదలినయట్లు - ఘనమైన మేరుతో గరుడదేవుండు॥
నిజ భక్త తాపంబు నిర్వృతింపగను - భుజబలంబులచేత భువికేగువేళ॥
పక్షపాతములేని భక్త్యాగ్రగణ్యు - పక్షపాతముచేత పక్షముల్‌ గదల॥
ఇట్టె వేడ్కనువచ్చి యిలను చాలఁగొని - కట్టగ నుండెడి కాలసర్పముల॥
ఖండించఁ దుండించ గాళ్ళచేఁ జీర - దండించ జలరాజు తలఁపున నుండు॥
ఉష్ణముఁ జల్లార్చ నురగాశనుండు - కృష్ణ కృష్ణాయని కీర్తించి వెడలె॥
కీర్తన
శంకరాభరణము - రూపకం
పల్లవివిష్ణువాహనుఁ డిదిగో - వెడలెఁ జూడరే
అనుపల్లవికృష్ణ చరణ భక్తులలో - కీర్తిగల్గు భాగ్యశాలి
చరణ (1):రంగపతినిఁ బొంగుచు హృ - ద్రంగమునను దలఁచి
 బంగరు సరిరంగు గల ప -తంగ రాజు తాననుచును
చరణ (2):వరుణాలయు మొరలిటు విని - కరుణా పూరితుఁడై
 హరి భక్తుల పరితాపము - హరియింతు ననుచు వేడ్కగ
చరణ (3):రాజిల్లు విరాజాధిపుఁ - డీ జగమున కేగి యహి
 రాజ రాజభోగి త్యాగ - రాజనుతుని దాఁ బొగడుచు
వ. ఈ లాగున వైనతేయుండు వేంచేసి పరమ భాగవత కులాలంకారుఁడైన ప్రహ్లాదుని మేనియందు
బద్ధమై యున్న నాగపాశములను జూచి యత్యంత కోపముతో నేమి సేయుచున్నాడనిన.
క. మాయాతీతుని తనువును
బాయని నాగములఁగొట్టి బాగుగ మదిలో
హాయిగ దలఁచుచు మౌని
ధ్యేయునిఁ దాఁ జూడ వైనతేయుఁడు వెడలెన్‌॥
వ. అంతట నాగపాశ విమోచితుఁడయ్యు అంతరంగమున శ్రీహరి చరణకమల చింతాపరాయణుండై
మైమఱచి యానందాంబుధిలో నోలలాడుచునుండు ప్రహ్లాదస్వామికి బాహ్య బోధకలుగుటకై
సముద్ర మహారాజు అత్యంతమగు ప్రేమాతిశయమునఁ బలుకుటెట్టులనిన.
సీ. ప్రహ్లాద నా భక్తి భాగ్యంబు నీవల్ల - ధరలోన సజ్జనుల్‌ దలఁచనాయె
సాధుసంగతి నేను సలుపఁగా వచ్చితి - మాధుర్య వాక్కుచే మాటలాడు
అంతరంగపు రాజ్యమనుభవించుట నిల్పి - భావంబు బాగుగా బయలు పఱపు
వర్ధిల్లుదువు నీవు వారిజాక్షునిఁ జూచి - దద్దరిల్ల పనేమి ధర్మశీల
వైనతేయుండు పాశముల్‌ వదలఁజేసె - మేను వెతలెల్లఁ దెలియక మిగుల నీవు
పద్మజానంద జలధిలో బాగుమీర - పవ్వళించుట లిక చాలు బాలయిపుడు.
వ. సాగరుండు మఱియు ప్రహ్లాదస్వామిని జూచి యత్యంత నైతికాంతరంగుడై
పలుకుట యెట్టులనిన.
క. సాగరుఁడ నేను వచ్చితి
బాగుగ గనులారఁ జూచి భాషింపవయా
భాగవతుల చెలిమిని నను
రాగముననుఁ జేరవారు రంజిల్లరొకొ॥
వ. ఇవ్విధంబున బలికిన సుధామాధుర్యమగు గంభీరధ్వని విని యే మహాత్ములో,
యే పెద్దలో, యెఱిగి సత్కరింపకయుంటినే యను భయభక్తితోఁ గూడినవాఁడై కనులు
వికసింపగా తరుణార్క ప్రకాశుఁడై కరుణామూర్తి యగు వరుణాలయునిం గనుంగొని
యత్యంత హర్షాశ్రు పులకాంకితుడై సాష్టాంగముగా మ్రొక్కి పలుకుట యెట్టులనిన.
క. ఎప్పుడు వేంచేసితిరో
యప్పుడె మాటాడలేక యలసుఁడనైతిన్‌
తప్పును సయిపుము సాగర
యిప్పుడు పదములకు దండమిడెదను సుమ్మీ॥
వ. ఇటువలె నమస్కరించిన ప్రహ్లాదుని గనుగొని సముద్ర మహారాజు కానుకలొసఁగి పూజించున దెటులనిన
క. వరభక్తమణులఁ జేకొను
హరియెట్లో నాకు నీవు నాలాగు సుమీ
హరి భక్తుల నర్చించని
నరజన్మంబిలకు మోపు నాలుఁగు దెసలన్‌.
శ్లో. అభ్యర్చయిత్వా గోవిందం తదీయాన్నార్చయంతి యే।
నతే విష్ణోః ప్రసాదస్య భాజనం డాంబికా జనాః॥
శ్లో. అర్చాయా మేవతు హరేః పూజయా శ్రద్ధ యేహ్యతే।
నతద్భక్తేషు చాన్యేషు న భక్తః ప్రాకృతః స్మృతః॥
శ్లో. తులయామల వేనాపి న స్వర్గం నా పునర్భవం।
భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిముతా శిషః॥
శ్లో. అమృత శ్రుతి మీప్సితార్థ లాభం నిధి సందర్శన మైంద్రమాధిపత్యం।
అపవర్గ ఫలోదయోపి పుంసాం నతులామర్హతి సత్సమాగమస్య॥
వ. ఈ విధంబున మహావాక్యంబులం బలికి కానుక లొసఁగిన మహాప్రసాదంబని కైకొని
ప్రహ్లాదుండు సముద్ర మహారాజునుఁ జూచి భక్తిపారవశ్యముచే స్తోత్రంబుచేయు
మార్గం బెట్టులనిన.
సీ. స్థితిలయోద్భవములు శ్రీ హరి వేడ్కగా గావించ చూచితి గాసిదీర
నీయందుఁ బవళించి నిర్మలాత్ముఁడు యోగ - నిద్ర సల్పెను గదా నిత్యముగను
నా పూర్వ పుణ్యంబు నయమున నుండఁగ - నీవంటి మహితాత్ము నేనుగంటి
భ్రమర కీటము రీతిఁ బనిఁబూని సేయవే - హరిని సేవించుట కాసగొంటి
నీకు సరిలేదు జగతిని నిర్మలాత్మ - వనధి సర్వజ్ఞ! లోకజీవనుఁడవయ్య
జగముఁ బాలింపుచున్నావు సత్యముగను - తలచుకొనునట్టి భాగ్యము తనకు గలుగు.
వ. అంతట ప్రహ్లాదుండు ఆత్మార్థమై సాక్షాద్భగవంతుండగు శ్రీమన్నారాయణమూర్తి
ప్రత్యక్షంబగుటకై సముద్ర మహారాజును వేడుకొను మార్గ మెట్టులనిన.
క. సాగర నీయందే హరి
బాగుగ బవళించు నల ఉపాయంబు దయతో
వేగమె తెలుపుము నే నీ
వే గతియని నమ్మినాను వేమరు జలధీ॥
కీర్తన
తోడి - చాపు
పల్లవివారిధి నీకు వందన మొనరించెద
అనుపల్లవిసారెకు నీహృద - యారవిందమున ను
 మారమణునిఁ గూడు - దారిఁ దెలుపుము నాతో
చరణ (1):నాయెడ దయయుంచి సాకుమీ యెడ
 బాయకుండు దారితెలుపుమీ ముని
 ధ్యేయునితో మాటఁ బలుకుమీ ఏ యు
 పాయమైన చేసి ప్రాణము నిల్పుమీ
చరణ (2):దనుజ బాధలనెల్ల దలఁచను భోగ
 ధన సంపదలకు చెయి చాచను నా
 మనమున హరిని నే మానను నా
 కనులార నాథునిఁ గన దెల్పుము
చరణ (3):ఆజన్మ మసుర బాధాయెను జల
 రాజ! ప్రాయంబై దారాయెను త్యాగ
 రాజసఖుఁడు రాడాయెను విను
 మాజానుబాహుఁడు అగపడఁ దెలుపుమీ
వ. ఇవ్విధంబున నతిదీనుండై పలికెడు ప్రహ్లాదునిఁ జూచి యతని యంతరంగ
భక్తిఁ దెలిసి సముద్ర మహారాజు కొనియాడు మార్గం బెట్టులనిన.
ద్వి. ఎల్లకాలమునీవు నేర్పడమదినిఁ - గొల్లగాఁ బూజించుకొన్నది వినుము॥
చిత్తంపు బంగారు సింహాసనమున - నుత్తమోత్తమునుంచి యూర్జితంబయిన॥
ధ్యానమౌ పన్నీటిధారచే హరికి - స్నానంబుగావించి సంతసిల్లుచును॥
అభిమానమను వస్త్ర మమరంగఁగట్టి - విభునిపై జనువను వింతరత్నముల॥
ఘనభూషణములిడి కనికరంబుగను - నీదుపుణ్యములను నిర్మలంబైన॥
స్వాద్వన్నములు పెట్టి స్వానందమునను - నానందమను విడెంబమరగా నొసఁగి॥
మనసారఁ జూచుచుఁ దనువును మఱచి - యనిశంబు నేకమై యానందమంది॥
త్రిజగంబులను నీవు తృణముగానెంచి - విజయంబు చేకొన్న వీరుఁడవగుము॥
త్యాగరాజార్చితు దశరథపుత్రు - నాగమసంచారు నఖిలలోకేశు॥
గనులార సేవింప గాంక్షించినావు - వినుతులు సేయవే విశ్వాసముగను॥
వ. ఇవ్విధంబున సముద్ర మహారాజు ప్రహ్లాదునకు భగవద్దర్శనోపాయంబుఁ బల్కుసమయంబున,
తనలోతానే సాత్త్విక భక్తి పారవశ్యముచే నానంద భరితుఁడై శ్రీమన్నారాయణ నామ
సంకీర్తనము సేయనుపక్రమించు సమయంబున సముద్ర మహారాజు మఱియు నేమను చున్నాఁడనిన.
క. శ్రీపతి పాదాబ్జములే
దాపని యున్నావు కనుక ధన్యుఁడవీవే
యీ ప్రొద్దు కోమలాంగుని
గోపాలునిఁ జూడఁ దెలిసికొంటివి గాదే.
క. ధీరుని శిత పంచశరా
కారుని సతతంబు పూర్ణకాముని భక్తా
ధారుని దశరథరాజకు
మారుని నుతియింపవయ్య మహిజాధిపునిన్‌॥
కీర్తన
కల్యాణి - ఆది
పల్లవివచ్చును హరి నిన్నుఁ జూడ - మెచ్చును హరి నిన్నుఁ జూచి
అనుపల్లవికుచ్చిత విషయాదుల - జొచ్చురీతి నెంచి నీవు
 హెచ్చుగాను మా స్వామిని - మచ్చికతో నుతియింపుము
చరణ (1):ధీరుని సీతారామావ - తారుని సకల లోకా
 ధారుని నిజభక్తమం - దారుని నుతియింపవయ్య
చరణ (2):ధన్యుని వేల్పులలో మూ - ర్ధన్యుని ప్రతిలేని లా
 వణ్యుని పరమకా - రుణ్యుని నుతియింపవయ్య
చరణ (3):ఏ జప తపములకు రాఁడు - యాజనాదులకు రాఁడు
 రాజిగా నుతియించు త్యాగ - రాజనుతుఁడు ఈవేళ
ప్రథమాంకము సమాప్తము
AndhraBharati AMdhra bhArati - tyAgarAja prahlAda bhakti vijayamu yaxagAnamu - tyAgarAja prahlAdabhaktivijaya - tyAgarAja prahlAda bhakti vijaya yaxagAna - andhra telugu tenugu ( telugu andhra )