ఇతిహాసములు రంగనాథరామాయణము సుందరాకాండము
సీత పనవుట
నీ రీతి బెదరింప నిందీవరాక్షి
ధారుణీతనయ గొదలమంది కుంది[వా.రా. సర్గ 23-26]
కన్నీరు దొరుగ గద్గదకంఠయగుచుఁ
దన్నుఁగారించు దైత్యస్త్రీలకనియెఁ:
“దలఁప మానవులకు దానవులకును
గలుగునే దాంపత్యగౌరవశ్రీలు?
ఇందఱు దుర్భాష లిట్లాడఁదగునె?
చందురుఁబాయని చంద్రికరీతి,
భానునిఁబాయని ప్రభయునుబోలె,
నేను శ్రీరాముని నెడఁబాయఁజాల.
నా నృపాలుఁడు దీనుఁడైనను రాజ్య
హీనుఁడైనను నాకు నిష్టదైవంబు.
జలధికన్యక రీతి శర్వాణి భాతిఁ
బలుకుఁదొయ్యలిమాడ్కిఁ బౌలోమిచూడ్కి
రోహిణిసరణి నరుంధతి కరణి
స్వాహాంగనగతిని సావిత్రిమతిని
రతిచందమునఁబతివ్రతనిష్ఠఁబొదలి
పతియైనరఘురాము భజియించుదానఁ
జంపినఁజంపుఁడు; శాతాసి శిరముఁ
ద్రెంపినఁద్రెంపుఁడు; ధృతి రాముఁగాని
యితరుని నేనొల్ల; నిటువంటికల్ల
మతములు నేఁజెల్ల, మానుఁడిం”కనిన
మండుచు మిగుల నా మాటకు వారు
గండక్రొవ్వునఁబెక్కు గతులఁగారింప
ధూళి ధూసరితయై తూలి లోఁదారి
నీలాహిఁబోలిన నెఱివేణి చెదర
నేలపైఁబడి వేఁడినిట్టూర్పు నిగుడ
‘హా లక్ష్మణా’!యంచు ‘హా రామ’!యనుచు
‘హా యత్త కౌసల్య’! యనుచు నెల్గెత్తి
యా యుత్తమాంగన75యనదయై యేడ్చె.

  1. ↑యార్తిమై నే
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )