| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | మాల్యవంతుఁడు విష్ణుప్రభావమును దమ్ములకుఁ దెల్పుట |
| శా. | ఆ వృత్తాంతము వేగరుల్ దెలుపఁగా నాలించి యమ్మాల్యవ ద్దేవద్వేషి నిజానుజద్వయము నెంతేఁగూర్మి రప్పించి మం త్రావాసంబున నుండి యిట్లనియె నేకాంతంబుగా శేముషీ ప్రావీణ్యంబును గార్యతత్పరత సౌభ్రాత్రంబుఁ గాన్పింపఁగన్ | 3 |
| ఉ. | వింటిరె తమ్ములార! యొక వింత వినంబడె మొన్ననేమొ ము క్కంటిఁ గనంగ నెల్ల తెఱగంటి దొరల్ మునులేఁగి మ్రొక్కి మీ బంటుల మమ్ము నొంచెదరు బాధలఁబెట్టి సుకేశపుత్రు ల క్కంటకులన్ వధించి మముఁగావఁగదే శివ! యంచు వేఁడినన్ | 4 |
| చం. | కరచలనంబు మస్తకవికంపనముం గనిపింప వారితో హరుఁడపు డానతిచ్చెనఁట యా యసురేంద్రులు మా కజయ్యులా హరియగునే జయించుఁ జనుఁ డాయన యొద్ద కటంచు నట్ల సు స్థిరమతి వార లేఁగిరఁట శీఘ్రముగా నసురారియొద్దకున్ | 5 |
| చం. | హరునకుఁదెల్పినట్ల మన యాగడముల్ హరితోడఁదెల్ప నా హరి వెతలేల శాత్రవచయంబు వధించెదఁ గొంచ కింక మీ యిరవుల నుండుఁ డం చభయమిచ్చి ప్రియంబున వీడుకొల్పఁగా నరుసముఁజెంది వచ్చిరఁట యందఱు ముందఱి లీల గుంపులై | 6 |
| చం. | అమరులపాలివాఁడు హరి యాయన యిచ్చిన బాస దప్పఁడే క్రమముననైన గెల్చు మన గర్వము వింతకుఁదెచ్చె నెప్డు న క్రమమె యొనర్తు మే బలులఁగైకొన మెంతటివారి నాదరిం పము బలవద్విరోధము శుభం బొనరించునె యెంతవారికిన్ | 7 |
| కం. | హీనునితోఁదగు రణము స మానునితోఁ జేయఁదగు సమాధానము సం ధానరణంబులు దగ వస మానునితోఁ దొలఁగి కొలిచి మనుటయె యొప్పున్ | 8 |
| మ. | నడుమంత్రంబున బల్మిఁ దెచ్చుకొని యన్యాయంబునన్ మూర్ఖుఁడె క్కుడువారిన్ దొడరంగఁబోయి మడియున్ ఘోరానలజ్వాలలోఁ బడి నీఱౌ శలభంబులీల సహజభ్రాజిష్ణు శౌర్యుండు ని ల్కడ భావంబుననుండుఁ గయ్యమునకున్ కాల్ద్రవ్వఁడే పట్టునన్ | 9 |
| కం. | తన బలము నెదిరి బలమును గనుఁగొనక హితోపదేశకర్తల పలుకుల్ వినక కుజనుండు సాహస మునఁజెడు బలుగాడ్పుఁదొడరు బూరుగులీలన్ | 10 |
| ఉ. | కావున దేవతార్థముగఁ గయ్యము సేయఁగవచ్చు విష్ణుపైఁ బోవుట పాడిగా దతఁడు పుణ్యజనప్రియుఁ డాశ్రయించినన్ గావకపోవఁ డిప్పు డవకార్యము కయ్యము నెయ్యమొప్ప స ద్భావముతో ముకుందునకె భక్తులమైన నసాధ్యమున్నదే! | 11 |
| కం. | రాక్షసులు సేరినను హరి రక్షించునె యనఁగ వలదు ప్రహ్లాదాదుల్ రాక్షసులుగారొ వారల రక్షింపఁడొ మీ రెఱుంగరా హరిమహిమల్ | 12 |
| సీ. | ప్రళయాబ్ధి మోఁకాలిబంటిగాఁ జరియించు - మధుకైటభులఁబట్టి మట్టువెట్టెఁ జాఁపచుట్టుగ ధరాచక్రంబుఁజుట్టి కొం - పోవు హిరణ్యాక్షుఁబొడ వడంచెఁ ద్రైలోక్యనాథుఁడై తన కీడుజోడును - గాంచకున్న హిరణ్యకశిపుఁ ద్రుంచెఁ జదువుల దొంగయై జలరాశి డాఁగిన - కపటి హయగ్రీవు కడిమిఁజెఱచె | |
| గీ. | నముచి వధియించె సంహ్రాదనాము నొంచె గెలిచె శుంభనిశుంభుల నల సహస్ర కవచుఁ దెగటార్చెఁ బరిమార్చెఁ గాలనేమిఁ దరమె విష్ణునితోఁబోరఁ దమ్ములార! | 13 |
| ఉ. | వారలకంటె నెక్కుడగువారమె విష్ణునితోడఁబోర ని ష్కారణ మల్గఁ డాయన నిజంబుగ నేరము లేక శౌరియం దారయ దోసమేమి మనయందలి దోసమె తన్మనోంబుజం బీరస మొందఁజేసె నిదియెంచి యొనర్పుఁడు మీఁది కార్యముల్ | 14 |
| తే.గీ. | అని హితంబెఱిఁగించిన యన్నమాట లా సుమాలియు మాలియు నాలకించి నీతిఁదెలిసియుఁదెలియక నీతిమాలి యిద్దఱును గూడి యతనితో నిట్టు లనిరి | 15 |
| శా. | ఇష్టైశ్వర్యయుతంబు నీ నెలవు నీ యిచ్ఛావశం బాయు వు త్కృష్టప్రాభవశాలి వంచితతపో-ధిక్యంబు నీ సొమ్ము నీ శిష్టాచారము మేలుబంతి పలలాశిశ్రేణికిన్ శాత్రవా నిష్టోత్సాహనిధాన! నీకుఁదగునే నేఁడింత చింతింపఁగన్? | 16 |
| మ. | విశిఖోత్తుంగ తరంగ ఘుంఘుమరవోద్వేలంబు దుర్వారవీ రశతాంబూద్భట సంకులంబు సముదగ్రచ్ఛత్ర ఫేనావృతం బు శతాంగాద్రియుతంబు నౌ సురబలాంభోరాశి నీ బాడబో గ్ర శరజ్వాలల నింకె నెవ్వరెదురింకన్ నీకు దైత్యాగ్రణీ! | 17 |
| మ. | బలవంతుల్ భవదీయపుత్రకులు నీ భ్రాతల్ త్రిలోకైకవీ రులు నిన్ మృత్యువుఁ దేఱిచూడ వెఱచున్ రుద్రచ్యుతాంభోజగ ర్భులు నీ పే రనినం దలంకుదురు భీరుత్వంబు నీకేల? నిన్ దెలియంజాలక యానతిచ్చెదవు దైతేయాన్వయగ్రామణీ ! | 18 |
| తే.గీ. | అస్మదారులు సేయు రాయడి సుపర్వు లచ్యుతునితోడఁ దెలిపినా రనియె భయముఁ జెందెదవుగాని మనలను జెఱుప నింత కెత్తుకొని రని యలుగ వదేమి? యధిప! | 19 |
| మ. | అరులన్ జంపు మటంచుఁ బంద లయి యయ్యాదిత్యులార్తిన్ గణిం చిరిపో సర్వసమానుఁడైన హరి ద్వేషిత్వంబుఁదాఁబూని యే కరణిం గయ్యము సేయవచ్చు? మనతోఁ గ్రౌర్యంబుఁ గౌటిల్య మా హరికిం గల్గిన మాదృశుం డతఁడుగా కాధిక్యమే మారయన్? | 20 |
| తే.గీ. | సహజమాత్సర్యమున దేవసమితితోడ మనము దొడరిన హరి యేల మచ్చరించు ? నతఁడె నిష్కారణద్వేషి యయ్యెనేని సంధికార్యంబు వొసఁగునే సరసగతిని? | 21 |
| తే.గీ. | వనజనాభుండు గల్పించుకొను నటంచు వెఱచి పగతురపైఁ గిన్క విడువవలెనె ? యేటి యోజన? బలవంతుఁడీ హరియని యిపుడు శరణన్న నవ్వరే యెవ్వరేని ? | 22 |
| తే.గీ. | వెన్నునకు నస్మదాదుల మెన్నఁడైన నపకృతి యొనర్ప, మతఁ డెన్నఁడైన మనకుఁ జేయఁ డపకృతి, వేల్పులు సేసిరింత వేలుపులమీఁద నిఁక దండు వెడలవలయు | 23 |
| చం. | త్రిదశులతోడఁ గయ్య మొనరింప, రమాపతి యస్మదాదులం గదిసి రణం బొనర్చినను గా దన వచ్చునె? యంత భాగ్యము న్నదె? యెటులైన మంచిది, రణం బొనరింతుము, వేదశాస్త్రముల్ సదివితి మీవు లిచ్చితిమి జన్నము లూనితి మైహికంబునన్ | 24 |
| తే.గీ. | అన్న! నీమాట జవదాటి యాడితిమని యలుకసేయక ప్రతివాదములు క్షమించి యనుమతి యొసంగు మిపుడె మదాంధులగు సు ధాంధుల జయించి వచ్చెద మనుచుఁ బలికి | 25 |