ఇతిహాసములు రంగనాథరామాయణము సుందరాకాండము
హనుమ రావణాంతఃపురము ప్రవేశించుట
నట్టిచందురుఁజూచి యంతరంగమునఁ
దొట్టినవేడ్క వాతూలనందనుఁడు[వా.రా. సర్గ 9]
నంతఃపురంబెల్ల నరయుచు రత్న
కాంతిమంతము విశ్వకర్మనిర్మితముఁ
గామచారముఁ జిత్రకరకౌశలంబు
సోమార్కనిభమునై సురలోకవైరి
యా కుబేరునిఁదొల్లి యాజిలో గెల్చి
కైకొన్న మణిపుష్పకంబు నీక్షించి
యా విమానంబులో నంగనామణులు
రావణు సౌఖ్యవారాశిఁదేలించి
పానాభిరతికేళిఁ బరవశలగుచు
మేనుదీగలు సోల మిసిమి పెందొడల
పస బయల్పడ నీవి బంధంబుల్‌ సడల
వసివాళ్లువాడిన వదనంబు లలరఁ
గమ్మనిట్టూర్పులు గ్రమ్మఁగెమ్మోవు
లెమ్మెలు గైవ్రాల నెలనవ్వు దేర
నరమోడ్పుఁగనుఁగవ లంగజకేళి
పరవశత్వముఁదెల్పఁబాదపద్మముల
నందెలు రొదలు సేయక యాశ్రయింపఁ
జందనతిలకముల్‌ శ్రమవారిఁగరఁగ
వేణీభరము 23వీడ విరిదండలూడ
నాణిముత్తెపుఁబేరు లత్యంత కఠిన
వక్షోజపర్వతద్వయిఁజిక్కు వడఁగ
లక్షితాసవ మదాలసచిత్తలగుచుఁ
గటిసైకతంబులఁగచశైవలముల
స్ఫుటనాభిసరసుల భ్రూతరంగముల
స్తనచక్రముల విలోచన మీనతతులఁ
గనుపట్టి సుఖసుప్తి గైకొన్ననదుల
కైవడి నిద్రించు కామినీమణుల
నా వాయునందనుం డందంద చూచి
పరవధూమర్మముల్‌ పరికించుటకును
బురపురఁబొక్కుచుఁబుణ్యమానసుఁడు:
“స్వామికార్యార్థమై సతులమర్మంబు
లీ మాడ్కిఁగనుఁగొంటి; నింతియెకాని,
కానిచేతల వీరిఁగనుఁగొన్న వాఁడఁ
గా; నింతి నీ యింతిగమిలోన వెదక
వలెఁగాని మఱి పెఱవానిలో వెదక
వలనుగా.”దనుచు భావమున నెన్నుచును
జప్పుడు గాకుండఁజనుచు ముందఱను
విప్పైన యొక రత్నవేదికమీఁదఁ[వా.రా. సర్గ 10]
బువ్వుఁబాన్పున నిద్రపోయెడువాని
నవ్వాసవునిభోగ మడఁగించువాని
సంజకెంపులతోడి జలదంబువోలె
రంజితగంధాంగరాగంబువాని
నీటైన సెలయేళ్లనీలాద్రివోలెఁ
దేటముత్తెపుఁబేర్ల దీపించువాని
నైదుమస్తముల ఘోరాహులువోలెఁ
బ్రోది నంగుళిరమ్యభుజములవాని
జిలుఁగువెన్నెలతోడి చీకటివోలెఁ
జలువదుప్పటి మేన జతనొప్పువాని
వెడఁదఱొమ్మున నొప్పు వేల్పుటేనుంగు
కడిఁదికొమ్ములపోటు కైపులవానిఁ
గర్పూర మణిదీప కళిక లిర్వంక
నేర్పుమైఁగదలించునిట్టూర్పు వాని
మకుటకుండల దీప్తిమయ మూర్తివాని
సకలారి గర్వనిస్రావణుండైన
రావణుండను వాని రాక్షసాధిపుని
భావించి యాతనిపార్శ్వభాగముల
నడపంబు గిండియు నాలవట్టములుఁ
గడువేడ్కఁబట్టియుఁగరకంకణములు
రాయంగ వింజామరములు వేసియును
హాయిగాఁ బాడియు నాడియు వీణ
మీటియు మద్దెలల్‌ మృదుమార్గలీల
సూటి వాయించియు స్రుక్కి యొండొరులు
తమ సాధనంబులు దగఁగౌఁగిలించి
తమి నిద్రవోవు గంధర్వకామినుల
దేవకామినుల దైతేయకామినుల
భావించి యంత నా పరమపావనుఁడు
గగనమండలిఁ జంద్రకళయునుఁబోలె
మొగులుచెంత మెఱుంగుమొలకయుఁబోలె
నా రావణునిశయ్య నభినవయౌవ
నారూఢ24యౌ దేవతాంగనకరణి
నున్నమందోదరి నొయ్యనఁగాంచి
యన్నెలఁతుక సీతయని 25నిశ్చయించి
‘యవనిజ నేఁగంటి.’ననుచు నానంద
వివశుఁడై గంతులు వేయుచు నచటి
కంబముల్‌ వ్రాఁకుచుఁగలితవాలాగ్ర
చుంబనం బొనరించుచును నటించుచును
గాపేయ జాతివికారముల్‌ గొంత
సేపు సూపుచు26ఁదన చిత్తంబులోన[వా.రా. సర్గ 11]
మఱి వివేకము పూని“మనుకులేశ్వరుని
తెఱవ పతివ్రతాతిలకంబు పరమ
పావని జనకభూపాలునిపుత్త్రి
దేవదేవుని రామదేవునిఁబాసి
రావణుఁగోరునే? రాగిల్లి మధువుఁ
ద్రావునే? యిట్టేల తన బుద్ధి బ్రమసె?
నానావిధంబుల నాకుఁజూచినను
దానవిగాని యీ తరలాక్షి సీత
గా”దని తెలిసి యక్కడ నుండ కవల
మేదుర పరికరామ్రేడి తామోద
మానితాసవరక్త మధుమాంసయుక్త
పానశాలా పరంపరలెల్లఁ జూచి
గరుడోరగామర గంధర్వసిద్ధ
వరసతుల్‌ చెఱనున్న వాడలు వెదకి
నీడల నంతంత నిలిచి యేకాంత
మాడెడువారల నటు చేరఁబోయి
యా మాటలెల్లను నాలించి వినుచు
నా మారుతాత్మజుం డల్లన వచ్చి
“యిదినాకుఁజొరఁబోలు; నిదినాకుఁబోల
దిది నాకుఁజొరవచ్చు; నిది నాకు రాదు.”
అనక లంకాపురమంతయు వెదకి
మనుజవేషముతోడి మగువ నెబ్భంగి
నెందునుఁబొడగాన కిచ్చలో వగలఁ
బొందుచు నటపోయి పుర27సమీపమునఁ

  1. ↑వీడి, జాఱ
  2. ↑యై
  3. ↑తలపోసి
  4. ↑నంతఁజి
  5. ↑ములోపలను
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )