| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
అని నిశ్చయముసేసి యా మేడశిఖర మనిలనందనుఁడెక్కి యా సమీపమున[వా.రా. సర్గ 14-17] వాయువు నెండయు వడిఁజొర రాని యా యశోకవనాంతరావనిలోన నెలమిఁ బొంపిరివోయి హేమవర్ణమున విలసిల్లు శింశుపావృక్షంబు 39క్రింద వ్రతములఁగడుడస్సి వనటలఁగ్రుస్సి యతిదుఃఖమునఁగుంది 40యలఁతలఁగంది విపులాశ్రువులఁదోఁగి విరహాగ్నిఁగ్రాఁగి కపటవృత్తులఁజిక్కి కడుముట్ట స్రుక్కి జీవంబుపై రోసి చెలువంబు41మాసి యా విధి మది దూఱి యలసత మీఱి చెక్కిటఁజెయి సేర్చి చింతల కోర్చి దిక్కులేమిఁదలంచి ధృతి42దూర డించి యినరశ్మి వాడిన యెలదీగవోలె ఘనధూమయుత దీపకళికయుఁబోలె జలదమాలికలోన శశిరేఖఁబోలె బలుమంచు వొదివినపద్మినిఁబోలెఁ జెలఁగుపిల్లులలోని చిలుకయుఁబోలెఁ బులులలో నావునుఁబోలె దుర్వార ఘోరరాక్షస వధూకోటిలో నున్న నారీశిరోమణి నళినాయతాక్షి మలినాంగి వేణీసమన్విత జఘనఁ గలితభూషణజాల గద్గదకంఠి (జనితోష్ణనిశ్శ్వాస సతతోపవాస జనకతనూజాత జగదేకమాతఁ) బొడగని సీత గాఁబోలుఁబొమ్మనుచుఁ గడుభక్తి రామలక్ష్మణులకు మ్రొక్కి కడువేడ్క సురలను గడఁగి వేఁడుచును నడరెడుముదమున నా మేడ డిగ్గి మదినుబ్బి యంగుష్ఠమాత్రుఁడై కదిసి పదిలుఁడై యా శింశుపావృక్షమెక్కి బాలుఁడై యలవటపత్రంబునందు వే లీలఁగ్రీడించు విష్ణుండువోలె శాఖామృగేంద్రుండు జడిగొన్న 43దాని శాఖలలో డాఁగి చతురుఁడై నిలిచి పావనచరితుఁ డా పద్మాయతాక్షి భావించి భావించి పలుమాఱు చూచి: “కడఁకతో ఋశ్యమూకమునందుఁగన్న తొడవులు నీయున్న తొడవులుఁజూడ నేక ప్రకారంబు; లీ పద్మగంధి కాకుత్స్థుసతి సీత గాఁబోలు.”ననుచు మఱియునుఁబరికించి మారుతాత్మజుఁడు నెఱసిన బుద్ధిమై నెలఁత నీక్షించి శ్రీరాముఁడానతిచ్చిన ప్రకారమున నా రమణీమణి యవయవ 44శ్రేణిఁ గర్ణభూషణమణికరకంకణములు స్వర్ణాంబరంబును సరిఁబరికించి వలవంతఁబడి వేఁగువారి చిహ్నములు వలనొప్పఁగల పతివ్రతల చిహ్నములుఁ జదు45రాండ్రురగు మర్త్యసతుల చిహ్నములు జెదరకన్నియుఁజూచి చింతించి మఱియుఁ గొనకొని రాముఁబేర్కొని ప్రలాపింపఁ గనుఁగొని మఱి సీతగా నిశ్చయించి యా విన్ననగుమోము నా కృశాంగంబు నా విరిసినవేణి నా యున్న యునికి నా దురవస్థయు నా విలాపంబు నా దైన్యమును జూచి యాత్మలో వగచి “చంద్రునిఁబాసిన చంద్రికరీతిఁ జంద్రాస్య యా రామచంద్రునిఁబాసి యుండునే? యీ యింతి నొగిఁబాసి రాముఁ డుండునే? యిదిసోద్య మూహించిచూడఁ గులశీల దాక్షిణ్యగుణవయోధర్మ లలితరూపము లొక్క లాగౌటఁజేసి యా రామవిభున కీ యంగనామణియు నీ రామ కా రామనృపతియుఁదగును. ఈ కాంతకై కాదె యినకులేశ్వరుఁడు శ్రీకంఠు విలుద్రుంచెఁ జెఱకు చందమున! నాకులంబునఁజెంద నడరి యా కపట కాకంబు శిక్షించెఁ గడిమి వాటించి; తొలుతఁబట్టినయంతఁద్రుంచె విరాధు; నలిఁగోసె నా శూర్పణఖముక్కు సెవులు; ఖరదూషణాది రాక్షసుల ఖండించె; మరణంబు నొందించె మారీచు నీచు; వాలి నొక్కమ్మున వధియించెఁ; గపుల నాలుగుదిశల కున్నతశక్తిఁ బనిచె. వారిలోపల బలవంతుండ ననుచు నారూఢగతి నంగదాదులఁగూడి ఘనపుణ్యనిధియైన కాకుత్స్థునెదురఁ బనిపూని వచ్చితిఁబంతంబు మెఱసి; నా పుణ్యవశమున నా కోరినట్ల యీ పుణ్య 46సతిఁగంటి నిచ్చోట వచ్చి; దారుణాసుర వధూతతినట్టనడుమఁ గారణాకృతిఁజిక్కి కలఁగు నీ సతికి నెబ్భంగిఁజూపుదు నింక నారూప? మెబ్భంగి భాషింతు నీ యింతితోడ? నెబ్భంగి నూరార్తు నీ పుణ్యసాధ్వి? నెబ్భంగి నిబ్భంగు లెఱిఁగింతు47ఁబతికి?” |