ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
పాతాళహోమము
బనిచి యనుష్ఠాన2165పద్ధతిఁబొంది
చని మృత్యువక్త్రంబుఁజనఁజొచ్చు భంగిఁ
బాతాలగుహఁజొచ్చి పదిలుఁడై నిలిచి
యాతతహోమకృత్యమునకుఁదగిన
రక్తవస్త్రంబులు రక్తమాల్యములు
రక్తచందన మనురక్తుఁడై తాల్చి
బంధురదక్షిణప్రవణవేదికకు
గంధపుష్పాక్షతల్‌ గరమొప్ప నిచ్చి
యా2166మహావేదిలో నగ్ని సంధించి
2167హోమమంత్రములెల్ల నొగి నుచ్చరించి
వెరవొప్ప నా హోమవేదిలోఁగలయఁ
బరికించి నిశితాస్త్రపరిధులు చేర్చి
శ్రీవృక్షభల్లాతసిత ముఖ్యసమిధ
లావృత్తిఁగైకొని యంతట మఱియు
నోజ సర్షపములు నొనర దూర్వములు
లాజలుఁదగ గుగ్గిలంబును నగురు
నేయి తేనియ కల్లు నెత్తురుఁబెరుగుఁ
బాయసాన్నంబు దర్భలుఁబ్రవాళములుఁ
దగరులు మీలు గ్రద్దలు వరాహములు
నొగి విని మొదలుగా నొప్ప వేల్చుచును
నాశ్చర్యకరమైన యా2168మహావేది
నిశ్చలిత ధ్యాననిరతుఁడై యుండె.
బలువిడి రావణు2169పాపంబులెల్లఁ
గలసి పెల్లెగసినకైవడి దోప
నా మహాగుహనుండి యప్పు డత్యుగ్ర
ధూమంబు లురుతరస్తోమంబు లగుచుఁ
బటుతర నిర్ఘాతపవనసంఘాత
చటులంబులై నిక్కి చదలఁబర్వుటయు,
వెఱచిరి దివిజులు; వెఱచిరి మునులు;
వెఱచిరి దిక్పతుల్‌; వెఱచిరి కపులు.
నా మహాధూమంబు లప్పుడు చూచి
2170రాముతో ననియె నా రావణానుజుఁడు:
“నెలకొని రణమున నిను2171ఁదాఁకి యెదుట
నిలువనేరక పోయి నేఁడు రావణుఁడు2172
కపటకర్మారంభ గంభీరవృత్తి
విపులజయా2173ర్థియై వేల్చుచున్నాఁడు;
అవధరించితె పొగ లాకసంబునను
నివుడుచు నున్నవి నిండి యొండొండ.
హోమంబు నిర్విఘ్న యోగమై యితఁడు
కామించురీతినిఁ గడముట్టెనేని
రావణు లోకవిద్రావణుఁ బోర
దేవాసురులకైన 2174ఁదెగి గెల్వరాదు.
కావున హోమవిఘ్నము సేయవలయు;
వేవేగ వానరవీరులఁ బనుపు.”
మనవుడు రఘురాముఁ“డౌఁగాక!” యనుచుఁ
బనిచినఁ బనిపూని బలువిడిఁగడఁగి
గురుబలాఢ్యుఁడు గవాక్షుండుఁ దారుండు
శరభుఁడుగ్రథనుండు శతబలి నలుఁడు
గవయుఁడు మైందుండు గంధమాదనుఁడు
బవమానసూనుండుఁబనసుఁడంగదుఁడు
గుముదుండు జ్యోతిర్ముఖుండు గోముఖుఁడు
గ్రమమున వీరాదిగాఁగల కపులు
పది2175కోటులుద్భట ప్రథనవిక్రములు
విదితప్రతాపులు విపులకోపనులు
గగనమార్గమున లంకకు నేఁగుదెంచి
యగణితహుంకారులై పెచ్చుపెరిగి
పదఘట్టనముల భూభాగంబు వగులఁ,
జదియ దిగ్గజములు, చదలు గ్రక్కదల,
నార్పులు బొబ్బలు నడరఁబెల్లడరి
దర్పితనిర్భరోత్సాహసాహసులు
నలిఁదాఁకి రావణునగరి కాపున్న
బలియురఁబెక్కండ్రఁబట్టి చెండాడి,
క్రూరులై దౌవారికులఁబట్టి చంపి,
భూరిసత్త్వమునఁ దల్పులు వీడఁదన్ని,
నగ రుద్దవిడిఁ జొచ్చి నగరూపధరులు
నగచరుల్‌ వడి దశానను రోయువారుఁ,
బృథురథశాలలు బిరుదులై చొచ్చి
రథములు విఱుగ నుర్వర వ్రేయువారు,
గజశాల లొగిఁజొచ్చి ఘనముష్టిహతుల
గజమస్తకములు వ్రక్కలు సేయువారు,
హయశాల లొగిఁజొచ్చి హయశరీరములు
భయదోగ్రనఖములఁబడ వ్రచ్చువారు,
సొరిది శాలలఁజొచ్చి జోడుపక్కెరలు
దరమిడి చించి చిందఱ లాడువారుఁ,
జలమొప్ప నాయుధశాలలు సొచ్చి
కలయశస్త్రాస్త్రముల్‌ ఖండించువారు,
నేచి బండారపుటిండ్లలోఁ జొచ్చి
ఱాచి యర్థములు సూఱలు సల్లువారు,
నురుసత్త్వగతు లొప్ప నుప్పొంగి పొంగి
వరుసఁదోరణములు వడిఁద్రెంచువారుఁ
బసిఁడిగోపురములు భర్మహర్మ్యములు
వెస నుర్విఁగూలబల్విడిఁ2176ద్రోయువారుఁ,
గట్టల్కఁగొందఱఁగని:“జగద్ద్రోహిఁ
బట్టితెం.”డని పట్టి బాధించువారు,
వనితలు సుతులును వాపో2177వుచుండ
జనను లడ్డము2178రాఁగ సదనముల్‌ సొచ్చి
నెట్టన వెలి కీడ్చి నెఱసి రాక్షసుల
దట్టించి తలలూడఁ దాటించువారు;
వాసిమై నిబ్భంగి వనచరుల్‌ గూడి
గాసిపెట్టుచునుండఁగా భీతి నొంది
దీనదశాతురస్థితిఁ దూలపోయి
దానవు వీడు విధ్వస్తమై కలఁగె.
హరిపీడితానేక హయహేషితములుఁ
గరిఘటానేక భీకరబృంహితములు
వృద్ధబాలాంగనా విల విలాపములు
సిద్ధవిక్రమ కపి సింహనాదములుఁ
గలయఁబర్విన లంక కల్పాంతకాల
ములఁబేర్చుబడబాగ్ని ముఖముఖార్చులకు
నులికి వాపోవుపయోధిచందమునఁ
గొలఁది కగ్గలముగా ఘూర్ణిల్లఁదొడఁగె.
నంత సూర్యోదయంబయ్యె; రావణుని
నంతటఁబరికించి యతఁడున్నచోటు
కానక చింతించి కడుసంభ్రమమున
వానరుల్‌ వెదకంగ వారి నీక్షించి
చతురతమై విభీషణుపత్ని సరమ
పతిహితంబాత్మలో భావించి యపుడు
వడి నంగదునకు రావణుఁడున్నచోటు
చిడిముడిపాటుతోఁజేసన్నఁ జూపెఁ.
జూపుటయును జూచి సుభటదంభోళి
కోపించి యప్పు డగ్గుహవాత నున్న
శిల నుగ్గుగాఁదన్ని చెచ్చెఱఁ జొచ్చి
యలఘువిక్రమకళాయతకేలి వాలి
పొలుపొంద భుజసత్త్వమునఁబెంపుమీఱి
కలఁగి రాక్షసులెల్లఁగడుభీతిఁబొందఁ
జని హోమనియతి నిశ్చలుఁడైన వాని
ఘనమంత్రతంత్రసంగతుఁ డైన వాని
రావణు2179నమరవిద్రావణుఁ గాంచి:
“రావణుఁబొడగంటి; రండు రం.”డనిన
ననిలతనూభవుం డాదిగాఁ గలుగు
వనచరాధిపులెల్ల వడిఁగూడ ముట్టి
యగ్గుహారక్షకులైన రాక్షసుల
నుగ్గు నూచము సేసి నుతశక్తి మెఱసి
యొక్కఁడ వేల్చుచునున్న యద్దనుజు
నక్కడ పొడగని యలుక దీపింపఁ:
“దోడెవ్వరును లేక తుది నొంటిపడియెఁ
దోడు వేలుత.” మని దొరకొని కపులు
సొరిది నవ్వేదిక చుట్టుల నున్న
పరిధులు సమిధులు బహుకలశములు
హస్తి కుక్కుట జంబుకాశ్వోష్ట్ర శునక
మస్తక2180ంబులు ఘృతమధుపాత్రతతులు
నఱిముఱిఁబుచ్చి హోమాగ్నిలో వైచి
నెఱసి యార్చిరి దైత్యనికరంబు బెదర.
నప్పుడు పాపాత్మునంగంబులందు
నిప్పులు2181సల్లియు నిగుడి యందంద
గుండంబులో మండుకొఱవులు2182వట్టి
యొండొండ వ్రేయుచునుండిరి కపులు.
చేతిస్రుక్‌స్రువములు చెనసి రాఁదిగిచి
వాతూలసుతుఁడు రావణు నేసి డాసె.
నిత్తెఱంగునఁగపు లేచి కారింపఁ
జిత్తంబులో నిష్ఠ చెద2183రంగనీక
కినియక కదియక కృతనిష్ఠ నుండె
గొనకొని నిద్రించుకొండచందమున.

  1. ↑ఫలసిద్ధి (శుద్ధి)
  2. ↑హోమ
  3. ↑యా హోమపాత్రికలటు సంస్కరించి - కామిత సిద్ధిసంకల్ప పూర్వముగ
  4. ↑హోమవేది
  5. ↑ప్రాణంబు
  6. ↑రాముఁడువలికె… నుజుని- నో విభీషణ! చూడు ముగ్రంబులగుచు-నీ విధిధూమంబు లిటు దివిఁబర్వె- నేమకోయనవుడు నింపు రెట్టింప-నెలకొని…
  7. ↑నెదురించి
  8. ↑శుక్రానుమతి నిట్లు సురుచిరగరిమ- విక్రమశాలియై వేవేగ యిపుడు-కపట
  9. ↑ర్థమై
  10. ↑దృష్టింప
  11. ↑కోట్లు భండనప్రచుర
  12. ↑దాఁచు, ద్రోచు
  13. ↑వఁగన్న
  14. ↑సొర
  15. ↑లోక
  16. ↑ఘృతపయోమధు
  17. ↑చూపులు నిగుడంగఁబట్టి
  18. ↑పుచ్చి
  19. ↑రక యతఁడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )