| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | షష్ఠాశ్వాసము |
| కం. | శ్రీమహిళాత్మలలాటత టీమృగమద సారసంఘటిత రేఖావీ క్షాముకురాయిత జాంబవం తీమానవతీకపోల! ధీజనలోలా! | 1 |
| తే.గీ. | అవధరింపుము, రామచంద్రావనీశ చంద్రుఁ డీ భంగి విభవనిస్తంద్రుఁ డగుచుఁ బ్రజల నందఱఁ దాఁ గన్న ప్రజలకరణి నరయుచును భూమిఁ బాలించునవసరమున | 2 |
| ఉ. | భాసిలెఁ జైత్రమాస మతిభాసురపల్లవక్లప్తకోకిల గ్రాసము లోకజైత్ర రతిరాజకరాగ్ర విరాజికింశుక ప్రాసము కీరవాక్చకిత పాంథజనశ్రవణాంతరంగుళి న్యాసము కేసరాదిసుమనస్సముదంచితగంధవాసమై | 3 |
| కం. | తనకంటె నుగ్రతేజం బునఁ దనయుఁడు దక్షిణమునఁ బొదల నచట నేఁ జన దత్యుగ్రత నిలువఁగ ననినటువలె భానుఁ డుత్తరాశఁ జరించెన్ | 4 |
| సీ. | తముఁ బ్రోది సేసిన ధాత్రికి లతకూన - లర్పించు వివిధవస్త్రాళు లనఁగ మలయుకొమ్మల డాసి మలయానిల విటుండు - రహి వీడ్చి వైచిన రవిక లనఁగ వనదేవతాగాత్రమునను జైత్రుఁడు నించి - కడఁగి రాలిచిన చిక్కస మనంగ సమయవాసవుఁ డగచ్ఛదచయచ్ఛేదనం - బొనరింప ధర రాలు తునుక లనఁగ | |
| గీ. | బయనములు వోవు పథికుల పాదములకుఁ బరపు గనిపింపఁ బఱవని బఱపులగుచుఁ బండి తరుశాఖికలనుండి పడిన పండు టాకుగుమి నిండుకొనియె వన్యాంతరముల | 5 |
| సీ. | అల వనీలామహిళలకుఁ జైత్రునియందు - రహిఁ జెందు రాగాంకురముల గుమియొ? ప్రాంచితాగమసమాఖ్యశ్లాఘ్యజటి ముఖ్య - సమితి ధరించు పెంజడల గుంపొ? వనము దవాభిఖ్యవహియించుఁ గావున - జనియించు కీలికాసముదయంబొ? మధువశంబునఁ దేజుమాల్సేయ మరుఁడుంచు - సవిరహాస్రారక్తశస్త్ర చయమొ? | |
| తే.గీ. | యిట్టిలంబుగఁ గొమ్మలు గట్టుకొన్న బెడఁగు చెంగావి వలిపె పావడలొ? యనఁగ నలరుఁబోడుల కరచరణాధరముల తొగరుపొగరులఁ జిగురించి చిగురు లలరె! | 6 |
| ఆ.వె. | అతనుశాస్త్రరీతి నతిశయింపఁగఁ గల మేలిగురుల దొరసి బాళిమెఱసి యభ్యసించెఁ గోకిలార్భకప్రకరంబు శ్రుతిమనోహరైకసూక్తు లపుడు | 7 |
| మ. | వసుధాజంబు లగంబు తాటనట ఠేవల్ గుల్కు రత్నాళి నాఁ గిసలశ్రేణిరహింపఁ గోయిలలు భక్షింపన్ వనీలక్ష్మి యీ రస మూనన్, మఱియొండు రత్నముల వర్ణం బుంచె నేమో? యనన్ బస రొందెన్ దలిరాకులన్ మరకతప్రత్యగ్రజాగ్రద్ద్యుతిన్ | 8 |
| సీ. | పాదపంబుల పేరి పాథోదముల మీఁదఁ - గనిపించు నక్షత్రగణ మనంగఁ నవమల్లికావసంత సమాగమంబున - జనియించు పులకల చా లనంగ వనమహాఖనిఁబుట్టి యెనలేని రుచులచేఁ - గొమరొందు మగరాల గుమి యనంగ వనరాశిగానఁ బ్రవాళముల్ మునుగల్గి - నటులు దోఁచిన మౌక్తికాళియనఁగ | |
| గీ. | నలరు వనదేవతల పల్లవాంఘ్రియుగము లందుఁ జెలువొందు సితనఖబృంద మనఁగ మీఱె సారెకు మధుపకిశోరకములు కోరికలు చెందఁ గోరకవారకంబు | 9 |
| కం. | పద నెఱిఁగి చికిలిచేసిన మదనుని నునుఁ దూపు తెగలు మధుఁ డిగురుల మేల్ పొదల నిడె ననఁగ మొగ్గల గుదులు తలిరుకొమ్మలందు గుదికొని పొదలెన్ | 10 |
| సీ. | నవ్యపరాగ చందనచూర్ణపేటికల్ - మదనసమ్మోహన మార్గణములు! కొదమతేఁటులు గన్న కోర్కులపంటలు - వలిగాడ్పు మెచ్చువల్పులకొటారు లామనిదొర తేనియల కణఁజంబులు - వనలక్ష్మి సౌభాగ్యమునకు నెడలు సకలదేవ సపర్యలకు హేతువులు విర - హివధూజనమ్ముల కెదురుచుక్క | |
| తే.గీ. | లఖిల విషయాగ్రగణ్యంబు లనఁగఁదగిన యలరుగుంపులు గమకంబులై గుళుచ్ఛ భావము వహించి యెడలేక బటువు లంది యలరెఁ గొమ్మల కుచముల యందములను | 11 |
| మ. | రవముల్ సేయుచు భృంగకోకిల కిశోరశ్రేణి మూగన్ వియో గవతీవారము దూరదూరముల కేఁగన్ గింశుకాదిప్రసూ నవిశేషాంశుక సంగతిన్ రజ మనూనంబై రహింపంగఁ బు ష్పవతీత్వంబు వనేందిరారమణికిన్ బ్రాపించె నయ్యామనిన్ | 12 |
| చం. | సుమసమయాధిపుం గలసి సొంపెసఁగంగ శలాటుసంతతిం గ్రమమునఁ గాంచె గర్భములు గైకొనినట్టులు మంజరీస్తనా గ్రమిళితభృంగనీలిమ దగం దెలిపుప్పొడి నిండఁ దెల్లడా లమర మరందఘర్మ మొలయన్ వెలసెన్ లతకూన లయ్యెడన్ | 13 |
| సీ. | మరుని కర్పింప నామని సమకట్టిన - పచ్చఱాబరిణెల బాగుఁ గాంచి ఫలము లాశించి కొమ్మల నాశ్రయించిన - రాచిల్క పిల్లల రహి వహించి ధరణి యాత్మజతరూత్కరము నొక్కటఁ జూడ - బహురూపముల నిల్చు భాతి మించి లతికాంగనలు వేడ్కలకుఁ బట్టు పచ్చమే - ల్పట్టుబంతుల గుట్టుఁ బైటనుంచి | |
| గీ. | యసమసాయకజనకాభ నతిశయించి పసిమి హెచ్చిన పచ్చిక పస నడంచి మసృణహరిదశ్వహరికాంత మహిమ నొంచి పసరుచాయల కసుగాయ లెసక మెసఁగె | 14 |
| కం. | తా నుద్యానగుఁ డౌటను భానుఁడు ఛాయానిరూఢిఁ బాటించిన యు ద్యానంబున బహురూపము లై నిలిచెనొ యనఁగ ఫలము లరుణిమ నలరెన్ | 15 |
| శా. | సారంగప్రమదామహోన్నతి రహించం బల్లవశ్రేణికా రారంజల్లతికాతతిద్యుతులు మీఱం గీరచంచూదిత ద్వారస్ఫారఫలస్రవద్రసపయోధారల్ దగన్ శ్యామలా కారశ్రీదళముల్ దనర్ప ఘనరేఖన్ మించె సాలౌఘముల్ | 16 |
| చం. | లసితరసాలసాల కిసలగ్రసనవ్యసనానురాగభా గ్రసనపికస్వరంబులు వికస్వరతన్ విని చొక్కి యింపునన్ మసలుచు ఖత్తులాణము ఘనత్వరఁబోవక నిల్చినందునన్ శ్వసనుఁడు మందమందగమనంబు వనంబులఁ జెందె నామనిన్ | 17 |
| చం. | హళహళినప్పు లిచ్చిన క్రియన్ విరితేనియ లాను తేఁటులున్ మలయుచు దాఁచఁబెట్టిన క్రమంబునఁ బండ్లు గ్రసించు చిల్కలున్ దలకొని సంతరించిన విధంబునఁ గెంజిగురుల్ గ్రహించుకో యిలలును గల్గి యామని రహించె మహీజనరంజనాకృతిన్ | 18 |
| తే.గీ. | అట్టి వాసంతవేళ రామావనీశ మౌళి మున్నీటిమొలనూలిమగువచూలి బాళితోఁగూడి వనపాళి కేళి సలుప నుల్లము జనింప రహిమించి యొక్కనాఁడు | 19 |