| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నా సమయంబున నధికవేగమున నా సమీరాత్మజుఁడరుదెంచి భరతుఁ గనుఁగొని వినతుఁడై కరములు మొగిచి కొని నిల్వఁగాకుత్థ్సకులుఁడిట్టులనియె: “నీ కులంబెయ్యది? నీకుఁబేరేమి? చేకొని యిటకు వచ్చినపని యేమి? యెవ్వండ? వెందుండి యెటవోయె?”దనిన నవ్వసుధేశుతో ననిలజుండనియెఁ: “గపి నేను; రఘురాముగాదిలిబంటఁ; దపనకులాంభోజతపనుఁడున్నతుఁడు తన పుణ్యచరిత ముత్తములెల్ల మెచ్చ వనవాససమయంబు వలనొప్పఁదీర్చి సౌమిత్రియును దాను జనకనందనయు రాముండు వచ్చి యరణ్యముల్ విడిచి నెమ్మితో ముందఱ నీ సేమ మరసి రమ్మన్న వచ్చినరాక యీ రాక!” యనవుడు భరతుఁ2507డత్యంతహర్షమునఁ గొనకొని పులకించి కోర్కి దీపింప: “రా పుణ్యవత్సల! రా కపిశ్రేష్ఠ! రా పవనాత్మజ!ర.”మ్మంచుఁదిగిచి నరనాథసుతుఁడు వానరనాథచంద్రుఁ గరము సమ్మదమునఁగౌఁగిటఁజేర్చి గజమాల్యమణులిచ్చి గజముల నిచ్చి గజరాజగమనలఁగరమర్థినిచ్చి కనకాంబరంబులుఁగడువేడ్క నిచ్చి వినుతభూషణములు వెలయంగ నిచ్చి తగుపట్టణము లిచ్చి ధనకోటులిచ్చి యగణితగుణధీరుఁడనియె మారుతికి: “నడవుల కరిగి రామావనీవిభుఁడు దడసిన2508కాలంబు దలఁప నచ్చెరువు! ఎందెందు వర్తించె? నెందెందుఁబోయె? నెందున్నవాఁడిప్పు డినకులేశ్వరుండు?[వా.రా. సర్గ 129] నీవు రాఘవునకు నిజదూత వగుట 2509నీ విధంబంతయు నెఱిఁగింపు మనఘ! యిచ్చలోపల నమ్మ నీ పలుకేను; వచ్చుట నిక్కమా వనచరాధీశ!” యనవుడు విని నవ్వి యవ్విమలాత్ముఁ డెనసినభక్తితో నేర్పడఁబలికె: “మీ తండ్రి దశరథ మేదినీశ్వరుఁడు భూతలరాజ్యప్రభుత్వంబు మాన్పి యడవికిఁబొమ్మన్న నన్నరేశ్వరుఁడు జడలు వల్కలములు శాంతుఁడై తాల్చి భానుప్రభాభాసి పాదచారమున జానకీలక్ష్మణసహితుఁడై వెడలి చిత్తసమ్మదమునఁజిత్రకూటాద్రి నుత్తమమునిగోష్ఠి నున్నచో నీవు భూరాజ్యమొల్లక పోయి మీ యన్న నారాధనము సేసి యర్థిఁబిల్చుటయు బతి రాకయున్నఁదత్పాదుకాయుగళ మతిభక్తియుక్తిమై ననురక్తి నడిగి తలమోచికొని వచ్చి ధారుణీరాజ్య ఫలభోగ ముడిగి తపస్వి వైతిచట. కుటిలదానవబలక్రూరదుర్గమున కట రాఘవుఁడు దండకారణ్యమునకుఁ జని శరభంగునాశ్రమభూమి నిలిచి మునుల నూఱడఁబల్కి, ముదమొప్పఁబోయి యా జనస్థానంబునందున్న దైత్య రాజు చెల్లెలిఁబట్టి రాజసంబొప్ప నలి మీఱ నా శూర్పణఖముక్కుసెవులుఁ గొలఁదికి మొదలంటఁగోసి పోవైచి ఖరదూషణాదిరాక్షసులఁబెక్కండ్ర నరభోజనులఁబదునాల్గువేవురను జంపి యక్కడఁబర్ణశాలలో నుండఁ దెంపుమై రాక్షసాధిపుఁడు ప్రేరేప మారీచుఁడనియెడు మాయావి యొకఁడు భూరిమృగాకృతిఁబొడసూపుటయును మృగనేత్ర సీత యా మృగము నీక్షించి: “మృగ మొప్పు;నాకు నీ మృగముఁదేవలయు.” ననవుడు శరచాపహస్తుఁడై దాని వెనుకొని రామభూవిభుఁడొగి నేయఁ గూలెడు నప్పు డా కుటిల రాక్షసుఁడు: ‘హా లక్ష్మణా!’యను నార్తరావమున నారూఢిఁజీఱిన నతివ భీతిల్లి యా రాఘవానుజు2510ననుప నచ్చటకు మునివేషధారియై ముద్దియ నెత్తి కొనిపో2511వు రావణుఁ2512గూడి పోనీక ఘనుఁడు జటాయువు గని యడ్డపడిన ననిమొన భర్జించి యతని నిర్జించి దనుజాధిపతి సముద్రము దాటిపోయి తన లంకలోనియుద్యానంబునందు సీతామహాదేవిఁజెచ్చెర నునిచి యాతత2513జయశాలియై2514యుండె; నంత మాయామృగముఁజంపి మఱి రామచంద్రుఁ డాయాసపడి ఖిన్నుఁడై వచ్చి వచ్చి సౌమిత్రిఁబొడగని:“జానకి డించి యేమిటి కిట వచ్చి తీ.”వంచు2515వగచి యతఁడుఁదానును గూడి యా పర్ణశాల కతిరయంబున వచ్చి యందులో సీతఁ బొడగాన కిరువురు భూరిశోకమునఁ బడి2516యింతి వెదకుచు బహుదుర్గములను బోవుచో రావణుభుజశక్తిఁదూలి వావిరి లోఁదాఱి వసుధపైఁ గూలి యున్నజటాయువు నొయ్యనఁగదిసి యన్నీచదుర్దశ నద్దశాననుఁడు గావించి సీత లంకకు నెత్తికొనుచుఁ బోవుట యతనిచేఁబొందుగా నెఱిఁగి యా విహంగాధీశు2517నపుడు దహించి పోవుచు వనదుర్గభూములు గడచి ముందట నా ఋశ్యమూకంబు గాంచి యందు సుగ్రీవునకై వాలిఁజంపి తారతో నాచంద్రతారార్కముగను నా రాజ్యమంతయు నాతని కిచ్చె; నిచ్చిన సుగ్రీవుఁడెంతయు2518మెచ్చి విచ్చలవిడి సీత వెదకెడికొఱకు లక్షల రెండేసిలక్షలఁగపుల నక్షీణబలుల మహాయశోధనులఁ బదిదిక్కులకుఁబంపఁబఱచి వానరులు వదలక వెదకంగ వచ్చి సంపాతి: “సీత యున్నది లంకఁ; జింతింపవలవ; దీ తెఱంగిటుసేయుఁడిటమీఁద.”ననిన జలరాశి నూఱుయోజనము2519లే దాటి నలిఁగి యశోకవనంబులో నున్న వైదేహిఁగని యానవాలు నే నిచ్చి యా దేవి మాణిక్య మర్థి నిచ్చుటయు నది దెచ్చి యిచ్చిన నవనివల్లభుఁడు ముదమంది విస్మయంబును బొంది యపుడు సకలశాఖామృగసహితుఁడై పోయి యకలంకవిక్రముం డబ్ధి బంధించి లంకపై విడిసి యలంకృతశక్తి లంకేశుఁజంపి కళంకంబు లుడిపి యవ్యయశ్రీయుక్తి నా లంకఁబుణ్య 2520భవ్యు విభీషణుఁబట్టంబు గట్టి పావనాత్మకులైన బ్రహ్మాది సురల చే వరంబులు గొని చెలువగ్గలించి హితమతి సురలతో నేఁగుదెంచుటయు నతిభక్తి మీ తండ్రి యడుగుల కెఱఁగి యనలముఖంబున నతిశుద్ధయైన జనకజఁగైకొని సమ్మదంబొప్ప ఖ్యాతి పెంపొంద నా కపులు రాక్షసులు బ్రీతి సుగ్రీవవిభీషణాంగదులు బలసి తన్గొలువఁబుష్పక మెక్కి వచ్చి ఫలితవిక్రమయశోభరితుఁడై విభుఁడు ఆ భరద్వాజసంయమి యాశ్రమమునఁ బ్రాభవస్ఫురణ మొప్పఁగ నున్నవాఁడు చందనచంద్రికాసమచారుకీర్తి; యిందెల్ల భంగుల నెల్లి విచ్చేయు.” ననవుడు భరతేశుఁడతనివాక్యముల జనితానురాగుఁడై శత్రుఘ్నుఁజూచి:[వా.రా. సర్గ 130, 131] “తడయక నీ వయోధ్యాపురంబునకుఁ గడువేగమునఁబోయి కడఁక దీపింప నాయతమంగళాయతనమై యొప్పు నీ యుత్సవము వీట నెల్లఁ జాటింపు; గొనకొని మన2521రాముకొలువు కూటమున ఘనసేతుబంధాదికథలు వ్రాయింపు; దేవగేహములు భూదేవగేహములు నీవు సన్నిధి నుండి2522నెఱయఁబాటింపు; వరరత్నతోరణధ్వజ పరంపరలు పురవీథులందెల్ల భూషింపఁబంపు; తరుణులఁబిలిపించి తగిన ముత్తెముల వెరవార మ్రుగ్గులు వెట్టింపఁబంపు; లలితవస్తువుల నిండ్లకు నెల్లఁబంపు; కలయఁబౌరులనెల్లఁగైసేయఁబంపు; శ్రీరామవిభుఁడు వేంచేసిన2523శుభము చేరువనృపులకుఁజెప్పంగఁబంపు; కరితురగాదులక్రందు గా2524నీక పరువడిఁజతురంగబలములు2525గొలువ నెమ్మి మంత్రులతోడ నీవు వేగము2526గ నమ్మలఁగొలిచిర.”మ్మని పనుచుటయు ననఘుఁడు శత్రుఘ్నుఁడత్యంత వేగ మున నయోధ్యకుఁబోయి ముదముదీపింపఁ గరమర్థి రాఘవాగమనమంగళము వరుసతో నిజబంధువరులకుఁజెప్పి కౌసల్యతోఁ జెప్పి కైకతోఁ జెప్పి యా సుమిత్రాదేవి కర్థితోఁజెప్పి భరతుండు దనుఁబిల్చి పనిచినభంగిఁ బురముసర్వంబును భూషింపఁజేసి ‘యది యిది లేదు; కా.’దనకుండ2527నిండు చదు రొప్ప2528నగరులు చక్కఁజేయించి చందనకర్పూరజలములు గూర్చి యందంద ముంగిళ్ల నర్థిఁజల్లించి పురవీథులందు నొప్పుగ నవరత్న వరతోరణంబులు వరుసఁగట్టించి యనఘమానసులైన యా వసిష్ఠాది మునులుఁబురోహితుల్ మునిపుణ్యసతులు జననులు బంధులు సచివులు హితులు వనితలు2529ఁబౌరులు వరవృద్ధజనులుఁ గొందఱందలములఁగొంద ఱశ్వములఁ గొందఱు రథములఁగొంద ఱేనుఁగుల నెక్కి యేతేరఁబెంపెక్కి శత్రుఘ్నుఁ డెక్కుడుమహిమతో నెలమి దీపింపఁ బంచమహావాద్యపటురవం బెసగ నంచిత2530గతి వచ్చె నన్న యున్నెడకుఁ. |