ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
ఇంద్రజిత్తు మాయాయుద్ధ మొనర్చుట
అరదంబు సూతుండు హరులు నంగదుని
కరముక్త గిరిశృంగకఠినపాతమున
నవనిపైఁగూలిన నాజి747వంచించి
సవనశాలకు వేగ చని యింద్రజిత్తు
తగు హోమసాధనతతులు రాక్షసులు
మొగిఁదేరఁగైకొని ముఖ్యమార్గమున
వలనొప్పఁగా రక్తవర్ణంబులైన
తలచుట్టు నుభయవస్త్రములు మాల్యములు
ధరియించి వహ్నికిఁదగఁబరిస్తరణ
మురుతోమరంబులు నుగ్రశస్త్రములు
గఱిలేనిశరములు గావించి నలుపు
గఱిగొన్న ఘనమేషకంఠరక్తంబు
నొగిఁదాడి సమిధలు హోమంబు సేయఁ
బొగలేక మండుచుఁబొడవుగా నిక్కి
యెలమిమై విజయంబు నెఱిఁగింపఁజాల
వలఁతియై దక్షిణవలమానశిఖల
నొప్పుచు ననలుఁడాహుతులు గై748కొనియె.
నప్పుడు నిష్ఠతో నా యింద్రజిత్తు
యుక్తక్రమంబున హోమ మొప్పార
భక్తితో నొనరించి పావకువలన
నాలుగు హయములు నానాస్త్రశస్త్ర
జాలంబుఁగలుగు కాంచనమయరథముఁ
బడసె. నా రథమెక్కి బ్రహ్మాండమగలఁ
గడువడి నార్చి యుత్కటకోపుఁడగుచు
నింద్రాది దేవతలెల్ల భీతిల్ల
నింద్రజిత్తుఁడు మరి యేపు దీపించి
చెచ్చెర దానవసేనలతోడ
వచ్చి యదృశ్యుఁడై వడి దివి నుండి
మసలక రామలక్ష్మణులపై నేసె
నసదృశకాండంబు లందంద పెక్కు.
లా రామలక్ష్మణు లాకసంబునకు
భూరిశరంబులు పోవ నేయుటయు
నందొక్కటైనను నా యింద్రజిత్తు
నందుఁదాఁకమి మఱి యా దైత్యవరుఁడు
తనుఁగాన749రాకుండ దర్పంబు750మెఱసి
వినువీథిఁగడుఁబెక్కువిధములఁదిరిగి
కవిసి యంతటఁబోక ఘనులైనకపుల
నవలీలఁదునుమాడి751యందంద పేర్చి
నలుదెస నేయుచో నగచరులకును
నలినాప్తకులులకు నలినాప్తకిరణ
నిభములై పఱతెంచు నిష్ఠురాస్త్రములు
నభమునయందుఁగానఁగవచ్చుఁగాని
యరదంబుమ్రోఁతయు నా ఘోటకముల
ఖురములమ్రోతయు గుణముమ్రోఁతయును
సారథిపలుకు752లు ఝంకారములును
నా రథికునియార్పు నతనిమూర్తియును
నా రథంబును దాని యధికధ్వజంబు
753లే రూపములయందు నెటు సూడఁ754బడవ.
యా విధ మాసేన కప్పుడు తోచె
నా వాలిఁదునుమాడి యసమునఁబేర్చు
రామునిమీఁద సురప్రభుండలిగి
రామణీయకమహోగ్రప్రకాండములు
నా తనూజునిఁజంపినాఁడంచుఁబేర్చి
యీ తెఱంగున755 మించి యేసెనోయనఁగ.
నప్పుడు కపిసేనయంగంబులెల్లఁ
జిప్పలు756చిద్రుపలై చెదరంగఁజూచి
జనలోకపతితోడ సౌమిత్రి వలికె:
“వినువీథి డాఁగిన వీనిచే నిట్లు
మనుజేంద్ర!చూచితే మర్కటోత్తములు
మన కొఱకై వచ్చి మడియుచున్నారు.
విస్మయంబుగ నింక వీనివంశంబు
భస్మంబు సేసెద బ్రహ్మాస్త్ర మేసి.”
యనవుడు నా రాముఁడనుజుతో ననియెఁ:
“జనునె యొక్కరునికై చంపఁబల్వురను!
నెఱుఁగవే రణధర్మ? మెందు రాజులకు
వెఱచి డాఁగినవారి, వెన్నిచ్చువారి,
ముకుళితహస్తులై మ్రొక్కెడువారిఁ,
జకితాత్ములై వచ్చి శరణన్నవారిఁ,
గదనంబులోఁబూరిఁగఱచినవారిఁ,
బిదప నాయుధములు ప్రిదిలినవారి,
నిద్రవోయెడువారి నిర్జింపఁదగునె?
భద్రంబుఁగోరు నా పరమపుణ్యులకు?
నధికమాయలఁబేర్చు నా యింద్రజిత్తు
వధియింపనోపెడు వానరోత్తములఁ
గామచారులఁబంపఁ గా757లంబుగాని
సౌమిత్రి! బ్రహ్మాస్త్రసమయంబు గాదు.”758
అని నీలు నంగదు ననిలనందనుని
ఘను759ని శతఘ్నుని గజుని గవాక్షు[వా.రా. సర్గ 45]
భరితవిక్రమధాముఁబనసుఁగేసరిని
శరభుని ఋషభుని సన్నాథుఁగ్రథను
మఱి గవయుని నలుమైందుని ద్వివిదు
నఱిముఱిఁగోపించి యసురపైఁబనిచె.
నటు రాఘవుఁడు పంప నగచరాధిపులు
పటుగతి మిన్నులపై కపు డెగసి
తరుశైలములు వైవ దర్పించిక్రూర
శరపరంపరల రాక్షసరాజసుతుఁడు
వారి నొప్పించిన వార లా దైత్యు
నే రూపమునఁగాన760కెప్పటి మగుడి
వచ్చిరి761రామభూవరుఁడున్నయెడకు
నచ్చెరువంది యింద్రాదులు సూడ.
విలయమేఘశ్యామవిపులగాత్రంబు
నలుకతోఁగెంజాయ నడరునేత్రములుఁ
గలఘోరరూపంబు గానరాకుండ
మెలఁగుచుఁబలికె నమ్మేఘనాదుండు:
“నరనాథసుతులార! నన్నుఁగయ్యమున
నరుదు లక్షింప సహస్రాక్షునకును;
మీ రెంతవా!”రంచు మిన్నెల్ల నద్రువ
ఘోరమ్ముగా ధనుర్గుణము మ్రోయించి
యశనిసంకాశంబులగు సాయకములు
దశరథాత్మజులపై762ఁదఱచుగాఁబఱపి
763మఱియును నందంద మర్మంబులందు
గఱులుచ్చిపోఁబెక్కుకాండంబు లేసి
యంతటఁబోవక యా యింద్రజిత్తుఁ
డంతకాకారుఁడై యాగ్రహంబునను
బటుతర నిర్ఘాత పాతభీకరతఁ
జటులతర క్రూరసర్పబాణముల
నినకులేశ్వరులపై నేయంగ వారు
ఘనబాణముల వాని ఖండించి వైచి
వానిమీఁదికి మఱి వరసాయకములు
పో నేయ వానినిఁబొడిసేసి యసుర
వెండియు నందంద వేగంబు మెఱసి
దండిశస్త్రావళి తఱచుగాఁబఱప
“నదె వచ్చె బాణంబులందేయు.”మనుచు
“నిదె వచ్చెబాణంబు లిందేయు.”మనుచు
నే దెస బాణంబు లేతెంచుచుండు
నా దెస 764ఁబ్రతిబాణ మందంద యేయ
“నురగసమేతులై యుండుట మీకుఁ
గరమొప్పదొల్లియుఁగల;దటుగాన
తరణివంశజులార! తప్పక యిపుడు
నురగసమేతులై యుండుఁ.”డన్‌ కరణి
బంధురంబుగ నబ్జబాంధవకులుల
బంధించె వెస నాగపాశసంతతుల.
వారును నా బ్రహ్మవరము మన్నించి
తారు రాక్షసునిచేఁదద్దయుఁ765దూలి
యాదినారాయణునంశజులైన
మేదినీపతులు నిమ్మెయిఁగట్టువడిరి.
“నేఁడు రాముఁడు 766గాక నిక్క మూహింప
నాఁడితఁడే వామనస్వరూపంబు
నటు తాల్చి భూదాన మడిగి యా బలినిఁ
బటుకృతఘ్నతఁబట్టి బంధించె. నట్టి
ఫలము రామున767కిప్డు ప్రాప్తంబు గాక
పొలియునే మనుజుఁడై పుట్టి768యుండఁగను”
769నని లోకమునఁబుట్టు నపవాదమునకుఁ
దను సృజించినమాయఁదాఁ గట్టువడియెఁ.
బన్నుగా మాయావిబంధంబువలనఁ
దన్నుఁదామఱచిన ధరణీశు నపుడు[వా.రా. సర్గ 46]
కనుఁగొని దివిజులు గడు విన్ననైరి;
వనచరోత్తములెల్ల వడి ఖిన్నులైరి.
ఖిన్నుఁడైయున్న సుగ్రీవునకపుడు
సన్నుతమతి విభీషణుఁడిట్టులనియె:
“నిది యేల చింతింప? నెట్టివారలకు
నొదవదే యాపద లొక్కొక్కవేళ?
నినకులేశ్వరులకు నేమయ్యె నిపుడు
ఘననాగపాశముల్‌ గట్టినంతటనె.”
యని పల్కి యతఁడు మాయాదృష్టిఁజూచి
కనియె రావణసుతు గగన మార్గమునఁ.
గని నీరు మంత్రించి కన్నులు దుడిచి
వనజాప్తసుతునకు వలనొప్పఁజూపె.
నా రవిజుండును నా విభీషణుని
చారుమహామంత్రశక్తిచేఁజేసి
యా యింద్రజిత్తుని నప్పుడు గాంచి
యాయతోన్నత770మగు నచలంబుఁబెఱికి
యెగసి వ్రేయఁగఁద్రుంచి యింద్రజిత్తుండు
మొ771గ దిరిగించె నమ్ములవెల్లి పఱపి.
యినజుండు తిరిగిన నినజుని772డాకఁ
గని మున్ను వెఱచు రాక్షసులు మోదింప
నప్పుడు విజయుఁడై యా యింద్రజిత్తు
ముప్పిరిగొనుముదంబునఁదన్నుఁగొలుచు
వారును దానును వడి లంక కరిగి
యా రావణునితోడ 773నప్పుడిట్లనియెఁ:
“జంపితిఁగపులను సర్పబాణములఁ
గంపింపఁజేసి తిక్ష్వాకువల్లభుల.”
నని యొప్పఁజెప్పిన నంతరంగమునఁ
దనయునిచేఁత కెంతయు సంతసించి
రావణుఁడప్పుడు రయమునఁద్రిజట
రావించి యనియె:“ధరాపుత్త్రి నన్ను[వా.రా. సర్గ 47]
నొల్లదు, రాముని నొడఁగూడు774కొనుట
యుల్లంబులో నమ్మియుండుటఁజేసి.
నేఁడింద్రజిత్తుచే నేలకు775వచ్చి
పోఁడిమి చెడి రామభూపాలుఁడునికి
సీతఁదోడ్కొనిపోయి చెచ్చెరఁజూపు
మీ తఱిఁబుష్పక మెక్కించి నీవు.
అంత రామునిమీఁద యాసలు దక్కి
చింతింప కిట నన్నుఁజేకొను సీత.”

  1. ↑వర్జించి
  2. ↑కొనఁగ - నప్పుడు పసిఁడితే రయ్యగ్నివలనఁ - బడసి యా తేరెక్కి…
  3. ↑రానీక
  4. ↑నెఱపి
  5. ↑యసమునఁబేర్చి
  6. ↑కశాఘాతరవము (ములును)
  7. ↑లీ రూపు లని కన నెన్నంగఁ
  8. ↑బడదు
  9. ↑డాసి డాఁగి
  10. ↑చిద్రపలై, గుల్లలై
  11. ↑ఁదగుఁ
  12. ↑ఇది యేమి వీనికై యెల్లరఁబట్టి - చదియంగ మోఁదుట సరవియే మనకు- నని…
  13. ↑జాంబవంతుని గంధమాదనుని
  14. ↑కెప్పుడో
  15. ↑రయమున వసుమతీస్థలికి
  16. ↑ఁదద్దయు, దలము
  17. ↑మఱలక యందంద మర్కటోత్తముల
  18. ↑లందు నుదగ్రులై, మగ్నులై యందంద
  19. ↑దగిలి
  20. ↑గాని
  21. ↑కెట్లు
  22. ↑నయపుడు
  23. ↑అని తమలోనఁదారాత్మలఁగుంది - యనిమిషుల్‌ ఋషులును నాశ్చర్యపడఁగఁ-గనుఁగొని దివిజులు… , అనినచందంబున నర్కవంశజులు - ఘననాగపాశసంకలితులై యున్నఁ- గనుఁగొని దివిజు…
  24. ↑సానువగునద్రిఁ బె
  25. ↑గిఁ
  26. ↑రాక
  27. ↑ననె నింద్రజిత్తు
  28. ↑కొఱకు-ను
  29. ↑నొఱగి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )