ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణుఁడు శుక్రునొద్ద మొఱవెట్టుట
నంత నా వృత్తాంతమంతయు నెఱిఁగి
యెంతయుఁజింతించి యిచ్చలో2160ఁగలఁగి
విక్రమక్రమశక్తి విడిచి రావణుఁడు
శుక్రుసన్నిధి కేఁగి స్రుక్కుచు 2161మ్రొక్కి:
“2162చుట్టాల భృత్యుల సుతుల సోదరుల
నెట్టన రఘురాముని శితబాణాగ్ని
దరికొని కాలిచి దగ్ధులఁజేసి
పరిగి యమోఘమై ప్రళయాగ్ని పగిది
నున్నది; మాన్పరాకున్నది; పోర
నన్నియుఁదెగటాఱె; నన్నియుఁబొలిసె;
నేను బ్రాణములతో నెబ్భంగి నిలుతు
నానతి యి”మ్మన్న నా శుక్రుఁడనియె:
“నలఘుసంగరమున నరుల సాధింపఁ
గల వుపాయంబులు; గలఁగ నేమిటికి!
నే విఘ్నములు లేక యీవు హోమంబు
గావించుపుణ్యంబు గలిగినఁజాలు!
భీమసంగ్రామగంభీరంబు లగుచు
హోమాగ్ని ముఖమున నుండి నీ కడకు
నురురథాశ్వంబులు నుగ్రఖడ్గములు
శరచాపకవచముల్‌ చనుదెంచు వేగ.
నవి సాధనములుగా నరుల సాధింపు;
మవి నీకు జయసిద్ధు.”లనుచు నాతనికి
హోమమంత్రములెల్ల నుపదేశమిచ్చి
హోమకృత్యములెల్ల నొగి నేర్పఱించి
పొమ్మన వీడ్కొని పోయి రావణుఁడు
క్రమ్మినకడఁకతోఁ గడు నుగ్రుఁడగుచుఁ
బుర వప్రరక్షకు భూరిసత్త్వులను
బరికించి చతురంగబలములఁ2163బనిచి
యవధానతత్పరుఁడై వేగ లంక
గవనులు2164వేయించి కలయ శోధించి
యంత విద్యుజ్జిహ్వుఁడనుమహావీరు
నంతకాకారు నుద్ధతశూరుఁబిలిచి:
“నీవు నీ బలముతో నిష్ఠమై నగరుఁ
గావు; మేమఱకుము; కదలకు;”మనుచుఁ

  1. ↑వగచి
  2. ↑ఁబలికె
  3. ↑యున్నత రథముల నురుజవాశ్వముల - నెన్నిక కెక్కిన యేనుఁగుగములఁ -జు
  4. ↑బుచ్చి
  5. ↑పెట్టించి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )