ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
శ్రీరాముఁడు కుంభకర్ణునిఁ జంపుట
“డోరి! రాక్షస! నొదుఁగంగ రాదు;
ధీరుండవై యింకఁ దెగువ వాటించి
యమరులు మెచ్చంగ నమరి నా యెదుర
సమరంబు సేయంగఁజక్కఁగా నిలువు.
మటుగాక కపటుండవై మాయ వన్ని
యెటువోయినను నిన్ను నేల పోనిత్తుఁ?
“గావవే!”యని పోయి కమలజుఁగన్నఁ
గావ; నా బ్రహ్మలోకము నాకు నెదురె?
“కావవే!”యని పోయి కఱకంఠుఁగన్నఁ
గావ; నా రుద్రలోకము నాకు నెదురె?
“కావవే!”యని పోయి కమలాక్షుఁగన్నఁ
గావ; నా విష్ణులోకము నాకు నెదురె?”
యని పేర్చి పలికిన నా రాముపలుకు
విని కుంభకర్ణుండు విపుల1282ంబు గాఁగ
దిగులొంది యగచరాధిపులగుండియలు
పగిలి నిల్వులతోడఁబ్రాణముల్‌ వోవ
జగతీతలము నాకసము దిక్కులెల్ల
నగల రాక్షసుఁడట్టహాసంబు సేసి
నలువొంద నా రామనరనాథుఁజూచి
పలికె1283నద్భుతరణప్రౌఢి దీపింప:
“వెడఁగుమాయలు వన్ని వెఱచి నీ చేత
మడియంగ మారీచమనుజాశిఁగాను
రయమున నీ చేత రఘురామచంద్ర!
భయమునఁజావఁ గబంధుండఁగాను.
అనిమొన నొక కోల నవనిపైఁ గూల
నినకులాధీశ్వర! యే వాలిఁ గాను.
జేతివిల్లిచ్చి నీచే భంగమొందఁ
బూతాత్ముఁడగు భృగుపుత్త్రుండఁ గాను.
గరమొప్ప నీ శరఘట్టనచేత
ధరణిపైఁగూల నేఁ దాటకఁ గాను.
రావణుతమ్ముఁడ; రాక్షసేశ్వరుఁడ;
దేవకంటకుఁడను; దీప్తవిక్రముఁడ;
నన్నెఱుంగవె రామ! నగచరకోటి
క్రొన్నెత్తు రానిన కుంభకర్ణుండ!
నెఱుఁగ1284ని బ్రహ్మయు నింద్రుండు నిన్నుఁ
గఱపిన బేలవై గర్వించి పుట్టి
యీ తరు1285చరకోటి నేమని నమ్మి
నా తోడి యుద్ధంబునకు వచ్చితీవు?
ఘనమైన యట్టి రాక్షసభాషణములు
సనకాదియోగీంద్రసన్నుతుల్‌ గావు;
ఉరువడిఁబఱతెంచునుగ్ర శస్త్రములు
పరిచారచామరప్రతతులు గావు;
చలమున నార్చు రాక్షసభటోత్తములు
నలిఁబాడు తుంబురునారదుల్‌ గారు;
వ్రాలుచు నీ మీఁద వచ్చు నా గాలి
యాలవట్టంబుల యనిలంబు గాదు;
యుద్ధరంగం బమృతోదధి గాదు;
యుద్ధంబు నీ కొలువుండుట గాదు;
ఇట్టేల పుట్టితి? వీయాజిలోన
నట్టి సౌఖ్యము నీకు నవనీశ! కలదె?
యది సెప్పనేల?1286ని న్ననియెడి దేమి?
యిదె చూడు నా గద యెట్టిదో రామ!
దీనఁబో గెలిచితి దేవ సంఘముల;
దీనికి సాటియే దివ్యాయుధములు!
బలమును శౌర్యంబు బాహువిక్రమము
గలదేని ఘోరాజిఁగదియుము నన్ను.
నెఱయ నీ1287యందలి నిజశక్తిఁజూచి
మఱి నిన్నుఁజంపెద మానవాధీశ!
యనుటయు రఘురాముఁడలిగి వేగమున
ఘనశిలీముఖములు గడుఁబెక్కువేలు
ఆ వాలి నేసినయట్టి బాణములు
దేవకంటకుమీఁదఁ దివిఱి యేయుటయు
జలబిందువులు గ్రోలు చాతకం బనఁగ
బలువిడి నా బాణపంక్తులు గ్రోలి
కరముగ్రమైన ముద్గరముఁద్రిప్పుచును1288
బరువడి వానరపతులఁదోలుచును
నెదురుగాఁజనుదెంచు నింద్రారిఁజూచి
మది లెక్కసేయక మానవేశ్వరుఁడు
కవిసి యుద్భటగదాకలితహస్తంబు
నవలీలఁ1289దెగసేసె1290ననిలబాణమున.
దాని పాటునకుఁగొందఱు తరుచరులు
నానా విధంబుల నలుగడల్‌ చనిరి;
అది మీఱి పాఱంగ నలవి గాకున్నఁ
జిదిసి వానరులు సచ్చిరి దానిక్రింద.
నున్న దాపలిచేత నొక పెద్దవృక్ష
మన్నరభోజనుం డవలీలఁబెఱికి
యింద్రాదు లదరఁబెల్లేతేర రాముఁ
డైంద్రబాణంబున నదియును ద్రుంచె.
నా భూరితర బాహు వమరు లుప్పొంగ
భూభాగ మగల నద్భుతముగాఁదునిసి
పెక్కండ్రుకపులు నిర్భిన్నులై క్రింద
నొక్కటఁబడి కూల నుర్విపైఁబడియె.
నిటు రెండుభుజములు నినకులేశ్వరుఁడు
పటు బాణములఁద్రుంప బల1291మఱ కపుడు
కడిఁదివజ్రమున రెక్కలు ద్రుంపఁబడిన
నడగొండయునుఁబోలె నలి నార్చియార్చి
చేతులు ముక్కునుఁజెవులును లేక
యాతతంబుగ వికృతాకారుఁడగుచు
నరుగుదెంచుచునున్న యా కుంభకర్ణు
నురువడిఁగనుఁగొని యుర్వీశ్వరుండు:
“దురమున నీ నీచుఁ ద్రుంతుఁగా!”కనుచు
సరభసంబున నర్ధచంద్రబాణములు
తెగ నిండ రెండు సంధించి ఖండించె
జగములు మెచ్చఁదచ్చరణయుగ్మంబుఁ.
బదములు దెగియును బాహువుల్‌ దెగియుఁ
గుదియక యత్యుగ్రకోపుఁడై నడచి
బడబాగ్ని1292 చక్రంబుపగిది నాననముఁ
గడు నేచి వికృతంబుఁగా 1293వించుకొనుచు
బలువిడి భాస్కరుఁబట్టెడు రాహు
నలవాటు గైకొని యా రాముఁగదిసెఁ.
గదిసిన నా కుంభకర్ణునినోరఁ
బొదిలోని నిష్ఠురభూరిబాణముల
నినకులేశ్వరుఁడేసె నేర్పడ నొక్క
దొనకోల లింకొకదొనఁజొన్పుకరణి.
ఘనమైన యా యంపగమి నోరు నిండ
దనుజుండు సింహనాదము సేయరాక
యేపార వికృతంపు టెలుఁగుహుంకృతులుఁ
జూపులజంకెలుఁజూపుచు వచ్చె.
వచ్చిన నా దైత్యవల్లభు1294మేన
నచ్చుగా దృష్టించి యైంద్రాస్త్ర మేసెఁ.
బ్రదర మిమ్మెయి రఘుప్రవరుఁడేయుటయు
నది ఘర్మమధ్యందినాదిత్యుపగిదిఁ,
దలపోయ నా బ్రహ్మదండంబురీతి
బలితమై నిగుడెడు పవనంబుకరణి
నెఱయ లోకములెల్ల నిండ నొండొంట
నెఱమంట 1295లొలుకుచు నేపుతో వచ్చి
కుంభకర్ణుని రొమ్ముఁగొని యుచ్చిపాఱి
కుంభిని నాటె దిక్కులు మ్రోయుచుండ.
నంతలో మఱియును నా రాఘవేంద్రుఁ
డంతక బాణమత్యంత వేగమున
సంధించి యేసిన సకలదిక్కులును
బంధురంబుగ మ్రోయ బ్రహ్మాండ మవియఁ
బ్రకటంబుగా భూమి పటపటఁబగుల
సకలభూతంబు1296లు సంచలింపంగఁ
గలయంగ శతకోటికాలచక్రములు
బలుపెక్కి యొక్కటై పఱతెంచుభంగి
వాలిన బడబాగ్ని వడి వచ్చుకరణిఁ
గాలకూటంబు మార్గణమైన పగిది
విచ్చలవిడిఁబర్వి వేగంబు మెఱసి
వచ్చి యా బాణంబు వడిఁద్రుంచి వైచెఁ
బటునీలగిరిశృంగభాతితో నున్న
కుటిలరాక్షస తల ఘోరంబుగాఁగఁ.
బుడమిపై నా దైత్యపుంగవుశిరము
పడక యా లంకలోపల1297ఁగనుపట్టు
పొడవైన గోపురంబులును మేడలును
బొడిపొడియై రాలిపోవఁ దాఁకుచును
జని మహాధ్వనితోడ జంతుసంతతుల
మునుకొని చదుపుచు మునిఁగె నంబుధిని.
బదికోట్లయగచర పతులోలి మ్రంద
నుదధిలో జలచరయూధముల్‌ చదియ
వసుధపై సగమును వనధిలో సగము
నసురదేహము గూలె నద్భుతంబుగను.
నా రవంబున నబ్ధులన్నియుఁగలఁగె;
ధారుణి వడఁకె; దిక్తటములు వగిలె;
లంకాధినాథునుల్లము వ్రయ్యలయ్యె;
లంకలోనెల్లఁ గోలాహలంబయ్యె;
జగములు మోదించె; సంతోషవార్ధి
నగచరాధిపు లోలలాడి రందంద.
రవికు1298లాధీశ్వరు రఘురామచంద్రు
వివిధభంగుల సరల్‌ వినుతించి రపుడు.
ఘనుఁడు రాముఁడు కుంభకర్ణు1299డీల్గుటకు
దనలోనఁజిఱునవ్వు దళుకొత్తుచుండ:
“దేవసంఘములకు దిక్పాలకులకు
భావింప నెక్కు డీ పడిన రాక్షసుఁడు.
ఇంక లోకములకు నెన్నండు నొండు
శంకలే.”దని మది సంతోషమంది
యప్పుడు కరమర్థి నాహవలక్ష్మి
నుప్పొంగఁగైకొని యుజ్జ్వలుండయ్యెఁ
గడు వడి రాహువు గబళించి పిదప
విడిచిన వెలుఁగొందు విమలార్కుపగిదిఁ.
దదనంతరంబ యా దానవకోటి
మదిలోన నెవ్వగ మల్లడి గొనఁగ1300[వా.రా. సర్గ 68]
విన్ననై వదనముల్‌ వెలువెలఁబాఱ
నున్నరావణుఁగాన నురువడిఁబోయి:1301
“దేవ! నీ తమ్ముడు త్రిదశాంతకుండు
వావిరి నగచరావళినెల్లఁ దోలి
దెసలు భూభాగంబు దివియుఁ దానగుచు
నసమసాహస1302మహాహవకేళి వ్రాలి
నెలకొని దుగ్ధాంబునిధి మందరాద్రి
కలఁచి యాడెడు క్రియఁగపికులాంభోధి
నిక్కడక్కడ సేసి యింద్రాదులెల్ల
వెక్కస1303పడఁబోరి వివశుఁడై తూలి
యంత శ్రీరామునియధికబాణాగ్ని
నెంతయు దగ్ధుఁడై యిలమీఁదఁద్రెళ్లె.”
నని కుంభకర్ణుఁడయ్యని1304లోనఁబడుట
దనుజులు సెప్ప నా దానవేశ్వరుఁడు
తనపాటు నింకఁదథ్యంబన్న కరణిఁ
గొనకొన్న మూర్ఛచేఁగుంభినిఁబడియె.
నతికాయుఁ1305డపుడు శోకాయత్తుఁడయ్యె;
ధృతిదూలి శోకించె దేవాంతకుండు;
దిక్కుదప్పినమాడ్కిఁద్రిశిరుండు నొరలెఁ;
దక్కక యా నరాంతకుఁడు మ్రాన్పడియె;
దనుజవీరులు మహోదరమహాపార్శ్వు
లును మహాశోకవిలుంఠితు లైరి.
బలు మూర్ఛ నంతటఁబాసి రావణుఁడు
పలుమాఱుఁదమ్మునిఁబలవింపఁదొడఁగె:

  1. ↑కోపమున
  2. ↑నుద్భట
  3. ↑క
  4. ↑చరునమ్మి యినకులేశ్వరుఁడ
  5. ↑నిన్నడిగెడి
  6. ↑యందుల
  7. ↑నఱిముఱిఁగోపించి యమరారి మీఁదఁ- గలఁగొన వచ్చెను గడువేగమునను - బలువడి వానర…
  8. ↑బడ
  9. ↑యామ్య
  10. ↑భేది చేతఁ - గ
  11. ↑వక్త్రంబు
  12. ↑నిచ్చు
  13. ↑ఁజంప
  14. ↑లుమియుచు
  15. ↑ల చైతన్య మెడలఁ
  16. ↑వడిఁ బడియెఁ - బదికోటులగ…
  17. ↑లాంబుధిచంద్రు
  18. ↑నిఁజూచి
  19. ↑నున్నతసింహాసనోరు పీఠమున - విన్ననై…
  20. ↑విన్నవించిరి. వారు వినతులై కదిసి - దేవ…
  21. ↑బలా
  22. ↑పడి పాఱి వివశులై తూల -నంత…
  23. ↑మొనఁ
  24. ↑డధిక
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )