ఇతిహాసములు రంగనాథరామాయణము సుందరాకాండము
సీత రావణుని దూఱుట
“బాపాత్మ! నీవు నా పతి డాఁగురించి
నీ పురి లంకలోనికి నన్నుఁదెచ్చి
యిది యొక్క కడిమిగా నేల గర్వించె?
దిది యొక్క మేలుగా నేల66ప్రేలెదవు?
పరవధూరతిఁగోరు పాపాత్ముకులము
సిరియును నాయువుఁజెడు; నటుగాన
తగవును ధర్మంబుఁదలపోసి నన్ను
మగుడ రామునకిమ్ము మనఁగోరెదేని?
కాదని దుర్బుద్ధి గైకొంటివేని?
కోదండదీక్షాదిగురు 67నిచే రామ
జననాథుచే నీవు సచ్చుట నిజము.
‘వనవాసకృశుఁడు కేవలదుర్బలుండు
ననద రాజ్యవిహీనుఁడసహాయుఁడతఁడు
మనుజమాత్రుఁ’డటంచు మది నెన్నవలదు;
దండకాటవిఁజతుర్దశ సహస్రోగ్ర
చండరాక్షసకోటిఁజంపఁడె తొల్లి?
దండధరోద్దండ దండంబు నొడిచి
చండాంశుకిరణోగ్ర సంరంభ మడఁచి
గణనాపరంపరల్‌ గడచి యందంద
రణభీషణములైన రాముబాణములు
పరువడి నీ లంకపైఁ బాఱునాఁడు
తరమిడి నీ యురస్థ్సలిఁ గాఁడునాఁడు
రావణ! నీ లావు రఘురాములావు
నీవె చూచెదుగాక! నేఁడేల చెప్ప?
నెండతోఁబ్రాలేయ మెదిరినయట్లు
కొండతోఁదగరు డీకొనిన చందమున
మదహస్తితో దోమ మార్కొన్నకరణి
నుదధితోఁ గాల్వ మొండొడ్డినపగిదిఁ
దర మెఱుంగక రామధరణీశుతోడ
దొరసిన భస్మమై త్రుంగెదుగాక!
యేమిటి కీ గర్వ? మినకులాధిపుఁడు
ఈ మహి నిన్నేల యిట్లుండనిచ్చు?”
ననిన రావణుఁడు మహారోషమెత్తి
జనకజఁజూచి యచ్చలముతో ననియెఁ:[వా.రా. సర్గ 22]
“బరమేష్ఠిఁదపమునఁబరగ మెప్పించి
వరశక్తి నతనిచే వరములు గాంచి
సురపతి మొదలుగా సురల నోడించి
గరళకంధరుతోడఁ గైలాస మెత్తి
కడిమిమై నూర్ధ్వలోకములు సాధించి
వడిఁబేర్చి పాతాళ వాసుల నోర్చి
సకలోన్నతుండనై సడిసన్న నన్ను
వెకలియై తమ తండ్రి వెడలంగఁ ద్రోవ
వికృతాంగుఁడై తపోవృత్తిమై నున్న
యొక పేదమానవుఁడోపునే చెనక?”
నని రాము నిందింప నందంద పొగిలి
మనమున నొగిలి యుమ్మలికంబు మిగిలి
ఘనశోక గద్గదకంఠయై యప్పు
డినకులాధిపుదేవి యెలుఁగెత్తి యేడ్చె.
ధృతిదూలి నల్గడ దేవగంధర్వ
సతులెల్ల నేడ్చిరి జానకిఁజూచి.
రావణుగర్వంబు రమణిశోకంబు
భావించి కోపతాపంబులు నిగుడ
ననిల తనూభవుఁడప్పు డా దుష్ట
దనుజుపై లంఘింపఁదలపోసి చూచి:
“బిరుదనై వీనిఁజంపితినేని పతికి
ధరణిజసేమంబు దగఁజెప్పఁగలను.
అమరారిచేత నా యలవెల్లఁబొలిసి
సమరంబులోపలఁ జచ్చితినేని
లంకదిక్కెఱుఁగక, లలన నెవ్వగల
నింకుచు నిందున్కి యెఱుఁగఁజొప్పడక,
యేను జచ్చుటయును నేర్పడ వినక,
భానుకులాగ్రణి ప్రాణముల్‌ విడుచు.
నింతచేసినచేఁత లేమియుఁగాక
యంతయుఁజెడిపోవు నధిపుకార్యంబు.
అనిసేయ నిది సమయము గాదు నాకు.
నని ధీరుఁడై యుండె నా మ్రానిమీఁద.
మఱియు రావణుఁడు గామంబు గ్రోధంబు
వెఱపును నొఱపును వెరవును గదుర
నాడిన మాటల కన్నిటి కాత్మ
నోడక యతినిష్ఠురోగ్రవాక్యములు
వనితలందఱు విన వసుధాతనూజ
తనుదూఱఁబల్కిన దనుజేశుఁడంతఁ
గుటిలభావమున భ్రూకుటిలసన్నిటల
చటులరక్తాక్షుఁడై జాజ్వల్యమాన
లోల కీలాభీల లోకసంహార
కాలాగ్నిరీతి నాగ్రహమున మండి,
ఘోరహుంకారుఁడై క్రూరుఁడై నీతి
దూరుఁడై యా సతిఁ దొడరి భర్జింప

  1. ↑తూలెదవు
  2. ↑ఁడైన
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )