ఇతిహాసములు రంగనాథరామాయణము సుందరాకాండము
సీతఁ గానమికి హనుమ దురపిల్లుట
“యినవంశవల్లభుఁడే32కతంబునను
మును నను రమ్మని ముదమొప్పఁ బిలిచి[వా.రా. సర్గ 13]
‘జనకజఁ గనుఁగొనఁజాలుదు వీవ.’
యని చెప్పి నాచేతి కానవా లీయఁ
బనిపూని వచ్చితి బంటనై యేను.
గనుఁగొనలేనైతిఁ గమలాక్షి నెందు.
నీ దురాత్ముఁడు తన్ను నిటు దెచ్చుచోట
వేదనఁబ్రాణముల్‌ విడిచెనో యింతి?
యంబరంబున వేగ నరు33దేర భీతి
నంబుధిఁబడియెనో యసురచే తప్పి?
యిచ్చట దనుజుల నీక్షించి బెదరి
చచ్చెనో? విరహాగ్ని సమసెనో? లేక,
కమలాక్షి 34యొరులకుఁగానరాకుండ
భ్రమపెట్టి మాయలు పన్నెనో వీఁడు?
ఒండు దేశంబుల నునిచెనో? కాక
దండించి చంపెనో తరళాక్షి నసుర?
యేమని మగుడుదు? నే మందుఁబోయి?
యేమిచేయుదు? నింక నిటమీఁద నేను
“వామాక్షిఁగానక వచ్చితి.” ననిన
రాముఁడప్పుడె పాయుఁబ్రాణవాయువుల.
నన్నకై సౌమిత్రి యడఁగు; నీ వార్త
విన్నంత భరతుండు విడుచుఁబ్రాణముల;
నతనికై శత్రుఘ్నుఁ డఖిలబాంధవులు
హతులౌదు; రినవంశ 35మంతయు సమయు;
నది36చూచి సుగ్రీవుఁ డా యంగదుండు
మొదలౌ కపులవంశములు నాశమొందుఁ
గాన వానప్ర37స్థుగతి మహాటవుల
నేను గాపుండుదు; నిదియుఁగాదేని,
సొద పేర్చుకొని యగ్ని సొత్తు; నొండేని
నుదధిలోఁబడి చత్తు నుసురాస దక్కి.
యక్కట! సంపాతి యాడినమాట
నిక్కమ్ముగా నమ్మి నీరధి దాటి
యిచ్చటి కొంటిమై నే వచ్చుటెల్ల
నచ్చుగా వృథయయ్యె. నౌఁగాక; యేమి?
త్రిదశులతోఁగూడఁ దెగువమైఁబేర్చి
త్రిదశేంద్రుఁబట్టి బాధింతు నొండేనిఁ;
జెలఁగుకీలలతోడ శిఖి నీటముంచి
యిలఁబ్రామి ప్రభలు మాయింతు నొండేనిఁ;
గ్రందుగా జమునిఁగింకరులతోఁబట్టి
డెందంబు వగుల దండింతు నొండేనిఁ;
జలమొప్ప నిరృతి రాక్షసులతోఁగూడఁ
బెలుకుఱఁబెలుచ నొప్పింతు నొండేని;
వారిరాసులతోడ వరుణుఁగారించి
ధీరత గెల్చి సాధింతు నొండేనిఁ;
గరువలి నయ్యేడుగాడ్పులఁబెనఁచి
కెరలి యందంద శిక్షింతు నొండేని;
నలిరేగి ధనదుఁ గిన్నరులతోఁబట్టి
చెలువేది కూల భర్జింతు నొండేని;
నెనయఁ సేనానితో నీశానుఁబట్టి
చెనసి యొండొండ నిర్జింతు నొండేనిఁ;
గుతలంబు గిరులతోఁగుమ్మరిసారె
38కృతిఁద్రిప్పిత్రిప్పి క్రక్కింతు నొండేని;
నీ లంక దైత్యుల నీ యబ్ధి ముంచి
లీలమైఁగలఁచి గాలింతు నొండేని;
నేనింత చేసిన నెల్ల దేవతలు
నానతులై వచ్చి యతివఁజూపెదరు.
కాకున్న రాఘవుల్‌ కరుణమైఁదారె
యీ కీడు వలదని యింక మాన్చెదరు.’

  1. ↑కాంతమునను
  2. ↑దెంచుచోట
  3. ↑నొ, న
  4. ↑మంతట
  5. ↑విని
  6. ↑స్థ
  7. ↑గతి… యుక్కడఁతు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )