ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
మాయాశిరోధనువులఁ జూపి రావణుఁడు సీతను వెఱపించుట
“రామునిధనువు శిరంబును బోలె
నీ మాయ నతివేగ నిర్మించి తెమ్మ.”
యనవుడువాఁడును నప్పుడు పోయి
తన నేర్పుమీఱ నా ధనువును శిరము
నతివేగ నిర్మించి యర్థిఁదెచ్చుటయు
నతనికి508మెచ్చు ప్రియంబును నొసగి
సురుచిరమైన యశోకవనమున
కరిగి యా దనుజేశుఁడవనిజఁ గనియెఁ
“బెల్లైన యీవగఁబెట్టనే కంటి
తల్లి, న!”న్నని వసుంధర దూఱుకరణిఁ
దలవంచుకొని విన్నఁదనమునఁదూలి
సొలవక ధాత్రిఁజూచుచునున్న దాని,
నొడలఁజిత్తమునఁబెంపొందు తాపాగ్ని
నుడికి పొంగుచు వెలి కుఱుకు509చునున్న
రాక్షసుపై రోషరసధార లనఁగ
నక్షీణబాష్పధారావళిదానిఁ
“బుత్త్రి! యీ దురవస్థఁబొందితే.”యనుచు
ధాత్రి దానును బరితాపంబు నొంది
యాలింగనము సేసినట్టిచందమున
ధూళిగప్పినమేనితో నున్నదాని,
“రావణ! నిన్ను నీ రాక్షసకోటి
నే విధంబునఁజంప కేలపోనిత్తు.”
నని వానిక్రూరకర్మాధిదైవంబు
గొనకొన్న కైవడిఁగూర్చున్నదాని,
నమరారు లను నీరసావనీజములఁ
దమకించి 510తావిట తాటంబు సేయ
నని దొర511కొను విలయానిలుపగిదిఁ
దనరు నిట్టూర్పులు దఱచైనదానిఁ
గని చెడఁదలఁచి యా కష్టదానవుఁడు
తన దిక్కుఁజూడని ధరణిజ కనియె:
“వెరవు చాలని యవివేకి దానవుల
ఖరదూషణాదుల ఖండించెననుచు
జనకనందన! రాముశౌర్యంబు నమ్మి
నను గణుతింప వెన్నఁడుఁజిత్తమునను.
నసమునఁగపులతో 512నంబుధి దాటి
యస 513మఱి యా సువేలాద్రిపై నుండి
యలసి నిద్రింపంగ నగచరసేన
నలమి యీ రాత్రి ప్రహస్తుఁడన్వాఁడు
నా కూర్చుబంటు 514 నీ నాథునిఁజంపి
కాకుత్స్థునురుకార్ముకంబును శిరముఁ
గొనివచ్చె; రామునికూర్మితమ్ముఁడును
వనచరాధిపులును వడిఁబాఱి రోడి.
కాన, కంజాస్య, రాఘవునాస విడిచి
నా నారులకు నాకు నాథవై యుండు.”
మనుచు విద్యుజ్జిహ్వుఁడనువానిఁబిలిచి
వనజాక్షిముందర వైవఁబంచుటయుఁ
“దనుమధ్య! యిది రాముతలయును విల్లు.”
నని యటువైచి వాఁడరిగె నవ్వుచును;
దలకొని రామభూ515తలపతి వచ్చి
తలరు నయ్యాహవతలమున నసుర
తలఁద్రెంచునని వియత్తలవాణివీచెఁ
‘దలఁకకు నీ విభుతలచొప్పు గాదు
సాధించు శ్రీరామచంద్రుఁడు నేఁడు
నీ ధర్మగుణముతో నింక’ నన్‌మాడ్కిఁ.
దరలాక్షి! యా తల తప్పక చూచి
కరమొప్పురామునికన్నులు మోముఁ[వా.రా. సర్గ 32]
దలకట్టు మౌళిరత్నప్రభావళియుఁ
బలువరుసయుఁగర్ణభాతియు 516మోవి
తలపోసి రాముని తలయకా517దలఁచి
బలుమూర్ఛపాల్పడి పడియె ధరిత్రి
‘నిది బొంకు; నీ పతి కేమియుఁగాదు;
సుదతి! నీ కీ మాయ చూడఁగా.’దనుచుఁ
దన యురస్థ్సలికి నాతన్వంగిఁ దివిచి
కొనియెనో కాక యా కుంభిని యనఁగఁ
బడి యంతఁదనలోనఁబడఁతుక దెలిసి
యడరెడు శోకాగ్ని నలయుచుఁబలికెఁ:
“గటకటా! కైకేయి! కలహంబు వన్ని
యిటు ద్రుంగఁజేసితే యిక్ష్వాకుకులము!
నీ రాఘవేశ్వరుఁడె గ్గేమిసేసె?
నూరక యడవుల నుండంగఁబనుప?’
“వననిధి బంధించి వచ్చితి; నన్నుఁ
గొనిపోయె దని యేను గోర్కి దీపింపఁ
బెద్ద నమ్మితిఁగదే పృథివీశ! నిన్ను!
నిద్దెస నా దైవ మిటు సేయు టెఱుఁగ?
నాకును నీకుఁబ్రాణము లొకటగుట
కాకుత్స్థ! యిటు బొంకుగాఁజేయఁదగునె!
పతికంటె ముందఱఁబ్రాణముల్‌ విడుచు
నతివఁ గానైతినే 518యర్కకులేశ!
యరుగుదుఁగాకేమి; యడరు నీ కడకు
నరనాథ! పుత్తెంతు నాదు ప్రాణములు!
వసుధ నా తల్లి; నా వరుఁడవు నీవు;
వసుధఁగౌఁగిటఁజేర్ప 519వావియే నీకు?
జనకుచే న న్నగ్నిసాక్షిఁ జేపట్టి
కొనివచ్చి యిటు పాయఁగూడునే నీకు?
నెట్టొకో రామ! నీ విట్లున్న నాదు
కట్టిఁడిప్రాణముల్‌ గ్రాఁగవయ్యెడిని.
క్రాఁగనియప్పు డే కాకుత్స్థ! నీవు
గ్రాఁగుట నిక్కంబు గా520కుండు.” ననుచు
నీ విధంబున సీత యేడ్చుచునుండ
దౌవారికులు వచ్చి దనుజేశుఁగాంచి:
“దేవ! కార్యంబు లెంతేనిఁబుట్టుటయు
నీ వరమంత్రులు నిను సభాస్థలికి
నరుగుదెండని ప్రహస్తాదులు వచ్చి
తరమిడియున్నారు ద్వారదేశమున.”
నని విన్నవించిన నా రావణుండు
చనియె శ్రీఘ్రంబున సభకు నత్తఱిని.
దనుజుండు సనఁగ నా తలయును విల్లు
విన విస్మయంబుగ వెస మాయమయ్యె
నా రావణుని లక్ష్మి యంతలోపలనె
బోరన మాయమై పోవు నన్నట్టు.
లిదె వచ్చె రాఘవుం డెత్తి పై ననుచుఁ
ద్రిదశారి యెంతయు ధీరుఁడై కడఁగి
వేగులవారిచే విన్నవార్తల521కు
వేగ నిస్సాణంబు వ్రేయంగఁబనిచి,
తన సేనఁగూర్ప522బ్రద్దలవారిఁబనిచె.
జనకనందన నంత సరమ వీక్షించి:[వా.రా. సర్గ 33, 34]
“యేల మాయమ్మ! నీ విటు ప్రలాపింప?
బోల వీ523మాటలు బొంకుగాఁదలఁపు.
వనిత! నీ ముందఱవైచిన శిరము
దనుజునిమాయగాఁ దలపోయవలదె?
వనజాక్షి! యసుర దుర్వాక్యంబులెల్ల
విని నేను బోయితి 524వెనుకనే యరయ;
నా వార్త విను; రాముఁ525డని కెత్తెననుచు
దేవారియెంతయుఁదిరు526గుడు పడియె.
నదె విను527నిస్సాణహననఘోషంబు;
నదె వినుమా రాక్షసావళి528యుగ్ర
రథములమ్రోఁతయు; రథికసారథుల
పృథు 529ల భాషణములు పెల్లుగా మ్రోసె.
నటుగాన రామున కాపద లేదు;
కుటిలకుంతల! నీవు గుందంగవలవ.”
దని చెప్పు530చో లంక యగల నార్చుచును
వనచరసేనలు వచ్చుట సూచి
యంతరంగంబు బిట్టగల రావణుఁడు
చింతించి మంత్రులఁజెచ్చెరఁబిలిచి:
“యదె రాఘ531వుం డెత్తె ననికి;మీ రిపుడు
విదితవిక్రమశక్తి వేగంబె పోయి[వా.రా. సర్గ 35]
మనుజుల నిద్దఱ మడియించి 532వేగ
533వనచరసేనల వధియించుఁడోలి;
నరుగుఁడు, లెం.”డన్న నా రావణునకు
వరనీతిమతి మాల్యవంతుఁడిట్లనియె:

  1. ↑నితనికి మెప్పులనేకంబు లిచ్చి
  2. ↑చందమున
  3. ↑వెసవీట
  4. ↑కొని
  5. ↑నతఁడబ్ధి
  6. ↑మానమతి
  7. ↑చూర్ణంబుగాఁజేసి
  8. ↑ధవుఁడిప్పు డసుర- తలలెల్లఁద్రుంచు నుద్ధతి రణస్థలిని - ఁదలఁకకు నీ పతితలయు నొప్పారు (తలలని యలవియత్తలము వీతెంచె ) నిలధర్మగుణముతో…
  9. ↑నాస
  10. ↑వగచి
  11. ↑నర్క
  12. ↑వసుధేశ, తగునె
  13. ↑కుండమనుచు
  14. ↑ను
  15. ↑ఁబ్రధానులఁబనిచె
  16. ↑వార్తలు
  17. ↑వేగమ యటకు
  18. ↑డదె వచ్చె
  19. ↑గంగఁబడియె
  20. ↑నిస్సహణాది ఘోషంబు
  21. ↑మ్రోఁత
  22. ↑తరాహ్వానముల్‌ బిట్టు వీతెంచె
  23. ↑చుండలం కగల
  24. ↑వుఁడు వచ్చె నతనిపై మీరు. (ననిసేయ నిపుడు)
  25. ↑రండు,
  26. ↑చనఁజొచ్చి యవ్వనచరసేనతోడ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )