ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణు వైభవమును విభీషణుఁడు రామున కెఱిఁగించుట
కరకౌశలమున లంకాపురంబనెడు
పురము నిర్మించెఁ; దత్పురవరంబునకుఁ
గోట లే డొప్పు; నక్కోట కోటకును
వాటమై నాల్గేసి వాకిండ్లు గలవు.
తఱచైనయట్టి కొత్తళములతోడ
నిఱివుగా ముందఱ నిటుక276కోటకును
బడుమటి277ద్వార మేర్పడఁగాచియుండు
278రెడపక రాక్షసు లెనుబదికోట్లు;
దానవు లుత్తరద్వారంబు గాచి
యేనూటడెబ్బది279యేడు కోట్లుండ్రు;
తూర్పువాకిలియందుఁదొలఁగ కే ప్రొద్దు
దర్పించి యుందు280రు తగ నూఱుకోట్లు
దక్షిణద్వార ముద్ధతిఁగాచియుందు
రక్షీణ281దానవు లఱువదికోటు.
లరయ నా లోపలియాఱుకోటలను
నరనాథ! యిరువదినాల్గు వాకిండ్ల
వరుస282 నీ చెప్పిన వడువున నెపుడు283ఁ
దరిగాచి యుందురు ధరణీతలేశ!
తిరమగుచున్నట్టి దిడ్డి వాకిండ్ల284
నురుసత్త్వులుండుదు రొక్కొక్కకోటి.
పురమధ్యవీథి నెప్పుడుఁగాచియుందు
రిరువదిలక్షలు నేళ్నూఱుకోట్లు.
కుంభకర్ణుని నిద్ర గుహచుట్టుఁగాచి
జృంభణమై వసించెద రేడుకోట్లు.
మొనసి యా రావణుమొగసాలఁగాచి
కొనియుందు రొక లక్షకోటి రాక్షసులు.
నొనర నా వాకిట నుండు రాక్షసులు
వినవయ్య! యిరువదివేల కోట్లెలమిఁ.
జెలువంబుగా నింద్రజిత్తువాకిటను
బలవంతు లుందు285రు పదివేలకోట్లు.
ఘనులైన యా యతికాయాది వీర
దనుజులవాకిండ్ల286 దశలక్షకోటి287
యెన్నికతో మఱి యినకులాధీశ!
యెన్నరా దాసేన; యెంతయు ఘనము.
వాసవాంతకు లావు వర్ణింపఁదరమె?
యీసునఁగైలాస మెత్తినవాఁడు;
వనజజుం డతనికి వర మిచ్చినాఁడు
దనుజులచేత గంధర్వులచేత
నమరులచేత నా యక్షులచేత
సమరంబులోపలఁజావు లేకుండ;
సమరంబె యేల? యే చందంబునందు
సమయింపరాదు రాక్షసలోకనాథు.
నతఁడు మీ చేతనే యనిఁజచ్చుఁగాని
క్షితినాథ! యన్యులచే నసాధ్యుండు.
కుంభకర్ణుండు గైకొనఁడు చీరికిని
జంభారినైనను సమరంబులోన.
నెత్తినమదమున నెఱుఁగఁ డే భయముఁ
జిత్తంబులో నింద్రజిత్తనువాఁడు;
హరునకుఁబ్రీతిగా యాగంబుసేసి
288వరమునఁబడసెను వజ్రకవచము;
నరుదుగా మాయావియై విల్లుఁబట్టి
యరుల నాకాశంబునందుండి గెలుచు.
నతి సత్త్వధనుఁడు ప్రహస్తుఁడన్వాఁడు
చతురుఁ డా రావణుసైన్యపాలకుఁడు;
ఖండేందుధరు చెలికాని సామంతు
భండనంబున మాణిభద్రుని నోర్చె.
దనుజవీరులు మహోదరమహాపార్శ్వు
లనువారు నతికాయుఁడనువాఁడు నధిప!
బలిమిఁగైకొనరు దిక్పాలురనైన;
గెలుతురు రణమునఁగిట్టినయపుడు.
నెత్తుట నంజుట నెట్టనఁదనిసి
మత్తున సంగరోన్మత్తులై చాల
నద టెక్కినట్టి మహాదైత్యవరులు
పదివేలకోటులు బలియురు గలరు.
వారిలావునఁజేసి వసుమతీనాథ!
యా రావణుఁడు గెల్చె నఖిలదిక్కులను.’
అనవుడు రాఘవుండనియె నాతనికి:
“విను విభీషణ! మున్ను విన్నాఁడ నేను;
మీ యన్న యెంతయు మిక్కిలిబంటు;
పాయక యాతని బలిమి యట్టిదియ.
వాఁ డెంతవాఁడైన వచ్చి నా యెదుట
వాఁడిమిఁబచరింప వాఁడెంతవాఁడు?
హరిహరబ్రహ్మాదు లాదిగాఁగల్గు
సుర లడ్డగించినఁజూర్ణంబు సేసి
వానిఁజంపుదు; నిన్నవశ్యంబు లంకఁ
బూని యేలింతు నిమ్ముల దానవేంద్ర!”
యనిన విభీషణుఁడా రాముఁజూచి
వినయంబుతో మ్రొక్కి వేడ్క నిట్లనియె:
“నా రావణుండెంత? యా లంక యెంత?
శ్రీరామ! నీ బాణశిఖి పర్వునపుడు?
లంకకోటలువ్రాఁకి లగ్గలు వట్టి
కింకతో నసురులఁగిట్టినయపుడు
నా లావుఁజూడుము నరనాథచంద్ర!
కాలాగ్నిరుద్రునిగతిఁ బేర్చువాఁడ.”
ననవుడుఁబతి వాని నాలింగనంబు
ఘనముగాఁజేసి లక్ష్మణునకు ననియె:

  1. ↑కోటొకటి
  2. ↑వాకి లేర్పడ
  3. ↑రుడుగక పదికోటు లుగ్రరాక్షసులు
  4. ↑యేను
  5. ↑రుద్ధతి, రెంతయు
  6. ↑సాహసు
  7. ↑నేఁజె
  8. ↑సరిగాచియుంద్రు రాక్షసకోట్లు చెలఁగి (పెక్కు), గురి మీఱి యా యేడుకోటలయందుఁ- దిరమగు…
  9. ↑పరభీకరంబైన పావకులనఁగ
  10. ↑రేఁబది
  11. ↑ఁదరలకుండుదురు
  12. ↑తొడరినకడమిమై దుష్టరాక్షసులు - కడు నేచి విడివడ్డ గజములో యనఁగ, నెన్నికతో…
  13. ↑గరిమతోడుత వజ్రకవచంబు వడసె
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )