| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
గడు సూక్ష్మరూపంబుఁగైకొని పోయి యడరి కోటలు 13వ్రాఁకి యట లంక సొచ్చి వడిఁగోట 14కావలివారుఁ దలార్లుఁ బొడగానకుండ నప్పుడు గూఢవృత్తి వీథులు వరికించి విపణిమార్గములు శోధించి రచ్చలు సొరిది నీక్షించి ఘనగోపురములెక్కి గజశాల లరసి మునుమిడి వరహర్మ్యములు సంచరించి దేవాలయంబులు దిరిగి యిల్లిల్లు భావించి గొందులు పరికించి చూచి యుప్పరిగలు గాంచి యోవరుల్ వెదకి చప్పరంబులు డాసి సౌధంబు లరసి చాలఁజెన్నగు రథశాలలు వాజి శాలలు శస్త్రాస్త్రశాలలుఁదడవి మాడువుల్ వరికించి మణిమయమైన మేడలు వాడలు మిగులఁ జెన్నైన యా విభీషణుగేహ మతికాయు గృహము దేవాంతకునియిల్లుఁ ద్రిశిరుమందిరము గంభీరమగు కుంభకర్ణుని నెలవుఁ గుంభునాలయము నికుంభుసద్మంబు శ్రీమించు నయ్యింద్రజిత్తునినగరు నా మహోదరునిలయం బాదియైన దనుజనాథుల నికేతనపంక్తు15లొకటఁ గనుఁగొంచు నద్భుతాక్రాంతుఁడై వారి యంతఃపురంబుల నంతయు వెదకి కాంతాజనంబులఁ 16గలయంగ నరసి వెండియు దనుజులవేశ్మముల్ గలయ నొండొండ గనుఁగొంచు నొక్కొక్క చోట నొక కన్ను నొక చెవి యొక కేలుఁగలుగు వికృత వేషులఁజూచి వెఱఁగుఁబొందుచును బహుపాద బహుభుజ బహుమస్తకోరు సహితులఁగొందఱ సారెఁగన్గొనుచు జపతపస్స్వాధ్యాయ 17సత్కర్మనిష్ఠఁ దపసులౌ దానవోత్తములఁజూచుచును మకరతోరణబద్ధమాల్యజాలములఁ బ్రకటితధూపసౌరభవిశేషముల రత్నముక్తాఫల రంగవల్లికల నూత్నేందుకాంత బంధుర వితర్దికల మణిగణహాటకమయ కవాటములఁ 18బ్రణుతింపఁదగుమంటపప్రదేశముల మహనీయతర విద్రుమస్తంభతతుల బహుశిరోగృహముల భవనపాళికల నాయుధోజ్జ్వలహస్తులైన రాక్షసులుఁ బాయక యే ప్రొద్దు బలసియున్నట్టి రావణు నగరు చేరఁగఁబోయి యచటఁ గావలివారలఁగలయ శోధించి పెక్కువాకిళ్లు నిర్భీతిమైఁగడచి యక్కొల్వుకూటంబులన్నియు వెదకి యంతఃపురముఁజేరనరుగునా 19లోనఁ గంతునిమామ సత్కళలకు సీమ[వా.రా. సర్గ 5] కలువలపైఁ బ్రేమ గల చందమామ కలితబింబ లలామగతి నుదయించి జలరాశిఁదేలించి జలజషండములఁ గలవాసిఁదూలించి గబ్బిజక్కవల విరహాగ్ని నలయించి వెడవింటివాని వరకీర్తి వెలయించి వాడిన కలువ మొత్తంబు నలరించి ముగ్ధజారిణుల చిత్తంబు 20దలరించి చిమ్మఁజీకటుల పంతంబు21దఱిఁగించి పదనైన చంద్ర కాంతంబు గరఁగించి ఘనచకోరముల విందులఁదనియించి విటవిటీజనుల పొందుల నెనయించి పూర్ణచంద్రికల దిక్కులకెల్లను తెలివి 22దెప్పించి చుక్కలగమికాఁడు చూపట్టె మింటఁ బావని వీడెల్లఁబరికింపవలసి దేవతలెత్తిన దీపమో యనఁగ. |