| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నంత శత్రుఘ్నునియాజ్ఞ సుమంత్రుఁ డెంతయు రయమున హితసమాహితుఁడు బహురత్ననిర్మలప్రభ నొప్పుమిగుల మహితార్కబింబసమంచిత రథముఁ గొనివచ్చి యట రఘుకులభర్తయెదుర నునిచిన శ్రీరాముఁడున్నతాత్మకుఁడు తల్లులచరణపద్మములకు మ్రొక్కి యెల్లవారును నెలుఁగెత్తి దీవింప ననఘుండు సుముహూర్త మగుట భావించి మునివసిష్ఠుఁడు తన ముందట నెక్కఁ బృథుకీర్తులింపెక్కఁబృథివి పెంపెక్క రథమెక్కె2544జనమనోరథ మెక్కుకరణి. నిరుపమతరభక్తి నిరతుఁడై2545యపుడు భరతుండు ధవళాతపత్రంబుఁబట్ట, నా సుమిత్రాపుత్త్రు లర్థి నిద్దఱును నాసన్నులై పట్ట నాలవట్టములు, నారూఢపంచమహావాద్యరవము తో రాసి దేవదుందుభు లోలి మ్రోయ, వినువీథి సురపుష్పవృష్టులు గురియ, జనులెల్ల జయజయశబ్దంబు లిడఁగ, నతులరథారూఢుఁడై మహోదార గతులొప్ప వెనుక రాక్షసభర్తనడవఁ, గెలఁకులఁగదిసి సుగ్రీవాదికపులు బలువారణము లెక్కి పదిలులై నడవఁ, బరువడిఁజతురంగబలములు నడవ, వరుసతో2546నిజబంధువర్గంబు నడవ, ఘనసేతుబంధాది కథలుగ్గడించి పెనుపొంద వర వందిబృందముల్ నడవ, జననులుఁదారాదిసతులు జానకియు ఘనరథంబులమీఁదఁగర2547మొప్ప రాఁగ, నడచె నయోధ్య కానందకందళితు లెడనెడ దీవింప హితపురోహితులు. కరిబృంహితంబు లుత్కటరథధ్వనులుఁ దురగహేషితములుఁదోరంబులైన భేరీరవంబులుఁబృథులఖడ్గోగ్ర ధారా2548గ్రఘట్టనధ్వనులు 2549ఁబెల్లెసగ నక్షీణకల్యాణుఁడగు రామవిభుఁడు నక్షత్రపరివృతనవచంద్రుభాతిఁ దియ్యంబు దీపింపఁదేజంబు మెఱసి యయ్యయోధ్యాపురం బర్థితోఁజొచ్చె. నప్పుడు సంతోష మంతరంగముల నుప్పొంగ బహుమంగళోన్నతుల్ మెఱసి పల్లవహస్తలుఁ బల్లవాధరలుఁ బల్లవారుణపాదపల్లవోజ్జ్వలలు హరిమధ్యసమమధ్య లమృతాంశుముఖులు గరిరాజగమనలుఁగమలలోచనలు నలినీలకుంతల లంబుజగంధు లెలదీగఁబోఁడు లింపెక్క నందంద కైసేసి చనుదెంచి కామినీమణులు ప్రాసాదగోపురప్రతతుల నుండి పుణ్యావలోకనంబులఁబుణ్యసతులు పుణ్యపుష్పాక్షతంబులు సల్లుచుండ మేడలపై నున్న మీనాక్షు లోలిఁ బ్రోడలై తమ తమ బోటులతోడ: “నీసునఁబిన్న నాఁడీ పుణ్యధనుఁడు సేసినచేతఁలు సెప్ప నచ్చెరువు తను2550నెదర్చినమాత్రఁదాటకఁజంపె; ననఘుఁడై కౌశికుయాగంబుఁగాచె; సర్పకంకణుమహాచాపంబు విఱిచె; దర్పించి జమదగ్నితనయు2551భంగించె; నహితలోకాంతకుండంతటిపనులు సహజశూరుఁడుగాన2552సనెఁగాక చేయ నమ్ముద్దుప్రాయంబునందుఁ2553గానలకుఁ బొమ్మన్నఁదపసియై2554పోయె2555 వేడుకను! బోయి జగద్ధితపుణ్యకృత్యములు సేయ నెవ్వఁడు సాలుఁ2556జేవ దీపింప! వనధి బంధించి రావణు2557ఁబోరఁద్రుంచి దనుజులఁబెక్కండ్ర ధరణిపైఁగూల్చెఁ. దన తండ్రిపనుపునఁదవిలి కానలకు మునివృత్తిఁజనునాఁటిముద్దు2558చందంబు 2559నీ పెద్దచందంబు2560నిన్నిచందముల దీపించుచున్నవి తెలియఁజూచితిరె? పర్జన్యు నవలీల భర్జించి సురలఁ దర్జించి భుజశక్తి దర్పించినట్టి యా మేఘనాదు నుగ్రాజిలోఁజంపె సౌమిత్రిఁగంటిరే చపలాక్షులార! పడఁతి! రావణుఁడతిపాపాత్ముఁడైన విడిచి లంకాపురీవిభుఁడయ్యె నితఁడు. వనజాక్షి! యీతఁడు వాలిసోదరుఁడు. వనిత! యీ పుణ్యుండు వాలినందనుఁడు. తడయక యంబుధి దాటి యా సీతఁ బొడగని వచ్చిన పుణ్యాత్ముఁడితఁడు. కలకంఠి! యవలీలఁగంధిఁబంధించి నలి లంకపై రాము నడపించె నితఁడు.’ నీరేరుహానన! 2561నిఖిలౌషధములఁ బోర లక్ష్మణుప్రాణములు దెచ్చె నితఁడు. అని2562తన్నుఁదమ్ముని నసురను గపులఁ గొనియాడుచును జెప్పికొనుచుండ వచ్చి నగరుఁబ్రవేశించి నలినాప్తకులుఁడు జగదేకనిధి రామచంద్రుండు దాను భరతశత్రుఘ్నులఁబనిచి దైత్యేంద్ర తరుచరప్రముఖులఁ దగుమందిరముల విడియించి యిష్టాన్నవివిధ భోజ్యములు కడఁకతోఁబుత్తెంచెఁగారుణ్య మొప్ప. సురుచిరమతి నంత సుగ్రీవుతోడఁ బరమసమ్మదమున భరతుఁడిట్లనియె: “నెల్లి రేపభిషేక మినవంశమణికి నెల్లతెఱంగు లాయితము సేసితిమి. సంగతిఁ జతురబ్ధిజలములు వలయు; గంగాదితీర్థోదకంబులు వలయుఁ; దెప్పింపు.”మనవుడు దిననాథసూనుఁ డప్పుడు పరమహర్షాంచితు డగుచు వలనొప్ప గజు జాంబవంతు సుషేణు నలఘువిక్రమవేగుఁడగు వేగదర్శిఁ గమనీయ2563ఘనరత్నకలశంబు లిచ్చి క్రమమునఁదీర్థోదకములు దేఁబనిచె. నలు గవాక్షుని వాయునందను ఋషభు గలయ సముద్రోదకముల దేఁబనిచెఁ. బనిచినఁగడిమిమైఁబ్లవగవల్లభులు వినువీథి నత్యంతవేగులై పోయి |