| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
నని యిట్లు చింతింప నంత రావణుఁడు జనకజఁ జింతించి సంతాప మంది[వా.రా. సర్గ 18] వేఁకువజామున వేగ మేల్కాంచి తేఁకువ మనసిజాధీన చిత్తమున దివ్యమాల్యంబులు దెఱఁగొప్ప ముడిచి దివ్యగంధంబులు దెఱఁగొప్పఁబూసి దివ్యాంబరంబులు దెఱఁగొప్పఁగట్టి దివ్యభూషణములు దెఱఁగొప్పఁబెట్టి తన కిరీటప్రభాతతు లెందుఁబర్వ ఘనచంద్రహాస సంకలితుఁడై మెఱసి, కరమణికంకణ క్వణనముల్ మొరయ సరస నచ్చరలు వింజామర లిడఁగ, ఘనకుచ 48హారముల్ గ్రాల గంధర్వ వనితాజనము లాలవట్టముల్ పట్ట, గొడుగులు ధరియించి కుచమూలరుచులు నడయాడుచుండఁగిన్నరసతుల్ గొలువ, బాహు49పార్శ్వంబులు పరగంగ 50హస్త వాహికలై యక్షవనితలు నడవఁ, బరిమళోదక పానపాత్రముల్ వట్టి గరుడకామిను లిరుగడల నేతేర, నెడనెడ సందడి నెడగల్గ జడిసి కడఁగి ముందఱ నాగకన్యలు నడవ, విద్యాధరస్త్రీలు వీణాది వాద్య హృద్యసంగీతంబు లింపుగాఁబాడఁ, దన గుణోన్నతు51లకుఁదగ సిద్ధసాధ్య వనితలు సేరి కైవారముల్ సేయ, బాగొప్ప వరఖడ్గపాణులై కదిసి రాగిల్లి వెనుక రా రాక్షసస్త్రీలు, కలగొని కరదీపికా సహస్రములు వెలుఁగ మందోదరి వేడ్కఁదోడ్కొనుచు మెఱుఁగులు 52వెనుకొను మేఘంబువోలె మఱియును 53గలసతుల్ మలసి తన్గొలువ, నురుపాదహతి54కోడి యుర్వి గంపింపఁ బరిహాసరవము లంబరవీథి నిండ, మంజీర మేఖలా మణిభూషణాది శింజితంబులు విందుసేయ వీనులకు, నా యశోకారామ మపుడు సొత్తెంచి వాయుసూనుఁడు దన్ను వాంఛతోఁజూడ నిద్రావశేష ఘూర్ణిత దృష్టితోడ భద్రకేయూరాంక బాహులతోడ వసుధపై జీరాడు వలెవాటుతోడ వసివాళ్లు వాడిన వదనంబుతోడ ఘనతరభీషణాకారంబుతోడ జనకజముందటఁజనుదెంచి నిలిచె. నిలిచిన55ఁగనుఁగొని నివ్వెఱఁగంది తలఁ56పులో రఘురాముఁ57దప్పక నిలిపి యూరుల నుదరంబు నురుకుచద్వయముఁ జారుహస్తంబులఁజక్కఁగా 58మాటి పులిఁగన్న లేడినిబోలెఁ జిత్తమునఁ గలఁగుచు 59నున్నట్టి కల్యాణిఁజూచి వనితలలోన దుర్వారగర్వమునఁ దను దైవమాడింపఁ దగవేది పలికె: “నింతి! నీ60తనుమధ్యమిట దాఁచనేల? కాంత! నీ నెమ్మోముగైవ్రాలనేల?[వా.రా. సర్గ 19, 20] వెడవింటివానికి వెఱచిన నన్నుఁ గడకంట నిఁకనైనఁగావు మో యబల! బలిమినైననుఁబట్టి పరకాంతఁబొందఁ దలఁచుట 61తమ జాతిధర్మమో యబల! యైన నీ యానతి యరసి యున్నాఁడఁ; గాన నా మాటలు గైకొని వినుము. ఈ రూపమున నుండ నేమికారణము? ‘దారుణాటవి దాటి తమ్ముఁడుఁదాను వనిత! రాముఁడు వచ్చి వనధి బంధించి ననిచిన కడమిమై నన్ను సాధించి గొనకొన్న వేడ్కఁ దోఁకొనిపోవు నిన్ను నని విచారించెద’వాత్మలో నీవు. అమరేంద్ర యమ వరుణాదులకైన సమరంబులో నన్ను సాధింప రాదు. ఈ బేలతన మేల? యిందీవరాక్షి! నా బాహుశక్తికి నరులెంత వార? లడవుల 62ఁగొండల ననదలై తిరిగి యిడుమలఁబడుచున్న హీనమానవుని పొం దేల కోరెదు? పొలఁతి! నన్బొంది పొంద నొల్లవె రాజ్యభోగంబు లకట! యనిమిషాధిపుఁడైన నంతకుఁడైన విను, జలాధిపుఁడైన విత్తేశుఁడైన ననలనైరృతివాయుహరులునునైనఁ జనుదెంచి నా లంక సాధింపలేరు. లంక మానవులకు లక్షింపఁదరమె? యింక నెక్కడిరాముఁ? డిం దెట్లువచ్చు? వచ్చి లంకాపురవర మెట్లు చొచ్చుఁ? జొచ్చి నన్నెబ్భంగి స్రుక్కక యెదురు? నెదిరి 63నాతోఁబోర నెబ్భంగిఁగదియుఁ? గదిసి నా సత్త్వమేగతి 64సైఁపఁజాలుఁ? జాలుట యెందాఁక సమకూరఁబోలుఁ? బోల వీ మాటలు 65పోవిడు మింక.” నని యిట్లు పలుమాఱు నఱిమి రావణుఁడు వినరాని పలుకులు వెస దూఱి పలుకఁ గడునల్గి గద్గదకంఠంబుతోడఁ బుడుకఁద్రుంచి“యవశ్యముగ రాముచేతఁ జెడుదు వీ.”వని చాటిచెప్పినరీతిఁ బడఁతుక దృణము చేపట్టి యిట్లనియెఁ:[వా.రా. సర్గ 21] |