ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రాముఁడబ్ధిపై బ్రహ్మాస్త్రము ప్రయోగించుట
నని వేఁడుకొనుటయు నా రామునెదురఁ
దనరారి యంతకంతకుఁబొంగి పొంగి
తోరంపుఁదెరలచేతులు వీచి వీచి
బోరన నుర్వుతెల్పున నవ్వి నవ్వి
ఘనమీనరుచినాలుకలు గ్రోసి క్రోసి
చనుమ్రోఁత నట్టహాసము సేసి చేసి
తుది314నీట 315దిక్కులతోఁజెప్పి చెప్పి
కదిసినసుళ్ల వక్రతఁజూపి సూపి
యుదధి యా రాముని నొక్కింత316గొనఁడ.317
యది యట్టిదయకాదె యరసిచూడంగ
జడుఁడైనవాఁడు318 దుర్జనుఁడైనవాఁడు
కడుఁగ్రూరజీవ319నగతి నున్నవాఁడు
మలుఁగక తనలోన మండెడువాఁడు
కులగోత్రమైనఁజేకొని మ్రింగువాఁడు
నెదు రెంతవేఁడిన నెఱుఁగునే? పెద్ద
యొదురుచు నంతంత నుబ్బునుగాక,
గదియంగ వచ్చుచోఁగడిఁదిచిత్తంబు
చెదరంగ విషముపైఁజిలికించుఁగాక.
నడుఁకక తన ప్రార్థనంబుఁగైకొనక
జడధి వొంగుట సూచి జానకీవిభుఁడు
నిడుదకన్నులక్రేవ నిప్పులు రాల
ముడివడుబొమలు గ్రమ్ముచుఁగోపమెసగ
జలనిధిదిక్కును సౌమిత్రిదిక్కుఁ
బలుమాఱుఁజూచుచుఁబలికె రాఘవుఁడు
“వీని గర్వముఁగంటివే? లక్ష్మణుండ!
యే నెంత వేఁడిన నింతఁగైకొనక
పొడసూపకున్నాఁడు; పొడసూపకున్నఁ
బొడ వడఁగింపక పోనేలనిత్తు?
నెడపక క్రోలియు నింకింపలేని
బడబానలంబె నా బాణానలంబు?
అటు సూచుఁగాక నా యస్త్రంబుకొలఁదిఁ
బటుతరమకరసర్పములు మీనములు
గండకంబులుఁగూర్మకర్కటంబులును
మండూకములు నీరు మానిసికదుపు
నురువడి నొండొంటి నొరయంగఁబాఱి
కెరలెడి తిమితిమింగిల తద్గిలములు
దండిరాక్షసులును దఱచు నెగళ్లుఁ
గొండలు మును మాఱుకొని రూపుమాపి
పరగుచునున్న నా బాణాగ్ని శిఖల
నెరసిన తనలోని యెమ్ములో యనఁగ
జలములఁగప్పి తజ్జలచరకోటి
మెలఁగుట మాన్పించి మీఁదఁదేలించి
చిప్పలు గుల్లలుఁజిక్కంగఁదన్ను;
నిప్పుడ ధూళిగా నింకించువాఁడ.
సిరితండ్రి యని పెద్దసేసితిఁగాని
హరిమామ యనుచుఁబాలార్చితిఁగాని
320యిందుకుఁదను వేఁడ నేటికి నాకుఁ?
బొందెఱుంగక పేర్చి పొంగెడు జలధి
న న్నశక్తునిఁగా మనంబునఁదలఁచి
యిన్ని చందంబుల321 నేఁచె. సౌమిత్రి!
తే విల్లు నమ్ములుఁ;322దెగి పొంగియున్న
యీ వార్ధి నా చేత నింకుట చూడు.
వనధిలో 323జలచరావళిఁ జూఱవుత్తు.”
ననుచు రాఘవుఁడు విల్లందుమాత్రమున
బలభేది వడఁకె; దిగ్భాగంబు వగిలె;
జలధులు గలఁగె; నాశాకరు లులికె;
ధారుణి గ్రుంగె; భూధరములు గూలె;
నీరజాసనుఁడును నివ్వెఱఁగందెఁ;
జుక్కలు డుల్లె; శేషుండు భీతిల్లె;
దిక్కులు ఘూర్ణిల్లె; దివి యొడ్డగిల్లె.
నినకులేశ్వరుఁడంత యేపు దీపింప
వినుతులు శోభిల్ల విల్లెక్కువెట్టి,
సమవర్తి సంవర్తసమయదండంబు
సమమైనవాని నుజ్వలమైనవానిఁ
బ్రళయకాలానలప్రభ నొప్పువాని
విల324యార్కచండాంశువిధమైనవాని
సాయకంబులు పెక్కు సంధించి325పేర్చి
తోయధిలోపలఁ326దొడఁగి యేయుటయుఁ.
“గడవఁబొంగితి నన్నుఁగరుణింపు.”మనుచుఁ
జెడక వారిధి యోరసిల్లెడుమాడ్కిఁ
గడు మ్రోసి పర్వతాకారంబు లగుచుఁ
గడువేగఁదరగ లాకస మప్పళించెఁ.
బలితంపు రామభూపాలుని బాణ
ములు పెక్కు నాట సముద్రునినోటఁ
గ్రమ్మెడులాలలకైవడి నురువు
లమ్మహావీచులయందుఁబెల్లెగసె
సొరిది నే327నెక్కడ చొత్తు నన్మాడ్కి
ధరియింప కా సముద్రము దల్లడిల్లె.
జలనిధియుదక మాస్వాదింప వచ్చి
మలుఁగని రామాస్త్రమహిమకు నులికి
మొగిళులు మగుడి వెమ్ముచుఁబోవు భంగి
బొగ328వెక్కసంబుగాఁబొరిఁబొరి నెగసె.
నొఱలుచు రాక్షసు లొఱలుట సూపు
తెఱఁగువ నొఱలె నెంతే జలచరులు.
మనుకులవల్లభుమార్గణవహ్నిఁ
దొనఁకఁజొచ్చిన సముద్రుని చిత్తవృత్తి
ఘనతరంబగు నహంకారాదులెల్లఁ
బెనుపరి నిలువక పెడఁబాయుమాడ్కి
దైతేయులెల్లఁబాతాళంబు విడిచి
భీతిల్లి పాఱిరి పెక్కుదిక్కులకుఁ.
దనచేత నింకక తనరినవార్ధి
ననయంబు నింకింతు నని వచ్చుచున్న
యినకులు బాణాగ్ని కెదు రేఁగుదెంచి
ననుపొంద నాలింగనము సేయుకరణి
నుడుగ329ని బాణాగ్ని నొడఁగూడి లోని
బడబాగ్ని వారాశిపై మండఁదొడఁగె.
నప్పుడు లక్ష్మణుం డంతకుభంగి
నుప్పొంగి రౌద్రసంయుక్తుఁడైయున్న
యన్న చందముఁజూచి యలుకుచు వచ్చి
మున్నీటి కెడ సొచ్చి మోడ్పుఁగే లొప్ప:
“మానవేశ్వర! యిది మథనంబుసేయ
రాని రుద్రునిరోషరసవార్ధి గాదు.
మానవేశ్వర! యిది మధనంబు సేయ
రాని కాలుని330కోపరసవార్ధి గాదు.331
ఈ నీరు332నెఱియింప నిబ్భంగిఁదొడఁగె;
మానక యింక నీ మార్గణవహ్ని
వెలికి నేతెంచి దిగ్వితతితోఁగూడఁ
గలయ లోకంబులు గాల్చునో333తుదను.
సర్వజగద్ధితచరితంబుఁబూని
యుర్వీశ! నీ కోప ముపసంహరింపు.
నీ కోపమునకు నీ నీరధి యెంత?
తే కార్ముకము దీనిఁదెగఁగొన కధిప.”
యని విల్లువట్టిన నతఁడీక కోప
మినుమడింపంగ సౌమిత్రిఁదా నుడిపి
“యంబకం బేల? నా యంబకంబులనె
యంబుధి నింకింతు.”ననిన చందమునఁ
గ్రూరదృష్టులఁగనుంగొని యౌడుగఱచి:
“యోరి! సముద్రుండ! యోడవునాకు.
నీ నీరు నింకించి నీయందుఁగలుగు
వానినన్నింటిని వడి నీఱుసేసి
భర్జింతు; నీ వింక బంటవై నిలువు.
దుర్జనత్వమున నాతో నెదిరించి;
యిదె తొడిగెద బాణ మే నారి.” ననుచు
నదలించి యపుడు బ్రహ్మాస్త్రంబుఁదొడుగ
బ్రహ్మయు నింద్రుండు భ్రమఁగానరైరి;
బ్రహ్మాండమెల్లను బగిలినట్లయ్యె;
భువనత్రయములోని భూతంబు లఱచె;
భువనంబులెల్లను బొగిలిన ట్లయ్యెఁ;
గలయంగ దిశలఁజీకట్లగ్గలించె;
వెలుఁగవు334రవిచంద్ర విమలబింబములు;
నశనులు వడియె; మహానిల మడరె;
నశరీరి యొఱలె; మిథ్యాగ్నులు మండె;
నుడుగక యొకమ్రోఁత యూరక మ్రోసె
జడధి యప్పుడు గ్రాహసమితియుఁదానుఁ
బొంగెల్ల నెక్కడ పోయెనో యనఁగఁ
దుంగ ఫేనము లెందుఁ దూలెనో యనఁగఁ
బటుఘోష335మెమ్మెయిఁ బాసెనో యనఁగఁ
జటులోగ్ర విషమెందు సమసెనో యనఁగఁ
బెంపెల్ల నెక్కడ ప్రిదిలెనో యనఁగ
సొంపెల్ల నెక్కడ చొచ్చెనో యనఁగ
భంగంబు లేకయుఁబరికించి చూడ
భంగంబునకుఁ దానె పట్టనఁబరగి
సత్త్వంబు సెడియు నాశ్చర్యంబుగాఁగ
సత్త్వసమగ్రుఁడై చలనంబు336నొంది
భ్రమణంబు లేకయు భ్రమణంబు గలిగి
యమితవేగంబున నధికత దక్కి
యా రాముచేతి బ్రహ్మాస్త్రంబు తుదకు
బీరంబు సెడి వచ్చి బిందువై నిలిచె
వరమునఁబెరుగు రావణుమస్తకములు
కర మరుదార నొక్కటఁద్రుంచుకొఱకుఁ
337గడఁగి రాఘవుఁడంబకము వాఁడిసేయ
బడబాగ్ని నిడి 338నీటఁబదనిడ్డకరణి,
‘చింతింప దేవ! నా జీవనంబెంత
యింతియెకా’ కని339యెడుభంగి దోఁప.

  1. ↑నీరు, నలు, మీఱి, నిరు
  2. ↑కెలఁకులతో
  3. ↑గొనదు
  4. ↑మదవృత్తి మీఱి దుర్మతియును మూఢుఁ, డదయునివిధమెల్ల నాత్మఁజింతింప - నది యట్టి…
  5. ↑దుర్జయుఁ
  6. ↑సంగతి
  7. ↑యేఁదన్ను వేఁడంగ నింతనాకేల - మీఁదెఱుంగక పేర్చి మీఱెడి
  8. ↑నెంచె
  9. ↑దే
  10. ↑జగ(ల) ములు వడిఁ
  11. ↑యోగ్ర
  12. ↑మించి
  13. ↑దొడరి
  14. ↑లోకంబుఁజొ
  15. ↑లెడత్రెవ్వకపొ
  16. ↑కెంతయు వడి
  17. ↑వీర
  18. ↑మానవేశ్వర, యిది మథనంబు సేయ - రాని మృత్యువుక్రోధరసవార్ధి గాదు- ఈ నీరు…
  19. ↑నెఱియంగ నిబ్భంగిఁజొచ్చె
  20. ↑తగదు
  21. ↑చంద్రార్కవిపుల
  22. ↑మెక్కడపంపెనో
  23. ↑ఁదక్కి
  24. ↑గడిఁది
  25. ↑నీరుపదనిచ్చు
  26. ↑యిడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )