| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
యప్పుడు సుగ్రీవుఁ“డని సేయ నాకు నిప్పుడు తఱి.”యని యిచ్చఁజింతించి కులశైలపతిమీఁదఁ గోపించి వచ్చు బలభేదిపగిది నప్రతిమవిక్రముఁడు పొరిఁబొరి సర్వాంగములు వెంచి పేర్చి పరుషరోషానలప్రభ లుప్పతిల్లఁ గొండలకెల్లను గొండయైనట్టి కొండనా నొకపెద్దకొండ సేపట్టి క్రోఁతులనెత్తుటఁ గొమరారఁదోఁగి మూఁతియుఁదనువును ముదుకయై తోచి వీక్షింప నరుదైన వేషంబుతోడి రాక్షసాధీశుపై రయమున వచ్చి: “న న్నెఱుంగవె యేను నలినాప్తసుతుఁడ; సన్నుతుండగు రామచంద్రునిబంట; నీకు నాకును గాక నిష్ఠురయుద్ధ; మీ కపికోటుల నేల చంపెదవు?” అని పేర్చి సుగ్రీవుఁడాడు వాక్యములు విని కుంభకర్ణుండు విపులకోపమున “సుగ్రీవ! కడు నిన్ను శూరుండ వందు; రాగ్రహింతురె శూరు లని1227వేళఁగాక! శూరత రణమునఁజూపుదుగాని యూరక వెడమాట లొప్పునే నీకు.” ననిన రాక్షసుమీఁద నర్కనందనుఁడు కినిసి తాఁదెచ్చినగిరి యెత్తి వైచె. వైచిన నది వాని వక్షంబుఁదాఁకి చూచునంతటిలోనఁజూర్ణమై రాలె; నా1228బెడిదంబున కార్చె నిర్వాగు. నా బల్లిదునిచేత నసుర స్రుక్కియును దడయక యత్యంత ధైర్యంబుతోడఁ గడుభయంకరవృత్తి గాఁగఁ బెల్లార్చి వాసికెక్కిన యిరువదివేల తలలఁ జేసి గంధాక్షతార్చితమూర్తి నొప్పు శూలంబు, నిర్జరాసురులకునైనఁ దాలుప వ్రేగైనదాని నా క్షణమె సుగ్రీవుమీఁద వైచుటయుఁబెల్లేచి యుగ్రంపుమంటల నుజ్జ్వలంబగుచు నేలయు నింగియు నిఖిలదిక్కులును జాలంగ దరికొని సాగి మండుచును బదివేలపిడుగుల పగిది మ్రోయుచును వదల కర్కజుమీఁద వచ్చుట సూచి ఘనవిషజ్వాలోరగప్రభుఁబట్టి వినతాత్మజుఁడు ద్రుంచువెరవు దీపింప నెడ సొచ్చి హనుమంతుఁడేపార నొడిసి కడుఁబెక్కు తునియలుగాఁద్రుంచివైచి కుప్పించి దాటి యెక్కుడుపేర్మి నార్చె నప్పుడు వానరు లందంద పొగడ. శూలంబు విఱుగుట సూచి కోపించి యాలోన వేగ నయ్యసురేశ్వరుండు కనలుచు వచ్చి లంకామలయాద్రి ఘనశృంగ మెత్తి యర్కజుమీఁద వైచె. నుగ్రంబుగా నది యురముఁదాఁకుటయు సుగ్రీవుఁడపుడు రోఁజుచు నేలఁబడియె. నాతఁడు వడుటకు నఖిలరాక్షసులు చేతోగతులయందుఁజెలఁగి యార్వంగఁ గుంభకర్ణుం డతిక్రూరుఁడై వచ్చి కుంభినిఁబడియున్న గురుసత్త్వధనునిఁ గనుఁగొని:“తలపోయఁగపిబలంబునకు నినకులేశ్వరునకు నీతఁడే లావు. ఈతఁడు వడుటయె యెల్ల వానరులు నాతతగతిఁబడు; టది సెప్పనేల? |