| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నంత నక్కడ దానవాంగనలెల్ల నంతంతఁ బెనుమూఁకలై లంకలోనఁ[వా.రా. సర్గ 95] బొరిఁబొరి శోకాగ్నిఁబొగులుచుఁబలికి: “రరయ జగన్నింద్యమగు చరిత్రంబుఁ బ్రాయిఁడి మోమును బలితరోమంబు నై యున్న శిరము నత్యాయతోదరము వికృతవేషంబును వికృతయౌవనముఁ గ్రకచోగ్రదంష్ట్రలుఁగలుగుశూర్పణఖ సకలగుణోజ్జ్వలు సత్త్వసంపన్ను సుకుమారు నురుతేజు సుముఖు నా రాముఁ గందర్పసురుచిరాకారుఁగామించె. నందని1866పంటికి నఱు సాఁపఁదగునె? యీ లంకలోఁగల యెల్ల రాక్షసులుఁ గాలగోచరులైన కారణంబునను భానువంశజు1867నకుఁబంక్తికంఠునకు నా నిశాచరి సేసె నధికవైరంబు. తగవు చింతింపక దాని మాటలకుఁ బగగొని తెచ్చె నీ పంక్తికంధరుఁడు. తన చావునకె కాదు, ధరణీశు దేవిఁ గొనివచ్చె రాక్షసకులమెల్లఁ జెఱుప. నింతట సిద్ధించెనే సీత దనకు? నింత తెంపునకుఁదా నితఁడేల 1868తొడఁగె? మారీచు నొక కోల మడియించె;దండ కారణ్యమునఁజంపెఁ1869గనలి విరాధు; నిది యెఱింగియు రాము నెఱుఁగలేఁడయ్యె మదిలోన గర్వించి మన రావణుండు. అనలసమానంబులగు సాయకముల జననాయకుఁడు జనస్థానంబునందుఁ బదునాల్గువేవురఁబరిమార్చి రోష మొదవంగ నేచి యత్యుగ్రబాణములఁ ద్రిశిరు దూషణు ఖరుఁదృణలీలఁజంపె; దశకంఠుఁడదియును దలపోయఁడయ్యె. రుధిరాశనుని నతిక్రూర1870విక్రముని నధి1871కయోజనబాహు నా కబం1872ధకునిఁ గ్రౌంచవనంబునఁగడ తేర్చి పుచ్చి రంచితవిక్రములైన దాశరథు. లిట్టిరాక్షసుల1873చా వెఱిఁగియుఁదొడరె నట్టిరాముని గెల్వ; నలవియే తనకు? జగతీశుఁడగు రామచంద్రుతోఁబోర మగఁటిమి గలిగెనే మన రావణునకు? నవలీల వాలి నొక్కమ్మునఁగూల్చి రవిజుఁగిష్కింధకు రాజుఁగావించెఁ! గరిసహస్రములు నగ్గలము లౌ పెక్కు తురగలక్షలు రథస్తోమకోటులును గణనకు మిక్కిలి కాలుబలంబు నణుమాత్రముగఁజంపె నాజిరంగమున; నధికపరాక్రము నా కుంభకర్ణు వధియించె నెక్కటి వసుధేశ్వరుండు. నట్టి పరాక్రమంబదియెల్లఁగనియు “నిట్టివాఁ’డని రాము నెఱుఁగలేఁడయ్యె. నా మేటి నతికాయు నా యింద్రజిత్తు సౌమిత్రి యొక్కఁడె సమయించె నాజి. నింకనైనను రాము నిట శరణనఁడు. లంక1874నింటింట విలాపముల్ వుట్టెఁ. “దమబంధు లీల్గిరి; తమ మగల్ దెగిరి; తమ సుతుల్ మృతులైరి; తమ సహోదరులు హతులైరి రణభూమి.”నని యెల్లవారు నతిశోకమునఁబొంది యడలుచున్నారు దుర్మతియును1875 నీతిదూరుండుఁగ్రూర కర్ముండునై నాఁడు కపటరూపమున సీత నీ పురికిఁదెచ్చిననాఁటనుండి తోతెంచుచున్నవి దుర్నిమిత్తములు. దశకంఠుఁడింక నీ దశరథసుతుని విశిఖాగ్నిఁగూలుట 1876వేగంబె నిక్క. 1877మక్కటా!1878నీతిజ్ఞుఁడగు విభీషణుఁడు పెక్కు భంగులఁజెప్పెఁబ్రియముతో బుది. నతఁడు సెప్పిన బుద్ధులన్నియు నాఁడు హితవుగాఁగైకొన్న నీ లంక చెడునె? కులశైలవృక్షముల్ కులిశఘాతమున నలుకమైఁదునుమాడు నా పురందరుఁడొ? మధుకైటభాదుల మర్దించినట్టి యధికుఁడా విష్ణుఁడో, యదయుఁడంతకుఁడొ? ప్రళయకాలమునాఁటి ఫాలలోచనుఁడొ యిల రాముఁడై పుట్టి యిట చంపఁదొడఁగె! దశరథతనయుండు దర్పంబు మెఱసి దశకంఠు ననిలోనఁదగఁజంపునపుడు ఘనులగు సురలైన గంధర్వులైన మునులైన వీనికి మును వరంబిచ్చు వనజసంభవుఁడు శర్వాణీశుఁడైన వినుఁడు రాక్షసులైన విడిపింప1879ఁగలరె? వరమిచ్చు నప్పు డా వనజసంభవుఁడు నరులచే1880 దెగకుండ నాఁడీఁడుగాన పరికింపఁగా 1881నిజ1882బంధులతోడ ధరణీశుచేఁ జచ్చు దశకంధరుండు. యిది నిజం; బెట్లన్న: నింద్రాదిసురల మది దయలేక పల్మాఱు నొప్పింప నీ రావణునిచేత నెంతయు నొచ్చి నీరజాసనుఁగాంచి నిఖిలదేవతలు నభయంబు వేఁడిన నా చతుర్ముఖుఁడు శుభ1883తరస్థితి వారిఁజూచి యిట్లనియె: “నే బాధలును జెంద విటమీఁద మీకు; మీ బుద్ధి వర్తించి మీరుండుఁడెలమి.” నని వారుఁదాను మహాదేవు కడకుఁ జని ప్రస్తుతింపఁ బ్రసన్నుఁడై శివుఁడుఁ గమలాసనాదులఁగరుణ వీక్షించి “యమరరక్షార్థమై యఖిలరాక్షసుల సమరంబులోపలఁ జంపించుకొఱకు నమర నిందిర వుట్టు నా సతీమణికిఁ బతి యయి ప్రజల నాపద లొందకుండ సతతంబుఁగావ దుర్జనుల రాక్షసులఁ జంపంగ విష్ణుండు జన్మించుఁబుడమి నింపార.”నని యానతిచ్చె. రాముండె యరయంగ నా విష్ణుఁ; డా మహీజాత పరికింప నిందిర; భావంబులోనఁ దలపోయ శివుమాట దప్పదు; గాన మలఁగనిశోకంబు మనకుఁబాటిల్లె; మనకు దిక్కెవ్వరు? మన రావణుండు మననేరఁ; డిఁక నేఁడు మఱుఁగంగ నేల? మనకందఱకు దిక్కు మన విభీషణుఁడు చని రామచంద్రుని శరణంబు సొచ్చె.” |