| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
భూతలాధీశుల పురములమీఁద నాతతోద్ధతగతి నరిగి యీనృపుల కడిమిమై నాతోడఁ గయ్యంబుసేయఁ గడఁగు డోటమి యొండె గైకొనుఁ డనిన ఘనుఁడైన సురథుండు గాధేయ గయులు ననవద్యతరతేజుఁడగు పురూరవుఁడు మొదలుగాఁ గల రాజముఖ్యులు పఙ్క్తి వదను నిప్పుడు గెల్వ వశము గాదనుచు నొనరంగ నూహించి యోడితి మనిన విని రావణుఁడు తన విక్రమంబునకు నలరుచు ననరణ్యుఁ డనురా జయోధ్యఁ జెలువంద రాజ్యంబు సేయ నందరిగి జననాథ నాతోడ సమరంబుఁ జేయఁ జనుదెమ్ము కాదేని చాల నే ననుము మిన్నక పోరాదు మృత్యుదేవతకు నన్న నామాటకు నతఁడు కోపించి నీరాక యెఱిఁగి నే నీతోడఁ బోర ఘోరసైన్యముఁ గూర్చుకొని యున్నవాఁడ శూరుఁడవై లావు చూపుదుగాక యీరిత్తమాటలు నింకేటికనఁగ నురుసత్త్వజవముల నొప్పారు కరులుఁ బరువడి లక్షయేఁబదివేలు హరులు బహురథశ్రేణులు పటురథాటోప బహుళంబులగుచున్న భటసమూహములు పెందూళి యెగయంగఁ బృథివి గంపింప నందందు వెలువడి యారాజసేన దశకంఠు సేనతోఁ దలపడి సకల దిశల నార్పులు నిండఁ దెంపారఁ బోరి దళముగాఁ బఱతెంచి దావాగ్నిఁ బడిన శలభసందోహంబు చందంబునొందెఁ దడయక విఱిగిన దన సేనఁ జూచి యడరు కోపంబున నానరేశ్వరుఁడు మొనసి మారీచుండు మున్నగాఁ గలుగు ఘనవిక్రముల దశకంఠు మంత్రులను గడిమి మార్కొని చండకాండముల్ వఱసి వడి మృగంబులఁ దోలు వడువునఁ దోలి యమరారి కభిముఖుఁడై యింద్రధనువు కొమరారు తన వింటిగుణము మ్రోయించి దశకంఠుఁ కోటీరదశకంబుమీఁద విశిఖంబు లేనూఱు వింట సంధించి యడరింప నదియును నచలశృంగములఁ బడు వారిధారల భంగియై పడిన నట్టహాసముతోడ నతిఘోరభంగి నెట్టన లంఘించి నెత్తి వ్రేయుటయు దారుణగతి రక్తధారలతోడ నారాజు రావణు హస్తఘాతమున నరదంబుపై నిల్వ కవనిపైఁ బడిన గిరిశృంగశకలంబు క్రియ నేలఁ గూలి కప్పిన పెనుమూర్ఛ గనుమూసియుండ నప్పాటునకు నాదశాస్యుండు నగుచు భూవర నాతోడఁ బోరికిఁ గడఁగి నీవేమి గుడిచితి నీలావు నమ్మి యలఘుఁడౌ నా ఢాక కఖిలలోకములఁ గులశైలవరములఁ గూడఁ గంపించు జగదేకవిజయుఁడై చరియించు నాకు మగఁటిమి యెవ్వరు మాఱు లేరనినఁ గంఠనాళమునకుఁ గదిసి జీవంబు కుంఠితమై యుండఁ గొంత కన్విచ్చి రావణు నీక్షించి రాక్షస నన్ను నీవు చంపెదనని నిక్కి పల్కెదవు కాలంబు నెవ్వఁడుఁ గడపంగఁ జాలుఁ గాలగోచరుఁడైనఁ గడతేరవలయు నీవొక్క నెపమున నియతి నీతెఱవు గావింప నీవిటఁ గర్తవు గావు కడుఁ గీడుజన్మంబు గలుగుటఁ జేసి పుడమిలో నరమాంసభోజివై తిరుగు మధము నిన్నేమన నతిశూరుఁడైన యధికుండు దన్నుఁ దా నగ్గించుకొనునె ధరణిపైఁ గంఠగతప్రాణుఁడగుచు దురవస్థతో నిట్లు తుదిఁ జేరియున్న నేనొండు గావింప నిటమీఁదఁ జాలఁ గాన నీవేమన్నఁ గైకొనవలసె విమలైకధర్మంబు విశ్రుతకీర్తి కొమరారు నిక్ష్వాకుకులములోపలను నలువారఁ బుట్టిననాఁటను గోలె జెలువొంద దానంబుఁ జేసితినేని విపులయాగములు గావించితినేనిఁ దపమొనర్చితినేనిఁ దగవుతోఁ బ్రజల నెలమిఁ బాలించితినేని యిక్ష్వాకు కులజుఁడు నుత్తమగుణరత్ననిధియు ననుపమతేజుండునగు మహారాజు ననిలోన నినుఁ జంపునని శాపమిచ్చె సురదుందుభులు మ్రోసె సురపుష్పవృష్టి యరుదార ధరణిపై నందందఁ గురిసె నరనాయకుండంత నాకలోకమున కరిగె రావణుఁడును నటు వాసి చనియె నని చెప్ప రఘురాముఁ డల్లన నవ్వి మునినాథుఁ గనుఁగొని ముదముతో ననియె ననఘాత్మ శూరసూన్యం బైననాఁడు పొనుపడియుండెనె భువనంబులెల్ల నాజికి నతనితో నడరంగ నెందు రాజపుత్త్రులు లేరె రాజులు లేరె యుఱక నారాజన్యు లోడితి మనిరె వఱలు దివ్యాస్త్రముల్ వారికి లేవె యోటమెన్నఁడు లేదె యద్దామవిక్ర మాటోపగతిఁ దూల నాదశాస్యునకు నెందు నాతనిఁ జూచి యెదురంగ లేక పందలైపోయిరె పార్థివులనినఁ బరమేశుఁడగుచున్న పార్వతీపతికిఁ బరమేష్ఠిచెప్పిన భంగి నింపలర దరహసితాస్యుఁడై తాపసోత్తముఁడు ధరణీశుఁ గనుగొని తాఁ జెప్పఁ దొణఁగె రావణు చేసిన రణమింక నొకటి భూవరోత్తమ నీవు పోలంగ వినుము |