ఇతిహాసములు ఉత్తరరామాయణము సీతాదేవి యరణ్యంబున మునిపత్నులతో మెలఁగఁ గోరుట
సీతాదేవి యరణ్యంబున మునిపత్నులతో మెలఁగఁ గోరుట
శా.సారంగీశిశుకోటి దప్పి పులి దీర్చన్‌, సింహపోతశ్రమం
బాఱన్‌ దంతి కరాంబువుల్‌ నిగుడఁజేయన్‌, మించు భాగీరథీ
తీరారణ్యములన్‌ వసించు మునిపత్నీశ్రేణితోడన్‌ ఫలా
హారంబుల్‌ గొని యొక్కనాఁడు మెలఁగన్‌ బ్రాణేశ! వాంఛించెదన్‌
188
ఉ.నా విని సమ్మతించి రఘునాయకుఁ డాసతి నాదరింపుచున్‌
నీవు దలంచినట్ల తరుణీమణి! రేపటి రేపటంతటన్‌
బావనగాంగభూములకుఁ బంపెదనంచు మెఱుంగుఁ జెక్కు లిం
పావహిలంగ ముద్దుఁగొని యాయమ లోపలికన్పి పిమ్మటన్‌
189
సీ.అడపంబు చోఱవాఁ డెడఁబాయ కెడనెడ - మడిచిన తెలనాకు మడుపు లొసఁగఁ
జీరాడు దుప్పటి చెఱఁగుఁ జేఁబూని వెం - బడి గిండిఁ గొని వచ్చు బుడుతఁ డొదుగ
ద్వారపాలకులు తత్తఱముతో వడి లేచి - ముకుళిత హస్తులై మ్రొక్కు లిడఁగఁ
బనులసందడి నెదుర్పడిన దాసీదాస - జనములు జడిసి పార్శ్వముల కొదుఁగఁ
 
గీ.గటికవారును దగు నూడిగములవార
లవసరంబున నియ్యోగు లాడ నాడఁ
బొడఁగని యథోచితాకృతుల్‌ బొరసి కొలువ
మధ్యకక్ష్యాంతరము చేరి మనుజవిభుఁడు
190
తే.గీ.లలిత నవరత్నపీఠ మలంకరించి
మంత్రి బంధు హితాప్త సామంతవరులు
భద్రమధుమత్తకాశ్యపప్రముఖ నర్మ
సఖులు గొలువంగఁ గొలువుండి సంతసమున
191
సీ.శ్రుతులు శాస్త్రంబులు స్మృతు లావరించి వి - ద్వజ్జనుల్‌ సేయు వాదములు వినుచు
ప్రౌఢోక్తులలరఁ బౌరాణికుల్‌ వినిపించు - వివిధ పురాణార్థ వితతి వినుచు
నవరసాలంకారనైపుణ్యమున మహా - కథకులు గణియించు కథలు వినుచు
జాతీయ మేర్పడ సరసభంగులఁ బరి - హాసకుల్‌ దెలుపు హాస్యములు వినుచుఁ
 
గీ.గొంత ప్రొద్దుఁ బుచ్చికొని కొలిచినవారి
నెల్లఁ బనిచి వలయు హితులు గొల్వఁ
దగిన రీతిఁ గొంత దడవుండి హితగోష్ఠి
భద్రుఁ జూచి రామభద్రుఁ డనియె
192
ఉ.వింతలు భూమి నేమయిన వింటివె? పౌరులు నన్నుఁ గూర్చి నిం
దింతురొ యెంతురో తెలిసితే? జననీ గురుసోదరాదు లే
కాంతమునందు నేమనుచు నాడుదురో? వినకుందువోటు వి
న్నంతయు నీవు దాఁపక యథార్ధముగా వివరింపు నావుడున్‌
193
మ.కరముల్‌ మోడ్చి వినీతి భద్రుఁ డనియెన్‌ గాకుత్‌స్థవంశేంద్ర! నీ
చరితంబుల్‌ బదివేల నోళ్ళఁ బ్రజలెంచన్‌ విందు నేనెందులన్‌
గురునాజ్ఞన్‌ వని సంచరించి లవణాకూపారముం గట్టి యా
సురులన్‌ గొట్టిన చర్య లెంచ కివి యెచ్చోనైన నిందింతురే?
194
చం.నరులకు శక్యమే యనిమొనన్‌ ఖరదూషణముఖ్యరాక్షసే
శ్వరుల జయింప? వాలి నడఁపన్‌? గపివర్యులచేఁ బనుల్‌ గొనన్‌?
బరుషశరాగ్రబిందువుగ బల్కడలిన్‌ ఘటియింప? నీతఁడై
హరియొ హరుండొ యంచు జనులాడఁగ విందు నరేంద్ర! నావుడున్‌
195
చం.ఎలనగ వంకురింప ధరణీశుఁడు గ్రమ్మఱఁ బల్కె భద్ర! నీ
పలుకిది నిక్కమౌ నయినఁ బౌరులు భూమిజనుల్‌ శుభాశుభో
క్తులు వచియించుచోట ననుఁ గూరిచి జానకిఁ గూర్చి నిందలం
బలుకక పోవ రత్తెఱఁ గబద్ధము లాడక తెల్పుమీ యనన్‌
196
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju