| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
డఱిముఱి హనుమంతుఁడటు కూలుటయును నెఱసి రావణుఁడంత నీలుపైఁగవిసె. హనుమంతుఁడును మూర్ఛయంతలోఁదెలిసి దనుజుండు నీలుపైఁదఱుముట సూచి 1014యటుపోవఁదగదని యంతట నిలిచె. నటు1015దన్నుఁగిట్టి పెల్లార్చుచునున్న మనుజాశనునిమీఁద మలయశృంగంబు గొని వైచె నీలుండు గోపించి పేర్చి. నడుమనె తునుమాడె నాకారి దాని నెడపనికడఁకతో నేడమ్ము లేసి. వెండియు నీలుండు విపుల1016వక్షంబుఁ గొండలుఁదరువులుఁ గొనివైచుటయును వాని నన్నింటి రావణుఁడు చూర్ణంబు గా నిశితాస్త్రసంఘంబులుఁదునిమి నీలునిమేనఁబెన్నెత్తురు లొలుక వాలినయమ్ములు వడిఁబెక్కు లేసె. నేసిన నొచ్చియు నింత గైకొనక గాసిల్లి నీలుండు గడులాఘవమున 1017ధారుణి దైత్యులు దల్లడం బంద వీరుఁడై దానవవిభు తేరి కుఱికి పొలుపొంద నప్పు డద్భుతశక్తి మెఱసి నిలిచి యచ్చలమున నిగుడి యుప్పొంగి వడిఁబేర్చి1018 యా రథధ్వజమున కెగసి పొడిచేసి చాపాగ్రమునకు లాగొప్ప నెగసి చలంబున నెక్కెడలించి మగుడి రావణుఘనమకుటముల్ ద్రొక్కి యురుభుజనిజవిక్రమోన్నతి మెఱసి సురసిద్ధసాధ్యులు 1019సోద్దెంబు నొంద నొక మౌళిపై నుండి యొక మౌళి 1020వ్రేసి యొక మౌళిపై నుండి యొక మౌళియూఁచి యొక మౌళిపై నుండి యొక మౌళి డుల్చి యొక మౌళిపై నుండి యొక మౌళిఁదన్ని మకుటంబులన్నియు మట్టిమల్లా1021ర్చి యకలంకుఁడై నీలుఁడంతట పోక వారక తనుఁబట్ట వచ్చిన సూక్ష్మ మై రావణునిఁ జూచి యందంద నగుచు గొడగులు సించి గ్రక్కున మీఁదఁ ద్రోచి పొడిగాఁగఁ జామరంబులు ద్రుంచివైచి విఱుగంగ నరదంబు వీఁకఁదాటించి కఱకఱితోడ నుత్కంఠ దీపింప దనుజేశు నురుముష్టిఁదాఁచి హారములు పెనఁచి రాఁదిగిచి యా పృథులవక్షంబుఁ జఱచి యందంద యుత్సాహంబు మెఱసి1022 యుఱక యీ గతి నాడుచుండుట చూచి తరుచరసేనలు దైత్యసేనలును బొరిఁబొరి నద్భుతంబుగఁజూచుచుండ వెఱఁగంది రా రామవిభుఁడు లక్ష్మణుఁడు. మఱి రావణుండును మహితాగ్నిశరము నయ్యెడ నారితో నలుక సంధించి యయ్యగ్నిసుతుతోడ ననియె మండుచును: “నీలాఘవము లెస్స; నిన్ను మెచ్చితిని. నీలాఘవమె నాకు నెడపక చూపు; మిదె వచ్చె నా బాణ మినవహ్నిరుచుల; బ్రదికెడు చందంబుఁబరికించికొనుమ.” యని యేయుటయు నీలుఁడగ్ని బాణమునఁ దనువెల్ల మండుచు ధరణిపైఁబడియె. నగ్నిపుత్త్రుఁడు గాన యా తీవ్రశరము 1023నగ్నిచేఁజావక యవశుఁడై యుండె. |