దేశి సాహిత్యము యక్షగానములు ప్రహ్లాద భక్తి విజయము
పంచమాంకము
- త్యాగరాజస్వామి
వ. ఈలాగున ప్రహ్లాదస్వామి శ్రీవారిని సేవించుచు ప్రపంచ మంతయు
తృణముగా నెంచి నేత్రోత్సవానంద మందుచుండగ శ్రీమన్నారాయణమూర్తి
అతని మనసు శోధింప బలుకు మార్గం బెట్టులనిన.
సీ. పాలసాగరమందు బవ్వళించుటకన్న - భక్తుని హృదయంబు బాగుగాదె
అలవికుంఠమునందు నాదిలక్ష్మియుకన్న - భక్తుని హృదయంబు బాగుగాదె
చంద్ర సూర్యులయందు సతతముండుటకన్న - భక్తుని హృదయంబు బాగుగాదె
రాజయోగుల యంతరంగ రమ్యతకన్న - భక్తుని హృదయంబు బాగుగాదె
అట్టి నీ చిత్తవేదిలో ననిశముందు - నన్న మాకాంతపై నాన నిల్పినాను
వచ్చి ప్రొద్దాయె నే మఱి వత్తుఁగాని - జాలిఁ బడఁబోకు ననుఁగానఁ జాలలేక.
వ. ఇవ్విధంబున శ్రీమన్నారాయణమూర్తి తన్నునెడ బాయుటకై పలికిన పలుకులు విని
యాశ్చర్య భయ శోకంబులచే ప్రహ్లాదుండు పలుకున దెట్టులనిన.
క. ఆనందాంబుధి నీదఁగ
దానవ మదగర్వహరుడ దాటున బలికెన్‌
వీనులఁ జురుక్కనంగా
దీనత తన మదికి దోచి దిగ్గున లేచెన్‌.
క. ఏమిటి మాటను వింటిని
యేమో నేఁజేయు కర్మమెట్లో యనుచున్‌
రాముని ముఖమునుఁ జూచుచు
నేమంబున నసుర సుతుఁడు నేర్పునఁ బలికెన్‌.
వ. తిరుగ ప్రహ్లాదస్వామి పలుకున దెట్టులనిన.
క. నినుఁబాసి నిముసమోర్వను
తనువునుఁ దలిదండ్రులన్నదమ్ముల నొల్లన్‌
కనుగొను కలిమియె చాలును
వినతాసుతగమన వినుము విశ్వాధారా.
కీర్తన
రీతిగౌళ - చాపు
పల్లవినన్ను విడిచి కదలకురా - రామయ్య
అనుపల్లవినిన్నుబాసి యర నిమిషమోర్వనురా
చరణ (1):అబ్ధిలో మునిగి శ్వాసమునుఁ బట్టి - యాణిముత్యము గన్నట్లాయె శ్రీరమణ
చరణ (2):తరముగాని యెండవేళఁ గల్ప - తరునీడ దొరికి నట్లాయె నీవేళ
చరణ (3):వసుధను ఖననముఁ జేసి ధన - భాండ మబ్బినరీతిఁ గనుగొంటి డాసి
చరణ (4):బాగుగ నన్నేలుకోరా యల్ల - త్యాగరాజనుత తనువు నీదేరా
సనకాదయః (సనకాదులు)
శ్లో. నచ సీతా త్వయాహీనా నచాహ మపి రాఘవ
ముహుర్తమపి జీవావో జలాన్మత్స్యావివో ద్ధృతౌ॥
శ్లో. నహి తాతం న శత్రుఘ్నం న సుమిత్రాం పరంతప
ద్రష్టు మిచ్ఛేయ మద్యాహం స్వర్గం వాపి త్వయావినా॥
వ. ఈలాగున స్వామిని నరనిమిషమైన నెడబాయఁ దరముగాదనిన ప్రహ్లాదస్వామినిఁ
గనుంగొని శ్రీహరి తత్త్వబోధనఁ జేయున దెట్టులనిన.
చ. తలచిన మర్మముల్‌ వినుము త్వాదృశ భక్త జనాంతరమ్మునన్‌
మెలఁగుచు సుందరాకృతిని మేల్మిగఁ బల్కుచుఁ గోర్కె లిచ్చుచుం
జెలఁగు చరాచరంబులనుఁ జేరితి లీలను నీ జగాన నీ
వలె దొరకంగ లేదు కని వచ్చెద వారిధి రాజ కన్యకన్‌.
వ. శ్రీహరి తిరుగఁ బలుకుచు వేంచేయున దెట్టులనిన.
క. రెండొక దినములపై నం
దుండక నే వత్తుననుచు దురమునఁగని తా
నిండార శాంతపరచుచు
మెండగు రూపమునఁ జూడమెల్లన లేచెన్‌.
వ. ఈలాగున నుపాయముగ బల్కుచు నావలికి వేంచేయు శ్రీహరి హృదయం బెఱిగి
ప్రహ్లాదస్వామి యత్యంత వ్యసనాక్రాంతుఁడై పలుకున దెట్టులనిన.
క. వడిగాఁ జన గాలాడక
యడుగడుగుకుఁ దిరిగిచూచు చావలికేగే
యుడుపతి వదనునిఁ బ్రహ్లా
దుఁడు తత్తరమంది చూచి దురమునఁ బలికెన్‌.
కీర్తన
పంతువరాళి - త్రిపుట
పల్లవిఅందుండక నేవేగ వచ్చేనని నాపై - నానబెట్టిపోరా
అనుపల్లవిమందరధర నీవాప్తులతోగూడి - మఱచితే ఏమిసేతునే ఓ రాఘవ
చరణ (1):కనవలె ననువేళ లేకుంటేఁ - గన్నీరు కాలువగాఁ బారునే
 ఇనకులాధిప నీవు రాను - తామసమైతే నిల్లువాకిలయ్యేనే ఓ రాఘవ
చరణ (2):నిరుపమానందశయ్యపై లేకుంటే - నిముషము యుగమౌనే
 పరమాత్మ నినుగానక భ్రమసినవేళఁ - బరులునవ్వుటకౌనే ఓ రాఘవ
చరణ (3):పరమభక్తియు నాప్రాయములెల్లఁ - దనుజుల పాలుగాఁ బోనౌనే
 వరద శ్రీత్యాగరాజార్చిత పదయుగ - వారిధిముందరనే ఓ రాఘవ
వ. ఈలాగున ప్రహ్లాదుండు ఆనఁబెట్టిపొమ్మన్న వార్తను విని భక్తపరాధీనుండు కనుక
నత్యంత హితవచనములుగా శ్రీహరి పలుకున దెట్టులనిన.
క. ఆలాగుగానె వచ్చెద
బాలక చింతించవద్దు భావము నీపై
లీలకుఁ దనువందిందని
చాలగ నల్లాడు ననుచు సరగున వెడలెన్‌.
వ. ఈలాగున బలుకుచు వేంచేసిన శ్రీహరినిఁ దలచి అత్యంత దుఃఖసాగరమున నీదుచుఁ
గన్నీరు లొల్కగ మైమఱచి ప్రహ్లాదుండు పలుకున దెట్టులనిన.
క. జరిగిన నాథునిగని యే
మరి దిక్కులఁజూచి చూచి మాధవ యనుచున్‌
బరితాపమొంది మనసునఁ
గరుణాకరు దలఁచి దలఁచి కరఁగుచుఁ బలికెన్‌.
సీ. తల్లిచెంతనులేని తనయుని చందంబు - హరినిఁ గానకయుండ నబ్బె తనకు
బతిని గానని సాధ్విపరితాప రీతిని - హరినిఁ గానకయుండ నబ్బె తనకు
భానుఁగానని చక్రవాకంబు చందంబు - హరినిఁ గానకయుండ నబ్బె తనకు
నిండుదాహపు గోవు నీరుగానని రీతి - హరినిఁ గానకయుండ నబ్బె తనకు
నంచు తన ఫాలమున వ్రాసె నబ్జభవుఁడు - ఎట్లుకాలంబు వేగింతు నేమిసేతు
హరినిఁ జేరుట ధరలోన నాటలౌనె - శీఘ్రమేలాగు చూతునో శ్రీశునిపుడు.
కీర్తన
హుసేని - ఆది
పల్లవిఏమని వేగింతునే శ్రీరామ రామ
అనుపల్లవిఏమని వేగింతు నెంతని సైరింతు
 నాముద్దు దేవుడు ననుబాసె నయ్యయ్యో
చరణ (1):పాలించి లాలించి పలుమారుఁ గౌగలించి
 తేలించి నను పరదేశిసేయ తోఁచెనే
చరణ (2):ఆడిన ముచ్చట నా దంతరంగము నిండ
 నీడు లేదని యుంటి నిందాక సరివారిలో
చరణ (3):ఎడబాయక త్యాగరాజు నేలు శ్రీహరి తొల్లి
 బడలిక లార్చి నాచెయి పట్టినది తలచుచు
సీ. ధనవంతుడైన వెన్క దారిద్ర్య పరుఁడైన - నంతకన్నను దుఃఖమెందు లేదు
పరమ సాధ్వికి పతి పరసతీ ప్రియుఁడైన - నంతకన్నను దుఃఖమెందు లేదు
జ్ఞానచిత్తునకు నజ్ఞానశిష్యుఁడు గల్గు - టంతకన్నను దుఃఖమెందు లేదు
హరిని జూచిన కన్నులన్య రూపముఁ జూచు - టంతకన్నను దుఃఖమెందు లేదు
ఇంతకధికంబు హరిలేని యీదినంబు - నెట్లు సైరింతు హరి హరి మేమిసేతు
నన్ను నెడబాసి యుండుట న్యాయమౌనె - యాది విభుతోను వివరింప నచటలేఁడె.
వ. ఈలాగున ప్రహ్లాదస్వామి అత్యంత వ్యసనాక్రాంతుఁడై మఱియుఁ బలుకున దెట్టులనిన.
కీర్తన
గౌళిపంతు - చాపు
పల్లవిఎంత పాపినైతి నేమిసేయుదు హా - ఏలాగు దాళుదు నే ఓరామ
అనుపల్లవిఅంత దుఃఖములనుఁ దీర్చుహరినిఁ జూచి - యెంత వారైననుఁ బాయ సహింతురే
చరణ (1):మచ్చికతోఁ దాను ముచ్చటలాడి మోస - పుచ్చియేచ మదివచ్చెనే కటకటా
చరణ (2):సేవజేయుటె జీవనమని యుంటి - దైవమా నాపాలి భాగ్యమిట్లాయెనా
చరణ (3):రాజిల్లు శ్రీత్యాగరాజు తాఁబొంగుచు - బూజించు శ్రీరఘురాజిందు లేనందు
వ. ఇవ్విధంబునఁ బాయరాని ఖేదంబునఁ బలు విధంబుల మొరలనిడియు శ్రీహరినిఁ గానక
అఖండ సచ్చిదానంద స్వరూపుండైన శ్రీమన్నారాయణమూర్తి సతతంబు నివాసంబు
చేయుతావును యోచించునది యెట్టులనిన.
శ్లో. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ
మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద॥
సీ. కరముల నర్చించి కనులార సేవించు - వరధీరులందు శ్రీవరదుఁ డుండు
నెఱిని శృంగారించి నేతిపాల్‌ త్రావించు - నిర్మలాత్ముల యందు నిలిచియుండు
కమ్మని విడెమిచ్చి కౌగలించనుఁ గోరు - భక్తాంకములయందుఁ బండియుండు
సగుణ రూపంబెత్తి సార్థకం బిదియంచుఁ - దెలియు పెద్దలయొద్ద దేవుఁడుండు
ననుచు ప్రహ్లాదుఁడీ మర్మమెల్ల దెలిసి - కనుల బాష్పంబు వ్రాలంగఁ గరఁగి గరఁగి
తన్ను నెడ బాసినది చూచి తాళలేక - హరిని వెదకుచు వెడలె నిండార్తి తోడ.
వ. అంతట ప్రహ్లాదుండు పరమ భాగవతోత్తములయందు శ్రీహరి నిత్య నివాసంబై సత్యంబుగా
నుండునని తత్తరంబున శ్రీహరి గుణములను గట్టిగా మొరలిడు మార్గంబెట్టులనిన.
కీర్తన
కేదారగౌళ - ఆది
పల్లవిఓ జగన్నాథా యని నేఁ బిలచితే - నోయని రారాదా
అనుపల్లవిరాజీవనయన రాకేందువదన - రాజిల్లు సీతారమణిహృత్సదన
చరణ (1):ఇదివేళగాదు ఇకతాళఁబోదు - మదిని నీవేగాని మరి గతిలేదు
చరణ (2):ఇరవొందరాక యింత పరాకా - దొర నీవేయని తోచెను గాక
చరణ (3):లాలించు రాజా రవికోటి తేజా - లీలావతార పాలిత త్యాగరాజ
వ. ఈలాగున ననేక విధంబుల మొరలిడఁగా శ్రీహరి కనపడలేదని యా భక్తజనులఁ జూచి
ప్రహ్లాదుండు అత్యంత దీనుఁడై వివరముగా నడిగే దెట్టులనిన.
క. అసమాను హరినిఁ గానక
వ్యసనార్ణవమందు మునిఁగి వ్యధజెందుచుఁ దా
దెసలేక బాష్పమొల్కఁగ
నసురార్భకుఁ డల్లవారి నడుగను వెడన్‌.
కీర్తన
యదుకులకాంభోజి - ఆది
పల్లవిచెలిమిని జలజాక్షుఁగంటే - చెప్పరయ్యా మీరు
అనుపల్లవిపలుమారు మ్రొక్కెదను దయతోఁ - బలుకరయ్యా యెంతో
చరణ (1):శరచాపముఁ గరమున నిడి - మెఱయునయ్యా యెంతో
 కరుణారసము నిండిన - కన్నులయ్యా
చరణ (2):చూడఁ జూడ మనసుకరఁగె - సుముఖుఁడయ్యా భక్తుల
 జాడఁ దెలిసి మాటలాడే - జాణఁడయ్యా
చరణ (3):శృంగారిని బాసి మేను - చిక్కెనయ్యా హరి
 చెంగట మున్నే నామది - చిక్కెనయ్యా హరి
చరణ (4):నాలోని జాలిఁ బల్కఁ - జాలనయ్యా హరి
 మీలో మీరే తెలిసి - మర్మ మీయరయ్యా హరి
చరణ (5):త్యాగరాజ సఖుఁడని - తలఁతునయ్యా మీరు
 బాగుగ నాయంగలార్పుఁ బాపరయ్యా
వ. ఈలాగునఁ బలువిధంబులఁ దలఁచి మొఱలిడి కరఁగుచున్న ప్రహ్లాదుని ప్రేమ దుఃఖంబు
సైరింపలేక దేవసార్వభౌముఁడౌ శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీసమేతుండై సాత్త్విక
భక్తాగ్రేసరుని కడకు వేంచేయున దెట్టులనిన.
ద్వి. చిత్స్వరూపుఁడు భక్తచిత్తానుసారి - యుత్సవ పురుషుండు ఉరగేంద్రశాయి॥
అన్నిటి తలిదండ్రియౌ నెరదాత - మన్నించి దయసేయు మావల్లభుండు॥
అజరుద్రకోట్లకు నాదిదేవుండు - నిజదాసు వెసనంబు నిర్వహింపఁగను॥
తనయునిఁ గనవచ్చు తల్లిచందమున - వనజాక్షి లక్ష్మితో వరదుఁడాక్షణము॥
మెరుపుకోట్లను గేరు మోమునఁ దాల్చి - కరుణతోఁ బ్రహ్లాదు కడకు వేంచేసె॥
క. మెఱపును కనకశలాకను
మరుకాంతిని ధిక్కరించు మైతో దయతో
సరగున వేంచేసిన మధు
మురవైరియు దూరదూరమునఁ గనుపించెన్‌.
వ. అంతట నతిదూరమునఁ గనబడిన సత్వమాత్రుని నిత్యశుద్ధబుద్ధుని నిర్వికారుని ఆదిమధ్యాంత
రహితుని సచ్చిదానందుఁడగు సీతాసమేతుఁడైన శ్రీరామచంద్ర స్వరూపుని శ్రీమన్నారాయణ
దేవుని దురమున ప్రహ్లాదుండు నిశ్చయము చేయున దెట్టులనిన.
కీర్తన
కాపి - ఆది
పల్లవిపాహికల్యాణరామ పావనగుణరామ
చరణ (1):నా జీవాధారము - నా శుభాకారము
చరణ (2):నా నోము ఫలము - నా మేనుగునము
చరణ (3):నా వంశధనము - నా దైదోతనము
చరణ (4):నా చిత్తానందము - నా సుఖకందము
చరణ (5):నాదు సంతోషము - నా ముద్దువేషము
చరణ (6):నా మనోహరము - నాదు శృంగారము
చరణ (7):నా పాలిభాగ్యము - నాదు వైరాగ్యము
చరణ (8):నాదు జీవనము - నాదు యౌవనము
చరణ (9):ఆగమసారము - అసురదూరము
చరణ (10):ముల్లోకాధారము - ముత్యాలహారము
చరణ (11):దేవాదిదైవము - దుర్జనాభావము
చరణ (12):పరమైన బ్రహ్మము - పాపేభసింహము
చరణ (13):ఇది నిర్వికల్పము - ఈశ్వరజన్మము
చరణ (14):ఇది సర్వోన్నతము - ఇది మాయాతీతము
చరణ (15):సాగరగుప్తము - త్యాగరాజాప్తము
క. ఇతఁడే జీవాధారుం
డితఁడే నానోము ఫలము నింద్రాది నుతుం
డితఁడే మును నన్ను బ్రోచిన
డితఁడే సర్వేశ్వరుండు నితఁడే యితఁడే.
వ. ఈలాగున తన మది భ్రాంతి చెందనేల శ్రీమన్నారాయణుఁ డితఁడేయని
నిశ్చయించి శ్రీస్వామిని సేవించి సాష్టాంగ మొనరించున దెట్టులనిన.
ఉ. తల్లినిఁ జూచు బిడ్డవలెఁ దామరవైరికిఁ గల్వచందమై
పల్లవపాణి జారువలె భానుడూ లేవఁగ విప్రురీతిఁ దా
నుల్లము నాసజెంది నిఖిలోత్తమ దేవునిఁ గన్నయంతనే
ఝల్లని బాష్పముల్‌ వదలసాగెను పాదములందు మ్రొక్కఁగన్‌.
వ. అంతట శ్రీహరి యత్యంత దయతో ప్రహ్లాదునిఁ గౌగలించున దెట్టులనిన.
ద్వి. హరియు భక్తునిఁ బట్టి యంకమందుంచి - కరము కరమునబట్టి కౌగిటఁ జేర్చి॥
సామజవరదుండు జగమెల్ల మెచ్చ - మోము మోమునఁ జేర్చి మోదంబుమీఱఁ॥
బ్రాపు నీకైతిని ప్రహ్లాదయనుచుఁ - జూపు చూపొకటిగాఁ జూచి రిద్దరును॥
అతఁడితఁడనిలేక ఆకారయుగము - సతతము నొకటిగా సంతుష్టులైరి॥
వ. ఈలాగున ప్రహ్లాదుండు అత్యంతాత్మ హర్షంబుగలవాఁడై శ్రీహరినిఁ జూచి పిలుచున దెట్టులనిన.
కీర్తన
అసావేరి - ఆది
పల్లవిరారా మా యింటిదాఁక రఘు
 వీరా సుకుమారా మ్రొక్కేరా
అనుపల్లవిరారా దశరథకుమారా నన్నేలు
 కోరా తాళలేరా రామ
చరణ (1):కోరిన కోర్కెలు కొనసాగకయే
 నీరజనయన నీ దారినిఁగని వే
 సారితిఁగాని సాధుజనావన
 స్వారివెడలి సామినేఁడైన
చరణ (2):ప్రొద్దునలేచి పుణ్యముతోటి
 బుద్ధులుచెప్పి బ్రోతువుగాని
 ముద్దుగారు నీ మోమునుఁ జూచుచు
 వద్దనిలిచి వారము పూజించెద
చరణ (3):దిక్కు నీవనుచుఁ దెలిసిన ననుఁ బ్రోవఁ
 గ్రక్కునరావు కరుణను నీచేఁ
 జిక్కియున్నదెల్ల మఱతురా యిఁక శ్రీ
 త్యాగరాజుని భాగ్యమా
వ. అంతట ప్రహ్లాదస్వామి శ్రీహరినిఁ జేరి అత్యంత కుతూహలంబున నున్న వార్తవిని యిట్టి
వేడుకనుఁ జూచుటకై సత్యలోకంబుననుండి బ్రహ్మదేవుం డేతెంచు మార్గం బెట్టులనిన.
క. హంసతురంగారూఢుఁడు
హంసార్చితుఁ డాదిదేవుఁ డానందముతోఁ
గంసారి దర్శనార్థము
సంసారముతోడ బ్రహ్మ సరగున వెడలెన్‌.
కీర్తన
కల్యాణి - చాపు
పల్లవికమలభవుఁడు వెడలెఁ గనుఁగొనరే
అనుపల్లవివిమలహృదయమున - విష్ణునిఁ దలఁచుచు
చరణ (1):దండముఁబట్టి కమండలువుఁ బూని
 కొండాడుచును కోదండపాణిని జూడ
చరణ (2):సారెకు హరినామ సారముఁ గ్రోలుచు
 ధీరుఁడు నీరధి తీరమునకు నేడు
చరణ (3):ఆజానుబాహుఁడు అమరేంద్ర వినుతుఁడు
 రాజీవాక్షుని త్యాగరాజనుతునిఁ జూడ
వ. ఇటువంటి వైభవములను విని స్వర్గలోకము నుండి దేవేంద్రుండు వచ్చున దెట్టులనిన.
క. నిరవధి సుఖదాయకుఁడగు
పరమాత్మునిఁ జూడఁ జిత్త పరవశతను దా
మఱిమఱి శృంగారించుక
సురపతి వేంచేయు నట్టి సొగసునుఁ గనరే.
కీర్తన
తోడి - రూపకం
పల్లవిదొరకునా యని సురలదొర వెడలెను కనరే
అనుపల్లవికరకు బంగరువల్వఁ గట్టి సొమ్ములు వెట్టి
 హరిసేవఁ గనులార నంతరంగముననుఁ గాన
చరణ (1):ఘనమైన హరినామ గాన మొనరించుచుఁ
 జనవునను హరిసేవ సల్పనెవ్వరికైన
చరణ (2):నేఁడు తన నోముఫల మీడేరెనని హరినిఁ
 బాడుచును మనసార వేడుచును సేవింప
చరణ (3):రాజముఖుఁ డవనిజా రమణీతోఁ జెలఁగగఁ
 బూజించు శ్రీ త్యాగరాజ సన్నుతునిఁ గన
వ. ఇవ్విధంబున వేంచేసిన బ్రహ్మేంద్రాది సర్వసుపర్వ జనంబు లత్యంత బ్రహ్మానంద
పరవశత్వంబున జూచుచునుండఁగఁ బ్రహ్లాదుండు వారిఁజేరి శ్రీమన్నారాయణమూర్తిని
షోడశోపచారంబులచేతఁ బూజించి నానావిధ కుసుమంబులు చల్లున దెట్టులనిన.
కీర్తన
ఆహిరి - త్రిపుట
పల్లవిచల్లరే శ్రీరామచంద్రునిపైని పూలఁ
చరణ (1):సొంపైన మనసుతో నింపైన బంగారు
 గంపలతో మంచి చంపకములను
చరణ (2):పామరములు మాని నేమముతో ర
 మామనోహరుని పైనఁ దామర పూలఁ
చరణ (3):ఈజగతిని దేవ పూజార్హమౌ పూల
 రాజిల్లు మేటైన జాజి సుమములఁ
చరణ (4):అమిత పరాక్రమ ద్యుమణి కులార్ణవ
 విమల చంద్రునిపై హృత్కుముద సుమములఁ
చరణ (5):ఎన్నరాని జనన మరణములు లేకుండ
 మనసార త్యాగరాజ నుతునిపైనఁ
వ. ఈలాగున ప్రహ్లాదస్వామి శ్రీహరిని నానా విధంబులఁ బూజించి భజియించి
మంగళముంబాడు సమయంబున నిట్టి వైభవముల సేవించుటకై
సూర్యుండు వేంచేసెనో యన్నట్లు సూర్యోదయమైన వేడుక యెట్టులనిన.
క. సనక సనందన కమలా
సన నారద పాకవైరి సద్భక్తులతోఁ
దనుజారి బాగుమెరయఁగ
వనజాప్తుఁడుఁ జూడ నాసగొని యుదయించెన్‌.
మంగళము
కీర్తన
మోహన - జంపె
పల్లవిజయ మంగళం నిత్య శుభ మంగళం
చరణ (1):మంగళం మంగళం - మారామచంద్రునకు
 మంగళం మంగళం - మాధవునకు
చరణ (2):నిజదాసపాలునకు - నిత్య స్వరూపునకు
 నజరుద్రవినుతునకు - నగధరునకు
చరణ (3):నిత్యమై సత్యమై - నిర్మలంబైన యా
 దిత్యకులతిలకునకు - ధీరునకును
చరణ (4):రాజాధిరాజునకు - రవికోటితేజునకు త్యాగ
 రాజనుతునకు రామ - రత్నమునకు
కీర్తన
ఫరజు - చాపు
పల్లవిపరమైన నేత్రోత్సవమునుఁ గనుగొనఁ ధరణివెడలెఁ జూడరే
అనుపల్లవిధరను విధీంద్రులు కరచామరముల నిరుగడలను మెఱయ
 నిరతముగను గగనమున సురలచేతి విరులవాన కురియ
చరణ (1):పరమ భాగవత చయములు బాగుగ - హరినామము సేయ
 దురమున ప్రహ్లాదుఁడు కనికరమున - హరియని తలపోయ
 వారిధిరాజు నారద సనకాదులు - సారెకు నుతియింపఁగ
 వారము శ్రీత్యాగరాజ వరదుఁడల్ల వారలఁ గని బ్రోవగ
మంగళము
కీర్తన
సౌరాష్ట్ర - ఆది
పల్లవినీ నామరూపములకు - నిత్య జయమంగళం
చరణ (1):పవమానసుతుఁడు బట్టు - పాదార విందములకు
చరణ (2):పంకజాక్షి నెలకొన్న - యంకయుగమునకు
చరణ (3):నళినారిగేరు చిరు - నవ్వుగల మోమునకు
చరణ (4):నవముక్తాహారములు - నటియించే యురమునకు
చరణ (5):ప్రహ్లాద నారదాది - భక్తులు పొగడుచుండె
చరణ (6):రాజీవనయన త్యాగ - రాజ వినుతమైన
శ్లో. మంగళం జానకీశాయ మహారాజ సుతాయచ ।
మాయామానుష వేషాయ మహనీయాయ మంగళం ॥
ఫలశ్రుతిః
శ్లో. శ్రీరామ బ్రహ్మతనయ త్యాగరాజేన నిర్మితం
ప్రహ్లాద భక్తి విజయ ప్రబంధం భుక్తి ముక్తిదమ్‌
యే గాయంతి సదా భక్త్యా యే శృణ్వంతి చ శ్రద్ధయా
యే పఠంతి సదా ప్రీత్యా తేషాం సర్వాఘ నాశనమ్‌.
శ్రీ ప్రహ్లాద భక్తివిజము ఈ పంచమాంకముతో సమాప్తము.
AndhraBharati AMdhra bhArati - tyAgarAja prahlAda bhakti vijayamu yaxagAnamu - tyAgarAja prahlAdabhaktivijaya - tyAgarAja prahlAda bhakti vijaya yaxagAna - andhra telugu tenugu ( telugu andhra )