| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
అని లక్ష్మణుఁడు వల్క నా విభీషణుఁడు తన మది నూహించి దరణీశుఁదేర్చి:[వా.రా. సర్గ 84, 85] “యా యింద్రజిత్తు మాయయె కాని సీత కే యపాయంబును నిటుకాదు నమ్ము. ఖలుఁడైన యా పంక్తికంఠుండు దలఁచు తలఁపు నే నెఱుఁగుదు ధరణీశ! వినుము: ‘జానకి నొప్పింపు జనపతి.’ కనుచు నే నెన్ని చెప్పిన హితవుగాఁగొనఁడు; జనకనందన నేల చంపించు నతఁడు? మనుజేశ! యిది వాని మాయగా1704నోపు. నట్టిదయైన నో యవనీశవర్య! నెట్టన పొలియవే నిఖిలలోకములు. నిది బొంకు; చింతింప నేల? యా సీతఁ బదిలంబుగాఁజూచి ప్రతివార్తఁదెత్తు.” నని రాముననుమతి నవ్విభీషణుఁడు తన రూపమంతయు దాఁచి వేగమున నలి రూపుగైకొని యసురేశువనముఁ దలఁకక చొచ్చి సీతను గాంచి మరలి వచ్చి యా రామభూవరునకు మ్రొక్కి యచ్చపుభక్తితో నంతయుఁజెప్ప విని:“విభీషణ! యిట్టివిధ మేల సేసె ననిలోన నింద్రజి?”త్తన నాతఁడనియె: “దనుజుఁ డా సురహోమతాత్పర్యబుద్ధిఁ జనుటకునై యిట్టిచందంబు సేసె. హనుమంతుఁడాదిగానగచరకోటి మనములు గలఁచి యిమ్మాడ్కిఁబుత్తెంచి ‘తన హోమవిఘ్నంబు తగఁజేయువార లనయంబు నింక లే.’రని నికుంభిలకు నరిగినవాఁడు వాఁ;డచట హోమంబు పరిసమాప్తము గాఁగఁ బటునిష్ఠ నేఁడు తన హోమతంత్రమింతయుఁజిక్కకుండ మనుయుక్తి నవధానమతిఁజేసెనేని దేవదానవులైన దృష్టించి నిలిచి యా వీరవరు నెవ్వ రని గెల్వఁజాల. రటుగాన యీ లోన నసురవేలిమికిఁ బటుగతి విఘ్న1705ంబుఁబాటింపవలయుఁ. జనియెద మే మిదె సైన్యంబుతోడ; మనుజేశ పంపు లక్ష్మణుఁదోడు మాకు. సౌమిత్రి యనిలోనఁజండకాండముల భూమిపైఁబడనేసి పొలియించి మించి నేఁడింద్రజిత్తుని నృపవర! గెలుచు. వాఁడు నికుంభిలవనములోపలను దపముఁగైకొన్నాఁడు దశకంఠసుతుఁడు తపము నిండకమున్నె దండింపకున్న బ్రహ్మమెప్పించి యా పరమేష్ఠివలన బ్రహ్మశిరంబను బాణంబు విల్లుఁ గవచంబు ఖడ్గంబుఁగవదొనల్ మఱియు నవిరళమంత్రపూతాస్త్రముల్ వడసి కామగాశ్వయుతంబుఁగమనీయకేతు భీమంబు మారుతస్ఫీతవేగంబు నగురథం బా యగ్ని యందు వెల్వడినఁ దగ నా రథంబెక్కి ధనువందెనేని నా వాసవారాతి నాలంబులోన దేవాసురాదులు దృష్టింపలేరు. వానికి నిమ్ముల వర మిచ్చునప్పు డా నీరజాసనుండతని నీక్షించి: “నీవు నికుంభిల నెఱయ హోమంబుఁ గావించితేని యే గతి నజేయుఁడవు; కావించుహోమంబు గడమగునేని రావణాత్మజ! నీవు రణములోపలను బగఱచేఁ1706బడు.” దని పలికిన వాఁడు. జగతీశ యటుకాన1707సమరయత్నంబు చేయించి నేఁ డింద్రజిత్తుఁజంపింపు. మాయావి యగు వీఁడు మడిసినఁజాలు నమరకంటకుఁడగు నద్దశాననుఁడు సమరంబులో1708పలఁజచ్చినవాఁడు.” |