ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రాఘవు మాహాత్మ్యము మందోదరి రావణున కెఱిఁగించుట
“యో దశానన! నీకు యుద్ధమధ్యమున
రాదు జయింపంగ రఘురామదేవు;
నీవొక్కఁడవె యేల? నెఱసి రాఘవుని
దేవాసురులకైనఁదీరదు గెలువ.
నీ మది రాజుగా నిర్ణయింపకుము:
రామచంద్రుండు పురాణపూరుషుఁడు;
ఆ మేటి తొల్లి మత్స్యావతారమున
సోమకు నిర్జించి శ్రుతులుద్ధరించె.
ఘనమంథశైలంబుఁగమఠమై యతఁడు
దన వీపుఁగుదురుగా ధరియించెఁదొల్లి.
భూమి వరాహమై పొలుపొంద నెత్తి
రాముఁడు మున్ను హిరణాక్ష్యుఁజంపె.
నతఁడు నృసింహుఁడై యలుకతోఁదొల్లి
పతితుదైత్యునిఁజంపి ప్రహ్లాదుఁగాచె.
నలిగి యాతఁడు వామనావతారమున
బలి నర్థియై వేఁడి బంధించెఁదొల్లి.
జమదగ్ని రాముఁడై జన్మించి తొల్లి
విమలశౌర్యునిఁగార్తవీర్యునిఁజంపె.
2204వీకమైఁజేకొన్న విశ్వమంతయును
నా కశ్యపబ్రహ్మ కర్థితో నిచ్చెఁ.
దన సత్త్వమంతయుఁదలకొన వచ్చి
నినుఁజంప నిప్పుడు నిష్ఠతోఁబూని
దిశలఁదేజంబులు దీపింప మెఱసి
దశరథేశ్వరునకుఁదనయుఁడై పుట్టె.
నా మహామహిము నత్యద్భుతక్రియల
నేమని చెప్పుదు నేను వాక్రుచ్చి!
యలఘువిక్రమకళాయతశక్తి మెఱసి
బలియుఁడై రాముఁడు బాల్యంబునందు
గౌశికప్రముఖదిక్పతులెల్లఁబొగడఁ
గౌశికుం డొనరించు క్రతువు రక్షించె;
శతసహస్రాయుత సంఖ్యలు గడవ
నతనిచేఁబడసె దివ్యాస్త్ర సంతతులు;
జనకుఁడు మెచ్చ నార్జవ మొప్ప నిలిచి
ఘనశక్తి విఱిచె శంకరుశరాసనము;
దైవయోగంబునఁదనకుఁబట్టంపు
దేవిగాఁబూని వైదేహిఁగైకొనియె;
సోమించి నిజబలస్ఫురణంబు చూపి
రాముఁ డా భార్గవరాము భంగించెఁ;
దన తండ్రి పనుపునఁదప మొప్పఁబూని
మునివృత్తి వనవాసమునకు నేతెంచె;
సన్నుతశక్తిమైఁజంపె విరాధుఁ;
బన్నుగాఁబేర్చి శూర్పణఖ శిక్షించె;
నడుగుల నా దండకారణ్య భూమిఁ
గడుఁబుణ్యభూమిగాఁగావించె నతఁడు;
ఖరదూషణాది రాక్షసవీరవరుల
ధరఁగూల్చె మఱి చతుర్దశసహస్రముల;
మారీచుఁదునుమాడె మాయఁబోనీక;
ఘోరరూపుఁగబంధుఁగూలంగ నేసె;
నీ2205గొంటుతనమెల్ల నిలిపి ధట్టించి
లాగొప్ప నిన్ను వాలమున బంధించి
చతురబ్ధిజలములఁజలమున ముంచి
యతులసత్త్వక్రీడ నడరి కారించి
విడిచిన యా వాలి వెస నొక్క కోలఁ
బడనేసి సుగ్రీవుఁబట్టంబు గట్టె;
నలవుమైఁదనదు బాణాగ్ని కీలలను
జలనిధి నింకించె జగములు మెచ్చఁ;
గలనిలోపలఁగుంభకర్ణు ఖండించెఁ
జలమున నఖిలరాక్షససమేతముగ.
సమరంబులోపలఁ జంపె లక్ష్మణుఁడు
నమర నయ్యతికాయు నయ్యింద్రజిత్తు.
నలుగఁ డెన్నఁడును రామావనీనాథుఁ;
డలిగిన నిలువ రింద్రాదులు నెదుట.
మదిమదినుండి యా మనుజేశుదేవిఁ
ద్రిదశారి! వంచనఁ దే నీకుఁదగునె?
నీ వెఱుంగవె రాము నిత్యసత్త్వమ్ము!
నీ వెఱుంగవె రామనృపు మహత్త్వంబు!
రాముసత్త్వస్థితి రావణా! నీకు
నేమి పాపముననో యెఱుఁగఁ జొప్పడదు;
నీ వింక రఘురామునిష్ఠురబాణ
పావకజ్వాలల భస్మమై పడక
జనకనందనతోడ సకలరాజ్యంబు
నెనయ రాఘవునకు నిమ్ము వేవేగ.
మరలి తపోవృత్తి మన మరణ్యములఁ
జరియింత మింతియచాలు భోగములు.
నీవు తీరిన నాకు నీతోడఁగూడఁ
బావకుముఖమునఁబడి కాలరాదు:
మున్ను మా జనకుండు ముదిమియుఁజావు
నన్నుఁజెందక యుండ నాకిచ్చెవరము.
వరభోగ మేనొల్ల; వలవ దీ త్రోవ;
తరము గా దింక దుస్తరము తద్వరము;
సరమకు నొండె, నా జనకజ కొండె,
వరువుడ నై యేను వర్తింపవలసె.”
ననవుడు దశకంఠుఁ డా కలకంఠిఁ
గనుఁగొని పలికె నుత్కటకోపుఁడగుచు:
“2206నింతేల చింతింప నెలనాఁగ! నీకు?
నింతకు వచ్చితినే యేను 2207నేఁడు?
చుట్టాల భృత్యుల సుతుల సోదరుల
నెట్టనఁజంపించి నేఁడింకనాకు
దేవదానవభయోద్వృత్తిఁబోనాడి
యీ వట్టిప్రాణంబు లేల రక్షింప?
దురమున నింద్రజిత్తునివంటి కొడుకుఁ
బరులచేఁజంపించి బ్రదుక నేమిటికి?
గరుడోరగామరగంధర్వవరులఁ
బొరిగొంటిఁ; బెఱిచితిఁబుణ్యగేహినులఁ;
దపసులఁజంపితిఁ; దరుణి! యే నింకఁ
దపసినై పోయినఁ దపసులు నగరె?
కావు నీ మాటలు; కార్యంబు తెఱఁగు
భావింపనేరవు పద్మాయతాక్షి!
యే నెల్లభంగుల నింక రాఘవులఁ
బోనీక చంపుదు; భూమిజ నీయ
నారూఢబలుఁడ నై, యటుగాక యేను
శ్రీరాముశరములచేఁజత్తునేని
నాకవాసులు మెచ్చ నా కోరుచున్న
వైకుంఠ మెదురుగా వచ్చు నిచ్చటికి.
లలన! నీ వేటికి? లంక యేమిటికిఁ?
దలకొన్న ముక్తిసత్పథముఁగైకొందు.
నెలనాఁగ! నీవింక నేను లేకున్నఁ
గల పుణ్యలక్షణకళలెల్లఁ2208బాసి
కమలబంధుఁడు లేని కమలినివోలెఁ
గొమరారు శశిలేని కుముదిని వోలె
నుండుము నీ.”వన్న నొండాడ వెఱచి
యుండె మందోదరి యుదరి లజ్జించి.

  1. ↑లోకంబు లెఱుఁగ భూలోకమంతయును
  2. ↑గండు (గర్వ) గుణ
  3. ↑నింతయుఁజింతిప వెలనాఁగ నాకు (నీవు)
  4. ↑నీకుఁ-జు
  5. ↑బొలిసి, దఱిగి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )