| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
నీతెఱంగున బాధ లెసఁగఁ జేయుచును నాతతస్థితి తుహనాద్రిపార్శ్వమున నేపారు వనమున కేగి యందునను రూపరు యౌవనకళారుచిరాంగినొక్క హరిణాజినాంబర నంచితవ్రతను వరతపస్విని వేదవతియను కన్యఁ బొడఁగాంచి యరుదంది పొలఁతి యీకడిది నడవడికిని యౌవనమునకుఁ దగునె నీయొప్పు గనుఁగొని నియతాత్ముఁలైనఁ గాయజగోచరుల్ గాక పోఁగలరె యెవ్వఁడు నీతండ్రి యెద్ది నీనామ మెవ్వనిసతివి నీ విటనుండుటేమి పోఁడిగా నెవ్వని బొందుదువీవు వాఁడు కృతార్థుండు వనజాయతాక్షి యాపద లడఁగింప నంగజాస్త్రములఁ జూపు నీకడకంటి చూపింతె చాలు నీ మేను గుందించు నీతపంబునకు నేమిప్రయోజనం బెఱిఁగింపుమనిన నాతిథ్య మొనరించి యావేదవతియు నాతురుండైన దశాస్యుతో ననియె మా తాత సురమంత్రి మహనీయబుద్ధి నా తండ్రి కెనవచ్చు నాతఁ డున్నతుఁడు మా తండ్రి ధర్మైకమతి కుశధ్వజుఁడు బ్రాతిగా నియతి నాబ్రహ్మర్షివరుఁడు వేదంబు చదువ నావేళనేఁ బుట్టి వేదవతి నామవిఖ్యాతనైతి నను నంతఁ గోరి గంధర్వులు సురులు దనుజులు యక్షులు దైత్యులు నడుగ నెలమితో విష్ణున కిత్తునన్బుద్ధిఁ బలుమాఱుఁ దమ్మెల్లఁ బరిహరించుటయు రాతిరిమై దైత్యరాజు శంబరుఁడు మాతండ్రి జంపె నేమఱుపాట వచ్చి మా తల్లియును నంత మాతండ్రితోడ వీతకల్మషబుద్ధి విహితమార్గమును జేకొని తగ నేకచితిఁ బొంది పుణ్య లోకంబునకు ధర్మలోలయై చనియె నేనును మాతండ్రి హృదయంబు కోర్కి మానుగాఁ దలపోసి మానసంబునను భక్తవత్సలుఁడైన పంకజోదరుని భక్తిభావంబున భర్తగాఁ గోరి తపము గైకొంటి నా తపమున కదియె నెప మీతపశ్శక్తి నిఖిలంబుఁ గాంచు నిను నెఱుఁగుదు నేను నీవు పౌలస్త్యు మనుమఁడ వీపిన్న మాటలేమిటికి ననవుడుఁ బుష్పకం బాతఁడు డిగ్గి మనసిజశరభిన్నమానసుఁడగుచుఁ గనకలతాచారుకాంతిపూరమునఁ దనువొప్ప నక్కన్యఁ దప్పక చూచి తపమిది వార్ధకధర్మంబు గాని చపలాక్షి యౌవనాచారంబు గాదు నుపభోగకాలంబు నూరక పుచ్చి విపరీతచరితంబు వెలఁది నీకేల లలితాంగ నీవింక లంకేశు నన్నుఁ బొలుపారఁ గైకొని భోగింతుగాక పతి నాకు విష్ణుండు భావింప ననుచు జితలోకుఁడగు నాకుఁ జెప్పంగనేల నీగర్వమేటికి నీమాటలేమిటి కేగుణంబుల నాకు నెనవచ్చు నతఁడు ననవుడుఁ గోపించి యక్కన్య పలికెఁ జనదిట్లు వలుక నాజగదేకవీరు వేదంబులయిన వెదుకఁ జొప్పడని యాదిదేవుండని యావిష్ణుమహిమ కల్పాదికాలంబు గడపంగలేని యల్పుల కెఱుగంగ నలవి గాదనినఁ దెగులతో గదిసి యాదేవకంటకుఁడు తగవు చింతింపక తలవట్టి దివియ విడిపించుకొని రోషవిస్ఫులింగమ్ము లడర నయ్యింతియు నతని నీక్షించి యోడక తలవట్టితోరి దుష్టాత్మ పాడియె నా మానభంగంబు సేయ నేనాఁట నిది చెల్లు నేనాఁటదానఁ గాన నిన్నిప్పుడ కడతేర్పఁ జాలఁ జేసిన తపమెల్లఁ జెడిపోవుఁ గాన గాసిల్లి శపియింపఁగా మున్నె చాలఁ బ్రదుకేమిటికి పరిభవముతో ననుచు సొదఁ బేర్చుకొని యగ్నిఁ జొరనిశ్చయించి నేమంబు గైకొని నిశ్చలవృత్తి హోమంబు నిచ్చలు నొనరింతునేని కాలంబు పాత్రంబుఁ గడపక ధర్మ శీలనై దానంబు సేయుదునేని పొడము నింద్రియముల పొడ వడంగించి కడు నుగ్రతప మర్థిఁ గావింతునేని నా సుకృతంబున నక్షీణపుణ్య భాసురుండగునట్టి పార్థివేంద్రునకు నరయ నయోనిజనై జనియించి పరమపాతివ్రత్యపరతఁ బెంపొంది దురితలోలుఁడవైన దుశ్శీలు నిన్ను దురములోఁ బతిచేతఁ దునిమింతుననుచు నరవిందనాభుని యంతరంగమున నరవిందముఖి నిల్పి యనలంబుఁ జొచ్చె వసుధ నప్పుడు పుష్పవర్షంబు గురిసె నెసఁగ సంతోషించి రెల్లదేవతలు ఆ వేదవతియును నంత నాజనక భూవరుం డధ్వరభూమి దున్నింప సీతాంతరంబునఁ జెన్నొందఁ బుట్టి సీతాభిధానంబుచే నుల్లసిల్లి యసమానశుభమూర్తి నమరుచు జనక వసుధేశు పుత్రియై వరియించె నిన్ను నీవు విష్ణుండవు నీవు నీ మహిమ భావింప మానుషభంగి గాదెట్లు వేదవతీకన్య వృత్తాంతమెఱిఁగి యాదశాస్యుఁడు పుష్పకారూఢుఁడగుచు సంవర్తుఁడను మహాసంయమీశ్వరుఁడు సంవిధానంబున సకలసంయములు ననిమిషసంఘంబు లలర మరుత్తుఁ డను రాజు నధ్వర మర్థి జేయింప నావార్త కటువోవ నక్కడనున్న దేవత ల్వీక్షించి తిరుగుడు పడఁగ నిక్కడ జనుదెంచె నీయుగ్రుఁడైన రక్కసు గెలువంగ రాదిప్పుడనుచు నాకాధినాథుండు నమలియై జముఁడు కాకరూపంబైనఁ గడుభీతినొంది యాలోన వరుణుండు హంసయై పెంపు దూలి కుబేరుండు తొండయై మఱియుఁ దక్కిన సురలెల్ల ధైర్యంబు లెడలి యొక్కొక్కరూపమై యొగి నోసరింప వడిఁ బేర్చి యాయజ్ఞవాటంబుఁ జొచ్చి యడరు గర్వంబున నారాజుఁ జూచి భూపాల నాతోడఁ బోరికిఁ గడఁగు మోపనియట్టైన నోడితిననుము మిన్నక పోరాదు మెయితోడ నికు నన్నమరుత్తుఁ డయ్యమరారిఁ జూచి యీమాటలాడ నీవెవ్వఁడవనిన నామాట కతఁ డట్టహాసంబు చేసి కిన్నరేశ్వరు తమ్ము గీర్వాణరిపుని నన్ను రావణు మున్ను నరనాథ వినవె నెఱసిన నాబల్మి నిఖిలలోకముల నెఱుఁగని యవ్వీరుఁ డెవ్వఁడు లేఁడు భువనైకభీకర భూరిప్రతాప భవనుండ రిపుగజపంచాననుండ నింద్రాది దివిజుల హృదయంబు లడరఁ జంద్రహాసముఁ గొని చరియించువాఁడఁ త్రిజగత్తులందును దివిజసంగ్రామ విజయుండనై యుందు విపులసాహసుఁడ నెవ్వఁడవను మాట నిచట నే వింటి నెవ్వఁడనో యింక నెఱిఁగెదుగాక వడిఁ గుబేరుని నాహవంబునఁ దోలి కడిమిమై నీపుష్పకముఁ గొన్నవాఁడ ననుడు మరుత్తుఁడు నాదశగ్రీవుఁ గనుఁగొని రాక్షస కడుఁ గృతార్థుఁడవు భ్రాత నోడించితి బవరంబులోన నీతేజమొరులకు నేలసిద్ధించుఁ దోయజగర్భుఁడు దుష్టాత్ముఁడైన నీయట్టి కొఱగాని నీచుఁ బుట్టించె నంతకు పురికి నిన్ననుతు నాయెదుర నంతకు బదిలుండవై నిల్వుమనుచు బాణాసనంబును బటు బాణభరిత తూణముల్ గొని తెంపు తోరణంబునకు నరుగంగ సంవర్తుఁ డడ్డంబు సొచ్చి నరనాథ దీక్షితునకు నల్గరాదు నేమంబుఁ గైకొని నిత్యైకనిష్ఠ నీమహేశ్వరయాగ మీడేర్పవలయుఁ గాన నిప్పుడు కులక్షయము వాటిల్లుఁ గాన విక్రమవేళ గా దట్లుగాక నెందును దుర్జయుం డీదశగ్రీవుఁ డెందువ్రాలునొ జయ మెఱుఁగంగ రాదు అనిన మరుత్తుఁడు నాత్మఁ జింతించి ఘననిష్ఠ శాంతంబుఁ గైకొనె మదిని ఆ కోపమున విల్లు నమ్ములు విడిచి చేకొని జన్నంబు సేయంగ దొడఁగె నకలంకుఁడై దైత్యుఁ డావిజయంబు సకలదిక్కులయందుఁ జాటించి యార్చి రోషోగ్రగతి నా మరుత్తుని గెలిచె దోషాచరేంద్రుఁడు తొడిబడ మునుల సమయించి యటు వాసి చనియె దేవతలు తమతమ రూపముల్ దాల్చి రాలోన నాకాధినాథుండు నమలి నీక్షించి నీ కలాపమున నా నేత్రముల్ వేయుఁ గలిగి క్రొమ్మేఘంబు గర్జిల్లి కురియఁ జెలఁగి తజ్జలములు సేవింపుమనుచు నరుదుగా వరమిచ్చె నది మొదల్ నమలి పురి చిత్రవర్ణమై పొలిచె లోకముల వరుణుండు హంసకు వరమిచ్చె శుభ్ర తరవర్ణమై మేను దనరారి వెలుఁగఁ బన్నుగాఁ గాంచనప్రభ మేను గలుగఁ గిన్నరాధిపుఁడిచ్చెఁ గృకలాసమునకుఁ గరుణ నంతకుడును గాకి నీక్షించి జరచేతఁ దెవులచేఁ జావు లేకుండ మరణంబు నొందిన మనుజులకెల్ల నిరవంద ధరణిపై నిడిన పిండములు తిరముగాఁ గొని వారిఁ దృప్తులఁ జేయ వరమిచ్చె నంత నధ్వరము దీరుటయు నిజనివాసములకు నిర్జరుల్ చనఁగ రజనీచరేంద్రుండు రణకాంక్షులైన |