| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శ్రీ సీతాదేవి గర్భంబును దాల్చుట |
| సీ. | కమ్మల మగఱాల కాంతి గ్రమ్మెనొ నాఁగఁ - దళుకు లేఁజెక్కులు దెలుపు మించెఁ బూసిన కస్తూరిపొలుపు మించెనొ నాఁగ - గలికి చూచుకములు నలుపు మించె రతికాంక్షఁ గృశమౌ తెఱంగుఁ దెల్పెనొ నాఁగఁ - నళినీలవేణి దేహము గృశించె వ్రేలు నీలపుఁదాళి డాలు ముంచెనొ నాఁగఁ - గరియాన నూఁగారు కారుకొనియె | |
| గీ. | బడలిక జనించె నూర్పు సందడి రహించె నడుము గనిపించె మిగుల నెన్నడలు గాంచెఁ జడిమ ప్రాపించెఁ జిట్టుముల్ సంభవించె దౌహృదము జానకీదేవి దాల్చునపుడు | 178 |
| తే.గీ. | ఇటుల గర్భిణియైన పూర్ణేందుబింబ ముఖి యొకానొకనాఁ డాత్మసఖులు వింత వగలఁ గైసేయ నప్సరోవనితఁబోలి హెచ్చ రహిఁ గాంతుచెంతకు వచ్చుటయును | 179 |
| శా. | ఆలోకించి దరస్మితం బెనయ రామాధీశుఁడుప్పొంగి య చ్చూలాలిం దొడమీఁద నుంచికొని మించుంజెక్కు లేఁజెమ్మటల్ పాళిం బల్మఱు గోట మీటుచుఁ గుచోపర్యుల్లసత్తారహా రాళుల్ చిక్కులు దీర్చుచున్ బలికెఁ గాంక్షాకర్ణనాకాంక్షియై | 180 |
| మ. | దరహాసద్యుతులెప్పుడున్ దొరయుటన్ దత్కాంతులింపొందెనో? వరవీటీగత చంద్రఖండరుచి పై వ్యాపించెనో? చంద్రకాం తరమన్ గెల్చిన కీర్తి నిల్చెనొ? యనన్ దళ్కొందె నీ చెక్కులం దరుణీ! పాండిమ తారహారముకురోదారప్రభల్ మీఱఁగన్ | 181 |
| మ. | స్తనశృంగారరసంబు చూచుకసముద్యన్నీలిమం గానిపిం చి నవీనంబగు పూఁతకస్తురి రుచిం జెల్వొంది పైనిండి జా ఱిన తద్ధారయొ నాఁగఁ దార్కొని మిటారించెన్ భవద్రోమ రా జి నిరూఢాంగకదీప్తిఁ దోఁచు జడయౌ సిద్ధం బనన్ జూపరుల్ | 182 |
| కం. | గడుసువలిగబ్బి గుబ్బల బెడిదపు భారమున జడిసి పేదతనముతో వడఁకెడి నీ నడుమున కి య్యెడ గర్భసమృద్ధి యభయ మిచ్చెఁగదే చెలీ! | 183 |
| కం. | సోముని గెల్చిన నీ నగు మోము ధరాదేవి మెచ్చి ముద్దిడుకొనెనో? కామిని! యది కాదేనియు నీ మొగమున మంటితావి యేమిటి కొదవెన్? | 184 |
| చం. | జడగతిఁ బాదముల్ గనిన చాడ్పున వాలుమిటారి చూపులన్ బడలిక మబ్బుపైకొనిన బాగున మోమునఁ బాండురద్యుతుల్ సుడిసినలీల మంటి చవిచొక్కు రసజ్ఞ వహించినట్టు నీ యెడఁద మఱేమియైన యొక యిచ్చ జనించినఁ దెల్పవే చెలీ! | 185 |
| కం. | పత్నికులమలర నంత ర్వత్నియయిన చిన్నె లెఱిఁగి వాంఛిత మేమో నూత్నముగ నడిగి మగఁడది యత్నంబునఁ జేయవలయు నతివరొ! యనుచున్ | 186 |
| ఉ. | మాటలఁ దాటకాంతకుఁడు మాటికిఁదేనియ లొల్క వేఁడినన్ బాటలగంధి సిగ్గు ప్రతిభాషితచాతురి నడ్డగింపఁగాఁ గాటపుఁగాంక్ష యన్తరువుకత్తె మదిం ద్వరసేయ నల్లనన్ మీటిన మ్రోయువీణెవలె మించునెలుంగున భర్తతోననున్ | 187 |