ఇతిహాసములు ఉత్తరరామాయణము శ్రీరాముఁ డుద్యానవనమునఁ గ్రీడింపఁ బోవుట
శ్రీరాముఁ డుద్యానవనమునఁ గ్రీడింపఁ బోవుట
సీ.కలితాళికన్యస్తకస్తూరికాతిల - కము ముఖలావణ్యకాంతిఁ దెలుప
నునుపాలకాయ యొంటుల నవశ్రీ గెల్చు - శ్రవణయుగ్మముకీర్తి నవధరింప
నవమల్లికాజైత్ర నక్షత్రమాలిక - హృదయస్థ గుణపాళి నెఱుకపఱుప
మకుటకీలితవజ్రమణిరుచుల్‌ జనవీక్ష - ణాళుల మల్లెల ట్లాసఁ గొల్ప
 
గీ.మిసిమి బంగారుతళుకుల మేటి దుప
టీ చెఱంగులు లలితాంజనాచలమున
నలరు నరుణతాపచ్ఛాయ నవలఁ ద్రోయ
రాముఁ డఖిలైకనయనాభిరాముఁ డయ్యె
20
మ.పురకాంతామణు లాత్మరూపవిభవంబుల్‌ సూచి కందర్పగో
చరతం దత్తఱమంద, మందపవనాంచత్స్యందనారూఢుఁడై
స్మరుఁడున్‌ దత్స్నుషఁ గూడి చైత్రుఁ దిలకింపం బోవుచందానఁ బు
ష్పరథం బెక్కి నిజావరోధసహితుండై యంద ముప్పొంగగఁన్‌
21
శా.ఘ్రాణానందకరాంగసౌరభము రంగత్కంజరాగోపల
శ్రేణీధాగధగస్ఫురద్రదన మద్రి స్పర్థి భూరిస్ఫుటా
రీణోరోజ మెసంగ మోహనకళారేఖామనోహారియౌ
గాణిక్యం బిరువంకలం గదిసి శృంగారంబునన్‌ గొల్వఁగన్‌
22
కం.ఒకచో నటభట పరిహా
సకగాయకవైణికాది చతురులు సుకవి
ప్రకరంబును గొలువఁగఁ దీ
వ్రకరాన్వయమణి పురోపవనమున కరిగెన్‌
23
వ.ఇవ్విధంబునం దన విలాసంబున కుచితంబై నమితపరిజనంబుతో నరిగి, పుర పరిఖాయితాయతోత్తుంగ తరంగ రవానుషంగ రంగద్భృంగ యుగ యుగపద్విహరణోచితపరాగవిసర కేసరయూథసరోరుహభాసుర సరయూరోథంబునన్‌ బొదలు కదళీ కరంజక వంజుళహింజుళ సరళవకుళ చందనహరిచందన పిచుమందమందార మాకంద కందరాళసింధువార తమాల తాల సాలహింతాల నారికేళ పనస ఖర్జూర జంబీర మధూక బంధూక శింశుపాశోకకదంబ ప్రముఖ తరుకదంబచ్ఛాయల సోయగం బై, సాఁగి సోగ లగు నేలకితీఁగలతోఁ గలసి, బాగుమెఱయు మిరియంపుఁబొదల తుదలం బొసంగు లవంగలతా కుడుంగంబులతో సనంగిపెనంగి యనుంగుల తెఱంగున రంగైన లుంగవల్లికల నల్లుకొని యల్లి బిల్లి యగు నాగవల్లికల జోకలఁ జేకొని మోకలగు పోఁక మ్రాఁకుల తీఁగల బందునఁ బొందిన ద్రాక్షపందిళ్ల సందునం గ్రందుకొను రుద్రాక్షతరువుల తెరువుల నిండికొన్న బండిగురిగింజతీఁగ చప్పరంబుల చొప్పున, నుప్పరంబునంటు కప్పురంపుటనంటి గుప్పుమనన్‌ గప్పు తావులకుఁ దావలంబగు తావుల ఠావుకొను గుజ్జులేమావుల సజ్జల నుజ్జీవించు గొజ్జంగియీరంబుల నంటుగోరంటలతో జంటఁ బాయని గెంటెనల నంటు ననంటులతో గెంటని గేదంగుల తెగలతో బుగులుకొనువగలు వాసనలు డాసి, వాసిఁగన్న దాసనముల యాసన్న నరణిఁ జెన్నుఁబన్ను సన్నజాజులతో వన్నెకెక్కు హొన్ను గన్నేరులం దొరలు సురపొన్న పుప్పొడి దుమారంపుఁదిన్నెల చేరువన్‌ బాఱువ న్నీటికాలువల దరులపొంత వంతు మీఱు చేమంతుల చెంతల నండగొన్న బొండుమల్లియలతోగలసి, మొల్లంబులగు మొల్లలతావులఁ గొల్లలాడు భ్రమరదంపతుల యింపుసొంపులు దింపు సంపెరగల సంపదలకు నిరుగుపొరుగులై పాదుకొను విరవాదుల యాదటఁ బ్రోదిగొను జాదులతోఁ దులఁ దూఁగి కనుపట్టు కలుగొట్టు చెట్టులపట్టున నిట్టలంబుగాఁ బుట్టు మెట్ట కెందమ్ములకుఁ దోఁబుట్టువులగు చెంగలువల చలువల నెట్టుకొను వట్టివేళ్ల కడలఁ బొగరు మీఱు కురువేరునపురున గుబాళించు మరువంపు వలపులతోఁ జెలిమిసలుపు సూదిమల్లెతీఁగల నాదుకొని, పొగడం దగిన పొగడలఁ గడలుగొని, ఘుమ్మను వాతపోతంబులచేఁ గదలు పారిజాతంబులకొమ్మల వ్రేలు జాళువా తూఁగుటుయ్యెలలకోళ్లఁ గీలుకొను రతనంపుమెఱుంగులఁ దుఱంగలించు కృతకాచలకందరంబులం దిరమ్ములగు మందిరమ్ముల మెచ్చి, చూడ వేడుక హెచ్చి, జోడుఁ గూడుకొని వచ్చి, వైదూర్యగవాక్షంబులు చొచ్చి పోఁగూడక అళికి వెనుకఁ జిక్కు చక్కనయ్య చక్కెరదిండి తేజీలముక్కుల నెక్కసక్కెంబులాడు సక్కడి సరోజాతరాగధాతురాగంబులకు సరాగంబు లగు చిగురుల పొగరున నెగరు కోయిలల పంచమస్వరంబులఁ గరంగు నెలఱాయరంగులఁ దొఱంగు జలధారాశీకరపరంపరలం గనుంగొని, యంతరంగంబు లుప్పొంగ నటించు నీలకంఠంబుల పింఛంబుల యొప్పు తప్పక చూచి, విప్పుగల కప్పు మొగులనెడి దిగులునఁ గొలంకుల కెలంకుల నిలువఁ దలంకి చంచలించు రాయంచల గరుదంచలధాళధళ్యంబు లసమయచంచలాలతల సొంపు సంపాదింప, నిలింప వన సంపదలఁ బొంపిరి వోవు నయ్యెలదోఁట డాయం బోవు నవసరంబున.24
సీ.సవిధపంకజవనీచరమాణకలహంస - గరుదంచలాంబు వర్ఘ్యంబు గాఁగఁ
దనయంతఁ బరిసరంబునఁ దత్‌క్షణమ రాలు - కమ్మక్రొవ్విరి చాలు కాన్కగాఁగ
నళికుటుంబముల రాయిడిఁ జేరువల జాఱు - నవపరాగంబు గందవొడిగాఁగ
గాడ్పుసోఁకి చలించు కర్పూరకదళికా - దళములు తాళవృంతములు గాఁగ
 
తే.గీ.శారికాకీరికాసమంచద్రుతంబు
వైదుషీభూషితోరుస్తవంబు గాఁగ
రమణ నారామలక్ష్మి యా రామవిభునిఁ
బూజగావించు చందానఁ బొల్చెనపుడు
25
చం.ప్రసవరజంబు గందవొడి పై కెగఁజల్లుచు భృంగఝంకృతిన్‌
బొసఁగ నుతించుచున్‌ జలజపూరమరందకణావళీముద
శ్రుసమితితో నెదుర్కొనియె సొంపున గంధవహార్భకుండు దా
రసహితుఁడై చెలంగు రఘురాముని యుల్లము పల్లవింపఁగన్‌
26
సీ.కలకలఁ బల్కు చిల్కలకొల్కిఁ దమ జాతి - గాఁబోలు నని చిల్క కదుపు పొదువఁ
జెలికత్తె నెలుఁగెత్తి చీరుతొయ్యలి దమ - కులమని కోయిలల్‌ గుంపుఁ గూడ
వెడ జాఱుకొప్పుతోఁ గడుమీఱు వగలాఁడి - దమ వియ్యమని తేంట్లు తారసిల్ల
నటనతో నడచు చందనగంధి దమ బంధు - వని యంచ బలఁగంబు వెనుకొనంగ
 
గీ.శతసహస్రసఖీజనసహిత జనక
దుహిత గణికాసమూహంబు తొడరి గొలువ
ననుచరుల నెల్ల నట నిల్వ నానతిచ్చి
రాముఁ డభ్యంతరవనాంతరంబు సొచ్చె
27
వ.అప్పుడు28
సీ.కుంభినీసుత గబ్బిగుబ్బ పాలిండ్లతోఁ - బ్రతియైన గజనిమ్మపండ్లు కొన్ని
జనకకన్య పిసాళి జళుకు కందోయితో - సరియైన మెట్టదామరలు కొన్ని
సీతాంబుజాతాక్షి చిఱునవ్వు చాయతో - సవరైన విరిమల్లె సరులు కొన్ని
కోసలాత్మజ పెద్దకోడలి నెమ్మేని - జిగిఁబోలు మేలిసంపెఁగలు కొన్ని
 
గీ.మైథిలీదేవి దంతసంపదల సొంపు
నకు సమంబైన కుందబృందములు కొన్ని
యేర్చి కొనితెచ్చి యినకులాధీశ్వరునకు
నెలమి వనపాలకులు కాన్క లిచ్చుటయును
29
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju