| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
అని పేర్చి పలుకుచో నా మాటలెల్ల వినియు మందోదరి వెస మాల్యవంతు కరము చేపట్టి డగ్గఱి దైత్యవనిత లిరుదెసఁగొలువంగ, నెంతయు వేడ్క నతికాయుఁడును దోడ నరుగుదేరంగఁ, బ్రతిహారు958లురువడి బలసి యే తేర, నాయుధహస్తు లంతంతట గొలువఁ, బాయక చామరప్రతతులు పొలయ, సకలభూషణరుచిజాలంబు వెలుఁగ, సకలమంత్రులు తో959న చనుదెంచుచుండఁ, గడునొప్పు నీలమేఘములోని మెఱుపు వడుపునఁజొచ్చె రావణుసభాస్థలము. నాసతి నప్పు డర్ధాసనాసీనఁ జేసి రావణుఁడు విశేషప్రియోక్తి నుచితపీఠంబుల నుండంగఁబనిచె నచలితమతులగు నమ్మంత్రివరుల; మ్రొక్కినయతికాయు మోదంబుతోడఁ దక్కక యునిచె నొద్దన గద్దెయందు. నంత నక్కొలువెల్ల నలబలం బడఁగ నింతితో నా దానవేశ్వరుం డనియెఁ: “గొలువులోపలి కిటు కువలయనేత్రి! తలఁప నెన్నఁడు రాని దానవు నేఁడు వడవడ వడఁకుచు వచ్చుటయెల్లఁ గడుఁజోద్యమైనది కారణంబేమి?” యనిన మందోదరి యాత్మేశుఁజూచి: “దనుజేశ!నాకు రాఁ960దఱి యయ్యెఁగాన వచ్చితి నేఁడు నావచ్చుట కెల్ల నిచ్చలోపలఁగడు నెగ్గుసేయకుము. అనిలోన ధూమ్రాక్షుఁడాదిగాఁగల్గు మనవారు దనుజేశ! మడియుట కంటె! యల జనస్థానంబునందు రాక్షసుల నలిఁదునిమెను బదునాలుగువేల; సరి ఖరత్రిశిరులఁజంపిన961 వాఁడు నరుఁడు గాఁ962డంటి నా నరనాథు; రాముఁ డలిగి వెండియు దండకారణ్యమునను బలవంతుఁడైన కబంధు నిర్జించె; మారీచు వధియించె మాయఁబోనీక; ఘోరాస్త్రమున వాలిఁగూలంగ నేసె; దేవహితార్థమై తివిఱి రాఘవుఁడు భూవలయంబునఁబుట్టినవాఁడు; ఆదినారాయణుం డతఁడు; గాఁడేని మేదిని నింతటిమిక్కిలి నరుఁడు గలుగునే? మఱి కఱకంఠుని చాప మలవొప్ప విఱిచెఁబ్రఖ్యాతంబు గాఁగఁ; దమ తండ్రిపనుపునఁదపసియై సత్య సమయంబుతో వనస్థలి963నున్నయంత సీతఁదెచ్చితి వీవు; శ్రీరామచంద్రుఁ డే తెఱంగున నీకు నెగ్గేమి సేసె? రామలక్ష్మణులతో రణ మొనరింప నీ మూఁడుజగముల నెవ్వరు గలరు నలి సామభేదదానంబులు సూపఁ గలిగిన 964దండంబు గాదు పాటింప. దండంబుఁబాటింపఁ దలఁచెదవేని దండింపఁ బడుదురె దశరథాత్మజులు? దేవ! రాముఁడు పరదేవత గాన నీవు మ్రొక్కుటయెల్ల నేరంబు గాదు. శరణన్నఁ జేకొను; శర ణన్న నీకు నురుశుభం బగుఁగాని యొక కీడుఁగాదు. గుణరూపదాక్షిణ్యగుణ965గణకేళి గణుతింప నలవియే కాకుత్స్థరాముఁ. డలిగిన నిలువ రింద్రాదిదేవతలుఁ; దలఁపవయ్యెదు! నీదు తరము గాదెందు. వలదు; వృథాగర్వవహ్నిఁ గూలకుము; చల మొప్ప; దొప్పదు; సంతాపముడిగి యింకనైనను సీత నిచ్చుట మేలు. లంకేశ! కులమును లంకయు966 నిలుపు. మహనీయవాహనమణిభూషణాది సహితంబుగా నీవు జానకి నిచ్చి యూపాక్షు నతికాయు నొగి మాల్యవంతు భూపాలుపాలికిఁబుచ్చు సంధికిని. మతిమంతుఁడగుచున్న మన విభీషణుఁడు హితబుద్ధిఁగావించు నీ సంధి మనకు. వేయు నేటికిఁ? గార్తవీర్యుతో సంధి సేయవే? యతని గెల్చిన భృగురాము గెలిచిన రాముండు కీర్తిధాముండు తలపోయ సంధికిఁదగఁడె చర్చింప?” |