ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణుఁడు విభీషణుఁ బురి వెడలనడచుట
“పగవానితోనైనఁబాయక కూడి
మిగిలిన యేపుతో మెలఁగంగవచ్చుఁ;
బటువిషంబొలికెడు పాముతోనైనఁ
జటుల183 నిర్భయవృత్తిఁజరియింపవచ్చుఁ
దనవారివలె నుండి దాయలఁగూడి
మనువారితోఁగూడి మనరాదుగాక.
వారక నీ వట్టివాఁడవుగాన
వైరుల నా యొద్ద వర్ణించె దుబ్బి.
తమ్ముఁడ వని చంపఁదగదుకా; కీవు
తమ్ముఁడవా? 184నాకు దాయవుగాక.”
యనవుడు బ్రహ్మశాపాతిశయంబు
గొనకొనుటయుఁజూచి కుంభకర్ణుండుఁ
తమ్మునిమాటలు దగ వన185రాక
186యిమ్ము లాడెడు నన్న నెట్టనలేక
యగ్గౌరవముతోడ నన్నకు మ్రొక్కి
దిగ్గన గుహకు నిద్రింపంగఁ జనియెఁ.
జనినపిమ్మట విభీషణుఁడు రావణుని
కనియెఁజిత్తంబున నలుక187దీపింప:
“నన్నవుగాన నీ యాపద కులికి
యిన్నియుఁజెప్పితి హితవని నీకుఁ;
బొసఁగదు బహుముఖంబులఁగాన నీకు
నసురేశ! చెప్పినయాప్తులబుద్ధి;
హితవుసెప్పెడిమంత్రు 188లెందుఁబుట్టుదురు?
హితవని విను రాజు లెందుఁగల్గుదురు?
తగు నాకుఁజెప్పుట; తగు నీకు వినుట;
తగు సీత నిచ్చుట తగునీతి నీకు.
(బలమెంత గల్గినఁబరికించి చూడ
నలవెంత గల్గిన నది యేమిచేయుఁ?)
బురుషుని వెరవునఁబోనీక 189పేర్చి
పరి190కింప దైవంబు ప్రతికూలమైన.
దైవంబునా నొండు దైవంబు గలఁడె?
దైవంబు దశరథతనయుండు గాక?”
యని విభీషణుఁడాడ నా రావణుండు
విని బొమల్‌ ముడివడ వికృతాస్యుఁడగుచు
మిన్నందఁగోపించి మీసంబు లదరఁ
గన్నుల మంటలు గ్రమ్మ నిట్లనియె:
“నెన్నెదు రాముని నిట దైవమనుచు
నన్నరుండే దైవ మయ్యెడు 191వాఁడు?
వెడఁ192గైనతండ్రిచే వెడలంగ193ఁగొట్టఁ
బడి యడవులలోనఁబలుమాఱు స్రుక్కి
విను మాకు నలమును వేరు వెల్లంకి
తినియెడువాని నే దేవర యండ్రు?
తన దేవిఁగొనిరాఁగ దైవంబయేని
ననుఁదాఁకవల 194వదే నన్నెదిరించి?
యలసి తమ్ముఁడుఁదాను నడవులలోనఁ
బలవించి పలవించి పలుమాఱుఁదిరిగి
వచ్చి సుగ్రీవుఁడన్‌ వానరు మఱుఁగు
సొచ్చుట దైవంబుచొప్పులే తలఁపఁ?
బలుమాఱు నేటికిఁబందమానవునిఁ
జెలఁగి నాతో సరిచేసి చెప్పెదవు?”
అనిన రావణుతోడ ననియెఁగ్రమ్మఱను
దనలోన నవ్వుచుఁదగ విభీషణుఁడు:
“ఎసగి దివ్యులఁబెంప ఋషుల195రక్షింప
నసురుల శిక్షింప నవనిఁబాలింప
నాదినారాయణుండర్కవంశమున
నీ దాశరథి గాఁగ నిట్లు జన్మించె.
వనజాసనాదులు వర్ణింప లేరు;
సనకాదులును గూడఁజర్చింపలేరు;
ఆ మహామహిమ నీ కలవియే తెలియ?
రాముఁడు మర్త్యుఁడే?రాక్షసాధీశ!
కాన రామునిఁగని కంజాస్య నిమ్ము
దానవేశ్వర! మనఁదలఁచెదవేని.
మలఁగక యర్థకామంబులవలనఁ
దలఁపగ్గలంబైన ధర్మ మెక్కడిది?
నీ వొల్ల వెన్నఁడు నీతి మార్గంబు;
నీ వారలొల్లరు నీకంటె మున్నె;
కాన కార్యాకార్యగతి యిట్టి 196దనిన
దానవేశ్వర! నీకు ధర్మ197ంబు గలదె?
వచ్చెద రగచరుల్‌ వారిధి దాటి;
వచ్చి యీ రాక్షసవనితలనెల్ల
మోడ్చినకరముల ముందలల్‌ వట్టి
యీడ్చెద; 198రటువలె నీడ్వకమున్న
యొప్పింపుమా సీత నుర్వీశ్వరునకుఁ;
దప్పక చెప్పితి దానవాధీశ!
మండెడునగ్నులమాడ్కి రాఘవుని
దండిబాణంబు లుద్దండత వచ్చి
నీ రొమ్ముగొని కాఁడ నేర్తునే చూడ
నీ రాజ్యగతి సూడ నేర్తుఁగా కేను?
బ్రళయా199నిలుఁడు కులపర్వతశిఖర
ములఁ200గూల్చుపగిది రాముఁడు భండనమున
నీ తల లందంద నేలపైఁగూల్ప
201నే తెఱంగున నింక నేఁజూడనేర్తు?”
ననిన విభీషణు నదరంటఁజూచి
మునుకొని పదిమొగంబులు జేవుఱింపఁ
గటము లుప్పొంగ నొక్కట నూర్పులెసగ
బటుధూమములతోడిపావకుండనఁగఁ
బదహతి మేదినీభాగంబు వగుల
నదలుపుబెట్టున నాకసంబదర
‘నద్దిరా! యితనికోపావేశ’మనఁగ
గద్దియనుండి దిగ్గన 202డిగ్గనుఱికి
యడిదంబు జడిపించి యటు వ్రేయఁబూని
యుడిగి విభీషణు నుగ్రతఁదన్నెఁ.
దన్నిన వజ్రంబుతాఁకునఁగూలు
నున్నత గిరివోలె నుర్విపైఁబడియెఁ.
బడిన వెండియు వ్రేయఁబాఱఁబ్రహస్తు
డెడ సొచ్చి వలదని యెడలించె వాలుఁ.
గొలువెల్ల నాతనికోపంబుఁజూచి
“తలకొని యెంతవింతలు వుట్టె”ననఁగ
ననలార్చు లక్షుల నడర దైత్యేశుఁ
డనియె నిర్దయతఁబ్రహస్తునిఁజూచి:
“వీనిదురుక్తులు వింటె ప్రహస్త!
వీని నమ్ముదురె యెవ్విధిఁదమ్ముఁడనుచు?
వెడలంగఁద్రోయుము వేగంబె వీని;
నెడనేసి మొగ మోడితేని నా యాన.”
యనినఁబ్రహస్తుండు న వ్విభీషణునిఁ
గనుఁగొని పలికె నాగ్రహవృత్తి దోప:
“వల దిట యుండ; నీ వలసినయెడకు
వెలువడి యరుగుము వీటికిఁబాసి.”
యనిన విభీషణుఁడతికోపుఁడగుచు
203ననలుండు నలుఁడును హరుఁడు సంపాతి
యనువారితోఁగూడి యసురేంద్రుతోడ
ననియె నుద్ధతి గదాహస్తుఁడై నిలిచి:
“మదనాతురుండువు; మఱి పాపములకుఁ
గుదురైనవాఁడవు; క్రూర204కర్ముఁడవు;
మున్నెకదా నిన్ను మూర్ఖునిఁబాయ
నున్నాఁడ; నిది గ్రొత్తయును గాదు నాకు
నార్తరక్షకునిఁ గృపాంబుధి దివ్య
మూర్తి జగద్ధితంబుగఁబుట్టినట్టి
సత్యసంధుని రామజనపాలచంద్రు
నిత్యయశోనిధి నిర్మలాత్మకుని
శరణని పోయెద; శరణన్న నతఁడు
కరుణతోఁబ్రోచు నే కాలంబునందు.
నేను బోయిననైన నిటమీఁద నెఱిఁగి
మానైన నీతితో మను దానవేంద్ర!
యట్టిద కాదేని యర్కనందనుఁడు
దట్టించునపుడైనఁదలఁపు నా బుద్ధి;
యట్టిద కాదేని యగచరుల్‌ లంకఁ
జుట్టినయపుడైనఁ జొనుపు నా బుద్ధి;
యొండేని రఘురాము205నుగ్రబాణములు
206ఖండించునపుడైనఁగనుము నా బుద్ధి”

  1. ↑నిర్భర
  2. ↑పగ
  3. ↑లేక
  4. ↑యిమ్ములనాయన్న నెట్లనరాక
  5. ↑రెట్టింప
  6. ↑లెందునుగలరు
  7. ↑పేర్చు
  8. ↑కించి
  9. ↑నేని
  10. ↑గయి
  11. ↑నోటు-వడి
  12. ↑దె క్రన్నన నెది
  13. ↑మన్నింప
  14. ↑దనవు
  15. ↑మెక్కడిది?
  16. ↑రగచరు లీ
  17. ↑నిలంబులు పర్వత
  18. ↑ద్రోచు
  19. ↑నేతున్‌ నే వీక్షింప నిర్జరవైరి, య
  20. ↑లేచివచ్చి
  21. ↑“తన మంత్రులు నలనీలహితసంపాతులను వారలు నలువురు”.భా.రా
  22. ↑చిత్తుఁ
  23. ↑ఁడుగ్ర… ల
  24. ↑దండించు… దలఁపు…
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )