| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
యనవుడుఁగోపించి యా విభీషణుఁడు గనుఁగొని పల్కె నుద్గాఢవాక్యముల: “నెవ్వనిఁగాఁజూచి తినకులేశ్వరునిఁ? 179గ్రొవ్వులు వలికెదు180కూడదు నాక? గణుతింప నింద్రుండు గాఁడు నీ కోడ రణభీషణుండగు రాముండుగాని; గణుతింప ననలుఁడు గాఁడు నీ కోడ రణగరిష్ఠుండగు రాముండుగాని; గణుతింపఁగాలుండు గాఁడు నీ కోడ రణమహోగ్రుండగు రాముండుగాని; గణుతింప నైరృతిగాఁడు నీ కోడ రణభీకరుండగు రాముండుగాని, గణుతింప వరుణుండు గాఁడు నీ కోడ రణ వినిద్రుండగు రాముండుగాని; గణుతింపఁ బవనుండు గాఁడు నీ కోడ రణనిపుణుండగు రాముండుగాని; గణుతింప ధనదుండు గాఁడు నీ కోడ రణమహాశనియగు రాముండుగాని; గణుతింపఁ బశుపతి గాఁడు నీ కోడ రణవిజయుండగు రాముండుగాని; వారి నోర్చినయట్లు వచ్చునే యోర్వ నా రామదేవుని నాలంబులోనఁ? దలము దప్పినయట్టి తలఁపులు దలఁచి తలక్రిందువడియెదు తద్దయుఁగ్రొవ్వి. కులనాశకుండవు కొడుకవా? నీవు వలయు రావణుపగవాఁడవు గాక. పావకనిభరామబాణఘట్టనకు రావణుఁ181డే యోర్చు రణములో నిలిచి? యీ రావణుఁడు తన హితులతోఁగూడ నా రామచంద్రుని యడుగుల కెరఁగి మణులతో వారణమణులతోఁదురగ మణులతో మానినీమణి నిచ్చుటొప్పు182” ననవుడు రావణుం డా విభీషణునిఁ దన రోషదృష్టిచేఁ దప్పక చూచి:[వా.రా. సర్గ 16] |